గూఢచారి 232 – ఇంట్రడక్షన్

గూఢచారి 232 రూంలోకి ప్రవేశించాడు. కానీ అతని కాళ్ళు తప్ప మరేమీ కనపడ్డం లేదు. ఇద్దరు వ్యక్తులు ఒక తెర పట్టుకుని అతని మొహం నుంచి మోకాళ్ళ వరకు కవర్ చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో జేంస్ బ్యాండ్ మ్యూజిక్ వచ్చింది.

“అదేంటి మొహం అలా తెర వెనక దాచుకున్నాడు. సిగ్గా?” ప్రశ్నించాడు డీజీపీ.

“అంతార్జాతీయ గూఢచారి, అతనికి సిగ్గేంటి? మీరు సినిమాల్లో ఇంట్రడక్షన్ సీన్లు చూడలేదా? ముందుగా హీరో కాళ్ళు మాత్రం చూపెడతారు. ఐతే సినిమాలో ఉన్న సౌలభ్యం ఇక్కడ లేదు కాబట్టి ఇలా తెర అరేంజ్ చేశాం,” చెప్పాడు శాతకర్ణి కించిత్ గర్వంగా.

“ఐతే బూట్లు చూసి సరి పెట్టుకోవాలన్న మాట. అవును ఎందుకలా మాసిపోయి ఉన్నాయి?” అడిగాడు హోం మిమిస్టర్ పర్సనల్ సెక్రటరీ.

గూఢచారి 232కి చిర్రెత్తుకొచ్చినట్టుంది. తెర వెనుకనుంచే, “నా పనిలో ప్రపంచమంతా తిరగాల్సి వస్తుంది. మరి ఆ మాత్రం దుమ్మంటుకోదా?” కోపంగా అరిచాడు.

“అంటుకోవచ్చు. కానీ ఈ మీటింగ్‌కి వచ్చే ముందు కొత్త బూట్స్ కొనుక్కు రావచ్చు కద, మీకు DA పెంచలేదా?” అడిగాడు సెక్రటరీ.

కోపం నషాళానికి అంటినట్టుంది. తెర పక్కకి లాగేశాడు 232. “మన గవర్నమెంట్ ఇచ్చే బోడి DAకి నా లాంటి ఇంటర్నేషనల్ స్పైస్ వేసుకునే షూస్ వస్తాయా? ఐనా మేము పని చేసేది దేశాన్ని రక్షించడానికి. మాటి మాటికి షూస్ మారుస్తూ తిరగడానికి కాదు,” మండిపడుతూ అన్నాడు.

అప్పుడు చూశారు, గూఢచారి 232ని అందరూ. సాధారణమైన రూపు రేఖలు. ఆరడుగుల ఎత్తు, ఛామన చాయ రంగు.జీన్స్, బ్లేజర్, మాసిపోయిన స్నీకర్స్, అతి మాములుగా ఉన్నాడు 232.

“ఇతనేనా గూఢచారి 232 అంటే,” కాస్త నిరాశగా అన్నాడు డీజీపీ.

“మరి లేకపోతే, హాలివుడ్ స్టార్‌లా ఉంటాడు అనుకున్నారా? గూఢచారి ఈ విధంగానే ఉండాలి. అందరిలో కలిసిపోయేలా. మామూలుగా. చూసిన ప్రతి వారికి వాళ్ళకు పరిచయమైన వ్యక్తిలా కనపడాలి, అప్పుడే తన పని సులువుగా చేసుకోగలడు,” చెప్పాడు శాతకర్ణి.

“అవును నిజమే! ఇతన్ని చూడగానే మా బాబాయి కొడుకు గుర్తుకు వస్తున్నాడు. వాడూ ఇంతే, ఎంత చెప్పినా వినకుండా మాసిపోయిన బూట్లు వేసుకుని తిరిగే వాడు,” అన్నాడు డీజీపీ.

“నాకు మా అల్లుడు గుర్తుకు వస్తున్నాడు, అతనిది కూడా ఛామన చాయే,” అన్నాడు సెక్రెటరీ.

“మీ ఓవరాక్షన్ ఆపండి. అంత కష్టపడి పోలికలు వెతుక్కోనక్కర లేదు,” కోపంగా చూస్తూ అన్నాడు శాతకర్ణి.

“అవును 232 నంబర్ ఎందుకు? నాకు తెలిసినవి గూఢచారి 116, 117. ఈ 232 ఏంటి?” అప్పుడే మేలుకున్న హోం మినిస్టర్ తను కూడా ఒక ప్రశ్న వదిలాడు.

