యాష్-ట్రేలియా, కన్నా ఏక్-హజారే, వీ.సీ.అర్

“మౌనంగానే మొరగమని కుక్క నీకు చెబుతుంది, మొరిగే కొద్దీ విరుగునని అర్థమందులో ఉంది,” ధన్వంతరి గాడు జుత్తు దువ్వుకుంటూ గొంతు చించుకుంటున్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది.

“అన్నామంటే అన్నామంటావు కానీ, ఏంట్రా ఆ పాట? మౌనంగా మొరగడమేంటి, విరగడమేంటి?” ఒక్క అరుపు అరిచాను.

మా ఇద్దరికి ప్రతి రోజూ ధన్వంతరి గాడింట్లో కూర్చుని కరెంట్ ఎఫెయిర్స్ డిస్కస్ చేయడం ఒక ఆనవాయితి. ఎందుకంటే మేం సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాం.

“అంటే వీలైనంత మౌనంగా మొరగడం మంచిది అని. ఎక్కువగా మొరిగితే వొంటి మీద కర్ర విరుగుతుందని కవి హృదయం.”

“ఎవరా కవి?”

“ఇంకెవరు, నేనే!”

“ఈ పైత్యం ఎప్పటినుంచి?”

కొద్దిగా హర్ట్ అయినట్టు మొహం పెట్టాడు ధన్వంతరి.

“పైత్యం కాదురా కవిత్వం. దీన్ని కవిత్వం అంటారు. ఇంద్ర బోస్ అనే రచయిత ఇలాంటి పాటే రాస్తే, అందరూ దాన్ని వేనోళ్ళ పొగిడారు. ఆఖరికి కలి యుగాంతం వరకు ఇలాంటి పాట నిలిచిపోతుందని నొక్కి వక్కాణించారు. ఆ స్ఫూర్తితోనే నేను ఇలా రాశాను.”

“ఆయనేదో మొక్క గురించి రాసినట్టున్నాడు?”

“మొక్కైతే ఏంటి, కుక్కైతే ఏంటి? పిచ్చి మొక్క, గజ్జి కుక్క, పెంట కుప్ప, కాదేది కవితకనర్హం అని ఒక మహా కవి అన్నాడు.”

“నిజంగా ఆ మహా కవే బతికి ఉంటే ఇది విని గుండెలు బాదుకునే వాడు. సర్లే గానీ, మనం కరెంట్ అఫెయిర్స్ గురించి డిస్కషన్ మొదలు పెడదామా?”

“తప్పకుండా. టీవీ ఆన్ చేస్తున్నా, ఒక్కొక్క చానెల్ లో వచ్చే న్యూస్ చూస్తూ విశ్లేషించడమే తరువాయి.”

“నువ్వు సూపర్ రా! కానియి”

ధన్వంతరి గాడు టీవీ ఆన్ చేశాడు.

టీవీ మీద ఆదరా బాదరా ఎయిర్ పోర్ట్ కనిపించింది. అర్రైవల్స్ దగ్గర ఒక పాతిక మంది యువకులు, ఒళ్ళంతా కట్లు కట్టుకుని, వీల్ చెయిర్స్‌లో కూర్చుని వస్తున్నారు.

“ఏదో పెద్ద విమాన ప్రమాదం జరిగినట్టుంది. ఈ న్యూస్ ఎలా మిస్ అయ్యానబ్బా?” అన్నాను నేను.

“వాళ్ళు యక్సిడెంట్ తాలుకు కాదు. యాష్-ట్రే-లియా కి చదువుకోవడానికి వెళ్ళిన భారతీయ విద్యార్థులు. అక్కడ యాష్-ట్రే-లియన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిని ఇలా వచ్చేస్తున్నారు. వారానికొక గుంపు దిగుతూనే ఉంటుంది. అది పెద్ద న్యూస్ కాదులే.”

“మరెందుకు వెళ్ళడం?”

