కాస్త అబ్బాయి గురించి ఆరా తీద్దురూ!


“మంచి సంబంధం అండి, మన చిట్టికి సరిజోడీ అనిపిస్తూంది,” జగన్నాధ రావుకి మనవి చేసుకుంది పార్వతమ్మ.

“నిజమే అనుకో, కానీ అబ్బాయి ఎక్కడో దూరంగా పూనాలో పని చేస్తున్నాడు. అతడు ఎలాంటి వాడో, అతగాడి గుణగణాలు ఎలాంటివో మనకు తెలిసేదెలా?” సంధేహం వెలిబుచ్చాడు పార్వతమ్మ భర్త జగన్నాధరావు.

పక్కనే కూర్చుని ఈ మాటలు వింటున్న చిట్టి కాస్త సిగ్గు పడింది. అఫ్ కోర్స్, చిట్టి అంటే నిజంగా చిట్టి ప్రాణం కాదని, పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లని మీకిప్పటికే అండర్ స్టాండింగ్ అయిపోయుంటుంది. చిట్టీ తమ్ముడు, చంటి (వాడికో ఇరవయి ఏళ్ళుంటాయి), సోఫా మీద బోర్ల పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు.

“మా అన్నయ్య మల్లిఖార్జున రావు ఉన్నాడు కదండి, ఆయన్ని వెళ్ళి వాకబు చేయమంటే ఎలా ఉంటుంది?” అడిగింది పార్వతమ్మ.

“బాగానే ఉంటుంది. మీ అన్నయ్య ఒప్పుకుంటాడా?”

“ఫోన్ చేసి మీరే అడగండి.”

“సరే!”

రెండో రింగుకే ఫోనెత్తాడు మల్లిఖార్జున రావు.

“హలో ఎవరండీ?”

“నేను బావగారూ, జగన్నాధ రావుని.”

“ఓ, నువ్వటోయి, మా చెల్లెలు ఎలా ఉంది? చిట్టి, చంటి ఎలా ఉన్నారు?”

“మీ చెల్లెలే నాకు ఫోన్ చేయమని పురమాయించింది. చిట్టి బాగానే ఉంది. చంటి ఏదో తెలుగు పుస్తకం చదువుకుంటున్నాడు.”

“తెలుగు పుస్తకమా? ఇంకా అవి రాస్తున్నారా? ఏం పుస్తకమో?”

“శ్యాం గోపాల్ వర్మ రాసిన “నా ఇష్టం, చదివితే నీకే నష్టం” అన్న పుస్తకంలెండి.”

“ఇంటరెస్టింగ్!”

“ఇంతకీ మీరేం చేస్తున్నారు బావగారూ?”

“ఈ రోజు నేను ఉపవాసం కద! ఇప్పుడే ఒక అర డజన్ అరటిపండ్లు తిని, ఒక శేరు పాలు తాగాను.”

“అది ఉపవాసమా?”

“కాదా మరి? అన్నం ఒక మెతుకు కూడా తినలేదు.”

“ఐతే నిజమే లెండి. ఇంతకీ మీకు ఫోన్ చేసిందెందుకంటే, చిట్టీకి ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. అబ్బాయి ఆనంద మూర్తి పూనాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. మీరేమన్నా అక్కడికి వెళ్ళి అబ్బాయి మంచి చెడు గురించి వాకబు చేస్తారేమో అని…”

“ఇక్కడ నీకో సంగతి చెప్పాలోయి జగన్నాధం,” గొంతు సవరించుకున్నాడు మల్లిఖార్జునరావు.

“అలాగే, సాధారణంగా నేను ఎంగిలి మెతుకులు సీరియల్ చూడగానే నిద్రపోతాను,” చెప్పాడు జగన్నాధరావు.

“అది నాకెందుకు చెప్తున్నావు?” ఆశ్చర్య పోయాడు మల్లిఖార్జునరావు.

“అంటే, ఆ సీరియల్ ఇంకో గంటలొ మొదలవుతుంది, అర గంట తరువాత అయి పోతుంది. మీరేదో చెప్పాలన్నారు కద. దానికి మీకున్న టైం ఎంతుందో తెలియబరుస్తున్నాను.”

“మరీ విడ్డూరం కాకపోతే అంత సేపు చెప్తానటయ్యా?”

