అందరూ అంధేరాలోనే

సివిల్స్ ప్రిపరేషన్ కోసం మళ్ళీ ధన్వంతరి గాడి ఇంటికి బయలుదేరాను. మిగత రాష్ట్రం అట్టుడుకి పోతున్నా, ఆదరా బాదరా మాత్రం ప్రశాంతంగా ఉండడంతో నా ప్రయాణానికి ఎటువంటి ఆటంకం కలగలేదు.

వాడి ఇంటికి చేరుకున్నాక, తలుపు ఎలాగూ తెరిచి ఉంది కద అని ధన్వంతరి గాడిని పిలవకుండానే, వాడి అపార్ట్‌మెంట్‌లో ఎంటర్ అయి టీవీ ముందు కూర్చున్నాను.

“అంధేరా ప్రదేశ్ చీల్చేసి, కొన్ని సీట్లు లాగేసి, సాహుల్‌నే PM చేసినట్టు కల్లో వచ్చిందే, జగన్మోహన్ సింగే ఓరి నా డార్లింగే, డార్లింగే, ఓరి నా డార్లింగే,” గట్టిగా పాడుతూ బయటకి వచ్చాడు ధన్వంతరి.

“ఇదేదో ఢిల్లీ అమ్మ పాడాల్సిన పాటలా ఉంది?” అనుమానంగా అడిగాను నేను.

“ఇది ఆవిడ పాటే! ఎలాగూ ఆవిడ రాయదు కద అని తన తరపున నేనే కవిత్వం చేసుకున్నా,” సెలవిచ్చాడు ధన్వంతరి.

“కవిత్వం చేసుకున్నావా? మా బాబే! ఇంతకీ ఢిల్లీ అమ్మ ఉద్దేశం నెరవేరుతుందంటావా?”

“ఆమె ఆశ అదే కద! బృందగానాలో సీట్లన్ని అప్పన్నంగా వచ్చేస్తాయని, తద్వారా అబ్బాయి సాహుల్‌కి 2014లో ప్రధాన మంత్రి పదవి కట్టబెట్టొచ్చు అని ఆవిడ ప్లాన్. చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు.”

వెంటనే బయటకి వెళ్ళి చుట్టూ చూశాను నేను. ఒక ఏడేళ్ళ కుర్రాడు కనిపించాడు. చేతిలో ఏదో గేం ఉంది. తల దించుకుని ఆడుకుంటూ వస్తున్నాడు.

“ఢిల్లీ అమ్మ బృందగానా ఎందుకు ఇచ్చిందంటావు?” అడిగాను అతన్ని.

వాడు తలెత్తి ఏమిటన్నట్టు చూశాడు. నేను నా ప్రశ్నని రెట్టించాను.

“ఢిల్లీ అమ్మకి క్యాన్సర్ అని అందరూ అంటున్నారు. కానీ నిజానికి ఆమెకి మెంటల్. అందుకే ఇచ్చింది,” తడుముకోకుండా చెప్పాడు వాడు.

“ఢిల్లీ అమ్మకి మెంటల్ అట, క్యాన్సర్ కాదట,” లోపలికి వచ్చి రిపోర్ట్ చేశాను నేను.

“ఆమెకి మెంటల్ ఏంటి గురూ? ఆమెని గెలిపిస్తున్న ప్రజలకి మెంటల్!” చెప్పాడు ధన్వంతరి.

నేను మారు మాట్లాడలేకపోయాను. ఒకోసారి ధన్వంతరి గాడి లాజిక్‌కి తిరుగుండదు.

“ఐతే తన కొడుకు పదవి కోసం ప్రజల జీవితాలతో ఆడుకుందన్న మాట, ఎంత దారుణం,” ఆవేశంగా అన్నాను నేను. నాకు చిన్నప్పటినుండి ఆవేశం ఎక్కువ.

పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు ధన్వంతరి. “ఏంటి గురూ, ఈ క్యామెడీ! అసలు హెన్రూ నుంచి ఢిల్లీ అమ్మ వరకు ఆ వంశంలో ఎవరైనా ప్రజల క్షేమం కోసం ఏ పనైనా చేశారా? కొత్తగా అలా చేస్తారు అని నువ్వు అనుకోవడానికి?” కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.

నాలుక కర్చుకున్నాను నేను. “నిజమేరోయి, ఎమోషన్‌లో వాళ్ళ క్యారక్టర్ మర్చిపోయాను.”