“పిచ్చి వాడా, జంబూ ద్వీపం కాకుండా ఎంత దిక్కు మాలిన చోట డిగ్రీ చేసినా దాని వ్యాల్యూనే వేరు. విదేశాలు, విదేశీయులు, విదేశీ వస్తువులు ఎప్పటికి గొప్పవే. ఢిల్లీ అమ్మ కేవలం వేరే దేశం నుంది వచ్చింది అన్న కారణంగా ఆవిడకి ఎంత గ్లామర్ ఉందో చూడు,” చానెల్ చేంజ్ చేశాడు ధన్వంతరి.

ఈ సారి స్క్రీన్ మీద వై.నో. గగన్ రోడ్డు మీద సైకిల్ తొక్కుతూ కనిపించాడు.

“ఏంటీ సెన్సేషన్! ఈయన కొంప దీసి తెగులు దేశం పార్టీలో చేరిపోయాడా?” అన్నాను.

“కాదులే ఆయన సమర్పించిన ఆస్తుల లిస్ట్‌లో పేర్కొన్నాడు, తనకు స్వంత కార్ లేదని. కొందరు గిట్టని వాళ్ళు అది నమ్మకపోవడంతో, ఇలా సైకిల్ మీద తిరుగుతూ రుజువు చేస్తున్నాడు.”

“మరి వెనకాల మెల్లగా వస్తున్న ఆ ఇరవై టాటా సుమోలు?”

“అవి ఆయన అనుచర వర్గానివి. ఆయనకి కార్ లేదు కానీ, తనకి కావలిసిన వాళ్ళకి, కార్లు, సుమోలు బాగానే కొనిపెడ్తాడులే!”

మళ్ళీ చానెల్ మారింది.

ఒక పెద్ద గుంపు, ప్లాకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేస్తూ పోతున్నారు. వాళ్ళేమంటున్నారో వినడానికి నేను చెవులు రిక్కించాను.

“బృందగానా జిందాబాద్. వాయు కళ్యాణ్ డౌన్ డౌన్. అతని సినిమా బొందల గడ్డని బ్యాన్ చేయాలి,” అంటున్నారు వారు.

“ఎందుకు బ్యాన్ చేయాలి?” ఆశ్చర్యపోయాను నేను.

“బొందల గడ్డ అనేది బృందగానా పదం. ఆ పదాన్ని తన సినిమా పేరుగా పెట్టుకోవడానికి మోస్తా ప్రాంతానికి చెందిన వాయు కళ్యాణ్‌కి హక్కు లేదంట.”

“ఇది మరీ అన్యాయం. ఇంతకీ ఈ గుంపు అంతా ఎక్కడికి పోతునట్టు?”

“ఈ నినాదాలు కాగానే వీళ్ళందరే, వాయు కళ్యాణ్ నటించిన బొందల గడ్డ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దూరుతారు. వాయు కళ్యాణ్‌కి బృందగానాలో అభిమానులు ఎక్కువలే”.

నాకు నోట మాట రాలేదు.

ఈ సారి స్క్రీన్ మీదకి సాహుల్ గాంధి వచ్చాడు.

ఇంటర్వ్యూ చేసే ఆవిడ సాహుల్‌ని అడిగింది, ” కన్నా ఏక్-హజారే చేస్తున్న ఉద్యమం మీద మీ అభిప్రాయం.”

సాహుల్ గొంతు సవరించుకున్నాడు.

“ఆయనకి కీర్తి కండూతి చాలా ఎక్కువ. అందుకే ఇలా రోడ్డు మీద పడ్డాడు. అవినీతిని నిర్మూలించడానికి నేను కూడా కంకణం కట్టుకున్నా. ఎటొచ్చీ, నాకు పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు కాబట్టి, రహస్యంగా ఈ అవినీతిని అంతం చేసే యజ్ఞంలో ఒక సమిధలా కాలిపోతున్నా.”

“ఏదీ కంకణం చూపించండి. కొత్త డిజైనా?” ఆసక్తిగా అడిగింది యాంకర్.

