ముఖ పుస్తకం – 9


నా పైత్యం శ్రుతి మించింది. అది కొంత మటుకు నాకే తెలుస్తూంది. మనుషులతో ముఖా ముఖీ ఏదీ సరిగ్గా మాట్లాడలేక పోతున్నా. ఎవరికి ఏది చెప్పాలి అన్నా, వీలైతే, వాళ్ళ ఫేస్‌బుక్ అకౌంట్‌లో మెసేజ్ పెడుతున్నా.

కానీ నేను నన్ను నేను మార్చుకునే స్థితిలో లేను. ముఖ పుస్తకం నా జీవితమంతా వ్యాపించింది. ఇంకో రకంగా చెప్పాలంటే, నేను కూడా ముఖ పుస్తకమంతా వ్యాపించడానికి ప్రయత్నిస్తున్నా.

నా మటుకు నాకు అంతా బాగానే ఉన్నా, మా ఇంట్లో వాళ్ళకి నా మీద బెంగ పట్టుకుంది. ఈ బెంగ నన్ను చూడక పట్టుకున్న బెంగ కాదు. ఈ బెంగ నన్నెప్పుడూ నా రూంలోనే, చూడ్డం వల్ల పుట్టుకొచ్చిన బెంగ.

“ఒరే, నీకు స్నేహితులెవరూ లేరా?” దిగులుగా అడిగింది మా అమ్మ నన్ను ఒక రోజు.

“ఇంసల్ట్! స్నేహితులు లేకపోవడమేంటి? నాకు దాదాపు 800 స్నేహితులు ఉన్నారు!” కోపంగా చెప్పాను నేను.

“అవునా? మరి ఒక్కడు కూడా ఇంటికి రాడేంటి? నువ్వెలాగూ బయటకి అఘోరించడం మానేశావు కద!”

“హ హ హ. పిచ్చి అమ్మ. వాళ్ళు బాలకృష్ణ టైప్. వెధవది, వీధికి, ఇంటికి ఏంటే! డైరెక్ట్‌గా నా రూంకే వచ్చేస్తారు.”

“ఎలా రా? నేనెప్పుడూ ముందు గదిలోనే ఉంటాను కద. కొంప తీసి వెనక పైప్ మీద పాకి, కిటికీ గూండా వస్తున్నారా?”

“ఆ గతి వాళ్ళకి పట్టలేదే. హాయిగా నా కంప్యూటర్ స్క్రీన్ మీదకే వస్తారు!”

“అంటే???”

“అంటే, నేను ముఖ పుస్తకం మీద అకౌంట్ తీసుకున్నా కద, వాళ్ళంతా కూడా అందులో సభ్యులు. కాబట్టి, అక్కడే కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, ఆట్లాడుకుంటాం, పోట్లాడుకుంటాం,” కించిత్ గర్వంగా చెప్పాను నేను.

“ఏడిసినట్టు ఉంది, ఫ్రెండ్స్ అంటే వీళ్ళా. అందుకే అన్న మాట, ఎప్పుడూ ఆ రూంలో తగలడతావు. రేపటినుంచి గంట కంటే ఎక్కువున్నావంటే, కాళ్ళిరగ గొడతాను,” అరిచింది మా అమ్మ.

నాకు సడన్‌గా గుర్తు వచ్చింది. పది నిముషాలయ్యింది నేను అప్‌డేట్స్ చూసుకుని. ప్రపంచంలో ఏమేం జరిగి పోతున్నాయో!

“మై ఆ రహా హూ!” అంటూ నేను నా రూంలోకి పరిగెట్టాను.

“లాభం, లేదు, వీడికి పూర్తిగా ముదిరిపోయింది,” మా అమ్మ వెనక నుండి గొణుక్కోవడం నాకు వినిపించింది.

* * *

మా వాళ్ళు, మా విస్సు మామయ్యని పిలిపించారు. విస్సు మామయ్య చాలా అనుభజ్ఞుడు. మా ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలొచ్చినా చిటికెలో పరిష్కరిస్తూంటాడు. ఎంత చెప్పినా, ఏం చేసినా నా పద్ధతి మారకపోవడంతో, ఆఖరి అస్త్రం కిందా ఆయన్ని ప్రయోగించారు.

“అసలు ఆ ముఖ పుస్తకంలో ఏముందని రా, అంతలా దానికి బానిస అయి పోయావు?” సూటిగా పాయింట్‌లోకి వచ్చేశాడు, విస్సు మామయ్య.

“మామయ్య, ఫస్ట్ అఫ్ ఆల్, బానిస అన్న పదాన్ని నేను ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాను. ముఖ పుస్తకం నన్ను బానిస చేసుకోలేదు, నేనే ముఖ పుస్తకానికి దగ్గరయ్యాను.”

