గూఢచారి 232 – ప్రాజెక్ట్ పీకిస్తాన్

“ఏంటి సార్ ఆ సమస్య?” అని నాలుక కర్చుకున్నాడు 232. పీకిస్తాన్తో సమస్యల గురించి ఏకరువు పెడితే, అది పురాణ కాలక్షేపంలా సాగిపోతూనే ఉంటుంది. పైగా శాతకర్ణి గారికి అన్నీ వివరంగా చెప్పే అలవాటు ఉందాయె!

“క్లుప్తంగానే చెప్తాలే,” 232 మనసులో ఆలోచనలు పసిగట్టి గుర్రుగా అన్నాడు శాతకర్ణి. ఇక ఏం మాట్లాడలేదు 232. ఎందుకైనా మంచిది అని ఆలోచించడం కూడా మానేశాడు.

“పీకిస్తాన్ మన దేశంలో విధ్వంసం సృష్టించడానికి పూనుకుంది,” మొదలు పెట్టాడు శాతకర్ణి.

అప్పటి వరకు గురక పెడుతున్న హోం మినిస్టర్ తనున్న కుర్చీలోంచి కింద పడాడు. ఆయన బాడీగార్డ్స్ ఆయన్ని మళ్ళీ కూర్చోపెట్టారు.

హోం మినిస్టర్ వైపు అసహ్యంగా చూస్తూ కంటిన్యూ చేశాడు శాతకర్ణి. “ఐతే, ఈ సారి ఒకే చోట ఒక పెద్ద ఉపద్రవం కాకుండా, అనేక ప్రదేశాల్లో అనేక రకాలుగా చిన్న పెద్ద సంఘటనలతో ప్రజల్ని భయ భ్రాంతుల్ని చేయాలని వారు నిర్ణయించుకున్నట్టు, విశ్వసనీయంగా తెలిసి వచ్చింది.”

“అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగవచ్చన్న మాట,” అన్నాడు 232.

“కరెక్ట్! అందుకే ఈ గురుతర బాధ్యత నీ మీద పెట్ట దల్చుకున్నాను,” చెప్పాడు శాతకర్ణి.

“సార్, ఇది అంత గురుతర బాధ్యతలా లేదు, ఒక బీట్ కానిస్టేబుల్ చేసే పనిలా ఉంది. ఎటొచ్చి నేను దేశమంతా బీట్ మీద తిరగాల్సి వస్తుందేమో! ఐనా మన చీ.బీ.ఐలో ఈ పని చేసే వారెవరు నిజంగా లేరా? నేను పూనుకోవల్సిందేనా?” అనుమానం వెలిబుచ్చాడు 232.

“నువ్వు మరీ అలా నిలదీసి అడిగితే ఏం చెప్పను. ఒకప్పుడు ఉండే వారు.”

“ఇప్పుడెమయ్యారు?”

“ఇప్పుడు మన చీ.బీ.ఐ గాంక్రెస్ పార్టీ యొక్క రాజకీయ ప్రత్యర్థుల పని పట్టే పనిలో ఉంది. అంటే వాళ్ళ అక్రమాస్తుల విషయాలు వెలికి తీయడం, వారి చీకటి రహస్యాలు బయట పెడతానని బ్లాక్మెయిల్ చెయ్యడం లాంటివన్న మాట. నిజం చెప్పాలంటే మన వాళ్ళు సగానికి పైగా, అంధేరా ప్రదేశ్లో వై.నో. గగన్ని జైల్ ఉంచేందుకు, ప్రతి వారం ఏదో కేసు బుక్ చేస్తూ బిజీగా ఉనారు.”

“ఇదంతా గాంక్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం. ప్రతిపక్షాల కుట్ర. చీ.బీ.ఐ స్వతంత్ర్య ప్రతిపత్తి ఉన్న సంస్థ. చట్టం దాని పని అది చేసుకుపోతుంది,” నిద్రలోనే గట్టిగా అరిచి, మళ్ళీ గురక కంటిన్యూ చేశాడు హోం మినిస్టర్.

