ముఖపుస్తకం పై విమర్శలు


ముఖపుస్తకం మీద టైపు చేసుకుని ( సాధారణంగా నోరు చేసుకుని అంటారు, కానీ ఈ 21వ శతాబ్దం రెండవ దశకంలో, ఇలా బ్లాగులు రాసి టైపు చేసుకొవడానికి మాత్రమే వీలు కుదురుతుంది), తప్పు చేశానేమో అని నాకు ఈ మధ్యే సందేశం, అదే సందేహం, వచ్చింది.

దీనికి కారణం, నేను ముఖపుస్తకంలో ప్రస్తుతించిన వివిధ రకాల క్యారక్టర్స్ నా మీద విరుచుకు పడడమే.

వారి ప్రతిస్పందనలు ఈ విధంగా ఉన్నాయి.

1. పద్మాకర్:

నువ్వు ఎదుటి వారి ప్రైవసీకి కొంచెం కూడా విలువ ఇవ్వవా? ఎందుకిలా మా పర్సనల్ విషయాల్లో తల దూరుస్తావు?

జీడిపప్పు అంటే ఇష్టం ఉండడం తప్పా? మొన్న సత్యా కృష్ణ గారి “ఓపెన్ పార్ట్” కార్యక్రమంలో వానమూరి ధీరేంద్ర నాథ్ చెప్పినట్టు, నేను జీడిపప్పు తినడం వల్ల, నాకు కానీ, ఎదుటి వాళ్ళకి కానీ, దేశానికి కానీ నష్టం లేకపోతే, నేను జీడి పప్పు తినడం తప్పెలా అవుతుంది? ఛాన్స్ దొరికితే నువ్వు కూడా జీడి పప్పు లాగించవా? పెద్ద నా మీద జోకులు వేస్తున్నావు గానీ… నా మనోభావాలు నువ్వు తీవ్రంగా గాయ పరిచావు.

2. ఎప్పుడూ మూడ్ బాగుండని అమ్మాయి

ఎదుటి వారి డిప్రెషన్‌లో ఆనందం వెతుక్కునే మీ గొప్ప సంస్కృతికి నా జోహార్లు. నేను అలా నా నైరాశ్యాన్ని ముఖ పుస్తకంలో పంచుకోవడం తప్పు ఎలా అవుతుంది? కష్టాలు పంచుకుంటే పోతాయి అన్న పెద్దల మాట మీరు వినలేదా? అందుకే నా కష్టాలు, నా నిరాశను ముఖ పుస్తకంలో ఎడా పెడా పంచుకుంటున్నాను. తప్పా?

ఎదుటి వాడి ఇల్లు కాలిపోతే, బీడీ అంటించుకోవడానికి నిప్పు దొరికిందని ఆనందించే వారికి, నా డిప్రెషన్‌ని చూసి ఎగతాళి చేసే మీ లాంటి వారికి తేడా లేదు. ఛీ, మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువ తిట్టలేను.

3. దూరపు చుట్టం (పూజల బాబాయి)

ఏం నాయనా? నీకు నచ్చే పూజలు ఏమీ చెప్పలేదన్న కోపంతో నన్ను ఇలా ఇంటర్‌నెట్ మీదకి ఈడ్చావా? అడిగితే చెప్పనా? అయినా నేను చెప్పిన పూజా విధానంలో తప్పేం ఉంది? బాబా గారి ఫోటోని గుండెల మీద పెట్టుకుని ఇంటి చుట్టూ పొర్లు దండాలు పెట్టమన్నాను. ఆ మాత్రం చేయలేవా? పైగా మీ ఇంటి చుట్టూతా ముళ్ళు, కాబట్టి నీ జీవితం చిరిగి చేటైపోతూంది అని రాశావు. ఆ ముళ్ళు పీకేసి, పొర్లు దండాలు పెట్టలేవా? ఆ మాత్రం, ఇంగితం లేదా? చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్టు…

