వాడి చావు మన ప్రాణానికొచ్చింది!

పీకిస్తాన్!

జంబూ ద్వీపాన్ని “అంటుకుని” ఉన్న పవిత్ర దేశం. అది SIS హెడ్ క్వార్టర్స్. జనరల్ కయ్యానికి తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు.

దానికి గట్టి కారణం ఉండనే ఉంది. ఓసమ్మో ధనా ధన్ అనే ఉగ్రవాది పీకిస్తాన్ నడిబొడ్డున, వమెరికా ప్రత్యేక సైనిక దళాల చేతుల్లో హతమయ్యాడు.

“ఛ ఛ ఎంత దారుణం, ఎంత ఘోరం, తలుచుకుంటేనే సిగ్గు చేటు,” అన్నాడు కయ్యానికి.

“అవును, మన దేశంలోనే ఉండి, అదీ మన మిలటరీ అకాడెమీ పక్కనే ఉన్నా పట్టుకోలేకపోయామంటే ఎంత అవమానం. ఎంత సిగ్గు పడాల్సిన విషయం. క్యా షర్మ్ కి బాత్ హై! అసలు తలెత్తుకు తిరగ గలమా?” అన్నాడు కొత్తగా జాయిన్ అయిన ఒక రిక్రూట్.

“ఎవరక్కడా? వీడికి ఇరవయి కొరడా దెబ్బలు తగిలించండి,” హుకుం జారీ చేశాడు కయ్యానికి.

“అయ్య బాబోయి! నేనేం చేశాను?” భయంతో అరిచాడు ఆ రిక్రూట్.

“మనకు సిగ్గూ శరం లాంటివి ఉన్నాయని నువ్వు అనుకున్నందుకు, నేను బాధపడుతూంది ఓసమ్మోని పట్టుకోలేకపోయాను అని అర్థం చేసుకున్నందుకు,” వివరించాడు కయ్యానికి.

“మరి కాదా?”

“ఒరే మూర్ఖుడా, ఓసమ్మో ఉన్నన్ని రోజులు, మనకు ఏ లోటు ఉండేది కాదురా! వమెరికా ఓసమ్మోని పట్టుకోవడానికి మనం ఉపయోగపడతామని మనకు బోలెడు ధన సహాయం చేసేది. దానిలో కొంత మనం జంబూ ద్వీపం నాశనం చేయడానికి వాడే వాళ్ళం. ఇప్పుడు ఆ చచ్చినోడు చచ్చి ఊరుకున్నాడు. నానేటి సేతురో! ఓలమ్మో, ఓలక్కో,” అని వాపోయాడు కయ్యానికి.

“ఓహో, మరి మన నాయకులు, పేపర్లో, టీవీలో ఉగ్రవాదం వల్ల అందరికంటే నష్టపోయింది మనమేనని, వమెరికాకి ఓసమ్మోని పట్టుకోవడానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుంది అని, చెప్తారు కద?” సందేహం వెలిబుచ్చాడు రిక్రూట్.

“వీడికి ఇంకో పది ఎక్కువ తగిలించండిరా!”

“అయ్య బాబోయి, మళ్ళీ ఇదేంటి?”

“లేకపోతే మన నాయకులు వాగే వెధవ వాగుడు నమ్మడానికి నువ్వేమన్నా జంబూ ద్వీపంలోని మేధావుల్లో ఒకడివా? ఏ అధో గతి రాయో ఐతే, ఎవరు? ఓసమ్మో, వమెరికా మాజీ అధ్యక్షుడు ఖుష్ ఇద్దరూ ఒకటే అని సెలవిచ్చిందే? ఆవిడ! మన నాయకులు చెప్పేవన్ని నిజాలని, పీకిస్తాన్‌కి ఏ పాపం తెలీదని నమ్ముతుంది కానీ, ఇదే గడ్డలో పుట్టిన నువ్వు మన వాళ్ళ మాటలు నమ్మడమేంటి? అందుకే ఇంకో పది కొరడా దెబ్బలు!”

“అంటే మనకు ఓసమ్మో ఇక్కడే ఉన్నాడు అని ఎప్పటినుంచో తెలుసన్న మాట!”

“ఒక్క తెలియడమేంటి, నేను, మన అధ్యక్షుల వారైన జర్దాపాన్ గారు, ప్రతి నెల ఓసమ్మో ఇంట్లోనే కలిసి డిన్నర్ చేసి, జంబూ ద్వీపం నుంచి దిగుమతి చేసుకున్న ఒక సినిమా కూడా చూసే వాళ్ళం.”

