యదవలకు పదవులు

యధావిధిగా నేను సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ కావడానికి ధన్వంతరిగాడి ఇంటికొచ్చా. తలుపు తట్టబోయేంతలో లోపలినుంచి వాడి పాట వినిపించింది. “వీడు కవిత్వం ప్రాక్టీసు చేయడం మానలేదన్న మాట,” అనుకున్నాను నేను. “భూగోళం అబ్బాయైతే నీలా ఉంటాడురా, నీలా ఉంటాడురా,” హుషారుగా పాడుతున్నాడు ధన్వంతరి.

నేను లోపలికి వెళ్ళగానే వాడితో, “ఆ లిరిక్స్ ఏంట్రా, భూగోళం అబ్బాయి కావడమేంటి?” అన్నాను.

హర్ట్ అయినట్టు మొహం పెట్టాడు ధన్వంతరి. “అవునులే, అదే ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే’ అన్న పాట మాత్రం విని మెచ్చుకుంటావు. నేను పేరు పొందని కవిని అనే కద ఈ డిస్క్రిమినేషన్?” బాధగా అన్నాడు వాడు.

నిజమే అనిపించింది నాక్కూడా. ఆ సాంగ్ విన్నప్పుడు అందరిలా నేనూ ఎగిరి స్టెప్స్ వేశాను కానీ, దాని అర్థమేంటి అని ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు అని ఎవరైన అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్పలేను. నేను ఒక సాధారణ తెలుగు సినిమా ప్రేక్షకుడిని. లిరిక్స్ గురించి ఆలోచించకుండా పూర్తిగా ట్యూన్ మీద బేస్ అవ్వడం నా రక్తంలోనే ఉంది. అందుకన్న మాట.

“సరే, సరే మన కరెంట్ అఫెయిర్స్ స్టడీ మొదలు పెడదామా?,” మాట మారుస్తూ అన్నాను నేను.

“కరెంట్ అఫెయిర్స్ అంటే గుర్తొచ్చింది. ఇంకో గంటలో కరెంట్ పోతుంది. అంతలో డిస్కస్స్ చేసేయ్యడం మంచింది. పైగా ఒకటా, రెండా, ధర్మ ప్రభువు, మన హిరణ్‌కుమార్ రెడ్డి పుణ్యమా అని నాలుగు గంటలు వరుసగా పోతుంది. అందుకని వెంటనే రంగంలోకి దూకుదాం,” అన్నాడు వాడు.

మేమిద్దరం ముందైతే లివింగ్ రూంలోని సోఫాల్లోకి దూకాము. “మన చదువు మంగళప్రదంగా సాగాలంటే, ముందు టీవీ-999 చ్యానెల్ పెట్టు,” సలహా ఇచ్చాను నేను.

టీవీ-999 చ్యానెల్‌లో ముందస్తుగా కేంద్ర మంత్రి అపజయరాం రమేశ్ ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని ఒక విలేఖరిణి ఇంటర్వ్యూ చేస్తూంది.

“మీరు మొన్న, గుడుల కంటే మరుగుదొడ్లు ఇంపార్టెంట్ అనడం చాలా వివాదాలకు దారి తీస్తుంది. దీనిపై మీ స్పందన?” అడిగింది ఆవిడ.

“వాళ్ళకేం తెలుసమ్మా, నేను రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టర్‌ని కద, మొన్న ఒక పల్లెకి వెళ్ళినప్పుడు, మరుగు దొడ్డి లేక నేనెంత కష్ట పడ్డానని! దేవుడు గుర్తుకొచ్చాడనుకో!” కాస్త బాధగా చెప్పాడు అపజయరాం రమేశ్.

“కానీ గ్రామీణాభివృద్ధి మంత్రి మీరే కద! ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత మీదే కద? మరి ఎలా పరిష్కరించుదామనుకుంటున్నారు?”

“దానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన అవుడియా ఉందమ్మా. నిన్ననే చెప్పాను, తమరు గమనించినట్టు లేదు. అత్తగారింట్లో మరుగు దొడ్డి లేకపొతే ఆ ఇంటికి కోడలుగా వెళ్ళొద్దని, పెళ్ళి కాని ఆడపిల్లలకు అందరికీ ఒక ఉచిత సలహా పడేశాను. దెబ్బకి మన పల్లె ప్రాంతాలు మరుగు దొడ్లతో కిట కిటలాడుతాయి. ప్రభుత్వానికి కూడా ఒక పైసా ఖర్చు ఉండదు,” గర్వంగా చెప్పాడు అపజయరాం.

“ఇంక చాలు, చ్యానెల్ మార్చు,” అన్నాను నేను.

చ్యానెల్ ఫ్లిప్ చేశాడు ధన్వంతరి. ఈ సారి సీనియర్ గాంక్రెస్ నేత వాయ్‌ముడ్ రవి తెర మీదకి వచ్చాడు.

ఆయన చుట్టూ బోలెడు చాలా మంది విలేఖరులు గుమిగూడి ఉన్నారు.

