కన్నవారి కలలు


రాఘవరావు ఒక ప్రవాస భారతీయుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అమెరికాలో స్థిరపడిన తెలుగు వాడు. చాలా మంది తెలుగు వాళ్ళలానే తనూ హెచ్-1 వీసా ద్వారా అమెరికా వచ్చి, ఆ తరువాత పెళ్ళి చేసుకుని, ఆ తరువాత గ్రీన్ కార్డ్ సంపాదించి, అమెరికాలో తెలుగు వారు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న క్యాలిఫోర్నియా రాష్ట్రంలో, భార్యా సమేతంగా సెటిల్ అయ్యాడు.

రాఘవరావుకి ఇండియాలో గడిపిన రోజుల గురించి, ముఖ్యంగా తన చదువు గురించి, ఉన్న గుర్తులు ఇవి. వీధిలో ఉన్న పిల్లలతో గోళీలు, క్రికెట్టు లాంటి ఆటలు ఆడుకోవడం. సాయంత్రం వీలైతే ఒక గంట చదవడం. ఎవరైనా చుట్టాలొస్తే వాళ్ళతో సినిమాకి వెళ్ళడం, పరీక్షలకు రెండు రోజుల ముందు కాస్త సీరియస్‌గా చదవడం, మార్కులు సరిగ్గా రానప్పుడు నాన్న చేతిలో దెబ్బలు తినడం.

రాఘవరావు వాళ్ళ ఇంటి దగ్గర స్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత దగ్గర ఉన్న టౌన్‌లో ఇంటర్‌మీడియేట్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణుడు కావడం వల్ల హైదరాబాద్‌లోని గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంజనీరింగ్ చదువుకుని, తరువాత కొన్ని రోజులు ఇండియాలో ఉద్యోగం వెలగబెట్టి, ఆ తరువాత అమెరికా చేరుకున్నాడు.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, అప్పటితో పోలిస్తే ఇప్పటి పిల్లల పెంపకం, ముఖ్యంగా ప్రవాస భారతీయుల పిల్లల పెంపకం, ఎంతలా మారిపోయిందో అన్న విషయాన్ని ఎత్తి చూపడానికి.

ఒక శనివారం, ఫ్రెండ్ సుధాకర్ పిలిచాడని, రాఘవరావు తన భార్య రాధతో సహా అతనింటికి చేరుకున్నాడు. సుధాకర్ రాఘవరావు కంటే వయసులో పెద్ద. అతనికి 5, 7 ఏళ్ళ వయసులో ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇంటికి చేరి కాలింగ్ బెల్ కొట్టగానే సుధాకర్ భార్య స్మిత తలుపు తెరిచింది. “రండి,రండి. మీ కోసమే ఎదురు చూస్తున్నాం. లంచ్ కూడా సిద్ధం,” అని ప్రకటించింది నోరారా నవ్వుతూ.

“మరే, క్యాలిఫోర్నియాకి మూవ్ ఆయాక ఇదే మొదటి సారి మీ ఇంటికి రావడం,” సోఫాలో కూర్చుంటూ అంది రాధ.

“ఇంతకి మా వాడు ఎక్కడ?” అడిగాడు రాఘవరావు భార్య పక్కనే ఆసీనుడవుతూ.

“ఆయన ఇప్పుడే బయటకి వెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారు,” చెప్పింది స్మిత.

“అదేంటి? మేము వస్తునట్టు వాడికి తెలీదా?” కాస్త నొచ్చుకున్నాడు రాఘవరావు.

“మీరు అపార్థం చేసుకోకండి. ఆయన అర్చక్‌ని కుమ్మోన్ క్లాసులో దింపడానికి వెళ్ళారు. క్లాస్ కాగానే వచ్చేస్తారు,” వివరణ ఇచ్చుకుంది స్మిత.

ఒక్క క్షణం ఆవిడ వాడిన పదాలు అర్థం కాలేదు రాఘవరావుకి. తరువాత వెలిగింది అతనికి, అర్చక్ సుధాకర్ స్మితల ఏడేళ్ళ అబ్బాయి. వినూత్నంగా ఉండాలని సుధాకర్ దంపతులు తమ కొడుకుకి ఆ పేరు పెట్టుకున్నారు.

“ఈ కుమ్మోన్ ఏంటండి?” సంభాషణలో తను కూడా పాలు పంచుకుంది రాధ.

