బంగారు కలలు (ఆధునిక బేతాళ కథలు – 3)

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పై నుంచి శవాన్ని తీసి భుజాన వేసుకుని ఎప్పటి లాగే మౌనంగా స్మశానము కేసి నడువ సాగాడు.

అప్పుడు శవంలోని  బేతాళుడు, “రాజా, నీ శ్రమ, దీక్ష చూస్తూంటే నాకు ముచ్చటేస్తూంది. ఐతే ఒకో సారి సంకల్పబలం సదుద్దేశం ఉన్నప్పటికి, కొన్ని తల పెట్టిన కార్యాలు విఫలమౌతుంటాయి.  ఇప్పుడు నీకు అలాంటి కథే ఒకటి చెప్తాను, విను,” అంటూ మొదలు పెట్టాడు.

“జంబూ ద్వీపం అనే దేశానికి సంబంధించిన కథ ఇది. ఆ దేశాన్ని గాంక్రెస్ అనబడే ఒక మహోత్తరమైన పార్టీ ఏలుతూంది. గాంక్రెస్ పార్టీ పేదల కోసమే పుట్టిన పార్టీ. వారికి పేదలంటే ఎంత ఇష్టమంటే, ఎల్లప్పుడూ పేదలకు సేవ చేస్తూ ఉండడానికి, జంబూ ద్వీపంలో అసలు పేదరికం అనేది ఎప్పటికి అంతరించిపోకుండా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

అందులో భాగంగానే మధ్య తగరతి ప్రజల మీద, పెద్ద పెద్ద వ్యాపారస్తుల మీద వేసే పన్నుల వల్ల వచ్చిన ఆదాయంతో జంబూ ద్వీపంలోని అతి పేద వారికి సంక్షేమ పథకాలు నడపడం మొదలు పెట్టారు.

ఆ డబ్బుని పేదలకి రకరకాలుగా పంచిపెట్టారు. “తినకపోతే కుక్కుతాం” పథకం కింద పేద వారికి వంట సరుకులు ఇవ్వడం, “ఋణం తీర్చక పోయినా, ఏం ఫర్లేదు” పథకం కింద రైతులకు అప్పులు ఇవ్వడం, బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు హాస్టల్ ఫీజ్ కట్టడం, ఉచిత విద్యుత్ ఇవ్వడం, పేదలకు పక్కా ఇళ్ళు కట్టించడం, ఒకటేమిటి పోలింగ్ బూత్‌కి వచ్చి వోటు వేస్తారని నమ్మకం ఉన్న వాళ్ళందరికి రక రకాల వరాలు ప్రసాదించారు.

మరి ఇంత కష్ట పడుతున్నారు కాబట్టి, ప్రజలకు ఇచ్చే ప్రతి రూపాయిలో తొంభై పైసలు వాళ్ళే ఉంచుకున్నారు. కొన్ని చోట్ల దీన్ని కరప్షన్ అంటారు. కానీ జంబూ ద్వీప ప్రజలు మాత్రం పట్టించుకోకుండా గాంక్రెస్‌కి జేజేలు పలికారు. ఎందుకంటావు?”

మాట్లాడను అన్నట్టు తన నోటికేసి వేలు పెట్టి చూపించాడు విక్రమార్కుడు.

“ఓ, మర్చిపోయాను, నువ్వు మౌన వ్రతంలో ఉన్నావు కద. స్మార్ట్ బాయ్! సమాధానం కూడా నేనే చెప్తాను విను. జంబు ద్వీప ప్రజలు చాల గొప్ప మనసు కల వారు. వారికి ఎవరన్నా ఎంతో కొంత పారేస్తే, ప్రపంచం బద్దలయి పోయినా పట్టించుకోరు. డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ప్రభుత్వంతో అసలు సున్నం పెట్టుకోరు. కాబట్టి ఈ పద్ధతి గాంక్రెస్‌కి బాగా వర్కౌట్ అయ్యింది. ఆల్‌రెడీ రెండు సార్లు ఎన్నికల్లో కూడా గెలిచారు. మూడో సారి గెలవడానికి ఉర్రూతలూగుతున్నారు.”

చెవిలో విపరీతంగా దురద వేయడంతో, ఒక చేత్తో భుజం మీద బేతాళుడిని జాగ్రత్తగా బ్యాలన్స్ చేస్తూనే, ఇంకో చేత్తో తనివి తీరా చెవి గోక్కున్నాడు విక్రమార్కుడు.

“ఐతే దురదృష్ట వశాత్తు ఆర్థిక వ్యవస్థ ఇలాంటి దానాలు ధర్మాలు సబ్సిడీల వల్ల నడవదు. ఆర్థిక వ్యవస్థకి కావాల్సింది కట్టుదిట్టమైన infrastructure మరియు శాంతి భద్రతలు. కానీ ఉన్న డబ్బులు అన్నీ తమ మధ్య, పేదల మధ్య పంచుకోవడంతో, రోడ్లు వేయడం, డ్యాములు కట్టడం, దేశం నలు మూలలా విద్యుత్తు ఇవ్వడం, లా అండ్ ఆర్డర్ లాంటి విషయాలపై శ్రద్ధ పెట్టడానికి గాంక్రెస్ ప్రభుత్వానికి వీలు లేకుండా పోయింది.