“మరి పెళ్ళికి ముందు ఇలాగే మీ చెల్లెలి గురించి చెప్తాను అని, సగం రోజంతా చెప్పారు. అందుకే ముందు జాగ్రత్తగా…”

“అప్పుడు నేను సేల్స్ మ్యాన్ మూడ్‌లో ఉన్నానోయి. మా చెల్లెలిని చేసుకోబోతున్న నువ్వు ఎంత అదృష్టవంతుడివో చెప్పాలి కద? ఇప్పుడు ఆ అవసరం లేదు. క్లుప్తంగా చెప్తానులే!”

“ఐతే చెప్పండి మరి!”

“కుర్రాడి మంచీ చెడూ కనుక్కొమన్నావు కద. మంచిదేముందిలే, మనం కనుక్కోవాల్సింది ముఖ్యంగా చెడు గురించి. చెడు అలవాట్లూ, చెడ్డ గుణాలు లేకుంటే చాలు. మంచి ఏమన్నా ఉంటే మనం బోనస్ అనుకోవాలి.”

“ఓహో!”

“కాబట్టి నేను వెంటనే బయలుదేరి వెళ్ళి, అబ్బాయి సంగతేంటో తేలుస్తా. పేరేమన్నావు, ఆనంద మూర్తి కదూ?”

“అవును.”

“సరే వచ్చాక ఫోన్ చేస్తాలే, ఉంటాను.”

***

మల్లిఖార్జున్ రావు స్టేషన్‌లో దిగగానే ఆనంద మూర్త్ ఆయని రిసీవ్ చేసుకున్నాడు.

“థాంక్సోయి. ఉదయం ట్రైన్ కద! అందులో ఆది వారం. టైంకి వస్తావో రావో అనుకున్నా,” అన్నాడు అతనితో.

“ఏం, అలా ఎందుకనుకున్నారు?” ఆశ్చర్యపోయాడు ఆనందం మూర్తి.

“అంటే మీకు నిన్న సెలవు ఉంటుంది కద. అసలే కుర్ర వాడివి. ఫ్రెండ్స్‌తో కలిసి రాత్రి లేట్ గా పార్టీలు అవీ చేసుకుని ఉండచ్చు. పొద్దున్నే నిద్ర లేవాలంటే కష్టం కద,” నర్మ గర్భంగా అన్నాడు మల్లిఖార్జున రావు.

“అలాంటిదేం లేదండి, నేను సెలవున్న రోజు ఒక గంట ఆలస్యంగా పడుకుంటాను, అంతే,” చెప్పాడు ఆనంద మూర్తి.

“ఓహో, కుర్రాడికి పార్టీలు గట్రా పెద్దగా అలవాటు లేవన్న మాట,” మనసులోనే నోట్ చేసుకున్నాడు మల్లిఖార్జున రావు.

అఫ్ కోర్స్, అంతటితో తృప్తి పడే మనిషి కాదు మల్లిఖార్జున రావు. తన అంబుల పొదిలో ఉన్న శరాలన్నిటినీ ఒక దాని తరువాత ఒకటి వదలడానికే నిశ్చయించుకున్నాడు.

“నా దగ్గర సిగరెట్లు అయిపోయాయి. నీ దగ్గర నుంచి ఒకటి అరువు తీసుకోవచ్చా?” క్యాజుయల్‌గా అడిగాడు.

“నేను సిగరెట్లు కాల్చనండి. అసలు ఆ పొగే నాకు పడదు. బస్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఎవరైనా సిగరెట్టు కాలిస్తే…”

“వాళ్ళని చావ చితక గొడతావా?” వెంటనే అడిగాడు మల్లిఖార్జున రావు.

“లేదు నెక్స్ట్ స్టాప్‌లో బస్ దిగిపోతా. అనవసరంగా వయొలెన్స్ ఎందుకు చెప్పండి?”

“అబ్బో, ఐతే సిగరెట్ అలవాటు లేకపోవడమే కాదు, అనవసరంగా గొడవలు కూడా పెట్టుకోడన్న మాట,” మళ్ళీ నోట్ చేసుకున్నాడు మల్లిఖార్జున రావు.

“మా ఇల్లు దగ్గర్లోనే, పదండి,” బయలు దేర దీశాడు ఆనంద మూర్తి.

***

బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక, మళ్ళీ తన పని మీద ఫోకస్ పెట్టాడు మల్లిఖార్జున రావు. “ఇందాక దారిలో వస్తున్నప్పుడు పోస్టర్ చూశాను. ‘షీలా కీ జవాని ‘ అట పిక్చర్ పేరు. మార్నింగ్ షో వెళ్ళొద్దామా?” క్యాజుయల్‌గా అడిగాడు.