“అదే, మరీ బాగా దగ్గరయ్యావనే, మీ ఇంట్లో వాళ్ళంతా బెంగ పెట్టుకున్నారు. అసలేముందిరా అందులో?”

“అసలేం లేదు అని అడుగు మామయ్య! అన్నీ ఉన్నాయి.”

“నా మొహం! నేను నమ్మను.”

“బయట ప్రపంచంలో దొరికేవన్ని, ఇక్కడ దొరుకుతాయి మామయ్య. కానీ ఎన్నో రెట్లు దొరుకుతాయి. కొన్ని సార్లు మన నిజ జీవితంలో దొరకనివి కూడా దొరుకుతాయి.”

“ఏం దొరుకుతాయిరా? శాంపుల్‌కి ఒకటి చెప్పు.”

“సరే! చెప్తాను. శ్రమ తెలియకుండా విను. నీ గోల్డెన్ డేస్‌లో నీకో లవ్ అఫెయిర్ ఉండేది కద! ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ట్రాన్స్‌ఫర్ అయి రాత్రికి రాత్రి ఊరొదిలి వెళ్ళిపోయారు, రైట్?”

ఒక్క సారి గుండె పట్టుకున్నాడు విస్సు మామయ్య. “ఆ విషయం ఎందుకురా గుర్తు చేస్తావు? నా వీక్ పాయింట్ మీద కొడుతున్నావు.”

“ఆ తరువాత ఆ అమ్మాయిని మర్చి పోలేక, ఎక్కడుందో తెలీక, పెళ్ళి చేసుకోకుండా ఉండి పోయావు.”

విస్సు మామయ్య మైండ్‌లో ఏదో బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ స్టార్ట్ అయినట్టుంది. పైకి లేచి నిలబడి, “విధి బలీయమైనది,” అన్నాడు.

“అలా డైలాగులు కొట్టి చేతులు దులిపేసుకోవాల్సిన అవసరం లేదు, మామయ్య. నువ్వు ముఖ పుస్తకంలో చేరావు అనుకో, ఆ అమ్మాయిని మళ్ళీ కలిసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అందరు అక్కడే ఉన్నారు. పైగా, ఆ అమ్మాయి కూడా పెళ్ళి చేసుకోలేదనుకో..”

“వాడిన పూలే వికసించెనే,” అప్రయత్నంగా అన్నాడు విస్సు మామయ్య.

ఐతే తన బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ అదన్న మాట.

“అది సంగతి మామయ్య. ఆల్‌రెడీ చాలా టైం వేస్ట్ చేశావు. నీ కర్తవ్యమేమిటో నీకు తెలిసిందీ కద? ప్రొసీడ్!” అన్నాను నేను.

ఆ తరువాత అంతా చక చకా జరిగిపోయింది. విస్సు మామయ్యకి నేనొక ముఖపుస్తకం అకౌంట్ క్రియేట్ చేసిచ్చి, కొన్ని బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఆ వెంటనే తను మా వాళ్ళు ఉండమంటున్నా వినకుండా మా ఇంటి నుండి నిష్క్రమించాడు.

హమ్మయ్య అనుకుని నేను నా ముఖపుస్తకం ప్రపంచంలోకి తిరిగి వెళ్ళిపోయాను.

***

“రేపే అప్పాయింట్‌మెంట్ డాక్టర్ మానస్ గారితో,” మా నాన్న నాతో చెప్పారు.

“మానస్ ఎవరు? ఐనా డాక్టర్ ఎందుకు? నేను దుక్కలానే ఉన్నానుగా,” అభ్యంతరం తెలిపాను నేను.

“నువ్వు బాగానే ఉన్నావురా, నీ వల్ల ఇక్కడ మాకు అన్ని రోగాలు వస్తున్నాయి. నీ వల్ల విస్సు మామయ్య కూడా భ్రష్టు పట్టి పోయాడు. అందరికి తల్లో నాలుకలో ఉండేవాడు, ఇప్పుడు కంప్యూటర్‌లో వైరస్‌లా తయారయ్యాడు. మన చుట్టాలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. పుత్ర దు:ఖం తండ్రికి కొడుకు పుట్టిన నాడే కలగదు, పుత్రుడు ముఖ పుస్తకములో కి ప్రవేశించిన నాడు తథ్యం సుమతి అన్న శతక వాక్యం నాకిప్పుడు అర్థమయ్యింది.”

“నాన్న, సుమతి శతకంలో ఉన్నది ఆ పద్యం కాదు. పుత్రోత్సాహం తండ్రికి… సుమతి!”