“కానీ ఢిల్లీ అమ్మ ఆశ నెరవేరేలా లేదు. గాంక్రెస్ తన గోతిలో తానే పడేలా ఉంది. వాయల సీమా, మోస్తా ప్రజలనుంచి ఇంత తిరుగుబాటు వస్తుందని ఆమె ఊహించలేదు. పైగా బృ.రా.స గాంక్రెస్‌లో విలీనం అయ్యేలా లేదు. కాబట్టి గంపగుత్తగా బృందగానా నుంచి 17 సీట్లు వచ్చే అవకాశం లేదు.”

“ఐతే ఈ నిర్ణయం ఏ పార్టీకి లాభించిందంటావు?” అడిగాను వాడిని.

“ఇది ఎలాంటి నిర్ణయం అంటే, ఎవరికి పూర్తిగా లాభించేలా లేదు. ఐనా మనకు అలవాటే కద. టీవీ చూస్తూ విశ్లేషిద్దాం,” అంటూ వాడు టీవీ ఆన్ చేశాడు.

వెంటనే వీ.సీ.ఆర్. ప్రత్యక్షం అయ్యాడు. పక్కనే ఆయన పుత్రికా రత్నం తవిక కూడా ఉంది.

“బృందగాన రాకుండా ఎవ్వరు ఆపలేరు. గాంక్రెస్ ప్రకటనని స్వాగతిస్తున్నం. గన్నట్లు వాయలసీమ మోస్తా వోల్లంతా తమ దుకునం ఈడకెల్లి ఎత్తెయ్యాలే. ఎల్లుండ్రి, ఎల్లుండ్రి,” అన్నాడాయన.

“డ్యాడీ, యాది మర్చినవు. ఎవలైనా వాయల సీమ లేదా మోస్తా ప్రజలు ఆదరాబాదరాలొ గిట్ల ఉండాలంటే, వాల్ల ఇల్లకి గులాబి రంగు వేయించాలే, పైగా కాంపౌంట్ గోడ మీద “జై బృందగానా” అని రాయాలె,” అడ్డు పడింది తవిక.

“మంచిగ చెప్పినవు బిడ్డా. అవు గది కూడా చెయ్యలే,” సర్దుకున్నాడు ఆయన.

“నిర్ణయం తమకి అనుకూలంగా వచ్చాక ఎందుకు వీళ్ళు జనాన్ని రెచ్చగొడుతున్నారు?” ధన్వంతరిని ప్రశ్నించాను నేను.

“బృందగాన సమస్య తీరి పోయి, గాంక్రెస్ క్రెడిట్ అంతా కొట్టేస్తే, ఇంక వీళ్ళ మొహం చూసేదెవరు? అందుకే 2014 ఎన్నికల వరకు ఈ మంట ఇలా రాజేస్తూనే ఉంటారు. అందుకే విలీనానికి కూడా ఒప్పుకోలేదు.”

చ్యానెల్ మార్చాను నేను.

ఈ సారి బీ.పీ పార్టీకి చెందిన శంకయ్య నాయుడు తెర మీదకి వచ్చాడు. “గాంక్రెస్ బృందగానని ఇవ్వడం మేము ఆమోదిస్తున్నాం. కాని వాళ్ళు అలా చేసిన పద్ధతిని ఖండిస్తున్నాం. ఈ సమస్య గురించి ఇంకా సునిశితంగా రాత్రంతా టీ తాగుతూ ఆలోచిస్తాం,” ఉద్ఘాటించాడు.

“బీ.పీ పార్టీ వాళ్ళు బృందగానాకి అనుకూలమే కద? మరి ఈయనేంటి ఇలా తేడాగా మాట్లాడుతున్నాడు?” ఆశ్చర్యపోయాను నేను.

“బృందగాన ఇచ్చిన క్రెడిట్ తమకు దక్కితే కనీసం ఒక నాలుగైదు ఎం.పీ. సీట్లైనా వస్తాయని అనుకున్నారు. వీళ్ళ బ్రహ్మాస్త్రాన్ని గాంక్రెస్ వేసేసింది కద. ఎట్టి పరిస్థితుల్లోనూ గాంక్రెస్‌ది పై చేయి కాకూడదు. అందుకే రేపు పార్లమెంట్‌లో బృందగాన బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ముందే డిఫెన్స్ తయారు చేసుకుంటున్నారు.” ఇది వాడి ఆన్సర్.