“ఈయనకి ఇదొక్కటి బాగా వినపడుతుంది,” పళ్ళు కొరికాడు శాతకర్ణి. “నిజానికి నిన్ను కూడా వై.నో. గగన్ ఆస్తుల గురించి వాకబు చేయడానికి రంగంలోకి దించమన్నారు. నేనే అతి కష్టం మీద, నీ లాంటి అంతార్జాతీయ లెవెల్ గూఢచారి, ఇలాంటి పనులు చేస్తే పరువు తక్కువగా ఉంటుందని, నిన్ను వదిలేయమని, కష్టం మీద కన్విన్స్ చేశాను.”

“థాంక్యూ సార్,” అన్నాడు 232. ఒక్క సారి తాను ముడుపులపాయ చుట్టూ తిరుగుతూ గగన్ పాతి పెట్టిన ఆస్తులకోసం తను గడ్డపార గునపం వేసుకుని తిరుగుతున్న ఇమేజ్ కళ్ళ ముందు కదిలి చిన్నగా వణికాడు 232.

“అలా నిన్ను ఇలాంటి ముఖ్యమైన అసైన్మెంట్ ఏదన్నా వస్తే ఉపయోగించడానికి అట్టి పెట్టాను,” ఎక్స్ప్లెయిన్ చేశాడు శాతకర్ణి.

“ఇప్పుడు నా అసైన్మెంట్ ఏంటి సార్? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరగడం ఐతే కాదు కద?” సందేహంగా అన్నాడు 232.

“కాదు, ముందు నువ్వు అంధేరా ప్రదేశ్ రాజధాని ఐన ఆదరా బాదరాకి వెళ్తున్నావు. అక్కడ పాంచ్ మీనార్ దగ్గర పీకిస్తాన్ ఒక లోకల్ ముఠాని తయారు చేస్తూందట. వారి ద్వారా నగరంలో అల్ల కల్లోలం సృష్టించాలని పీకిస్తాన్ ఫ్యూచర్ ప్లాన్. ఆ గ్యాంగ్ ఏదో కనిపెట్టి, ఆ రాకెట్ని స్మాష్ చేయడం నీ తక్షణ కర్తవ్యం.”

లేచి నిలబడ్డాడు 232.

“అంతకంటే ముందు నువ్వు, మన స్పెషల్ ఎఫెక్ట్శ్ దివిజన్ చీఫ్ ఆధునిక రావుని కలవబోతునావు,” వారించాడు శాతకర్ణి.

“ఎందుకు?”

“ఎందుకేంటి! ఆయన నీ అసైన్మెంట్లో కావాల్సిన రక రకాల పరికరాలు ఇస్తాడు. ఈ వార్ ఆన్ పీకిస్తాన్లో మనం టెక్నాలజీ వాడుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది,” సెలవిచ్చాడు శాతకర్ణి.

“అలాగే సార్. ఇప్పుడే వెళ్ళి ఆధునిక రావుని కలుసుకుంటాను,” చెప్పాడు 232.

“ఒక్కో సారి ఆధునిక రావు పూర్తిగా టెస్ట్ చేయకుండానే, ప్రాడక్ట్స్ రిలీజ్ చెసేస్తూంటాడు. కాబట్టి ఒకటికి రెండు సార్లు అడిగి గానీ ఏదీ తొందర పడి తీసుకోకు. నీ కర కర స్తాన్ అసైన్మెంట్లో ఏమయ్యిందో గుర్తుంది కద?”

గుర్తొచ్చింది 232కి. జేంస్బ్యాండ్ సినిమాలోలా ఎగిరే కార్లు చేయాలన్నది ఆధునిక రావుకి ఎప్పటి నుండో ఉన్న కోరిక. అలాంటి కారే ఒకటి తయారు చేసి 232కి అతను కర కర స్తాన్ వెళ్ళిన సందర్భంలో ఇచ్చాడు.