వేపాకు నమిలినట్టు మొహం పెట్టాడు ఆనంద మూర్తి. “అది ఒక దరిద్రపు గొట్టు పిక్చర్ అండి. మనం చక్కగా పార్వతి టెంపుల్‌కి వెళ్దాం. చాలా బాగుంటుంది. అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు,” కాస్త పరవశంగా అన్నాడు.

“దరిద్రపు గొట్టు పిక్చర్ అంటున్నావు, చూశావా?” టక్కున అడిగాడు మల్లిఖార్జున రావు.

“ఆ పోస్టర్ చూస్తే చెప్పెయ్యొచ్చండి. ఎలాగూ నేను ప్రతి శనివారం గుడికి వెళ్తాను. మీరు ఉన్నారు కాబట్టి, నాతో వచ్చెయ్యండి.”

అలా ఆనంద మూర్తితో గుడికి వెళ్ళి, ఇంటికి వచ్చాక, కాస్త నడుము వాల్చి, “అబ్బాయి అలాంటి పిక్చర్లు చూడకపోవడమే కాదు, చక్కగా గుడికి కూడా వెళ్ళే బాపతు అన్న మాట,” తనలో తాను ఆనంద పడుతూ నిద్రలోకి జారుకున్నాడు మల్లిఖార్జున రావు.

***

సాయంత్రం నిద్ర లేవగానే మళ్ళీ తన ప్రయత్నాలు తాను మొదలు పెట్టాడాయన.

“కాస్త ఒంట్లో నలతగా ఉందోయి. ఇలాంటప్పుడు కాస్త మందు వేసుకుంటే బాగుంటుంది,” కన్ను కొడుతూ అన్నాడు ఆనంద మూర్తిని ఉద్దేశించి.

“మీరేం వర్రీ కాకండి. ఇంట్లో ఎప్పుడూ ఒక మందు బాటిల్ రెడీగా ఉంటుంది,” అని లోపలికి వెళ్ళాడు మూర్తి.

“అయ్య బాబోయి, ఏ దురలవాట్లు లేవనుకుంటే, అబ్బాయికి తాగుడు అలవాటులా ఉంది,” మనసులోనే బోలెడు ఫీల్ అయి పోయాడు మల్లిఖార్జున రావు.

లోపల నుంచి ఒక సీసా, ఒక చెంచా తీసుకుని వచ్చాడు ఆనంద మూర్తి. “ఒక రెండు చెంచాలు తీసుకోండి, ఒంట్లో నలత చేత్తో తీసేసినట్టు మాయమై పోతుంది,” అన్నాడు.

“నువ్వు మందు చెంచా లెక్ఖన తాగుతావా బాబూ?” బోలెడు ఆశ్చర్యపోతూ సీసా లేబిల్ చూశాడాయన. “మాదీ ఫల రసాయనం” అని రాసి ఉంది దాని మీద.

“మరి లేకపోతే సీసా మొత్తం తాగుతారా, ఇంకేమన్నా ఉందా?” అంటూ ఒక చెంచాడు మందు ఆయనకు ఇచ్చాడు ఆనంద మూర్తి.

“అనవసరంగా కుర్రాడిని అపార్థం చేసుకున్నాను,” కాస్త ఫీల్ అయ్యాడు మల్లిఖార్జున రావు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగానే కావచ్చు, ఆ చెంచాడు మందు వెంటనే తాగేశాడు.

***

మరుసటి రోజు పొద్దునే తిరుగు ప్రయాణం కట్టాడు మల్లిఖార్జున రావు. ఈ సారి ఆయన వెళ్తూంది జగన్నాధ రావు ఇంటికి. ఇంట్లో ప్రవేశించగానే, ఊపిరి కూడా తీసుకోకుండా ఆనంద మూర్తి గురించి తన రిపోర్ట్ మొదలు పెట్టాడు.

“కుర్రాడు బంగారమోయి జగన్నాధ రావు, నాకు బాగా నచ్చాడు,” అనౌన్స్ చేశాడు.

“అది కాదు బావా,” ఏదో చెప్పబోయాడు జగన్నాధ రావు. ఆయనా, ఆయన సతీ మణి పార్వతమ్మ, చిట్టి, చంటి అంతా అక్కడే ఉన్నారు.

“ఇంకేం మాట్లాడకు, అంత యోగ్యుడిని, బుద్ధిమంతుడిని నేనింతవరకు చూడలేదంటే నమ్ము. మన చిట్టి చాలా సుఖపడుతుంది, ఇతగాడిని చేసుకుంటే.”

