గూఢచారి – 232 – ఉపోద్ఘాతం


అది జంబూ ద్వీపంలో ఉన్న ఛీ.బీ.ఐ. ముఖ్య స్థావరం. అక్కడ అత్యవసరమైన సమావేశం జరుగుతూంది. హోం మంత్రి, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ లాంటి పెద్ద తలకాయలతో పాటు, కొందరు సెక్రట్రీలు, ఢిల్లీ డాలీ నగరపు డీజీపీ లాంటి చిన్న తలకాయలు కూడా ఉన్నాయి.

“మిత్రులారా,” గొంతు సవరించుకున్నాడు ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. అక్కడ కూర్చుని వారందరు కూడా తమ తమ గొంతులు సవరించుకున్నారు. అందరూ అలా చేయడం వల్ల ఒక పెద్ద సౌండ్ వచ్చింది. అందు వల్ల శాతకర్ణి కాసేపు ఆగి, “మిత్రులారా” అని మళ్ళీ గొంతు సవరించుకున్నాడు. వెంటనే, అక్కడ ఉన్న వారంతా మళ్ళీ తమ గొంతులు సవరించుకున్నారు. మళ్ళీ ఒక పెద్ద శబ్ధం వచ్చింది.

శాతకర్ణికి చిర్రెత్తుకుని వచ్చింది. “నేను గొంతు సవరించుకున్నాను అంటే, దాని అర్థం, ఒక చిన్న ఉపన్యాసమో ఉపోద్ఘాతమో ఇవ్వబోతున్నాను అని. అంతే కానీ, మీరందరూ కూడా గొంతులు సవరించుకొని సౌండ్ పొల్యూషన్ సృష్టించాలని కాదు,” కాస్త బిగ్గరగా అన్నాడు. ఈ సారి అందరూ మౌనం వహించారు.

“మిత్రులారా, మనం ఒక పెద్ద ఆపదలో చిక్కుకున్నాం. దాన్నుండి ఎలా బయట పడాలి అని ఆలోచించడానికే ఈ సమావేశం,” ఆగాడు శాతకర్ణి.

ఎవరూ ఏం మాట్లాడలేదు.

“ఆ ఆపదేంటో అడగరా?” కాస్త అసహనంగా అన్నాడు శాతకర్ణి.

“ఎలాగూ మీరే చెప్తారు కద, ఎక్కువ ఉత్సాహం చూపిస్తే ఆ పని ఏదో మాకు తగులుకునే ప్రమాదం ఉంది,” ఎక్స్‌ప్లెయిన్ చేసాడు ఢిల్లీ డాలీ డీజీపీ.

“అంటే పని చెప్తారేమో అన్న భయంతో అడగడం లేదా?” ఆశ్చర్య పోయాడు శాతకర్ణి.

“మరి లేకపోతే? అసలే స్టాఫ్ తక్కువ, పనెక్కువ. కొత్త పని ఎలా చేస్తాం? మొన్నటికి మొన్న, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అందరూ సెలవు పెడితే, లాభం లేక నేను వెళ్ళి కన్నాట్ సర్కిల్ దగ్గర నిల్చుని ట్రాఫిక్ డైరెక్ట్ చేసాను. కాళ్ళు పట్టుకుపోయాయి. ఇంకా లాస్ట్ ఇయర్ పొజిషన్స్ ఫిల్ చేయలేదు. పైగా…”

“సరే, సరే. ఈ పని మీకు అడిగినా ఇవ్వం లెండి. అసలు సంగతేమిటో నన్ను చెప్పనివ్వండి,” ఎక్కడ ఈ సమావేశం పక్క దారి పడుతుందో అన్న భయంతో అడ్డు పడ్డాడు శాతకర్ణి.

“ఐతే ఓకే, సమస్యేంటో చెప్పండి,” అన్నాడు డీజీపీ.

“మన శత్రుదేశం పీకిస్తాన్ అంధేరా ప్రదేశ్ రాజధాని ఐనా ఆదరా బాదరాని స్థావరంగా చేసుకుని ఆ రాష్ట్రంలో అల్ల కల్లోలం రేకెత్తించబోతూంది,” అనౌన్స్ చేశాడు శాతకర్ణి.

డీజీపీ తన ముక్కు గోక్కున్నాడు. వెనక నుంచి హోం మినిస్టర్ గురక వినిపించింది. మిగతా వాళ్ళు రియాక్ట్ కూడా కాలేదు.

“ఏంటి, ఇంత సెన్సేషనల్ న్యూస్ చెప్తే మీరెవరూ స్పందించరు?” ఆశ్చర్య పోయాడు శాతకర్ణి.

