నేనెక్కడికీ పోలేదోచ్!


నమస్తే, నా పేరు బుడుగు. నేను మా నాన్నకు పిడుగు. తనేమో నాకు గొడుగు. కావాలంటే మా బాబాయిని అడుగు.

హదేంటి, బుడుగు మళ్ళీ వచ్చేశాడు అని హాశ్చర్య పోయారా? హాశ్చర్యమెందుకు, నేనెక్కడికన్నా వెళ్తే కద? నేను, రాధ, గోపాళం, బాబాయి, సుబ్బలష్మి, బామ్మ, సీ గానా పెసూనాంబ, మా వీధి చివర జెట్కా వాడు, ఎక్కడికీ పోమట. ఎప్పటికీ తెలుగు వాళ్ళ గుండెల్లోనే ఉండి పోతామట. ఇలా అని ఈ మధ్య చాలా మంది చెప్పారు. చాలా మంది అంటే ఫది మంది కంటే ఎక్కువ మంది లే.

ఆ సంగతి నాకెలా తెలుసు అంటారా? ఇదిగో, మొన్నే బిళ్ళలు కొనుక్కుని వస్తూంటే, మా ఊరి స్కూలు ముందు ఒక పెద్ద సబ జరుగుతూంది. సబ అంటే బోలెడు చాల మంది కలవడం. అందులొ కుంచెం మంది స్టేజు ఎక్కి మాట్లాడుతారు. ఎక్కువ మంది కింద నిల్చోనో, కూర్చోనో వింటారు. ఒక్కో సారి ఈ వినాల్సిన జనం గాఠిగా అరిచేస్తూంటారు. దీన్నే నినాదాలు చేయడం అంటారు. అంటే నాకు తెలీదు. నేను ఎప్పుడన్నా నినాదాలు చేస్తే మాత్రం గోపాళం ఖోప్పడేస్తాడు, “ఒరేయి బుడుగు అలా అరవద్దన్నానా, వెధవ కానా,” అని.

నన్ను చూడగానే స్టేజ్ మీద నుంచి ఒక నలుగురు దూకి వచ్చేశారు. బిళ్ళలు లాక్కోవడానికేమో అనుకుని పక్క సందులోంచి పారిపోదామనుకున్నా. కాని అంతలో గుర్తొచ్చింది, నేను చిన్న వాడినా చితక వాడినా, అవసరమైతే వాళ్ళకి ప్రైవేట్ చెప్పైనా సరే, నా బిళ్ళలు కాపాడ్డానికి తయారయి పోయాను.

కానీ ఆ నలుగురు వచ్చింది బిళ్ళలు లాక్కోవడానికి కాదట. నాకు సంతాపం తెలపడానికట. సంతాపం అంటే ఓదార్చడం, అంటే నాకు తెలీదు.

“బడుగూ, బడుగూ, బంగారు తండ్రి, నీకెన్ని కష్టాలు వచ్చాయి,” నన్ను పట్టుకుని ఘొల్లుమన్నాడు ఒక పెద్దాయన. నిజం చెప్పొద్దూ, నాకు చిర్రెత్తుకొచ్చింది. ఎన్ని సార్లు చెప్పాలి వీళ్ళకి నా పేరు బుడుగు అని? “నా పేరు బుడుగు, నేనొక పిడుగు” అని నా గురించి చెప్పుకునేంతలో, “ముళ్ళపూడి రవణ గారు మనందరిని వదిలి వెళ్ళిపోయారు,” అని మళ్ళీ ఘొల్లుమన్నాడు.

“ఒరేయి, పెద్దాయన గారు, ఈ రవణ గారు ఎవరు రా?” అని అడిగాను నేను.

“నిన్ను సృష్టించిన మనిషి,” చెప్పాడు వాడు.

“ఒరేయి, పెద్దాయన గారు, సురిష్టించడం అంటే ఏంట్రా?” మళ్ళీ అడిగాను నేను.

“అంటే, అంటే, ఆయన నిన్ను పుట్టించిన వాడు,” తడుముకుంటూ అన్నాడు వాడు.

