మహాభినిష్క్రమణం (ఆధునిక బేతాళ కథలు – 2)


పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పై నుంచి శవాన్ని తీసి భుజాన వేసుకుని ఎప్పటి లాగే మౌనంగా స్మశానము కేసి నడువ సాగాడు.

అప్పుడు శవంలోని సద్గురు బాబా బేతాళుడు, “రాజా, ఇలాంటి చలిలో, ఇంట్లో దుప్పటి కప్పుకుని వెచ్చగా బజ్జోకుండా, నీ లక్ష్యం సాధించడం కోసం నువ్విలా కష్టపడుతూ ఉండడం చూస్తూంటే, నాకు ముచ్చట వేస్తూంది. అందుకే నీకు దారి పొడువున శ్రమ తెలియకుండా ఒక కథ చెప్తాను విను,” అంటూ మొదలు పెట్టాడు.

“అసలు ఈ కథ చెప్తే శ్రమ తెలియకపోవడమేంటో! ఇప్పుడు తను నడవడమే కాకుండా, బేతాళుడి కథ కూడా వినాలి. కాబట్టి దాని వల్ల తన శ్రమ ఇంకాస్త ఎక్కువైనట్టే కద!” అనుకున్నాడు తనలో తాను విక్రమార్కుడు.

“పూర్వం, అంటే మరీ పూర్వం కాదులే, ఆదరా బాదార అనే నగరంలో ఆదర్శ కుమార్ అనే యువకుడు ఉండేవాడు.

“ప్రతి ఒక్కరికి ఒక్కో సమయంలో తాము బ్రతుకుతున్న బ్రతుకు అంటే విరక్తి వస్తుంది. కొందరికి అది శ్యాం గోపాల్ వర్మ ఈ మధ్య తీసే సినిమాలు చూడ్డం వల్ల రావచ్చు. కొందరికి పీకిస్తాన్ ఎంతగా వెధవ వేషాలు వేస్తున్నా, ఆపకుండా ధన సహాయం చేసే అరెమికాని చూసి రావచ్చు. ఇంకొంత మందికి దేశంలోని అన్ని వీధులకి ఎయిర్‌పోర్టులకి స్టేడియంలకి, హెన్రూదో మందిరా గాంధిదో జాజావ్ గాంధిదో, ఎవరో ఒకరి పేరు పెట్టడం చూసి, ఏం చేయలేని నిస్సహాయత వల్ల రావచ్చు. ఆదర్శ కుమార్‌కి వచ్చిన కారణం వేరే. అతనికి పదే పదే వాళ్ళావిడ చేతుల్లో జరుగుతున్న అవమానమే ఆ కారణం.

ఆదర్శ కుమార్ ఒక మధ్య తరగతి కుటుంబీకుడు. అందరి లానే అతను కూడా ఉద్యోగం రాగానే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాడు. మంచి అంటే, మంచిగా అనిపించిన అమ్మాయిలే. మొహం చూసినంత మాత్రానో, ఓ పది సార్లు మాట్లాడినంత మాత్రానో, మంచితనం ఎలా తెలుస్తుంది? ఇక పోతే, పెళ్ళైన మొదట్లో ఆమెని బాగా ప్రేమించాడు. I mean, ప్రేమ అంటే ఇష్టపడ్డం అనుకో. అసలు ప్రేమంటే ఎవరికీ సరిగ్గా తెలీదు కద! అదేంటి రాజా, అలా కింద పడి గిల గిల కొట్టుకుంటున్నావు? ఓహో, ఈ విశ్లేషణ వద్దు, అసలు కథ చెప్పమనా? నోరు తెరిచి చెప్పొచ్చు కద? ఓహో, మౌన భంగం అవుతుందనా? అలాగే, అలాగే. కథే చెప్తాను.