“ఇందులో సెన్సేషనల్ న్యూస్ ఏముంది సార్! గత పాతికేళ్ళుగా పీకిస్తాన్ ఆదరాబాదరా నుంచి తన కార్యకలాపాలు సాగిస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే కద,” తేల్చేశాడు డీజీపీ.

“అవునా! నాకు నిన్ననే తెలిసింది. మరి మీకు తెలిసీ ఏం చేస్తున్నారు?” కోపంగా అడిగాడు శాతకర్ణి.

“చెప్పాను కద సార్! అసలే స్టాఫ్ తక్కువ, పనెక్కువ. ఎప్పుడు మా ఇంట్లో వంట చేసే మా హెడ్ కానిస్టేబుల్ డుమ్మా కొడితే, నేనే వంట చేయాల్సి వచ్చింది. పైగా…”

“సరే, సరే!” అసహనంగా అరిచాడు శాతకర్ణి. “ఈ పని మీ వల్ల కాదు అని అర్థమయ్యింది. అందుకే దీనికోసం, మా సంస్థలో అందరికంటే ప్రతిభావంతుడైన గూఢచారిని ఈ పనికి నియమిద్దామని డిసైడ్ అయ్యాను. మొన్ననే అతను అరమికాలో ఒక అసైన్‌మెంట్ ముగించుకుని మన దేశం వచ్చాడు. రేపటినుంచే అతను రంగంలోకి దిగుతాడు.”

“మన వాళ్ళు అరమికాలో కూడా కేసులు సాల్వ్ చేస్తున్నారా? ఎవరు సార్ ఆ ప్రతిభాశాలి? తెలుసుకోవచ్చా?” ఆసక్తిగా అడిగాడు డీజీపీ.

“తెలుసుకోవడం ఏం ఖర్మ! డైరెక్టుగా మనిషినే చూద్దురు గానీ. ఎవరక్కడ? గూఢచారి 232ని ప్రవేశ పెట్టండి!” హుకుం జారీ చేశాడు శాతకర్ణి.

(సశేషం)

Advertisements
This entry was posted in గూఢచారి - 232, సీరియల్స్. Bookmark the permalink.

8 Responses to గూఢచారి – 232 – ఉపోద్ఘాతం

 1. kamudha says:

  ఈ సారి మీరు CBI గురించి చెప్తారా, కానివ్వండి.
  ఆరంభం మాత్రం అదిరింది. మిగతా భాగాలు కూడా బాగుంటాయని ఆశిస్తూ

  కాముధ

  • Murali says:

   CBI ఒక సాకు మాత్రమే. చెప్పేది ఎప్పుడూ జంబూ ద్వీపం గురించే! 🙂

 2. Anuradha says:

  చెప్పాను కద సార్! అసలే స్టాఫ్ తక్కువ, పనెక్కువ. ఎప్పుడు మా ఇంట్లో వంట చేసే మా హెడ్ కానిస్టేబుల్ డుమ్మా కొడితే, నేనే వంట చేయాల్సి వచ్చింది. :))
  ———–
  బాగుంది . మధుబాబు నవల ల ప్రభావం మీ మీద ఉందనుకుంటా :)) గూఢచారి – 232 … షాడో ని గుర్తు చేస్తాడేమో 🙂
  నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే ,ఏదన్నా ఇన్సిడెంట్ జరగగానే నిమిషాల్లో అది ఎవరు చేసారో చెప్పేస్తారు . ముందే వాళ్లకు సమాచారం తెలిస్తే ఆ ఘటన జరగకుండా ఆపొచ్చు కదా!

 3. Jitu says:

  Hmmm…

  Interesting!

  Let the play begin. 🙂

 4. Sreenivas says:

  “ఎలాగూ మీరే చెప్తారు కద, ఎక్కువ ఉత్సాహం చూపిస్తే ఆ పని ఏదో మాకు తగులుకునే ప్రమాదం ఉంది,” ఎక్స్‌ప్లెయిన్ చేసాడు ఢిల్లీ డాలీ డీజీపీ.
  LMAO Murali 🙂

  • Murali says:

   Good catch. మిగతా జోక్స్ చాలా డైరెక్ట్‌గా ఉన్నాయి. ఇది కాస్త subtle. 🙂

 5. చాలా ఇంటరెస్టింగ్.. ఉంది.. మీ గూఢాచారి.. తిందరగా మిగతాది.. కుదా రాసెయండీ…

  • Murali says:

   Sure! వారానికి కనీసం ఒక ఎపిసోడ్ ఐనా రాస్తాను. If possible, more.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s