ముఖపుస్తకం – 1


మానవ సృష్టిలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటాయి. నిప్పు కనుక్కోవడం అందులో ఒకటి, అప్పటి వరకు సాలడ్, పచ్చి మాంసం రుచి తప్ప వేరేది తెలియని మన పూర్వీకులకు అకస్మాత్తుగా ఒక కొత్త లోకం తలుపులు తెరుచుకుంది. వంట అనేది పుట్టుకొచ్చింది. (అఫ్ కోర్స్, నా వంట తిన్న వాళ్ళు, “భగవాన్, ఈ నిప్పు మానవులకు ఎందుకు దొరకనిచ్చావయ్యా?” అని వాపోవడం కద్దు. కానీ ఆ విషయం ప్రస్తుతం మనకు అప్రస్తుతం.)

అలానే ఉంకోటి చక్రం. ఈ చక్రం కనుక్కోవడం వల్ల మానవులకు దూర ప్రదేశాలు వలస వెళ్ళే వసతి కలిగింది. అంత వరకు బావిలో కప్పల్లా బ్రతికే మన పూర్వీకులు, వేరే బావులూ, వాట్లో వేరే కప్పలూ కూడా ఉన్నాయి అని కనిపెట్టారు. మన ప్రస్తుత వ్యావహారికంలో వాడే “జంప్ అయిపోవడం” అనేది చక్రం కనుక్కున్నాకే వీలయ్యింది. (అంటే అంతకు ముందు గుర్రాలు గట్రా ఉండేవి అనుకోండి. కాని అవి రౌతులని మోయడానికి మాత్రమే పనికోచ్చేవి. ఆస్తి పాస్తులు వాటి మీద తరలించడం అంత వీజీ కాదు.) అప్పటి వరకూ, నచ్చినా నచ్చకపోయినా అదే ఊర్లో అదే మనుషులతో ఉండాల్సి వచ్చేది. ఈ చక్రాలూ, తద్వారా బండ్లూ రావడం వల్ల, మూటా ముల్లే సర్దుకుని జనాలకు “జంప్” అయిపోయే సౌలభ్యం ఏర్పడింది. కొందరు ఔత్సాహికులు బోలెడు బండ్లు జమిలిగా కట్టుకుని వెళ్ళి దూర ప్రాంతాల ప్రజలని దోచుకోవడం కూడా మొదలు పెట్టారు. అవే యుద్ధాలు అని పిలవబడ్డాయి. (అంతకు ముందు దొమ్మీలు మాత్రమే ఉండేవి.)

దీని తరువాత వచ్చిన పెను మార్పు, వార్తా పత్రిక! దూర ప్రదేశాల్లో జరిగే సమాచారాలని ఈ వార్తా పత్రికల ద్వారా జనాలు తెలుసుకోవడం మొదలు పెట్టారు. (ఈ వార్తా పత్రికలని చక్రాలు ఉన్న బండ్ల ద్వారా సరఫరా చేసే వారు అన్న విషయం వేరే చెప్పక్కర్లేదనుకుంటా.) దీని వల్ల వేరే ప్రాంతాల ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, మన దగ్గర లేనివి వారి దగ్గర ఏమున్నాయి అని తెలుసుకునే వెసులుబాటు కలిగింది. దాని వల్ల ఇంతకు ముందు చెప్పినట్టు బండ్లు కట్టుకుని ఆ ప్రాంతాలని దోచుకోవడానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఇంకాస్త పెరిగింది.

వార్తా పత్రిక వచ్చిన చాలా ఏళ్ళ తరువాత Internet ఉద్భవించింది. దీనితో అప్పటి దాక ఉన్న కొద్ది ఎల్లలు కూడా చెరిగి పోయాయి. వెబ్‌క్యాంలో చూసి వంట చేయడం నేర్చుకోవడం లాంటి అద్భుతమైన విషయాలు వీలు పడ్డాయి.

మొత్తానికి చెప్పొచ్చేదేమిటంటే. ఈ పరిణామాల వల్ల ప్రపంచం అంతా ఒక పెద్ద పల్లెలా మారింది. అంటే, అందరికి అన్ని చోట్ల జరిగే విషయాలు తెలిసిపోవడం మొదలు పెట్టాయి. ఈ మార్పుకి అందరూ ముద్దుగా “ప్రపంచ పల్లె” అని ఒక పేరు పెట్టుకున్నారు.

మనుషులు ఇంత దగ్గర అయినప్పటికీ ఇంకా తృప్తి చెందని కొన్ని విద్రోహ శక్తులు, వాళ్ళని ఉక్కిరి బిక్కిరి అయ్యేంత దగ్గర చేయడానికి ఒక కొత్త సాధనంతో ముందుకు వచ్చారు. అదే ముఖపుస్తకం! ముఖపుస్తకం ద్వారా అందరికీ ఇప్పుడు తమ దగ్గరి వాళ్ళు, దూరం వాళ్ళు, ఇంకా చెప్పాలంటే అన్ని రకాల వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఎలా ఏం చేస్తున్నారో తెలుసుకునే మహదవకాశం ఏర్పడింది.

రాబోయే రోజుల్లో మనం చెప్పుకునే కథ ఈ ముఖపుస్తకానికి సంబంధించిందే.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in ముఖపుస్తకం. Bookmark the permalink.

5 Responses to ముఖపుస్తకం – 1

  1. kamudha says:

    ఏం చెప్తారో కొంత వరకు ఊహించగలిగినా, ఎలా చెప్తారన్నది మాత్రం సస్పెన్సే.

    కాముధ

  2. lslakshmi says:

    perlu pettatam lo meeku saati evaru leru

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s