అలా ఆరు రోజులు, నువ్వు వింటున్నది నిజమే, ఆరు నెల్లో, సంవత్సరాలో కాదు, ఆరు రోజులు వారు చిలక గోరింకల్లా కాపురం చేశారు. ఆ తరువాత ఇద్దరికి పెళ్ళి మత్తు దిగిపోయాక, అందరు భార్య భర్తలకు తెలిసిందే వారికీ తెలిసి, (అంటే అనవసరంగా ఈ పెళ్ళిలో ఇరుక్కున్నమని, జీవితాంతం ఒకరినొకరు చూస్తూ బతికేయాలని తెలిసి), కాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈ మధ్యలో, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

విక్రమార్కా, కాట్లాడుకుంటూంటే వాళ్ళకి పిల్లలు ఎలా పుట్టారు లాంటి చచ్చు ప్రశ్నలు నువ్వు వేయవనే ఆశిస్తున్నాను. నీకు ఒక డజన్ భార్యలు, యాభై పిల్లలు ఉన్నారు కద. నీకు తెలిసే ఉంటుంది,” చిన్న బ్రేకిచ్చాడు బేతాళుడు.

స్మశానానికి వస్తూ దారిలో తాను గాంధర్వ వివాహమాడిన కాటి కాపరి కూతురు గురించి చెప్పలేదు విక్రమార్కుడు. ఆ విషయం అప్రస్తుతం, పైగా మౌన భంగం ఐతే బేతాళుడు మాయమయి చెట్టెక్కుతాడు. కాబట్టి మౌనంగానే ఉండిపోయాడు.

“ఆఫీసు నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన ఆదర్శ కుమార్‌కి అతని భార్య ఏదో ఆలోచిస్తూ కనిపించింది,” కంటిన్యూ చేశాడు బేతాళుడు.

“ఏవిటోయి, అలా సైలెంట్‌గా ఉన్నావు?” ఆమెని అడిగాడు అతను.

“ఏవీ లేదు, నాకు తెలిసిన మగాళ్ళలో మీకంటే పనికి మాలిన వాడు ఎవడైనా ఉన్నాడా అని తెగ ఆలోచిస్తున్నాను. ఎవరూ తట్టడం లేదు,” బదులిచ్చింది ఆవిడ.

ఒళ్ళు మండిపోయింది ఆదర్శ కుమార్‌కి. “అంటే మన వీధి చివర గుడిసెలో ఉన్న రిక్షా వాడు కూడా నాకంటే బెటరా?” అడిగాడు కోపంగా.

“అందులో సందేహమేముంది. వాడు చదువుకున్న చదువుకు అంత కంటే మంచి ఉద్యోగం దొరకదు. దాన్ని వాడు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. పాపం రాత్రిళ్ళు అంతా కష్టపడి రిక్షా తొక్కుతాడు. మొన్న వాళ్ళ ఆవిడ్ని సంతకి తీసుకెళ్ళి బోలెడు పూసల దండలు కొనిచ్చాడు కూడా.”

“నిజమా? నీకు పూసల దండలు ఇష్టమని తెలిస్తే, నా బోనస్ అంతా ఖర్చు పెట్టి నీకు లాస్ట్ మంత్ ఆ పచ్చల హారం కొనిచ్చి ఉండే వాడిని కాదు కద!”

“ఏడిశారు. మీ లెవెల్‌కి నాకు ఏ వజ్రాల హారమో కొనివ్వాలి. కాని వాడు తాగి తందనాలాడకుండా వాడి పెళ్ళానికి పూసల దండలు కొనిచ్చాడు చూడండి? అది వాడి గొప్పదనం.”

“ఓహో!”

“మీ క్లాస్‌మేట్స్‌నే తీసుకోండి. అందరూ ఎంతో పురోగతిలో ఉన్నారు. ఆ జానకీ రాం ఐతే రియల్ ఏస్టేట్లో కోట్లు సంపాదిస్తున్నాడు.”

“కానీ వాడు ఎన్నో వెధవ పనులు చేసి ఆ స్టేజ్‌కి ఎదిగాడు.”