4. స్నానాల కజిన్

నా ఇష్టమయ్యా, గంట కాకపోతే, రెండు గంటలు స్నానం చేస్తాను. అసలు బాత్‌రూం నుంచి బయటకు రానే రాను. అసలు స్నానం గొప్పదనం తెలుసా నీకు? దాని విలువ ఏమిటొ తెలియాలంటే కార్తీక పురాణం చదువు. తెలుస్తుంది. పైగా వెధవ కిరాణా లెక్కలు ఒకటి, ఎన్ని సబ్బులు అవుతాయో ఎంత ఖర్చు అవుతుందో అంటూ. స్నానాన్ని ఎంజాయ్ చేసే నాలాంటి వాడు, సబ్బు చేతిలోకి వస్తే, “ల లా లా ల లా లా” అని పాడుకుంటూ స్నానం చేస్తాడే కానీ, ఆ రోజుకి సబ్బు ఎంత అరిగిందా అని చూడడు. స్నానేన సకల పాపానాం వినాశ:

5. కొలీగ్

కళా హృదయం లేని నీ లాంటి వాడికి “దరిద్రుడు” సినిమా గొప్పదనం, దాని ట్యాగ్ లైన్ ఔచిత్యం ఏం తెలుస్తాయి? ఈ సినిమాలో నా అభిమాన హీరో దరిద్రుడు. అయినా, అతనికి స్వాభిమానం ఎక్కువ కాబట్టి ఆకలి వేసినా బిచ్చమెత్తుకోడు. బిచ్చమెత్తుకోడు అని ఉందే కానీ, తిననే తినడు అని లేదే? హీరోయిన్, వ్యాంపు చెరో వైపు కూర్చుని తినిపించే గోరు ముద్దలు చాలు మా హీరో ఆకలి తీరడానికి!

6. అప్పారావు

అసలు ఇలాంటి బ్లాగ్ రాయడమే తప్పు. పైగా నన్ను ఏ మాత్రం కన్సిస్టెన్సీ లేకుండా, ఒక సారి అప్పిగాడు అని, ఇంకో సారి అప్పడు అని, మరో సారి అప్పారావు అని పిలవడం ఇంకా టూ మచ్. నా వల్లే నీ జీవితంలో కొత్త లోకాలు అడుగు పెట్టాయని, నా వల్లే నీకు సామాజిక స్పృహ, మా ఇంటి దొడ్లో పిచ్చి మొక్కల్లా, పెరిగిపోయిందని గుర్తుకి తెచ్చుకో. అన్నం తిన్న చేయినే కరిచే టైప్ నువ్వు.

7. విస్సు మామయ్య

నా లైఫ్‌లోని ట్రాజెడీ బయట పెట్టి నన్ను కూసింత అభాసుపాలు చేసినా, మోడు వారిన నా జీవితాన్ని మళ్ళీ చివురింపజేసిన వాడివి కాబట్టి నిన్ను ఏమీ అనలేను. ముఖ పుస్తకంలో జాయిన్ అయ్యాక, ఎంతో మందితో పరిచయాలు పెరిగాయి. నా ఓల్డ్ గర్ల్‌ఫ్రెండ్ దొరకలేదు కాని, దాదాపు నా వయస్సు వాళ్ళే, ఒక పదహారు మంది అమ్మాయిలు పరిచయమయ్యారు. ఈ నాలుగు లైన్లు రాసేంతలో వాళ్ళు నలభయి ఎనిమిది అప్‌డేట్స్ పెట్టారు. ఇంక ఉంటాను.