‘కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే’ అన్న సూక్తి ప్రకారం, ఈ సంక్షేమ పథకాలన్నిటికీ డబ్బులు తక్కువ పడడం మొదలయ్యింది. దాన్ని సర్దుబాటు చేయడం కోసం బంగారం దిగుమతుల మీద పన్నులు పెంచింది గాంక్రెస్. జంబు ద్వీప ప్రజలు గాసిప్‌లు లేకపోయినా ఉండగలరు కానీ, బంగారం కొనకుండా ఉండలేరు, కాబట్టి కొన్ని రోజులు అలా అదనపు అదాయం వచ్చింది ప్రభుత్వానికి . కానీ తరువాత అది కూడా సరిపోలేదు.

దిక్కు తోచక ఏం చేయాలో తెలియక మధన పడుతున్న ప్రభుత్వానికి ‘ఉన్నానో లేనో’ అనబడే ఊరి గుడి పూజారి ఆశా కిరణం చూపించాడు. ఆయన ఒక రాత్రి వాళ్ళ ఊరిలోనే ఉన్న ఒక పాడు బడ్డ కోట కింద వెయ్యి టన్నుల బంగారం నిక్షేపమై ఉందని కల కన్నాడు.

కల కన్న వాడు దాని గురించి మరిచిపోకుండా గాంక్రెస్ మంత్రి పాద దాసుకి కూడా తెలియ చేశాడు. ఆయన ఆ విషయం ఢిల్లి అమ్మకి, జగన్‌మోహన్ సింగ్‌కి చెప్పాడు.

“ఏ పుట్టలో ఏ పాముంటుందో, ఏ కోట కింద ఎంత బంగారం ఉంటుందో, వెంటనే మన పురావస్తు పరిశోధన విభాగానికి పురమాయించండి అర్జెంటుగా తవ్వమని ,” హుకుం జారీ చేసింది ఢిల్లీ అమ్మ.

“బాగా చెప్పారు మేడం! అంత బంగారం కనుక మనకి దొరికితే, ‘అణగారిన ప్రజలకు జీవితాంతం జీతం ఉచితం’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టేద్దాం. అప్పుడు మనం ఎన్నికలలో ఓడిపోవడం అనేదే ఉండదు,” ఆనందంగా చెప్పాడు జగన్‌మోహన్ సింగ్.

“మీరు నోరు మూయండి. పథాకాలకు పేర్లు పెట్టేది నేను, మీరు కాదు. మీ పని నేను చేయమన్న చోట సంతకాలు చేయడమే!” హుంకరించింది ఢిల్లీ అమ్మ.

నాలుక కరుచుకున్నాడు జగన్‌మోహన్ సింగ్. “ఇంకా చూస్తావే? వెంటనే మన పురావస్తు పరిశోధన విభాగం యొక్క డైరెక్టర్‌కి ఫోన్ చేసి ఆ పనిలోనే ఉండమని చెప్పు,” పాద దాసుకి ఆర్డర్ వేశాడు జగన్‌మోహన్ సింగ్. ఆయన ఆ పని చేయడానికి పరిగెత్తాడు.

ఆ తరువాత అన్ని పనులు చక చకా జరిగిపోయాయి. రాఘవ జన్మ భూమి గొడవ తరువాత ఏ పని లేకుండా గోళ్ళు గిల్లుకుంటున్న పురావస్తు పరిశోధన విభాగం వారు ఎగిరి గంతేసి తవ్వకాలలో చురుకుగా పాల్గొన్నారు. కోటని ఎడా పెడా తవ్వేశారు.

ఒక వారం తవ్వినా కోట కింద బంగారం కాదు కద, ఇత్తడి కూడా దొరకలేదు వారికి.

“కొంప దీసి అక్కడ బంగారం ఉందో లేదో, పూజారి గారు,” అనుమానం వెలిబుచ్చాడు పాద దాసు.

“మా ఉన్నానో లేనో ఊరి మీద ఒట్టు, ఖచ్చితంగా ఉంది! ఏదో మన దేశానికి డబ్బు అవసరం అన్ని కష్ట పడి కల కన్నాను నాయనా,” చిన్న బుచ్చుకున్నాడు ఆ ఊరి పూజారి.

ఇంకొన్ని రోజులు గడిచాయి. అబ్బే లాభం లేకపోయింది.

“స్వామీ, మీరు చూపించిన అన్ని చోట్ల కిందా తవ్వాము. ఆ హడావుడిలో నా వేలికి ఉన్న ఉంగరం ఎక్కడో పడిపోయింది కానీ, ఏ బంగారం దొరకలేదు. కొత్త చోటు చూపించండి,” కాస్త చిరాగ్గానే అడిగాడు పురావస్తు డైరెక్టర్.