చ్యానెల్ మళ్ళీ మారింది.

ఈ సారి తెగులు దేశం నాయకుడు సూర్య బాబు తెర మీదకి వచ్చాడు.

“ఏదో ఒక సమస్య పోతుంది అనుకుని అప్పట్లో కేంద్రానికి లెటర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. నేను ప్రజల కోసం బతికే మనిషిని. ఈ రోజే ఇంకో లెటర్ రాస్తాను,” అన్నాడు ఆవేశంగా.

“అన్నా, నీ కాళ్ళు పట్టుకుంటాం. ఒక్క లెటర్‌కే రాష్ట్రంలో సంక్షోభం నెలకొంది. ఇంకోటి ఇవ్వద్దన్నా,” అంటూ సూర్య బాబు కాళ్ళ మీద పడ్డారు ఒక డజన్ మంది తెగులు దేశం ఎం.ఎల్.ఏ.లు.

నేను చ్యానెల్ మార్చాను.

ఒక డజను గాంక్రెస్ నాయకులు స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యారు.

“ఢిల్లీ అమ్మ దేవత. చెప్పినట్టే బృందగానా ఇచ్చింది. జై ఢిల్లీ అమ్మ!” అన్నాడు సీనియర్ నాయకుడు జానా బెత్తెడు రెడ్డి.

“ఎహే, ఆయనకేం తెలీదు. అది ఉత్తి ప్రతిపాదన మాత్రమే. ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు,” బింకంగా అన్నాడు ఇంకో నాయకుడు జగడపాటి.

“మీరు నోరు మూయండి. ఆ దేవుడే వచ్చినా బృందగానా రాకుండా ఆపలేడు,” అంది చొక్కా అరుణ కుమారి.

“వాయల సీమ, మోస్తా ప్రజల్లారా, మీరు భయపడకండి! ఢిల్లీ అమ్మ సమ న్యాయం తప్పకుండా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతే అందరి కంటే ఆఖర్న నేను రాజీనామ చేస్తానుగా!” హామీ ఇచ్చాడు కేంద్ర మంత్రి రిచంజీవి.

“వీళ్ళంతా ఒక పార్టీ సభ్యులేనా?” డౌట్ వచ్చింది నాకు.

“ఒక పార్టీనే. కానీ ప్రస్తుతం వాయలసీమ, మోస్తాల్లో గాంక్రెస్ నాయకులకి తడిసి మోపెడవుతూంది. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అలా అని ఢిల్లీ అమ్మని విమర్శించే ధైర్యం కూడా లేదు. అందుకే ఈ సన్నాయి నొక్కులు,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ధన్వంతరి.

ఈ సారి చ్యానెల్ మారిస్తే ఎర్ర పార్టీ నాయకుడు బాదరాయణ వచ్చాడు.

“వాయలసీమ, మోస్తా ప్రజలకి జరిగే ఈ అన్యాయం మా పార్టీ సహించదు,” పిడికిలి బిగించి అరిచాడు ఆయన.

“అదేంటి, మీరు బృందగానా సపోర్టర్ కద?” అడిగాడు ఒక విలేఖరి.

“అప్పుడు వాళ్ళు ఉద్యమం చేశారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేశామండి! ఇప్పుదు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని సపోర్ట్ చేస్తాం. మాకు ఉద్యమం ముఖ్యం, సమస్య కాదు. విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది,” రెడ్ శాల్యూట్ చేశాడు ఆయన.

భరించలేక నేను చ్యానెల్ మార్చాను.

“గగనన్న విడిచిన బాణాన్ని నేను. ఐతే కొంచెం రూటు మార్చాను. ఇప్పుడు జాగ్రత్తగా బృందగానా వదిలి మిగతా అంధేరా ప్రదేశ్‌లో మాత్రం పర్యటిస్తా. మా అన్న అధికారంలోకి వస్తే ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళందరికి ఒక నెల జీతం బోనస్ ఇస్తాడు,” అనౌన్స్ చేసింది పిల్ల గాంక్రెస్ నాయకురాలు నర్మిల.

“మరి ఉద్యమించే వారికి ఉద్యోగం లేకపోతేనో?” సందేహమొచ్చింది ఒక విలేఖరికి.

“గగనన్న వాళ్ళకి ఉద్యోగం ఇప్పించి మరీ బోనస్ ఇస్తాడు. మేము మాట ఇచ్చాక మడమ తిప్పం,” సమాధానమిచ్చింది నర్మిల.

