ముఖ పుస్తకం – 10 (ఆఖరి భాగం)


లడక్! పీకాన్ కొంప మొనాస్టరీ. లడక్ లోనే అతి పెద్ద బౌద్ధ విహారం. కున్లున్ కొండల మీద నిర్మించ బడింది. ఇక్కడికి రావాలంటే మే నెల నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే సాధ్యం. ఆ తరువాత కురిసే మంచు అన్ని రహదారులను కప్పేస్తుంది. శిక్షణ పొందిన సైనికులకే అక్టోబర్ నుంచి మే వరకు లడక్ దాటడం చాల చాలా కష్టం. ఈ రోజు అక్టోబర్ ఒకటో తారీకు.

(ఇదంతా ఏమిటి, అసలు కథ గాడి తప్పింది, అనుకుంటున్నారా? పెద్దగా ఖంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మన పాత కథే. ఐతే కాస్త లొకేషన్ మారింది, అంతే!)

సరిగ్గా సెప్టెంబర్ ఇరవయ్యి ఎనిమిదిన మా వాళ్ళు డాక్టర్ మానస్ సలహా మేరకు నన్ను పీకాన్ కొంప మొనాస్టరీకి తీసుకుని వచ్చారు. రెండు రోజుల తరువాత లాస్ట్ బస్సులో వాళ్ళంతా తిరిగి హైదరాబాద్‌కి వెళ్ళి పోయారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మే వరకు అన్ని రోడ్లూ మూత పడే ఉంటాయి.

ఇదంతా జరిగింది ఇంతకు ముందు చెప్పినట్టు డాక్టర్ మానస్ ఇచ్చిన దిక్కు మాలిన సలహా వల్ల. నేను తన క్లినికి్‌ని “లైక్” ఛేశాను అన్న కృతజ్ఞత కూడా లేకుండా, నాకు ఈ ట్రీట్‌మెంట్ రికమెండ్ చేశాడు.

ప్రస్తుతం నేను ఒక్కడిని ఒక గదిలో ఉన్నాను. అసలు ఒక గది ఇంత ఖాళీగా ఉండచ్చు అని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఈ గదిలో ఏమీ లేవు. ఆఖరికి అరలు కూడా లేవు. ఉన్నా కూడా ఊడబొడిచేది ఏమీ లేదనుకోండి. అసలు అరల్లో పెట్టుకోవడానికి ఏవన్నా సామాన్లు ఉండాలి కద. నేను ఒంటి మీద దారించిన బౌద్ధ భిక్షువుల పొడుగు గౌన్ తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. ఇంతకంటే వివరాలు అడగకండి, వినడానికి మీకు సిగ్గు లేక పోయినా, చెప్పడానికి నాకు చాల సిగ్గుగా ఉంటుంది.

నాతో మాట్లాడాక డాక్టర్ మానస్ మా వాళ్ళకి cold turkey ట్రీట్‌మెంట్ రికమెండ్ చేశాడు. cold turkey ట్రీట్‌మెంట్ అంటే వ్యసనాలను పోగట్టడానికి వాడే ఒక కఠినమైన పద్ధతి.

ఉదాహరణకు, మీకు చేగోడీలు ఎక్కువ తినే అలవాటు ఉందనుకోండి. “నాన్నా, చేగోడీలు ఎక్కువ తినడం ఒంటికి మంచిది కాదురా. రేపటి నుంచి రోజుకి ఒక వంద మాత్రమే తిను. నెక్స్ట్ మంత్ నుంచి, రోజుకి ఒక తొంభై మాత్రమే తిను. అలా మెల్ల మెల్లగా తగ్గించుకుంటూ పోదాం, ఏం నాన్నా?” అని బుజ్జగించడం మామూలు పద్ధతి. దీని వలన రోగి తక్కువ ప్రయాసతో మెల్లగా చేగోడీలు తినడం మానేస్తాడు. (పైగా చేగోడీల బిజినెస్ కూడా పెద్దగా దెబ్బ తినదు.)

అదే పై రోగిని cold turkey విధానంతో ట్రీట్ చేస్తే ఇలా ఉంటుంది. “నా కొడకా, చేగోడీలు కాదు కద, వడియాలు కూడా ఇవ్వం. నిన్ను ఈ గదిలో పడేసి తాళం వేస్తాం. నాకు చేగోడీలు వద్దు బాబోయి అని నువ్వు కేకలు వేసే వరకు, ఇలానే నిన్ను బంధిస్తాం,” అని మిమ్మల్ని ఒక రూంలో పడేసి బయటనుంచి తాళం పెట్టారనుకోండి, అది cold turkey పద్ధతి అవుతుంది.