“ఎహే, మాట వరుసకి అన్నా. ఐనా ఇది అంత సులభమైనది కాదు, ఎన్నో ఏళ్ళ సమయం పడుతుంది. కానీ నేను లక్ష్యం పూర్తయ్యే వరకు, రోజూ కొద్ది కొద్దిగా కరిగిపోతూ శ్రమిస్తూనే ఉంటాను.”

“ఎందుకు అన్నేళ్ళు పడుతుంది?” ధన్వంతరిని అడిగాను నేను.

“అంటే ఆ అవినీతిని పెంచి పోషించింది, ఆయన ముత్తాత, నానమ్మ, నాన్నలే కద. మరి మూడు తరాల అవినీతిని అంతమొందించడం అంత వీజీ కాదు,” చెప్పాడు వాడు, చానెల్ చేంజ్ చేస్తూ.

స్క్రీన్ మీద ఈ సారి భక్తుల సందోహం కనిపించింది. అందరూ పెద్ద గొంతుతో భజనలు చేస్తున్నారు.

నేను ధన్వంతరి వైపు ప్రశ్నార్థకంగా చూశాను.

“బాబా గారి ఆరోగ్యం ఏమీ బాగా లేదు. ఆయన కోలుకోవాలని ఈ పూజలు,” అన్నాడు వాడు.

“బాబా గారే ప్రత్యక్ష దైవం కద? మళ్ళీ దేవుడికి ఈ పూజలెందుకు?”

“ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడని, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఆ దేవుడికి తెలుసో లేదో మరి. ఎందుకైనా మంచిది అని వీళ్ళు ఇలా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు.”

చానెల్ మళ్ళీ మారింది.

ఈ సారి బృందగానా నాయకుడు వీ.సీ.ఆర్. కనిపించాడు.

“మోస్తా వాళ్ళంటేనే నాకు దమాక్ ఖరాబవుతది.
మోస్తా వాళ్ళ బిర్యాని పేడ లెక్కుంటది. వాళ్ళ బాపనోళ్ళకు మంత్రాలు సదువుడు రాదు,” ఉటంకించాడు ఆయన.

“దీన్ని బట్టి నీకర్థమయ్యిందేంటి?” అడిగాడు నన్ను ధన్వంతరి.

“ఆయనకు పేడ రుచి బాగా తెలుసని. మోస్తా యాస అంటే ఆయనకు పడదు కాబట్టి ఆ బ్రాహ్మణుల మంత్రాలు అర్థం కాలేదని.”

“కరెక్ట్!” మళ్ళీ చానెల్ మార్చాడు వాడు.

“సర్కస్‌కి, బఫూన్లకి తగ్గి పోతున్న ఆదరణ,” వార్తల్లో ముఖ్యాంశాలు చదువుతూంది ఒక విలేఖరి(ణి).

“దీనికేమంటావు?” అడిగాడు ధన్వంతరి.

“మన చుట్టు పక్కలే, ఫ్రీగా ఇంత మంది బఫూన్లు ఉండి, ఇంత గొప్ప సర్కస్ జరుగుతూంటే, డబ్బులు పెట్టుకుని ఎవరు మాత్రం వెళ్తారు,” అన్నాను నేను.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

37 Responses to యాష్-ట్రేలియా, కన్నా ఏక్-హజారే, వీ.సీ.అర్

 1. ram says:

  i love this post. mine 1st comment

 2. Indian Minerva says:

  😀

 3. shiva bandaru says:

  🙂

 4. రవి says:

  ధన్వంతరికి సివిల్స్ సీటు వచ్చిందా? లేక చానెల్స్ చూసి పిచ్చెక్కిందా? మరో ఎపిసోడ్ లో చెప్పండి. :))

 5. cenima says:

  super….

 6. Sravya V says:

  :):):):):)

 7. JYN Sarma says:

  good. you might have as well used the original names itself……….

 8. భలే బాగుంది. ముఖ్యంగా “అన్నీ”!