కర కర స్తాన్లో రహదారి మీద శత్రువులని చేజ్ చేస్తున్న 232, వాళ్ళని ఓవర్టేక్ చేయడానికి, తన కార్ని ఫ్లయింగ్ మోడ్లో పెట్టాడు. కారు ఎగిరింది కానీ, కాసేపు మాత్రమే. కాస్త ఎగిరాక కార్ పక్కన మొలుచొకొచ్చిన రెక్కలు ఊడి పోయాయి. అదృష్ట వశాత్తు నేల మీదకి క్రాష్ కాకుండా రహదారి పక్కనే ఉన్న పెద్ద చెట్టు కొమ్మల్లో ఇరుక్క్కుపోవడం వల్ల 232కి ఏమీ కాలేదు. జంబూ ద్వీప ప్రభుత్వం కర కర స్తాన్ ప్రభుత్వాన్ని బతిమాలుకుంటే వారు ఒక క్రేను పంపించి రెండు రోజుల తరువాత చెట్టునుండీ దింపించారు.

ఈ మధ్యలో ఫ్లయింగ్ సాసర్ ఒకటి భూమ్మీద క్రాష్ అయ్యిందన వార్త బయటకి పొక్కి, చాలా మంది UFO ఆఉత్సాహికులు కర కర స్తాన్ చేరుకుని, “Alien, get down. Show yourself” అంటూ నానా రభస చేశారు.

తెలివిగా ఆ చెట్టు ఆకులతోతే కాస్త పసరు పిండుకుని, దాన్ని తన మొహానికి పూసుకోవడం వల్ల తన identitity బయట పడకుండా కాపాడుకున్నాడు 232. పోతే, ఆ పచ్చ మొహాన్ని చూసి, వచ్చిన మంద అతను నిజంగానే alien అనుకున్నారు.

“ఆ సంఘటన వల్ల మన దేశానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. పైగా కర కర స్తాన్ ప్రభుత్వం గంటకి లక్ష రూపాయలు చొప్పున క్రేను వాడుకున్న చార్జీలను మన ముక్కు పిండి మరీ వసూలు చేసింది. ఈ మధ్యలో నువ్వు చేజ్ చేస్తున్న శత్రువులు కర కర స్తాన్లో రెండు బ్రిడ్జులు పేల్చి వేశారు కూడా. ఇంకా నయం, ఆ డబ్బు కూడా మనల్నే అడగలేదు,” నిట్టూర్చాడు శాతకర్ణి.

“నాకు అర్థమయ్యింది సార్. ఆయని క్లియర్గా అడిగే ఏ కొత్త ప్రాడక్ట్ అయినా తీసుకుంటాను,” హామీ ఇచ్చాడు 232.

“థాంక్యూ మై బాయ్. ఇక వెళ్ళి ఆధునిక రావుని కలువు,” ఈ సమావేశం అయిపోయింది అన్న మెసేజ్ వచ్చేలా తను కూడా లేచి నిలబడ్డాడు శాతకర్ణి.

(సశేషం)

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

4 Responses to గూఢచారి 232 – ప్రాజెక్ట్ పీకిస్తాన్

 1. ravi teja says:

  చాలా బావుందడి, ఆచ్చు మధుబాబు షాడొ నవలలా ఉంది.
  ‘వై.నొ.గగన్ ‘ పేరు చాలా బావుంది.

 2. Siva Kumar K says:

  LOL
  ముడుపులపాయ—Classic..!!
  “అంధేరా ప్రదేశ్లో వై.నో. గగన్ని జైల్ ఉంచేందుకు, ప్రతి వారం ఏదో కేసు బుక్ చేస్తూ బిజీగా ఉనారు.” — 😛
  Sir awesome one..!!Waiting for next part…!! :):)

 3. Amun says:

  very nice 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s