“అవునా?”

“లేకపోతే! ఇప్పుడు మనం ఓసమ్మో సర్కస్ షో కూడా క్యాన్సిల్ చేసేయ్యాలి! హయ్యో!”

“అదేం షో?”

“నీకు ఏం తెలీదనుకుంటానే? మనం ప్రతి రెండు నెలలకి వమెరికా వారికోసం వేసే సర్కస్ షో! అందులో మన నాయకులు, క్లౌన్స్‌లా తయారయ్యి ఆడుతూ పాడుతూ అలరిస్తారు.”

“ఏమని ఆడతారు, దేని గురించి పాడతారు?”

“ఒక ప్రదర్శనలో, ఎవరైతే అప్పటి పీకిస్తాన్ అధ్యక్షుడో, ఆయన పిల్లి మొగ్గలు వేస్తూ వచ్చి, ఓసమ్మో పీకిస్తాన్‌లో లేడు అంటాడు. వమెరికన్‌లు ఆనంద పడి కొంత డబ్బు ఇస్తారు. ఆ తరువాత జరిగే ప్రదర్శనలో అదే నాయకుడు కాస్త మేకప్ మార్చుకుని వచ్చి, ఓసమ్మో పీకిస్తాన్లో ఉన్నాడని ఆందోళన వ్యక్తం చేస్తాడు. అప్పుడు వమెరికన్‌లు భయపడి బోలెడు డబ్బు ఇస్తారు.

ఈ సర్కస్ షోని గత పదేళ్ళుగా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు అది ఆపేయ్యాలి,” కంట తడి పెట్టుకున్నాడు కయ్యానికి.

“నాకిప్పుడు పూర్తిగా అండర్‌స్టాండింగ్ అయిపోనాది,” అన్నాడు రిక్రూట్.

“ఐనా సరే, నీ కోటా దెబ్బలు నువ్వు తినక తప్పదు,” తేల్చి చెప్పాడు కయ్యానికి.

This entry was posted in భూగోళం. Bookmark the permalink.

8 Responses to వాడి చావు మన ప్రాణానికొచ్చింది!

  1. చాలా బాగుంది.

    ఐనా ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు అధోగతి రాయి మీద మధ్యలో పడ్దారేంటి.

    కాముధ

    • Murali says:

      ఆవిడ నా ఫేవరెట్ మేధావి. పైగా ఆమె ఉరమకుండానే అందరి మీదా పడుతూంటుంది. మొన్న ముంబాయి దాడుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంకా మర్చిపోలేదు నేను. అవి గుర్తుకి వచ్చినప్పుడంతా ఆమెని ఎలాగో అలా ఇరికిస్తూనే ఉంటా.

  2. ram says:

    very nice. i was waiting for ur post on osama death. now u delivered it.

  3. అటు పీకిస్తాను..అటు వొమేరికా దిక్కుమాలిన తెలివి తేటలు ప్రదర్శిస్తుంటే ఏల మన విండియా..శాంతి శాంతి అంటూ..దొంగ జపాలు చేస్తూంది..గుడిలో లింగాన్నే మింగే ..ఒబసామాలు (అంటే ఒసామా+ఒబామా= ఒబసామా..నేనే కనిపెట్టా..బావుందా..థాంక్యూ..)మన దేశంలోనూ తగలడ్డారుగా..వారు ఇండియా
    దాటి వారి తెలివి తేటల్ని ఏ అమెరికానో స్వాహా చేయడానికి ఉపయోగించచ్చుగా..

  4. bonagiri says:

    అధో గతి రాయ్
    సూపర్..

    ఆవిడ వింటే ఆత్మహత్య చేసుకుంటుంది.

  5. చిలమకూరు విజయమోహన్ says:

    @bonagiri
    ‘ఆవిడ వింటే ఆత్మహత్య చేసుకుంటుంది’.
    ఆవిడ హృదయం రాయిలాగా గట్టిదిలెండి

    • Murali says:

      మీరూరుకోండి! ఆవిడది వెన్నెలాంటి మనసైతేనూ!
      ఒక సింధువులకు తప్ప ఎవరికి ఎలాంటీ హాని జరిగినా ఆమె తట్టుకోలేదు!

  6. tirapati gundu says:

    chachin laaga rest avvakunda malli postings back to full form..keep it up!

Leave a reply to కాముధ Cancel reply