“మీలా చేతకాని వాళ్ళంతా చెప్పేది అదే లెండి.”

ఆమెకి, ఏ ఉద్యోగం రాక వారి ఊరికి వెళ్ళి వాళ్ళ నాన్న మిగిల్చిన ఒక ఎకరాన్ని దున్నుకుని బతుకుతున్న ఇంకో క్లాస్‌మేట్ నిఖిల్ గాడి గురించి చెప్దామనుకున్నాడు ఆదర్శ కుమార్. కాని వాళ్ళావిడ, “బంజరు భూమిలో కూడా బియ్యం పండిస్తున్న మహానుభావుడు,” అని వాడికి కితాబిస్తుందని భయపడి ఊరుకున్నాడు.

“ఇంతెందుకు మీ వయసే ఉన్న వై.నో. గగన్ని తీసుకోండి. రాష్ట్ర రాజకీయాలు శాసించే స్థాయికి ఎదిగాడు. మీరు ఉన్నారు, నా కాళ్ళూ చేతులకి అడ్డం పడ్డం తప్ప ఏమైనా సాధించారా?”

“అంటే ఆయన జైల్లో ఉన్నాడు కద?”

“మామూలు జైల్ కాదు, ఏ క్లాస్ జైల్. అది గుర్తు పెట్టుకోండి. మన ఇంటి కంటే అక్కడే సౌకర్యంగా ఉంటుంది.”

“ఇంతకి ఏమంటావు?”

“మీ లాంటి అసమర్థుడిని కట్టుకుని ఇన్ని రోజులు ఉన్నానంటే అది కేవలం నా గొప్పదనం. నాలాంటిది మీకు భార్యగా దొరికినందుకు, రోజు లేవగానే నా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలి మీరు.”

అదిగో అప్పుడు కలిగింది విరక్తి ఆదర్శ కుమార్‌కి. తన భార్యకి తన మీద ఇంత నీచమైన అభిప్రాయం ఉన్నాక అసలు ఈ ఇంట్లో ఉండి ఏం లాభం? అతనికి గౌతమ బుద్ధుడు గుర్తొచ్చాడు. రాత్రికి రాత్రి భార్యా బిడ్డల్ని వదిలేసి దేశాలు పట్టిపోయాడు ఆయన. ఆయన అలా వెళ్ళడానికి మహాభినిష్క్రమణం అనే పేరు కూడా పెట్టుకున్నారు భక్తులు. అర్జెంట్‌గా తాను కూడా మహాభినిష్క్రమించకుంటే పరిస్థితి విషమించేలా ఉంది అని అనిపించింది అతనికి.

“సరే రేపంటూ ఉంటే, అలానే చల్లుకుంటాలే,” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

***

ఆ రోజు రాత్రి ఒంటిగంటకి డ్రాకులా తన శవపేటిక నుంచి లేచి కూర్చునట్టు నిద్ర లేచి కూర్చున్నాడు ఆదర్శ కుమార్. అతని భార్యా పిల్లలు గాఢంగా నిద్ర పోతున్నారు.

అచ్చు బుద్ధుడిలానే కట్టు బట్టలతో పడక గది నుంచి బయట పడ్డాడు. తరువాత ఒక క్షణం ఆలోచించాడు. అసలే చలికాలం. తాను ఇలా చంకలు లేని బనీను, గళ్ళ లుంగీ వేసుకుని వీధిన పడితే బస్ స్టాండ్‌కి వెళ్ళేంత లోపల ఫ్రీజ్ అయిపోయే ఛాన్సు ఉంది.

పైగా బుద్ధుడు బార్డర్‌కి దగ్గర ఉన్నాడు కాబట్టి, ఎక్కువ కష్టపడకుండానే వాళ్ళూరు దాటేసి అడవికి చేరుకున్నాడు. నిజానికి అప్పట్లో ఊర్ల కంటే అడవులే ఎక్కువ. కానీ తనకు అలా వర్కౌట్ కాదు. కాబట్టి, ఆఫీస్‌కి తయారయినట్టు తయారై, పర్సు సెల్‌ఫోన్ జేబుల్లో వేసుకుని బయట పడ్డాడు ఆదర్శ కుమార్.