“సార్, మా బృందగానా త్వరలో వస్తుంది అని మా ప్రియతమ నాయకుడు వీ.సీ.ఆర్. అంటున్నారు. నిజమేనా?” బృందగానా సానుభూతిపరులైన రిపోర్టర్లు షిండేని అడిగారు.

“బృందగానానా? అదేంటి? ఎక్కడ ఉంటుంది, ఎందుకు వస్తుంది? అసలు మీరేం మాట్లాడుతున్నారు?” అమాయకంగా మొహం పెట్టి అన్నాడు వాయ్‌ముడ్ రవి.

అక్కడ ఉన్న విలేఖరులు అంతా హాహాకారాలు చేశారు. “అదేంటి సార్, వీ.సీ.ఆర్. మీతో గత కొద్ది వారాలుగా చర్చల్లో ఉన్నారు కద. మీకు బృందగానా తెలీకపోవడమేంటి?”

“ఓ, వీ.సీ.ఆరా? నేను బోలెడు మందితో మాట్లాడుతూంటా, ఐనా అన్నీ నాకెలా గుర్తుంటాయి? అసలు గుర్తున్నా మీకెందుకు చెప్పాలి?” ఎదురు ప్రశ్నించాడు వాయ్‌ముడ్ రవి.

“మరి బృందగాన గురించి జరిగిన మార్చ్ సంగతేంటి?”

“మార్చ్ లేదూ, ఏప్రెల్ లేదూ. నోరు మూయండి. వాయ్‌ముడ్!” అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు వాయ్‌ముడ్ రవి.

“ఆయనే వాయి ముడ్ అన్నాక, ఇంకా ఎందుకురా? చ్యానెల్ మార్చు!” చిరాకు పడ్డాను నేను.

ఈసారి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్ రౌడీషీట్ దర్శనమిచ్చాడు. యధావిధిగా ఆయన చుట్టూ కూడా రిపోర్టర్లు గుమిగూడి ఉన్నారు.

“మరేమో మీ భార్య నడుపుతున్న NGOలో, గవర్న్‌మెంట్ ఆఫీసర్లకు బదులు మీరే దొంగ సంతకాలు పెట్టి, వికలాంగుల కడుపు కొడుతున్నారట. అహహ, నేను కాదు, సమాజ సేవకుడు క్రేజీవాలా అంటున్నాడు. అన్నట్టు మర్చిపోయాను, లా మినిస్టర్ అయ్యుండి ఇలా నీచ్ కమీనే కుత్తే పనులు చేయడానికి ఆయనకి సిగ్గు లేదా అని కూడా అడిగాడు. మీ స్పందన?” గబ గబా అడిగేశాడు ఒక విలేఖరి.

“వాడి పేరుతోనే తెలుస్తూంది, వాడెంత క్రేజీ ఫెలోనో. మీరు వాడి మాటలు నమ్ముతారా, నా మాటలు నమ్ముతారా?” కోపంగా అడిగాడు సల్మాన్ రౌడీషీట్.

“అంటే ఆయన దగ్గర ఆధారాలు కూడ ఉన్నాయంట. పైగా ‘కల్ తక్’ టీవీ కూడా ఆయనకి వత్తాసు పలుకుతూంది.”

సల్మాన్ కళ్ళు ఎర్రబడ్డాయి, “ఏదో మినిస్టర్ని కాబట్టి, కలంలో ఇంక్ పోసుకుని పని చేద్దామనుకున్నాను. ఇలాంటి దౌర్జన్యం చేస్తే, ఇంక్ బదులు రక్తం వాడాల్సి వస్తుంది,” అన్నాడు.

“అదేంటి మీరు లా మినిస్టర్ అయ్యుండి అలా రౌడీ షీటర్‌లా బెదిరిస్తున్నారు?” ఒక అడుగు వెనక్కి జరుగుతూ అన్నాడు ప్రశ్న అడిగిన విలేఖరి.

“నేనేం బెదిరించడం లేదు, నా నియోజకవర్గానికి వస్తే ప్రాణాలతో తిరిగిపోడని, ఫ్రెండ్లీగా హెచ్చరిస్తున్నాను,” మృదువుగా చెప్పాడు సల్మాన్ రౌడీషీట్.

సీన్ మారితే విలేఖరులంతా ఢిల్లీ అమ్మ దగ్గరున్నారు. “అదేంటండి, ఇలాంటి మనిషిని లా మినిస్టర్ చేసారు,” నిరసనగా అడిగారు ఆవిడని.

“అందుకే చేశామండీ! కనీసం లా మినిస్టర్ ఐతే ఐనా, ఆయనకు కూసింత లా అర్థం అవుతుందని. ప్చ్ ఆయన ఏమీ నేర్చుకుంటున్నట్టు లేదు,” బాధ పడింది ఢిల్లీ అమ్మ.

“మీది అంత దొడ్డ మనసు అని కనుక్కోలేక పోయాము. అన్నట్టు మీ అల్లుడు రాబర్ట్ వడాపావ్ కేవలం ఐదేళ్ళలొ 300 కోట్లకు పడగెత్తాడట. ఇది ఎలా సాధ్యమయ్యింది?” వేరే కోణం నుంచి నరుక్కుంటూ వచ్చాడు ఇంకో విలేఖరి.