“లెక్ఖలు నేర్పిస్తారు,” చెప్పింది స్మిత.

“అంటే అర్చక్ వెళ్ళే స్కూల్‌లో ఆ సబ్జెక్ట్ లేదా?” అయోమయంగా అడిగింది రాధ.

కిసుక్కున నవ్వింది స్మిత. “మీరు మరీ చోద్యం రాధా గారూ, వాళ్ళ స్కూల్‌లో కూడా చెప్తారు. ఐతే కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఎక్స్‌ట్రా కోచింగ్ అవసరం. కుమ్మోన్ వాళ్ళైతే అడ్వాన్సుడ్ మ్యాత్ ఒక లెవెల్‌లో కుమ్మేస్తారు, అందుకే అనుకుంటా కుమ్మోన్ అని పేరు. పైగా మేమొకరమే కాదు, వాడి స్కూల్‌లో ఉన్న మిగతా ఇండియన్ పిల్లలు అంతా కూడా కుమ్మోన్‌కి వెళ్తారు,” కాస్త గర్వంగా చెప్పింది స్మిత.

“కానీ మీ అబ్బాయి వెళ్ళే స్కూల్ బే ఏరియాలోనే పేరు పొందిన స్కూల్ అట కద? ఎక్స్‌ట్రా కోచింగ్ అవసరమా?” అంత తొందరగా ఆ టాపిక్ వదల దల్చుకోలేదు రాధ.

“ఇక్కడ సమస్య అది కాదండి, మిగతా ఇండియన్ పిల్లలు వెళ్తూంటే మనం పంపకపోతే వెనక పడిపోతాం. ఈ కాంపిటీషన్ తట్టుకోలేం,” అంది స్మిత.

“మీ వాడికి ఏడేళ్ళే కద. అప్పుడే కాంపిటీషన్ ఏంటండి? ఈ వయసులో నేనేం చదువుకున్ననో కూడా నాకు గుర్తు లేదు,” ఉండబట్టలేక అన్నాడు రాఘవరావు.

“మన కాలం వేరు రాఘవరావు గారూ, ఇప్పుడు లోకమంతా మారిపోయింది. ఈ కాలంలో తప్పదు. అయినా నా చిన్నప్పుడు నాకెన్నో కోరికలు ఉండేవి. అప్పట్లో కాస్త స్థోమత లేక, కాస్త అవకాశాలు లేక నా కలలను సాకారం చేసుకోలేక పోయాను. నా పిల్లలకు మాత్రం అలాంటి పరిస్థితి రానివ్వను. ఐనా మీకు పిల్లలు పుట్టాక తెలిసొస్తుంది లెండి,” నవ్వుతూ అంది స్మిత.

అంతలో, అర్చక్‌తో పాటు ఇంట్లోకి ప్రవేశించాడు సుధాకర్. “ఏరా రాఘవ్ ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారు రాధ గారు?” అంటూ.

“బాగున్నాంరా, ఇప్పుడే మీ వాడి క్లాస్ గురించే మాట్లాడుకుంటున్నాం,” సుధాకర్‌తో కరచాలనం చేస్తూ అన్నాడు రాఘవరావు.

“అంకుల్‌కి చేత వెన్న ముద్ద పద్యం చెప్పి వినిపించమ్మా,” ఆర్డర్ వేసింది స్మిత. ఇంకో సారి అడిగించుకోకుండా, టక టక పద్యం చదివేశాడు అర్చక్.

“భలే చదివావు. దీని అర్థం తెలుసా?” అడిగాడు రాఘవరావు. అర్చక్ బిక్కమొహం వేశాడు.

“వాడికి తెలుగు సరిగ్గా మాట్లాడ్డమే రాదురా, ఇంక అర్థమేం చెప్తాడు,” నవ్వాడు సుధాకర్.

“వాడి వయసు తెలుగు పిల్లలు అందరూ చెరో పదేసి పద్యాలు అప్ప చెప్తారు రాఘవ రావు గారు. వీడు వెనక పడిపోకూడదు, పైగా మన సంస్కృతి తెలియాలి, అని మేము కూడా నేర్పిస్తున్నాం. అర్థం తరువాత తెలుసుకుంటాడు లెండి,” చెప్పింది స్మిత. రాఘవరావు అప్రయత్నంగా బుర్ర గోక్కున్నాడు.