“వీళ్ళేంట్రా, ఇన్ని రోజులూ గాంక్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఓకే అన్నారుగా! ఇప్పుడు రూటు మార్చారేంటి?” విసుగ్గా అన్నాను నేను.

“ఎన్నికలయ్యాక బేరాలాడుకోవాలంటే, వీళ్ళకి తగినన్ని ఎం.పీ. సీట్లు రావాలి. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తే, వారనుకున్నది నెరవేర వచ్చు. అందుకే బృందగానాని గాలికి వదిలేశారు. వీళ్ళది కూడా ఢిల్లీ అమ్మ స్ట్రాటజీనే. పోతే ఆవిడ మోస్తా వాయలసీమకి నీళ్ళొదులుకుంది, వీళ్ళు అపోజిట్. అంతే! రేపొద్దున సెంటర్‌లో తల్లి గాంక్రెస్‌కి పిల్ల గాంక్రెస్ సపోర్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి,” గీతోపదేశం చేశాడు ధన్వంతరి.

“భగవాన్, ఈ పాడు ప్రపంచాన్ని చూడలేకుండా ఉన్నానయ్య,” వేడుకున్నాను నేను.

“ఇంకొన్ని రోజులు పోతే ఖచ్చితంగా రాత్రి ఏమీ చూడలేవులే!”

“ఎందు వలన చేత?”

“ఇంకాస్త స్ట్రాంగ్‌గా మన మోస్తా వాయలసీమ విద్యుత్ శాఖ ఉద్యోగులు సమ్మె చేస్తే, రాత్రిళ్ళు నీకూ నాకే కాదు, అందరికి అంధేరానే!”

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

7 Responses to అందరూ అంధేరాలోనే

 1. Siva Kumar K says:

  ROFL 😀 😀 😀

 2. ముగ్గురు మూర్ఖులు, మమో, మైమో, బుడ్డ గాడు, దుష్ట చతుష్టయం అందరివెనుక అల్లాపటేల్ ! పిడకల వేటగాళ్ళు అదేదో యాదవులు, ఇదేదో యాదవులు, మరొక ప్రక్క మమో లాగా మాట్లాడేది అర్ధం కాకుండ, చూసేది తెలియకుండ, కన్నమణి కోసం మద్దతుపలికే మరొక నాయగన్. ఇంతమంది కలిసి వండే వంట త్రిలింగాలలో, రెండు లింగాలకు రుచించదు. సామాజిక న్యాయం అన్న తెర పులి, జౌళి అన్నా భళీ అనే ఏవూరి, పదవులు ప్రట్టుకు వ్రేలాడే గణాచారులు. వీళ్ళందరిని చూసి మానని వ్యాధి శారీరకమో, మానసికమో తెలియని ఐరోపా యువతి. మమ్మీ, మమ్మీ పియమ్మే అని గుక్కపట్టి ఏడ్చే బుడ్డబ్బాయి. ఎన్ని రాష్ట్రాలలో ఎన్ని సమస్యలున్నా ఓట్లు వేస్తారనుకొన్నవారినే పరామర్సించే ఐరోపా వృద్ధ. పాలకులే దేవుళ్ళని భ్రమసే జనాన్ని ఆ దేవుడే కాపాడాలి. చక్కటి వ్యాసానికి జేజేలు.

 3. Sujatha says:

  బెత్తెడు రెడ్డి ఎవరా అని ఆలోచిద్దాం అని ఉపక్రమిస్తుండగానే గుర్తొచ్చేసింది. పేర్లు పెట్టడం లో వామ్మో.. మీ తర్వాతే ఎవరైనా!

  ఆవేదన కల్గించే అంశాన్ని సైతం పంచదార పూత పూసి హాయిగా నవ్వించారు.

  థాంక్యూ

 4. hari.S.babu says:

  ఒకప్పుడు నార్త్ ఇండియా లో కొన్నాళ్ళు చదువుకున్న్నా. అక్కడ మన రాష్ట్రం నుంచి వొచ్చిన వాళ్ళని పేరు సరిగ్గా పలకటం రాక అంధ్రీ వాలా లనే వాళ్ళు.కొంచే పరాగ్గా ఉంటే మాకది అంధేరీవాలా లాగా వినపడేది, ఇప్పుడదే నిజమయ్యింది:-)

 5. aksastry says:

  Wonderful! Keep it up.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s