చిట్టి వాళ్ళ మామయ్యని అదోలా చూసింది.

“అది కాదన్నయ్యా,” ఈ సారి పార్వతమ్మ అడ్డు పడింది.

“ఏంటమ్మ నువ్వు కూడా? నా మీద నమ్మకం లేదా? చిట్టి నా కూతురు లాంటిది. దాని గొంతు కోస్తానా నేను?”

“అది కాదు మామయ్యా, ఆ పెళ్ళి కొడుకు ఈ సంబంధం తనకు ఇష్టం లేదని ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పాడు,” తను కూడా సంభాషణలో పాల్గొన్నాడు చంటి.

“అవునా అదేంటి???”

జగన్నధ రావు ఇబ్బందిగా గొంతు సవరించుకున్నాడు. “కుర్రాడు చెప్పడమేంటంటే, అతడికి నీ ప్రవర్తన బొత్తిగా నచ్చలేదట. ఉన్న ఒక రోజులోనే నీకు ఎన్ని దుర్వ్యసనాలున్నాయో, అన్నీ బయట పెట్టుకున్నావట. సిగరెట్లనీ, బూతు సినిమాలనీ, మందనీ, మరోటని, నీ విశ్వరూపం చూపించావట కద? దానితో అతగాడు బెదిరి పోయాడు. పెద్ద వాళ్ళే ఇలా ఉంటే, ఇంక పిల్లని చూడాల్సిన అవసరం లేదనుకుని, ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేశాడు,” వివరించాడు.

నిరుత్తరుడయ్యాడు మల్లిఖార్జున రావు.

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

26 Responses to కాస్త అబ్బాయి గురించి ఆరా తీద్దురూ!

 1. Indian Minerva says:

  😀

 2. Sreenivas says:

  చాలా బాగా ఉంది మురళి గారు. I thoroughly enjoyed reading it!!!

 3. shiva bandaru says:

  🙂

 4. ram says:

  nice 🙂

 5. హహహహ్హహా! సూపర్! 😀 😀

 6. Venu Gopal says:

  కొసమెరుపు బాగుంది.

 7. హ హ బాగుంది మురళి గారు 🙂

 8. aragundu vedava says:

  🙂

 9. tirapati gundu says:

  Hello Teta,
  You are back in form…avunu y not write on crikettu?
  plz try!

 10. Padmaja says:

  Good one. I have been making repeated visits to your blog for a new post. You took a very long gap, terribly missed your humor filled posts. Thanks for coming back and doing a great job! Welcome!!!

 11. రవి says:

  పంచ్ బాగా ఇచ్చారు. ఎంగిలి మెతుకులు, చిరపుంజి, సొగిలి మేకులు సీరియల్స్ మధ్యలో సమయం చూసుకుని రాస్తున్నా. టైము లేదు.

 12. venuram says:

  super.. 😀

 13. kamudha says:

  చాలా బాగుంది, కొసమెరుపు అదుర్స్

  కాముధ

 14. Rajiv says:

  చాలా బావుందండి….

  నా ఇష్టం – చదివితె నీకె నష్టం…. నవ్వుతునె ఉన్నాను ఇంకా…..

  మాలాంటి వాళ్ళ కొసం ఇంకొంచెం ఫ్రీక్వెంట్ గా రాస్తె ఇంకొంచెం సంతొషిస్తాం….

 15. ఆనందమూర్తి వెళ్ళాక అబ్బాయి నర్మగర్భంగా..ఓ నవ్వు నవ్వి ఓ సిగరెట్ వెలిగించి..మందు ఓ గుక్క తాగి..పక్కనే ఉన్న అమ్మాయి బుగ్గపై ఓ చిటికె వేసి పిచ్చి ఆనందమూర్తి.. నాతోటే గేం ఆడతాడా..
  అంటాడనుకున్నా..

  • Murali says:

   ఈ ఐడియా కూడా బాగానే ఉంది కానీ, ఇందులో నా వ్యంగ్యాన్ని సంధించింది పెళ్ళి కొడుకు గురించి వాకబు చేసే పద్ధతి గురించి కాబట్టి, ఇక్కడ సరిపోదనుకుంటా.

 16. sriveena says:

  okanduku posthe okanduku thagadanna sametha ilage vatchi untundi…..!!!

 17. sree says:

  adbhutam 🙂

 18. phalguni says:

  “డామిట్ కద అడ్డం తిరిగింది ” అని అనుకోని ఉంటాడు ఆ పెద్దమనిషి .చాల బావుందికద

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s