తమ వీధి దాటి మెయిన్ రోడ్ దగ్గరకు రాగానే అక్కడ ఉన్న కిళ్ళీ కొట్టు దర్శనమిచ్చింది అతనికి. కిళ్ళీ కొట్టు ఓనర్ విశాలంగా నవ్వుతూ అతన్ని పలకరించాడు, “ఏంటి సార్, జాబ్‌కి బయలుదేరారా, క్యాబ్ రాలేదా?” అంటూ.

“జాబేంటి, క్యాబేంటి?” ఆశ్చర్యపోయాడు ఆదర్శ కుమార్.

“అదే సార్. బాగా డ్రెస్ అప్ అయి మరీ బయలుదేరారు కద. ఏదైనా కాల్ సెంటర్లో జాబ్ ఏమో అనుకున్నా. వాళ్ళు క్యాబ్ పంపించి పికప్ చేస్తారు కద,” వివరించాడు కిళ్ళీ కొట్టు ఓనర్.

“అదేం లేదు, ఊరికే వచ్చాను.”

“ఓహో! ఐతే వాకింగ్‌కి అన్న మాట. ఈ టైంలోనా? అవును లెండి! ఈ మధ్య మార్నింగ్ వాక్ కూడా చేయడానికి కుదరడం లేదు. నాలుగుకే ట్రాఫిక్ మొదలవుతుంది. ఈ మిడ్-నైట్ వాకింగ్ మంచి ఐడియా సార్!”

చిర్రెత్తుకొచ్చింది ఆదర్శ కుమార్‌కి. “ఇది వాకింగ్ కాదు. మహాభినిష్క్రమణం,” చెప్పాడు.

“అంటే ఏంటి సార్?”

“అంటే ఇలా వెళ్తూనే ఉంటాను అన్న మాట.”

“ఎప్పుడు తిరిగొస్తారు?”

“తిరిగి రావడమనేది ఉండదు.”

“అలా అనకండి సార్. భూమి గుండ్రంగా ఉంటుంది కద. మీరలా నడుస్తూ ఉంటే, ఎప్పటికో మళ్ళీ నా షాప్‌కే తిరిగి వచ్చేస్తారు.”

చిరాకు పోయి ఆందోళన కలిగింది ఆదర్శ కుమార్‌కి. “వీడెవడో చదువుకుని ఉద్యోగం రాక కిళ్ళీ కొట్టు పెట్టుకున్న బాపతులా ఉన్నాడు. ఇంకాసేపుంటే తన మనసు కూడా మార్చేయొచ్చు,” అనుకుని, “చూద్దాంలే. ప్రస్తుతానికైతే వెళ్తున్నాను,” అని చెప్పి బయలు దేరాడు.

ఒక అర్ధ గంట అలా నడిచాక, కాళ్ళు పీకడం మొదలెట్టాయి.

“అప్పట్లో బుద్ధుడు ఎలా నడిచాడో ఏమో. ఈ లెక్ఖన తను లుంబిని వనం లాంటి ప్రదేశానికి చేరుకోవాలంటే చాలా టైమే పట్టేలా ఉంది. ఏదైనా ఆటోలో వెళ్తే బాగుంటుంది,” అనుకుని అటు వైపు వస్తున్న ఒక ఆటోని ఆపాడు.

ఏ కళన ఉన్నాడో, ఆటో డ్రైవర్ ఆగాడు. తనెక్కడికి వెళ్ళాలో చెబ్దామనుకున్నాడు ఆదర్శ కుమార్. అంతలోనే ఆటో డ్రైవర్, “ఏడికైన సరే, మీటర్కి మూడింతలు ఇవ్వాలే,” చెప్పాడు.