“ఇప్పటి దాక ఇంత పవర్‌ఫుల్ గూఢచారి లేదు. అందుకే 116ని రెండుతో గుణించి 232 చేశాం,” విషయం వెల్లడించాడు శాతకర్ణి.

“ఓహో, రెట్టింపు శక్తి, అదనపు స్పయింగ్ అన్న మాట! బాగుంది,” మెచ్చుకోలుగా తల ఊపాడు డీజీపీ.

“ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారు సార్?” అడిగాడు 232. అతనికి కొంత చిరాకుగా ఉంది. తొంభయి ఆరు గంటలు నిద్రపోకుండ పని పూర్తి చేసి వచ్చి ఇంట్లో హాయిగా తొంగుందామనుకుంటే, రెండు గంటలకే నిద్ర లేపేశారు శాతకర్ణి.

అతని ఆలోచనలు వెంటనే పసిగట్టేశాడు శాతకర్ణి. “నీకు ఆ పని తొంభయి ఆరు రోజుల్లో చేసినా ఫరవాలేదు అని అరమికా పంపించినప్పుడే చెప్పాను. నువ్వే పడుతూ లేస్తూ పూర్తి చేశావు. నీ నిద్ర పాడైనందుకు నన్ను బ్లేం చేయనక్కరలేదు,” అన్నాడు.

నాలుక కరుచుకున్నాడు 232. తన మనసులో ఉన్న భావాలు శాతకర్ణి ఇట్టే పసిగట్టేయగలరు అని తెలిసి కూడా అలా దొరికిపోవడం అతనికి నచ్చలేదు.

“ఇప్పుడు మన దేశాన్ని ప్రధానంగా పట్టి పీడిస్తున్న సమస్యేంటి?” చటుక్కున అడిగాడు శాతకర్ణి.

232 బుర్ర పాదరసంలా పని చేసింది. “గత పది ఏళ్ళుగా గాంక్రెస్ జంబూ ద్వీపాన్ని మహమ్మారిలా పట్టుకుంది. ప్రజల పరిస్థితి ఏమీ బాగా లేదు. ఆఖరికి లంచాలు ఇచ్చినా పనులు కావడం లేదు,” చటుక్కున ఆపేశాడు తన ఆలోచనలని. శాతకర్ణి గారు గుర్రుగా చూస్తూండడమే దానికి కారణం.

ఆయనకి కావల్సిన ఆన్సర్ అది కాదు అని 232కి అర్థమయ్యింది. హోం మినిస్టర్ గాంక్రెస్ నుంచి వచ్చినవాడే. సాధారణంగా ఆయన ఏదీ వినిపించుకోడు. కానీ ఒక వేళ తను నిజంగా ఆ సమాధానమే ఇచ్చి ఉంటే గ్యారంటీగా నొచ్చుకునే వాడే. ఆ తరువాత శాతకర్ణి గారి పని, తన పని బస్ స్టాండ్ అయ్యుండేది.

ఇంకోసారి శరవేగంగా ఆలోచించాడు.

వెంటనే అతనికి అర్థమయ్యింది. “పీకిస్తాన్! జంబూ ద్వీపానికి పక్కలో బల్లెంలా తయారైన దేశం. ఆఖరికి అక్కడ చిన్న పిల్లాడిని నీకేం కావాలి అని అడిగినా, “జంబూ ద్వీపం మీద కనీసం ఒక బాంబ్ అన్నా వేయాలని ఉంది,” అని చెప్తాడట. పీకిస్తాను జంబూ ద్వీపాన్ని అల్ల కల్లోలం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూంది. ఈ మధ్య ఒక్క అడుగు ముందుకి వేసి, పరమ ఛండాలమైన సినిమాలకు కూడా ధన సహాయం చేసి, జంబూ ద్వీపంలో అన్ని చోట్లా రిలీజ్ అయ్యేలా చూస్తుంది. జంబూ ద్వీప ప్రజలు మనశ్శాంతి వెతుకున్నే ఒక్క మార్గాన్ని కూడా మూసేస్తూంది.”

శాతకర్ణి గారి పెదవులు చిరు నవ్వుతో విచ్చుకున్నాయి. “నువ్వూహిస్తున్నది కరెక్టే. ఇప్పుడు ఆ పీకిస్తాన్ వల్లే మనకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది,” గాఢంగా నిశ్వసిస్తూ అన్నాడాయన.

(సశేషం)

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

4 Responses to గూఢచారి 232 – ఇంట్రడక్షన్

 1. Jitu says:

  hmmm…

 2. Sushma Vedam says:

  enjoyed 🙂 looking forward for more…

 3. kvsv says:

  super..super…

 4. prabhakar says:

  wow kevvvvvvvv suuuuupeerrrrrrrrrrrr 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s