“అది నేను చెప్పాలా, నాయనా! ఎక్కడెక్కడ తవ్వలేదో ఆ ప్రదేశాల్లో కూడా తవ్వేయ్యండి,” ఉచిత సలహా పారేశారు పూజారి గారు.

“ఏంటో, కనీసం ఒక కేజీ బంగారం ఐనా దొరికితే కాని పరువు దక్కేలా లేదు,” తనలో తాను గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు డైరెక్టర్.

ఇంకొన్ని రోజుల తరువాత తవ్వడానికి ఏమీ భూమి లేక ఆపేశారు పురావస్తు శాఖ వారు. కోట ఉన్న స్థానంలో ఒక మోటా బావి ఏర్పడింది.

“బావి ఎంత బాగా తవ్వారో, మీరు పురావస్తు శాఖ మూసేసి, నీటి పారుదల శాఖకి షిఫ్ట్ కావడం బెటర్,” మెచ్చుకోలుగా అన్నాడు ఒక గ్రామీణుడు.

“అమ్మో, గుడిలో నా స్వామిని వదిలి చాలా రోజులు బయటే తిరుగుతున్నా. ఇంక నేను ఆగలేను,” అంటూ అక్కడి నుంచి మాయం అయ్యాడు పూజారి.

పురావస్తు శాఖ వారు తమ పలుగులు పారలు తీసుకుని అక్కడి నుంచి జెండా ఎత్తేశారు.

ఇప్పుడు చెప్పు విక్రమార్కా? కేవలం ఒక పూజారి కల ఆధారంగా ఇలాంటి నిర్ణయం గాంక్రెస్ ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? ఇప్పుడు దీని వల్ల ఎంత డబ్బు నష్టం, ఎంత పరువు నష్టం? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్ప లేక పోయావో, నీ తలలో ఒక కేజీ బంగారం ఉంది అని పాద దాసుకి చెప్తాను. ఆయనే నీ తల వెయ్యి ముక్కలు చేస్తాడు,” నవ్వుతూ అడిగాడు బేతాళుడు.

“నీ శ్యాడిజం తగలెయ్యా! ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కోట కింద తవ్వించడం వల్ల ఢిల్లీ అమ్మకి పెద్దగా నష్టం ఏమీ జరగలేదు. గవర్నమెంటు ఖర్చుతోనే ఆ పని జరిగింది. ఒక వేళ బంగారమే దొరికి ఉంటే, ఢిల్లీ అమ్మ విజ్ఞత గురించి, సింధూ పూజారుల మాట మీద ఆమెకి ఉన్న గౌరవం గురించి దిక్-అపయజ సింగ్ లాంటి వాళ్ళు దేశమంతా టముకు వేస్తూ తిరిగే వారు. దొరకలేదు కాబట్టి ఆ తప్పుడు నిర్ణయం జగన్‌మోహన్ సింగ్‌దే అని చేతులు దులుపుకుంటారు. సిగ్గూ శరం వదిలేసిన వాళ్ళే గాంక్రెస్‌లో చేరుతారు కనక, ఎలాంటి అపప్రథ వచ్చినా వాళ్ళు లెక్ఖ చేయరు,” బదులిచ్చాడు విక్రమార్కుడు.

ఆ సమాధానం కరెక్ట్ కావడంతో, అతని భుజం మీదనుంచి మాయమై మళ్ళీ చెట్టెక్కాడు బేతాళుడు. తృణమో ఫణమో ఇస్తే అన్ని సమస్యలకు పరిష్కారం చెప్ప గలిగే, ఆ ఊరులో కొత్తగా వెలసిన, సద్గురు బాబా దగ్గరకు పరిగెత్తాడు విక్రమార్కుడు.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

7 Responses to బంగారు కలలు (ఆధునిక బేతాళ కథలు – 3)

 1. Anuradha says:

  “తినకపోతే కుక్కుతాం” పథకం కింద పేద వారికి వంట సరుకులు ఇవ్వడం
  ఏదో మన దేశానికి డబ్బు అవసరం అన్ని కష్ట పడి కల కన్నాను నాయనా 🙂

 2. Siva Kumar K says:

  జంబూ ద్వీపంలో అసలు పేదరికం అనేది ఎప్పటికి అంతరించిపోకుండా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నారు —Nailed it…!!
  🙂

 3. Jitu says:

  Anndaru mee post lonche quote cheserukaabatti, aanavaiti tappakunda nanu chestunaanu.

  “సిగ్గూ శరం వదిలేసిన వాళ్ళే గాంక్రెస్‌లో చేరుతారు కనక, ఎలాంటి అపప్రథ వచ్చినా వాళ్ళు లెక్ఖ చేయరు.”

  The crux of the situation.

 4. Jitu says:

  Ayina, Congress chese panullo, idi o lekhenaa?

 5. swathi says:

  another good post

 6. suresh says:

  Really Rocks

 7. Mahesh says:

  గంక్రేస్ కూడా పట్టువదలని విక్రమార్కుడిలా దేశాన్ని పీడిస్తూనే ఉంది. చక్కటి వ్యంగ్య రచన 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s