“మూడింతలా? ఎందుకు?”

“రాత్రి పూట గివే రేట్లు. ఇష్టముంటే రా, లేకపోతే లేదు.”

మహాభినిష్క్రమణం పై వెళ్తూ, ఈ తుచ్ఛమైన రేట్స్ గురించి గొడవ పడ్డం భావ్యంగా అనిపించలేదు ఆదర్శ కుమార్‌కి. “సరే, అలాగే,” అన్నాడు.

“ఏడికి పోవాలె?”

“లుంబిని వనం లాంటి చోటు ఏదైనా ఉంటే తీసుకెళ్ళు.”

“లుంబిని పార్కా? గీ టైంలో ఆడికెందుకు. అసలే పోలీసులు తిరుగుతూంటరు.”

“లుంబిని పార్క్ కాదు,” కాస్త డీటైలెడ్‌గా తనకు కావల్సిన ప్రదేశం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఆదర్శ కుమార్.

“గసొంటి జాగా మన సిటీలనే లేదు. ఊరు బయటకి పొవాలే. నీకైతే మృగవాని పార్క్ కరెక్టుగ సెట్ అవుతది. కానీ నేను గంత దూరం రాను. వాపస్ల సవారి దొరకదు. ఒక పని జెయ్యి. జరంతా ముంగట పోయినవంటే నీకు షేర్ ఆటోలు దొరుకుతాయి. పైసలు కూడా తక్కువ పడతయి,” అని చెప్పి తుర్రుమన్నాడు ఆటో డ్రైవర్.

కాస్త ముందుకెళ్ళాక అతను చెప్పినట్టే షేరాటోలు ఎదురయ్యాయి అతనికి. దాదాపు అన్ని ఆటోలు ఆల్రెడీ ప్యాసెంజర్స్‌తో నిండి పోయి ఉన్నాయి. మృగవన్ పార్క్‌కి వెళ్ళే ఆటోలో అసలు చోటు లేదు. కాని డ్రైవర్ తన పక్కన కూర్చోమని సజెస్ట్ చేశాడు. అప్పటికే డ్రైవర్ కుడివైపు ఇంకొకతను కూర్చొని ఉన్నాడు. వెనకాల నలుగురు ఆడంగులు సర్దుకుని ఉన్నారు. చేసేది లేక తను డ్రైవర్‌కి ఎడమ వైపు కూర్చున్నాడు ఆదర్శ కుమార్.

షేరాటో ప్రమాదకరంగా పరుగులు తీయడం మొదలు పెట్టింది. అది మలుపు తిరిగిన ప్రతి సారి ఆటో లోంచి బయటకు పడినంత పని అయ్యి కష్టం మీద తమాయించుకున్నాడు ఆదర్శ కుమార్. “పీకుడు” సినిమాలో భవానీ పెల్టన్, “షేరాటో ఎక్కాలంటే ప్యాసెంజర్ల టెన్సనూ,” అని ఎందుకు పాడిందో కాస్త అర్థమయ్యింది అతనికి. ఎక్కువ ప్యాసెంజర్స్ ఉంటే, ఇదిగో, ఇలానే సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుంది మరి.

ఎంతసేపు అలా పడకుండ ఉండగలిగే వాడో తెలీదు కానీ, షేరాటో సడన్‌గా ఆగిపోయింది. డ్రైవర్ దిగి ఇంజన్ చెక్ చేశాడు. “మీరంతా కాస్త తోయాలి,” అనౌన్స్ చేశాడు.

“ఆరుమంది ఎలా తోస్తాం?” ప్రశ్నించాడు ఆదర్శ కుమార్.

“ఆరు మందేమిటి? లేడీస్ ఎప్పుడైనా దిగి తోస్తారా? మీరిద్దరే తోయాలి,” అన్నాడు ఆటో వాడు.

“మరి వాళ్ళేం చేస్తారు?”