  • Murali says:

   ముఖ్యంగా “అన్నీ”! — అర్థం కాలేదు…

   • ముఖ్యంగా అని యేదో ఒక పాయింటు వ్రాయబోయాను. కానీ దేనికేదీ తీసిపోయింది కనబడలేదు మరి! అందుకనే “అన్నీ!”.

 9. bonagiri says:

  టపా సూపర్..
  బిగినింగ్ లోని పాట ఇలా మారిస్తే బాగుంటుందేమో?

  “మౌనంగానే కరవమని కుక్క నీకు చెపుతుంది.
  మొరిగే కుక్క కరవదని అర్థమందులో ఉంది.”

  • Murali says:

   అద్భుతంగా ఉంది మీ సవరణ. I would have loved to think of it myself.

   ఐతే, కవిత్వం అనేది అంత వీజీగా అర్థం కాకూడదు. ఒరిజినల్ పాటలో కూడా ఆ కంఫ్యూజన్ ఉంది. మౌనంగా ఎదిగే వాళ్ళంతా ఒదిగి ఉండక్కర్లేదు. (హిట్లర్ కూడా చాలా మౌనంగా, చాప కింద నీరులా ఎదిగాడు. కాని ఒదిగి ఉండలేదు.)

   అందుకనే ధన్వంతరి పాటలో కూడా ఆ కంఫ్యూజన్ పొందు పరచడం జరిగింది.

   కానీ మీ ప్యారడీ సూపర్. కలి-యుగాంతం వరకు నిలిచి పోతుంది. 🙂

   • bonagiri says:

    మురళి గారూ, అంత లేదండీ.
    ఏదో, అలా ప్రాస కుదిరింది. అంతే.
    అన్నట్టు చంద్రబోసు గారికి క్షమాపణలు, అంత మంచి పాటని ఖూనీ చేసినందుకు.

 10. venuram says:

  super…

 11. Anuradha says:

  🙂

 12. Murali says:

  ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడని, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఆ దేవుడికి తెలుసో లేదో మరి. ఎందుకైనా మంచిది అని వీళ్ళు ఇలా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు
  ఇది చాలా బాగుంది

  కాముధ

 13. హరే కృష్ణ says:

  🙂
  Excellent!

 14. Sreenivas says:

  అదిరింది మురళి 🙂

 15. మళ్లీ చదివి మళ్లీ మళ్లీ నవ్వుకుంటున్నాను. 🙂 🙂

 16. Padmaja says:

  Good one. Anni issues oke tapa lo cover chesesaaru 🙂

 17. ఇంత మంది వీరతాళ్ళేసాక ఇంక నేనేం చెప్పను? అందుకోండి అభినందనలు “పేరడీ సామ్రాట్”!

 18. LOL….well said muraliji.

 19. Rajiv says:

  యాష్-ట్రే-లియా…

  “ఏదీ కంకణం చూపించండి. కొత్త డిజైనా?”…

  ఆసలు నవ్వు ఆగదండి కాసేపటి వరకు….

  ఈ మధ్య కొంచెం టెన్షన్ ఉన్నపుడు చదవటానికి మాత్రం కొన్ని టపాలు హొల్డ్ లొ పెడ్తున్నా… ఆఫీస్ లొ ఎప్పుడైన ఇంక ‘దిమాక్’ ఖరాబ్ ఐనప్పుడు తీసి చదువుతున్నా…. చాలా రిలిఫ్ గా ఉంటుంది…. Hats off…

  As always, waiting to see more from you

 20. madhu says:

  ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడని, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఆ దేవుడికి తెలుసో లేదో మరి
  keka

 21. Supraja says:

  “ఆయనకు పేడ రుచి బాగా తెలుసని. మోస్తా యాస అంటే ఆయనకు పడదు కాబట్టి ఆ బ్రాహ్మణుల మంత్రాలు అర్థం కాలేదని” Superb statement 🙂

 22. just i am reading this, as usual Excellent 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s