అప్పటిదాక తన రూంలో ఉన్నట్టుంది, అప్పుడే బయటకి వచ్చింది అర్చక్ చెల్లెలు కుహూ. వెరైటీగా ఉండాలని తనకి ఆ పేరు పెట్టారట, ఒకసారి సుధాకరే చెప్పాడు రాఘవరావుకి.

“ఇంకా తయారు కాలేదా! స్విమ్మింగ్ క్లాస్‌కి టైం అయ్యింది, పద పద,” ఖంగారు పడ్డాడు సుధాకర్.

“ఏంటి, నువ్వు మళ్ళీ బయటకి వెళ్తున్నావా?” ఆందోళనగా అన్నాడు రాఘవరావు.

“లేదురా, ఈ సారి స్మిత వంతు. నేను ఇంట్లోనే ఉండిపోతా,” చెప్పాడు సుధాకర్.

స్మిత, “పద కుహూ, నిన్ను తయారు చేస్తాను,” అంది.

“ఊహూ, నేను రాను,” మారాం చేసింది కుహూ.

“కుహూ, చెప్తే వినాలి.”

“ఊహూ, నేను ఇంట్లోనే ఆడుకుంటాను.”

“అక్కడ నీ ఫ్రెండ్స్ అంతా వస్తారమ్మ. నువ్వే మిస్ అవుతావు,” నచ్చ చెప్తూ అంది స్మిత.

“ఆ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఆహా ఓహో అనే పేర్లు ఉన్నాయా?” ఆసక్తిగా అడిగంది రాధ.

“అబ్బే! అవేం పేర్లండి? కుహూ అంటే కోయిల కూత. కాబట్టి ఈ పేరులో ఎంతో భావుకత్వం ఉంది,” ఎక్స్‌ప్లెయిన్ చేసింది స్మిత.

కాసేపట్లో స్మిత కుహూని తీసుకుని నిష్క్రమించింది. సుధాకర్, రాఘవరావు కబుర్లలో పడ్డారు. రాధ దిక్కులు చూస్తూ కూర్చుంది. అర్చక్ ఏదో తింటున్నాడు.

కాసేపయ్యాక అసహనంగా గడియారం వైపు చూశాడు సుధాకర్.

“ఏమయ్యిందిరా?” ప్రశ్నించాడు రాఘవరావు.

“స్మిత ఇంకా రాలేదేంటా అని. తను రాగానే నేను అర్చక్‌ని తీసుకుని కరాటే క్లాస్‌కి వెళ్ళాలి.”

“మళ్ళీ బయటకి వెళ్తావా, ఐనా నువ్వు కరాటే నేర్చుకుంటే, వాడెందుకు మధ్యలో?”

“హ హ హ. కరాటే నేర్చుకునేది వాడే. నాది కేవలం డ్రైవర్ ఉద్యోగం. వాడికి కరాటే ఎందుకు నేర్పిస్తున్నామంటే…”

“మిగతా పిల్లలు అంతా నేర్చుకుంటున్నారు. మీ వాడు వెనక పడిపోకూడదని,” ముక్త కంఠంతో సమాధానం ఇచ్చారు రాఘవరావు, రాధ.

“కరెక్ట్! మీరు బాగా క్యాచ్ చేశారు. అదిగో స్మిత వచ్చింది. నేను బయలుదేరుతున్నా,” హడావుడిగా అర్చక్‌ని తీసుకుని బయట పడ్డాడు సుధాకర్.

కాసేపయ్యాక సుధాకర్ అర్చక్‌తో తిరిగి రాగానే, స్మిత కుహూని తీసుకుని పియానో క్లాస్‌కి వెళ్ళిపోయింది. అలా సాయంత్రం అయ్యేప్పటికి, అర్చక్,కుహూ, చెరి ఆరు క్లాసులకి వెళ్ళొచ్చారు.

దాదాపు సాయంత్రం ఏడయ్యాక, ఫైనల్‌గా సుధాకర్ స్మిత, ఇంట్లోనే సెటిల్ అయ్యారు.

“ఏరా! ఇంక క్లాసులేమీ లేవా?” నీరసంగా అడిగాడు రాఘవరావు.

“ఈ రోజుకింతేరా, నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం అర్చక్ గుర్రపు స్వారీ నేర్చుకోవడానికి వెళ్తాడు. అప్పుడు ఇంకో క్లాస్ ఎక్కువవుతుంది,” సమాధానమిచ్చాడు సుధాకర్.