నాకు వెంటనే అవమానం వచ్చింది. అవమానం అంటే సందేహం. అంటే నాకు తెలీదు. ఎందుకంటే, గోపాళం రాధ నన్ను పుట్టించిన వాళ్ళని ఒక సారి బామ్మ చెప్పింది. మరి ఈ రవణ గారు ఎవరు?

“కొయి, కొయి, నన్ను పుట్టించింది గోపాళం, రాధ,” అన్నాను నేను.

“కాని వాళ్ళని సృష్టించింది కూడా రవణ గారే,” అన్నాడు పెద్దాయన.

ఇంకెలా చచ్చేది! “మరైతే ఆయన్ని నేను చూడలేదుగా?” కూసింత దిగులుగా అన్నాను నేను.

“ఆయన కూడా నిన్ను చూడలేదులే, నువ్వాయన మానస పుత్రుడివి,” అన్నాడు పెద్దాయన గారు.

మళ్ళీ నాకు ఖోపమొచ్చేసింది. నేనేమన్నా చిన్న వాడినా చితక వాడినా. ఇలా నాకు అర్థం కాని మాటలు చెప్తే నాకు ఎంత అనుమానం. అదే అన్నాను నేను పెద్దాయన గారితో.

“అంటే ఆయన నువ్వు ఉండాలనుకున్నాడు. నువ్వు పుట్టేశావు,” చెప్పాడు ఆయన.

నాకు వెంటనే అవమానం వచ్చేసింది. అవమానం అంటే సందేహం అని చెప్పాగా. మళ్ళీ నన్ను అడగొద్దు.

“మరి ఆయన లేకపోతే, నేనెలా ఉంటాను,” అన్నాను నేను.

“అదే మరి. మానస పుత్రుడివి కాబట్టి, ఆయన లేకపోయినా, నువ్వుంటావు.”

నాక్కుంచెం అర్థం అయ్యింది, కుంచెం కాలేదు.

“మరి రాధా గోపాళం?” అడిగాను నేను.

“రాధ, గోపాళం, బాబాయి, సుబ్బలష్మి, బామ్మ, సీ గాన పెసూనాంబ, మీ వీధి చివర జెట్కా వాడు, అందరూ తెలుగు వాళ్ళ గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతారు,” గంభీరంగా చెప్పాడు పెద్దాయన గారు.

“అవును, అవును,” అని నినాదాలు చేశారు సబకి వచ్చిన జనమంతా.

అదిగో! అలా తెలిసింది నాకు. కాబట్టి మీరేం బెంగ పెట్టుకోకండి, రవణ గారు లేకపోయినా నేను మాత్రం మీతోనే ఉంటాను. ఆయన కాకపోతే, తేటగీతి మురళినో, ఆయన అభిమానుల్లో ఇంకెవరో, నా గురించి రాస్తూ, నన్ను మీరెవ్వరు మర్చిపోకుండా చూస్తారు. మరదే రవణ గారి గొప్పదనం!

Advertisements
This entry was posted in బుడుగు. Bookmark the permalink.

10 Responses to నేనెక్కడికీ పోలేదోచ్!

 1. అవును, బోలెడంత మందిమి రాసాము….రాస్తూ ఉంటాము.
  http://chitram.maalika.com/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%82-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82/

 2. ram says:

  i love that character and ramana

 3. నిజమే,

  బుడుగు నువ్వు చెప్ప్లింది నిజ్జంగా నిజం.

  కాముధ

 4. Kiran says:

  Hats off to you Murali Sir..

 5. yagnasri says:

  మీరు రాసిన పోస్ట్స్ అన్నిటిలోకల్లా ఇదే అత్యుత్తమం . కాన్సెప్ట్ అద్భుతం . ముళ్ళపూడి గారు బోలెడు చాలా సంతోషించి ఉంటారు మీ పోస్ట్ చదివి . ఆయనలోని శక్తిని మీకు కొంత పంచి వెళ్ళారని కోరుకుంటూ….

 6. sailabala says:

  నమస్తే, నా పేరు బుడుగు. నేను మా నాన్నకు పిడుగు. తనేమో నాకు గొడుగు. కావాలంటే మా బాబాయిని అడుగు.
  ఎంత బావుందో ఇది

  • Murali says:

   అది ముళ్ళపూడి వారి ప్రయోగం. కొద్దిగా మార్చాను నేను. అంతే. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s