“వాళ్ళు అలానే కూర్చుంటారు. మా అందరిని కలిపి మీరు తోయాలి.”

ఒక పావు కిలోమీటర్ తోశాక జవ సత్వాలు ఉడిగిపోయాయి ఆదర్శ కుమార్‌కి. “ఇక నా వల్ల కాదు,” అనౌన్స్ చేశాడు.

“ఇక ఈ ఆటో కదిలేలా కూడా లేదు. మీరు వేరే ఆటో చూసుకోండి,” అన్నాడు డ్రైవర్. అప్పటికి వాళ్ళు ఆటో స్టాండ్ వదిలి ఒక రెండు కిలోమీటర్ల దూరం వచ్చారంతే! ప్రయాణీకుల ప్రొటెస్త్స్ పట్టించుకోకుండా, వారందరిని దింపేసి, ఆటోని రోడ్డు పక్కన పెట్టి, డ్రైవర్ బ్యాక్ సీట్లో నిద్రకి ఉపక్రమించాడు.

అందరూ తిట్టుకుంటూనే మళ్ళీ ఆటో స్టాండ్ వైపు నడిచారు. వారంతా తిట్టుకుంటున్నా, ఆదర్శ కుమార్ మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. మిగతా ప్యాసెంజర్స్ సరిగ్గా చూడలేదు కానీ, లేకుంటే ఆదర్శ కుమార్ తల వెనక ఏర్పడిన కాంతి వలయాన్ని గమనించే ఉండే వారు.

కాసేపట్లో ఇంకో షేరాటోలొ రివర్స్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాడు అతను. ఇంకాసేపట్లో తమ వీధిలోకి ఎంటర్ అయి అదే కిళ్ళీ కొట్టు ముందు నుంచి నడుస్తున్నాడు. వెనకాల నుండి కిళ్ళీ కొట్టు యజమాని, “ఏంటి సార్, అప్పుడే భూ-ప్రదక్షిణం చేసేశారా?” అన్న మాటలని అతను పట్టించుకోలేదు.

అతను ఇంటికి వెళ్ళెప్పటికి ఎవరూ నిద్ర లేవలేదు. వెళ్ళిన ఐదు నిమిషాలకు అతని భార్య లేచి కూర్చుంది.

“అదేంటి, ఆరు గంటలకే తయారయ్యారు? అంతే లెండి. ఎప్పుడు నన్నూ, నా పిల్లలని తప్పించుకుని పోదామా అన్నదే మీ ధ్యాస,” అని ఆవిడ గొణుగుతున్నా పట్టించుకోకుండా, “సాయంత్రం కాస్త తొందరగా వస్తాలే,” అంటూ ఇంటి నుంచి బయట పడి, ఈ సారి ఆఫీసుకి బయలు దేరాడు ఆదర్శ కుమార్.

అది రాజా, కథ. ఇప్పుడు చెప్పు. బుద్ధుడిలా మహాభినిష్క్రమణం మీద బయలుదేరిన ఆదర్శ కుమార్ ఎందుకు మనసు మార్చుకున్నాడు? ఏ ఇంటినుంచి ఐతే పారిపోయాడో మాళ్ళీ అదే ఇంటికి వచ్చి ఎందుకు చేరాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేదంటే, నీకు తమ వంశం గురించి మన బుజ్జి కృష్ణ ఇచ్చే స్పీచులు ఒక దాని తారువాత ఒకటి, దాదాపు వంద వినిపిస్తాను,” అంటూ ముగించాడు బేతాళుడు.