“ప్రస్తుతకాలానికి అనుగుణంగా శతకాల్లో పద్యాలు కూడా మార్చాలి. అందుకని నేనే మార్చేశాను. రేపు రెడీగా ఉండు,” ఆర్డర్ వేశారు మా నాన్న.

***

నాకు డాక్టర్ మానస్ క్లినిక్ బాగా నచ్చింది. ముఖ్యంగా ఆయన రిసెప్షనిస్ట్. ఆమె ముఖ పుస్తకం ఐ.డీ. ఏంటో కనుక్కోవాలి అని నిర్ణయించుకున్నాను.

మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు డాక్టర్ మానస్. “రండి, రండి. ఇతనేనా మీ అబ్బాయి? ఏమోయి మా క్లినిక్ ఎలా ఉంది?” అడిగాడు నన్ను. నేను “Like!” అన్నాను.

“అబ్బాయి మిత భాషా?” అన్నాడు మానస్.

“వాడి శార్దం. మితభాషి కాదు. మీకు చెప్పాగా వాడు ముఖ పుస్తకానికి అడిక్ట్ అని. అందులో మెంబర్స్ ఏదన్నా నచ్చితే అదే భాష వాడతారట. మొన్న వాళ్ళమ్మ కొత్తావకాయ పెట్టినప్పుడు కూడా ఇలానే మెచ్చుకున్నాడు,” చెప్పారు మా నాన్న గారు.

“ఓహ్, ఐతే విషయం చాలా దూరం వచ్చిందన్న మాట,” సాలోచనగా తల పంకించాడు మానస్.

మానస్ నా ఒక్కడితో ఇంటర్వ్యూ మొదలు పెట్టాడు.

“నువ్వు ముఖ పుస్తకం మీద రెచ్చిపోతున్న సమయంలో, నీ PC crash అయ్యింది. ఏం చేస్తావు?”

“వెంటనే Laptop on చేస్తా. అక్కడ నా దూకుడు కంటిన్యూ చేస్తా!”

“నీ ఖర్మ కాలి, Laptop కూడా ఫట్ అయితే?”

“నా smart phoneలో app వాడి చెలరేగిపోతా”.

“ఒక వేళ నీ smart phone charge అయిపోతే?”

నేను మానస్ వైపు అసహ్యంగా చూశాను. “సార్, మీ నోటి వెంట మంచి మాటలు రావా? ఐనా, ఒక వేళ మీరు చెప్పినట్టు జరిగితే, నా ఫ్రెండ్ అప్పారావు గాడి ఇల్లు దగ్గరే. అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోతా. వాడి Laptop మీద ముఖ పుస్తకం సైట్‌కి లాగిన్ అవుతా.”

“Laptop ఎందుకు? PC వద్దా?”

“మీకు బొత్తిగా నాలెడ్జ్ లేనట్టుంది. వాడి PC మీద వాడు ముఖ పుస్తకం సైట్‌కి లాగిన్ అయి ఉంటాడు కద!”

“ఓహో! ఒక వేళ ముఖపుస్తకం సైట్ ఏదన్నా అవాంతరాల వల్ల దాని ఓనర్ మూసేస్తే?”

“శివ శివ! ఏంటా అప్రాచ్యపు మాటలు. ఒక వేళ అలా జరిగితే, వెంటనే కాద్రాని సంప్రదిస్తాను.”

“ఎందుకు? కొత్త సైట్ ఓపెన్ చేయమనా?”

“కాదు కాద్రా ఒక క్షుద్ర మాంత్రికుడు. వాడితో ఆ ఓనర్ మీద చేతబడి చేయిస్తా.”

అక్కడితో ఇంటర్వ్యూ ఆపేసి మా వాళ్ళని లోపలికి పిలిచాడు డాక్టర్ మానస్.

మా వాళ్ళు వచ్చి కూర్చోగానే చెప్పాడు, “మీ వాడి అడిక్షన్‌కి ఒక్కటే పరిష్కారముంది.”

“అదేంటో చెప్పండి మానస్ గారు,” అర్థించారు మా నాన్న గారు.

సమాధానం చెప్పడానికి ముందు డాక్టర్ మానస్ తన గొంతు సవరించుకున్నాడు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in ముఖపుస్తకం. Bookmark the permalink.

11 Responses to ముఖ పుస్తకం – 9

 1. kastephale says:

  continue. very interesting

 2. Anuradha says:

  😀 😀

 3. chinni says:

  like:-)
  i will share.

 4. :)..Very good..waiting for next part..

 5. satish says:

  chala bagaundi……

 6. suresh says:

  well, you forgot to add like button to your blog

 7. suresh says:

  saw it just now…liked it

 8. Amun says:

  amazing………
  to be frank, this is great post of yours, after loooooong time.
  🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s