“చెప్తాను గానీ, పాము పడగ ఎలా ఎత్తాడో మీరు నాకు చెప్పండి. అసలే ఒట్టి పిరికి సన్నాసి,” ఆసక్తిగా అడిగింది ఢిల్లీ అమ్మ.

“అబ్బా, అది ఒక నుడికారం అండి. ఇక్కడ అర్థం సంపాదించాడని. మీకేమో ఇటాలియన్ తప్ప ఏదీ సరిగ్గా అర్థమయి చావదు,” విసుక్కున్నాడు ఆ విలేఖరి.

“ఓహో, అదా! అర్థమయ్యింది. ఐనా మా అల్లుడిగారిని శంకించడానికి మీకు ఎంత ధైర్యం? ఆయన తన సామర్థ్యంతోనే పైకి వచ్చి ఉంటాడు. అసలు నాకు ఆయన ఏం పని చేస్తాడో కూడా సరిగ్గా తెలీదు. ఏదో పార్ట్ టైంలో వడాపావులు అమ్ముకుంటాడు, అని అనుకుంటున్నా ఇప్పటి దాకా,” అమాయకంగా అంది ఢిల్లీ అమ్మ.

“అంటే మంచి విలువైన రీల్ ఎస్టేట్‌ని వడా పావు రేటుకే కొనుక్కున్నాడు లెండి. కాక పోతే ఇందులో ప్రాఫిట్ మార్జిన్ కూసింత ఎక్కువ. అన్నట్టు ఎప్పుడూ మీ వెనకాల నిల్చోని ఉంటారు ఒకాయాన? అదే జగన్‌మోహన్ సింగ్ గారు, ఆయన కనపడ్డం లేదేంటి?”

“ఆయన ఈ మధ్య ఢిల్లీ కాలేజుల్లో పార్ట్ టైం బోటనీ క్లాసెస్ తీసుకుంటున్నారు.”

“బోటనీనా? ఆయన ఎకానమిస్ట్ అనుకున్నాం ఇన్ని రోజులు. బోటనీ కూడా వచ్చా ఆయనకి?”

“అదే, మొన్న స్పీచ్‌లో చెప్పారు కద, డబ్బులు చెట్లకి కాయడం లేదని. ఆ కాన్సెప్ట్ భావి పౌరులైన మన స్టూడెంట్స్‌కి కూడా అర్థం కావాలని, ఇలా ప్రతి క్యాలేజ్‌కి వెళ్ళి క్లాస్ తీసుకుంటున్నారు. చెట్లకు, పూలూ, పండ్లే కాస్తాయి, డబ్బులు కాయవని,” ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఢిల్లీ అమ్మ.

“మన దేశ భావి పౌరుల పట్ల ఆయనకి ఎంత శ్రద్ధ! ఇంతకీ, మీ పార్టీలో ఒక్కో నాయకుడు ఒక్కోలా నోరు పారేసుకుంటున్నాడు. 2004 నుంచి దేశ పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా తయారవుతుందని అందరూ ముక్త కంఠంతో ఘోషిస్తున్నారు. గాంక్రెస్ పార్టీ బాగుపడ్డానికి మీ ప్రణాలిక ఏంటి?”

దీర్ఘంగా నిశ్వసించింది ఢిల్లీ అమ్మ. “మీరన్నది నిజమే! పార్టీని నడపడానికి ఒక సమర్థుడైన నాయకుడు కావాలి. అందుకే బాగా ఆలోచించి, మా అబ్బాయి సాహుల్‌కి పార్టీ బాధ్యతలు అప్పచెబ్దామని నిర్ణయం తీసుకున్నా. దాని వల్ల వాడికి పని దొరుకుతుంది, దేశం పని కూడా అయిపోతుంది. ఐ మీన్, ఒక పని అయిపోతుంది,” ముసి ముసిగా నవ్వుతూ చెప్పింది.

టీవీ ఆఫ్ చేశాడు ధన్వంతరి.

“అదేంట్రా, అప్పుడే అయిపోయిందా?” ఆశ్చర్యంగా అడిగాను నేను.

“సాహుల్ గాంధి ఒక వేళ ప్రధాన మంత్రి ఐతే, మనం IAS ఆఫీసర్లమై మాత్రం ఏం ఒరగబెడతాం అన్న డౌట్ వచ్చిందిరా,” చెప్పాడు వాడు విషాదంగా.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

5 Responses to యదవలకు పదవులు

  1. కపిల సింబల్ ని వదిలెయ్యడం ఏమీ బాగాలేదు. 🙂

    • Murali says:

      నిజమే, డిగ్గీ రాజా (దిగ్విజయ్ సింగ్)ని కూడా వదిలేయాల్సి వచ్చింది. 🙂 ప్చ్!

  2. హ హ హ… పేర్లు బాగున్నాయండీ 🙂

  3. subbaraya says:

    ఎందరో మగ అనుభవులు. ఆడ అనుభవి దగ్గర ఆడువారే! ఇకారాంతం ఇటలిని స్ఫురింపచేయుట సమానార్ధకం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s