***

“మీ వాడిని బాగు చేయలంటే ఇదే పద్ధతి. పీకాన్ కొంప మొనాస్టరీలో ఐతే ఈ ముఖ పుస్తకం మీదకి వెళ్ళే ఛాన్సు కూడా ఉండదు. అక్కడ ఇంటర్‌నెట్ సంగతి బుద్ధుడెరుగు, ఆఖరికి మాములు పోస్ట్ కూడా నెలకి ఒక సారే వస్తుంది. అక్కడ ఉంటే మీ వాడికి బయట ఒక ప్రపంచం ఉంది అన్న విషయం తెలిసొస్తుంది. ఏడు నెల్ల తరువాత మామూలు మనిషై, మంచు కురవడం ఆగి పోయి రోడ్లు మళ్ళీ తెరిచాక, మీ దగ్గరకు తిరిగి వస్తాడు,” గంభీరంగా చెప్పాడు మానస్ మా నాన్నతో.

“కడిగిన ముత్యంలానా?” ఆశగా అన్నారు మా నాన్న.

“మీ వాడు ఇంతకు ముందు ముత్యం అయి ఉంటే కడిగిన ముత్యంలానే వస్తాడు లెండి. ఎటొచ్చి, మీ వాడిలో నాకు ముత్యం క్వాలిఫికేషన్స్ ఏవీ కనపడలేదు. కాబట్టి కనీసం కడిగిన రాయిలా ఐనా తిరిగి వస్తాడు,” అన్నాడు మానస్.

నాకు ఒళ్ళు మండింది. “Dislike!” అని నా బొటన వేలు కిందకి దింపి చూపించాను. ఎవరూ పట్టించుకోలేదు.

“ఒక ముఖ్య విషయం. పీకాన్ కొంప మొనాస్టరీలో కాపలాలు గస్తీలు లాంటివి ఉండవు. కాబట్టి మీరు మీ వాడిని సరిగ్గా టూరిస్ట్ సీజన్ ఆఖర్లో తీసుకెళ్ళండి. లాస్ట్ బస్సు ఎక్కి వచ్చేయ్యండి. ఆ తరువాత మీ వాడు ఏడు నెలల వరకు పారిపోదామన్నా పారిపోలేడు,” నవ్వుతూ చెప్పాడు డాక్టర్ మానస్.

“నహీ!” గట్టిగా అరిచాను నేను.

***

అలా నేను పీకాన్ కొంప మొనాస్టరీలో వచ్చి ఈ ఖాళీ గదిలో పడ్డాను. ఇక్కడికి వచ్చి మూడు రోజులు ఐనా నాకు మూడు సంవత్సరాలు గడిచినట్టు ఉంది. అందులో ఆశ్చర్యం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడా అన్ని వస్తువుల్లానే, గడియారాలు కూడా ఉండవు.

మద్యాహ్నం అవుతున్నట్టు ఉంది. ఎందుకంటే పొద్దున తిన్న తిండి అరిగి పోయి కడుపు మండుతూ ఉంది. పొద్దున నాకు థుప్కా అనే పదార్థం పెట్టారు. “థూ, పక్కకు తీస్కోపో,” అని అది తెచ్చిన బౌద్ధ బిక్షువు మీద పెద్దగా అరిచాను నేను.

పళ్ళంతా కనపడేలా నవ్వి, అది తీసుకుని బయలుదేరాడు అతను. నాకు సడన్‌గా భయం ముంచుకుని వచ్చింది. వెళ్తే మళ్ళీ మజ్జాన్నం వరకు రాడేమో! వేగంగా ముందుకి దూకి అతని చేతిలో బౌల్ లాక్కున్నాను. భిక్షువు గది తలుపులు బయటనుంచి తాళం వేసుకొని వెళ్ళి పోయాడు. ఇలా నన్ను ఒక వారం రోజులు ఈ గదిలోనే ఉంచుతారట. ఆ తరువాత కాస్త వేరే మనుషులని కలవడానికి అవకాశం ఇస్తారట. ఇవన్నీ ఈ బౌధ్ధ భిక్షువులు నాకు చెప్పలేదు. మా వాళ్ళు వెళ్ళిన తరువాత నాకు ఒక పేపర్ ఇచ్చారు. దాని మీద ఈ వివరాలన్నీ ప్రింట్ చేయబడి ఉన్నాయి. అదీ, నా బ్రేక్‌ఫాస్ట్ కథ.