“అంత పని మాత్రం చేయొద్దు. ఐనా ఇందులో పెద్ద మిస్టరీ ఏమీ లేదు. దారి పొడుగునా తనకు ఎదురైన అనుభవాలే ఆదర్శ కుమార్ని అలా మార్చాయి. ఇప్పుడు అంధేరా ప్రదేశ్లో తపస్సులూ గట్రా ప్రశాంతంగా చేసుకునే ప్రదేశాలు వెతుక్కోవడం కష్టం. మృగవాణి పార్క్‌లో కూడా తనకు ఆ ప్రశాంతత దొరక్క పోవచ్చని అతనికి అర్థమయ్యింది. ఈ బాధలు పడ్డం కంటే అలవాటైన భార్య తిట్లు తినడమే బెటర్ అనిపించింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆ రోజు రాత్రే జంబూ ద్వీపానికి, ఛీ లంక దేశానికి మధ్య ఆ సంవత్సరంలో జరగబోతున్న 40వ వన్-డే కిరికెట్టు మ్యాచ్ ఉంది. జ్ఞానోదయం కంటే కిరికెట్టు మ్యాచ్ చూడ్డం ఇంకా ముఖ్యం. ఈ అన్ని కారణాల వల్ల, ఆదర్శ కుమార్ తిరిగి తన గూటికి చేరుకున్నాడు,” బదులిచ్చాడు విక్రమార్కుడు.

ఆ సమాధానం కరెక్ట్ కావడంతో, అతని భుజం మీదనుంచి మాయమై మళ్ళీ చెట్టెక్కాడు బేతాళుడు. కనీసం ఆ రోజు జరుగుతున్న ఇంకో కిరికెట్టు మ్యాచ్ స్లాగ్ ఓవర్స్ ఐనా చూద్దామని విక్రమార్కుడు కూడా ఇంటికి పరుగు దీశాడు.

(సమాప్తం)

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

12 Responses to మహాభినిష్క్రమణం (ఆధునిక బేతాళ కథలు – 2)

 1. Amun says:

  nice 🙂

 2. Anuradha says:

  బాగుంది 🙂

 3. Siva Kumar K says:

  ROFL 😀 😀

 4. Rajkumar says:

  LOLLLLLLLLLL as usual 😉

 5. krishna says:

  Baga rasaru!!!!

 6. Ravi ENV says:

  వావ్…ఐదారేళ్ళ క్రితం నేనూ ఇలానే భేతాళ కథలు డిసైడ్ చేసినప్పుడు నాకు ఇలాంటి అవుడియాలొచ్చేవి.కుమ్మేశారంతే. (ఐ పీ ఎల్ కూడా రాయొచ్చు.)

  http://blaagadistaa.blogspot.com/2007/09/blog-post_22.html

  • Murali says:

   రవి గారు,

   బాగా రాశారు. Don’t worry, I will carry your torch forward. I plan to write a few more. 🙂

   ఐ.పీ.ఎల్. గురించి తలుచుకుంటూనే ఆదర్శ కుమార్‌లా జవ సత్వాలు ఉడిగిపోతున్నాయి. ఇంక క్యామెడీ ఏం చేస్తాం చెప్పండి. 🙂 అప్పుడప్పుడు సైడ్‌లో చురకలు అంటించవచ్చు అనుకోండీ…

   మీరు ఇంకా ప్యారడీలు రాయాలి. ఈ బ్లాగ్ ప్రపంచంలో నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిన టపాల్లో మీవి కొన్ని.

   -మురళి

 7. భువన్ says:

  చాల బాగుంది! ఆదర్ష కుమార్ కి తొందరగానె కాంతి వలయం వచ్చింది. ఇంకా కథ పొడిగిస్తారనుకున్నాను.

  • Murali says:

   నిజమే తొందరగానే కాంతి వలయం వచ్చింది. O.Henry లా ఒక్కో సారి కథలు తొందరగా ముగించాల్సి వస్తూంటుంది. ఇంకో వైపు సంసార సాగరం కూడా ఈదాలి కద! 🙂

 8. narsingrao madharam says:

  very good… but you are sparing our great CM Kiran Kumar Reddy. There are lot of material to write about him and his great schmes……

  • Murali says:

   Frankly, Kiran Kumar Reddy is not his own boss. Whatever criticism that needs to be aired at him will eventually lead to the high command, whom I have never spared in my posts. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s