8. వల్లకాట్లో రామనాథం

పక్షులలో గరుత్మంతుడిని, రాక్షసుల్లో ప్రహ్లాదుడిని అని చెప్పిన ఆ శ్రీ కృష్ణుడు, వల్లకాట్లో రామనాథాన్ని నేనే అని చెప్పడం మరిచాడు. నేనెవరు, ఎక్కడ పరిచయమయ్యాను, ఎందుకు నిన్ను add చేసుకున్నాను లాంటి ఐహిక విషయాల్లో కొట్టుకుపోకుండా, ఎలాంటి కట్టెలు త్వరగా తగలబడతాయి, వేటిని వాడితే పొగ తక్కువగా వస్తుంది, లాంటి విషయాల మీద మనసు లగ్నం చేయి. పైకొస్తావు. ఐ మీన్, పైకెళ్తావు.

ఇంకా చాలా చాలా విమర్శలు వచ్చాయి. అవన్ని ఇక్కడ రాయడం కంటే, పీకాన్ కొంప మొనాస్టరీలో ఇంకో ఆరు నెలలు ఉండడం బెటర్.

స్వస్తి.

Advertisements
This entry was posted in ముఖపుస్తకం. Bookmark the permalink.

6 Responses to ముఖపుస్తకం పై విమర్శలు

 1. Wanderer says:

  A brilliant addendum to a brilliant series! ఇదిక్కడితో ఆగిపోకుండా, వందలాది ముఖపుస్తకం వాడకందారులు మీకు ఉత్తరాలు వ్రాసి తమ అభిప్రాయాలు తెలపాలని, అవన్నీ ఇక్కడ పోస్టుల రూపంలో రావాలనీ ఆశిస్తున్నాను.

 2. రవి says:

  నావీ కొన్ని.

  విజ్ఞాని పరమానంద్ కుమార్:
  నేను ముఖపుస్తకంలో రాసేవన్నీ నా వరకూ యూనివర్సల్ సత్యాలు. వాటిని కాదనే హక్కు నీకు లేదు. నాతో విభేదించు, కానీ నీ సత్యాన్ని నామీద ’మీరా శీకాయ పౌడర్” లా రుద్దవద్దు! నేను సహించను.

  మహాజ్ఞాని పరమేశం:
  స్త్రీలు మాత్రమే చింతకాయపచ్చడి పెట్టగలరంటే ఒప్పుకోవడం కుదరదు. తఱుచుగా మన వార్తాపత్రికలలో, టీవీలలో ఈ విషయం ప్రచారం చేయడాన్ని గర్హిస్తున్నాను.

  పాపారావు:
  ’పాపారావు’ has updated his photo.

  రాంబాయమ్మ:
  కొత్త కూర వండాను. ఫోటో ఇదిగో. మా ఆయన ఇంకో వారం రోజుల వరకూ నన్ను మాట్లాడించడు.

  రాంబాయమ్మ భర్త:
  హమ్మయ్య! ఏదో డ్రామాలాడి మా ఆవిడ వారం రోజులు నా జోలికి రాకుండా చేసుకున్నా.

  ..
  ..

 3. చాల బాగా రాసారు .మీ టపాలు చదువుతూ హ్యాపీ గా నవ్వుకోవచ్చు .మీ ముఖ పుస్తకం తొమ్మిదో భాగం నా వాల్ లో అతికించాను.మా అక్క చదివి నాకు ఫోన్ చేసి తిట్టింది నవ్వి నవ్వి పొలమారి తలనొప్పి కడుపు నొప్పి కూడా తెప్పించారట .ఈ నేరం నాది కాదని ఒప్పించడానికి చాల తంటాలు పడ్డాను 🙂

  • Murali says:

   ఏంటీ, నేను వాల్ మీద రాసిన కామెడీని మీ వాల్ మీదే అంటించారా? (విగ్రహారాధన వద్దన్న బుద్ధుడికి బౌద్ధులు తరువాత విగ్రహం కట్టినట్టు) 🙂 అన్నట్టు ఈ నేరం నాది కూడా కాదు. పూర్తిగా ముఖపుస్తకానిదే!

 4. Anuradha says:

  విమర్శలు కూడా మీ టపా లాగానే ఎంజాయ్ చేసేలా ఉన్నాయి 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s