ఇప్పుడు మద్యాహ్నం ఫుడ్ వచ్చే వరకు ఏం చేయాలి? ఆలోచనలో పడ్డాను. మా అప్పిగాడు ఏం చేస్తున్నాడో? వల్లకాట్లో రామనాధానికి కట్టెలు సరిగ్గ దొరుకుతున్నాయో లేదో? ఇలాంటి ప్రశ్నలతో మనసంతా గజిబిజిగా హైదరాబాద్ ట్రాఫిక్‌లా తయారయ్యింది. ఇంకో వైపు, నా చుట్టు అలుముకుని ఉన్న నిశ్శబ్దం నాకు పిచ్చెక్కిస్తూంది.

కాసేపయ్యాక ఇక భరించలేక గోడ మీద గట్టిగా చరిచాను. ఆశ్చర్యం! అటు వైపు గోడ మీద కూడా ఇంకెవరో చరిచారు. ఐతే నాలానే ఇక్కడ ఇంకో బాధితుడు ఉన్నాడన్న మాట. నేను ఆనందంతో ఎగిరి కాలితో గోడ మీద ఒక తాపు తన్నాను.అటు వైపు నుంచి కూడా డిట్టో! నా మనసు ఆనందంతో నిండి పోయింది.

“స్నేహితుడా, స్నేహితుడా, రహస్య స్నేహితుడా!” అంటూ, నాకు తెలిసిన ఒక డబ్బింగ్ పాట పాడుకుంటూ, గోడని ఎడా పెడా వాయించడం మొదలు పెట్టాను. అటు వైపు నుంచి నా రహస్య స్నేహితుడు కూడా గోడని దడదడలాడించ సాగాడు. మనిషికి కమ్యూనికేషన్ అనేది ఎంత ముఖ్యమో నాకు ఆ క్షణం అర్థమయ్యింది. ఏం చెప్తున్నాం అన్నది కాదు ముఖ్యం. ఏదో ఒకటి ఎప్పుడూ చెప్తూ ఉండాలి. అదీ విషయం!

ఆ తరువాత నాకు టైం కొంత సులువుగానే గడిచింది. వారం రోజుల దరువు తరువాత, నేను బాగా క్లోజుగా “కెవ్వు కేక” పాట ట్యూన్‌ని గోడ మీద చేతులతో గుద్దుతూ కాళ్ళతో తంతూ పలికించగలిగాను. అటు వైపు రహస్య స్నేహితుడు కూడా “ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా” ట్యూన్‌ని బాగానే పలికించాడు. ముఖ పుస్తక ప్రపంచంలో ఏం జరుగుతూందో తెలీని లోటు దీని వల్ల కాస్త పూడుకుంది.

***

వారం రోజులయ్యాక, ముందుగా ప్రామీస్ చేసినట్టే, నా తిండి తిప్పలు చూసే భిక్షువు, నన్ను నా గది నుంచి బయటకు తీసుకుని ఒక పెద్ద హాల్‌లో ప్రవేశ పెట్టి వెళ్ళి పోయాడు. As usual ఈ హాల్‌లో కూడా ఏమీ లేవు, ఒక నాలుగు కిటికీలు తప్ప. కిటికీల్లోంచి బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడ్డానికి ప్రయత్నించాను. ఏ కిటికీలోంచి చూసిన తెల్లని మంచు తప్ప ఏమీ లేదు. అంత తెలుపు చూసి కళ్ళు భైర్లు కమ్మడంతో, మళ్ళీ నా చూపుని హాల్ లోపలకే తిప్పుకున్నాను. లోపలేమో శూన్యం. దీని కంటే నా గదిలో సంగీత సాధనే బెటరెమో అన్న అనుమానం వచ్చింది నాకు.

“ఛీ, ఈ దిక్కు మాలిన ప్రదేశంలో ఎన్ని కోట్లు ఇచ్చినా ఉండను. దీనికంటే మా మూసీ నది తీరం బెటర్,” కోపంతో కాస్త గట్టిగానే అన్నాను.

“నేనూ అంతే, వెయ్యి కిలోల జీడి పప్పు ఇచ్చినా సరే, ఇక్కడ ఉండలేను,” ఒక గొంతు వినిపించింది.

వెనక్కి తిరిగి చూస్తే పద్మాకర్ గాడు! ముఖ పుస్తకంలో వాడి ఫోటోలు ఎన్నో చూసి ఉండడం వల్ల వెంటనే గుర్తు పట్టాను.

“ఒరే పద్మాకర్! నువ్విక్కడేంట్రా?” కాస్త ఆశ్చర్య పోయాను.

“ఏం నువ్వొక్కడివే ముఖ పుస్తకానికి అడిక్ట్‌వా? డాక్టర్ మానస్, మీ వాళ్ళకు మాత్రమే తెలుసా?” ఎదురు ప్రశ్న వేశాడు వాడు.

“ఐతే నిన్ను ఇక్కడికి పంపించింది కూడా డాక్టర్ మానసే అన్న మాట!”