“ఇక మేం వెళ్ళొస్తాంరా,” లేచి నిలబడ్డాడు రాఘవరావు.

“అప్పుడే వెళ్ళిపోతారా! ఏంటో అసలు మీతో సరిగ్గా మాట్లాడినట్టే లేదు,” బాధ పడ్డాడు సుధాకర్.

“మరే, ఎప్పుడన్నా మీ పిల్లలకి ఏ క్లాసులు లేని రోజు, ఇంకోసారి వస్తాంలే,” అన్నాడు రాఘవరావు.

“ఆ రోజు రావాలంటే, నువ్వింకో పదిహేనేళ్ళు వెయిట్ చెయ్యాలిరా,” బిగ్గరగా నవ్వాడు సుధాకర్. స్మిత కూడా అతనితో జత కలిపింది.

Advertisements
This entry was posted in కథలు, ప్రవాసాంధ్రులు. Bookmark the permalink.

13 Responses to కన్నవారి కలలు

 1. kishore says:

  బాగా చెప్పారు మురళి గారు..I am an resident of India and grown up as Raghava Rao and remained in India for different reasons, had a chance to visit US last year and visited most of my friends and observed the same.. First I didn’t understand what is Kumon? Later I realized this is one common denominator for all the Indian families out there 🙂

 2. శారద says:

  ఇంకా టెన్నిస్ కోచింగూ, బేస్ బాల్ (ఆస్ట్రేలియాలో అయితే నెట్ బాల్), భరత నాట్యమూ,. కర్ణాటక సంగీతమూ వదిలేసారే? ఇలా అయితే పిల్లలు ఎలా గొప్ప వాళ్ళవుతారు? వాళ్ళని కన్న వారి కలలు తీరెదెప్పుడు?

  • Murali says:

   నిజమే అనుకోండి. స్థలాభావం వల్ల అలా చేయాల్సి వచ్చింది.

 3. చాలా బాగుంది. చెప్పాలంటే చాలా ఉంది కానీ ఒక్క మాట. మన జీవితాల్లో మన పిల్లల జీవితాల్లో సుఖమనేది లేకుండా మనమే చేసుకుంటున్నాం. నిజమైన సుఖానికి అర్థం తెలియని వారి బ్రతుకులిలానే ఉంటాయి.

 4. jpraju says:

  మీరు వ్రాసినది అక్షరాలా నిజం. నేను కొన్ని రోజులు అమెరికా లో వుండి చూశాను. పిల్లలను అంతగా కష్టపెట్టాలా అనిపించింది.ఎంత పోటీప్రపంచం అయినా పిల్లలకు కొంత స్వేచ్చనివ్వాలి. అంత వత్తిడి వుండకూడదు.

 5. Sushma vedam says:

  Thank God! we are better off in India…though the rat race is on for medical and engineering entrance,rest of the hobbies are left to a child’s discretion…Pity the kids who take that kind of load and also parents for their constant run…..

 6. Ramana Turlapati says:

  chaala important points raaddamanukunna .. kaani time ledu .. pillalani ballet class ki theesuku vellali … ok tarvaata matlaadukundam, bye.

  • Murali says:

   నువ్వు ఆ ఇంపార్టాంట్ పాయింట్లు ఏవో చెప్పి ఉంటే, మా అబ్బాయిని mountain-climbing class నుంచి తీసుకొచ్చాక వాటికి సమాధానాలు ఇచ్చి ఉండేవాడిని. ప్చ్!

 7. Murali gaaru..

  chAlA bAgundi.. Let me add my point here. Bringing up kids in US is altogether different from that of India, in particular, if both parents are working.

  If you don’t send kids to different classes here, most of them would tend to become couch-potatoes by doing unproductive things all the time such as watching TV, playing Video games (ipone is the recent most addiction for them) etc at home. All parents can not control their kids at home and, to be honest, many of them don’t even know how to control kids in pleasant and effective ways. If the kids are sent to different classes, they get engaged and make new friends. Think from this direction and you would see a new point like I do. 🙂

  • Murali says:

   I agree with you in general. I do understand the compulsions of families where both parents are working. This satire is only aimed at parents who want to turn their kids into over-achievers (or super-achievers). I believe everything should be done in moderation.

 8. viru says:

  చాలా బాగుంది

 9. Jitu :) says:

  Hilarious narration. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s