“అవును! ఇక్కడ ఏడు నెలలు ఉంటే కడిగిన రప్పలా తిరిగొస్తాను అని చెప్పి మా నాన్నని కన్‌విన్స్ చేశాడు.”

“రప్ప లానా?”

“అదే రా, రాయి రప్ప అంటారు కద! అలా అన్న మాట.”

“మా వాళ్ళకూ అలాంటిదే ఏదో చెప్పాడులే. సో, నా పక్క రూంలో ఆకలేస్తే అన్నం పెడతా పాట వాయించింది…?”

“నేనే. నీ కెవ్వు కేక పాట విన్నాక అనుకున్నా. అచ్చం మన టేస్ట్ ఉన్న వాడే ఇక్కడ చేరాడు అని. ముల్లును ముల్లుతోనే తీయాలి అంటారు కద. అలా నేను ఈ పాటతో జవాబు ఇచ్చా.”

“ఒక రకంగా మనిద్దరం ఒకే టైంలో ఇక్కడికి రావడం మంచిదే అయ్యిందిలే,” సాలోచనగా అన్నాను నేను.

“అంటే?”

“ఒక మనిషి ఇంకో మనిషితో కమ్యూనికేట్ చేయడానికి, గోడలని కూడా వాడుకోవచ్చు అని మనం నిరూపించాం. ఇదే ఊపులో ఒక కొత్త గోడ భాష కనిపెడితే, మనం రోజంతా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. నేను గత సంవత్సరంగా ముఖ పుస్తకంలో నాకైన అనుభవాలన్ని, గోడ మీద దరువేస్తూ నీతో చెప్తా. నువ్వూ, నీ అనుభవాలు అలానే చెప్పు. ఈ ఏడు నెలలు survive అయ్యాక తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చు.”

“బ్రిలియంట్! వంద జీళ్ళు ఒకే సారి పర పరా నమిలేసినంత ఆనందంగా ఉంది.”

“నాకు తెలుసు నీకు ఈ ఐడియా నచ్చుతుందని. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం, గోడ భాష కనిపెట్టడం!”

“కరెక్ట్. “అ” అనాలి అంటే ఇలా గోడ మీద పిడి గుద్దులు గుద్దాలి,” పక్కనున్న గోడని గుద్దుతూ, చెప్పాడు పద్మాకర్.

“బాగుంది. “ఆ” అనాలి అంటే ఇలా రెండు సార్లు పెడీ పెడీ అని తన్నాలి,” కుంగ్-ఫూ మాస్టర్‌లా గాలిలోకి ఎగురుతూ అన్నాను నేను.

(అయిపోయింది)

(అంటే నిజానికి అయిపోలేదు, ఇంకా బ్యాడ్ అయ్యింది.)

నీతి: పనికొచ్చే పనులు చేయడం కష్టం కానీ, ఇలాంటి దిక్కు మాలిన హ్యాబిట్స్ ఎక్కడున్నా కంటిన్యూ చేయొచ్చు.

వినతి: ఈ కథ లింక్ మీ ముఖ పుస్తకం అప్‌డేట్స్‌లో తప్పకుండా పెట్టండి. 😉

Advertisements
This entry was posted in ముఖపుస్తకం. Bookmark the permalink.

9 Responses to ముఖ పుస్తకం – 10 (ఆఖరి భాగం)

 1. Abc says:

  mugimpu chappaga undhi (poyina vaatitho polisthe) .. ayina sare .. “Like!”

 2. swathi says:

  inka continue cheste bagundedi,i like it

 3. Amun says:

  Like –> for great post

  dislike –> for ending when real fun started

  🙂

 4. Annapurna says:

  Abrupt ga end chesesaru Muraligaru. Inka continue cheste bagundedi.

 5. suresh says:

  story ended like recent RGV movies. Probable effect of staying too long in monastery.

 6. Wanderer says:

  లాస్ట్ ఎపిసోడా???????? నహీఈఈఈఈఈఈఈఈఈ!!!!!!!!!!!!!!!!!!!!!

 7. sushma vedam says:

  Will surely miss the mukha pusthakam series….looking for more,the expectation has gone up now…

 8. Kumar says:

  కడిగిన రప్పలా తిరిగొస్తాను
  మనిషికి కమ్యూనికేషన్ అనేది ఎంత ముఖ్యమో నాకు ఆ క్షణం అర్థమయ్యింది. ఏం చెప్తున్నాం అన్నది కాదు ముఖ్యం. ఏదో ఒకటి ఎప్పుడూ చెప్తూ ఉండాలి. అదీ విషయం!
  ఇంటర్‌నెట్ సంగతి బుద్ధుడెరుగు 🙂 Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s