గూఢచారి 232 – ఎయిర్ హిండియాలో ప్రయాణిస్తే ఆ కిక్కే వేరబ్బా!

శాతకర్ణి గారి సలహా ప్రకారం, మూడో తారీకున ఆదరా బాదరా వెళ్దామనుకున్నాడు కాబట్టి, రెండో తారీకు రోజు టికెట్ కొనుకున్నాడు 232. అలా అని రెండో తారీకుకే ఎయిర్‌పోర్ట్ వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఆ రోజు ఒకటో తారీకు ఫ్లైట్ వస్తుంది కాబట్టి. (పాఠకులకు ఈ లెక్ఖలు కాస్త గజిబిజిగా ఉండొచ్చు. కాని 232 అఖండ మేధావి కాబట్టి తేలికగానే ఈ సమస్యని అర్థం చేసుకున్నాడు.)

ఢిల్లీ నుంచి వెళ్ళే అతని ఫ్లైట్ రాత్రి పది గంటలకు ఉంది. కాబట్టి రెండో తారీకు టికెట్టు పుచ్చుకుని మూడో తారీకు రాత్రి 9 కి ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాడు 232.

ఎయిర్ హిండియా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తన టికెట్ ఇచ్చాడు. వెనకాల ఉన్న క్లర్క్ బద్ధకంగా దాన్ని అందుకుని, ఇంకా బధ్ధకంగా దాన్ని తిరగేసి చూసి, “ఇది నిన్నటి టికెట్,” విసుగ్గా అన్నాడు.

“నిన్నటి ఫ్లైట్ వచ్చిందా?” అడిగాడు 232.

“అప్పుడే ఎందుకు వస్తుంది? ఇంకాస్త టైం ఉంది.”

“ఐతే ఈ టికెట్ ఇంకా వాడుకోవచ్చు. బోర్డింగ్ పాస్ ఇవ్వండి,” చెప్పాడు 232.

“మీ రిజర్వేషన్ కన్‌ఫర్మ్ కాలేదు, మీరు ఈ ఫ్లైట్లో వెళ్ళలేరు.”

“సరిగ్గా చూడండి. ఇది కన్‌ఫర్మేడ్ టికెట్టే,” కాస్త గట్టిగా అన్నాడు 232. (ఎయిర్ హిండియా వాళ్ళు కావాలనే ఇలా బెదరిస్తారని కూడా శాతకర్ణి అతనికి చెప్పి ఉన్నాడు.)

“మీరు గవర్నమెంట్‌కి పని చేస్తారా?” అడిగాడు క్లర్క్.

“ఒక రకంగా అంతే!”

“అందుకే మీకు ఎయిర్ హిండియా రహస్యాలు తెలుసు. మాములు వాళ్ళు ఐతే మొదటి సారి మాతో ప్రయాణం చేసినప్పుడు టికెట్ కన్‌ఫర్మ్ కాలేదు అంటే ఘొల్లున ఏడుస్తూ వెళ్ళిపోతారు. కొంత డేరింగ్ ఎండ్ డాషింగ్ ఫెలోస్ ఒప్పుకోరు. మమ్మల్ని దబాయించి ఇక్కడే ఉండిపోతారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఒక రోజంతా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తారు. మీలా ఇలా తెలివిగా ఒక రోజు ఆలస్యంగా రారు.”

“మరి రెండో సారి ఏం చేస్తారు?” ఆసక్తిగా అడిగాడు 232.

“రెండో సారి అంటూ ఉండదు సార్! ఒక సారి మాతో ప్రయాణం చేశాక, ఇంకా ఎప్పుడు ఎయిర్ హిండియా జోలికి రారు. నిజం చెప్పాలంటే, ఓ రెండేళ్ళ వరకు అసలు విమాన ప్రయాణమే చేయరు. ఏ బస్సులో, లేదా ఎడ్ల బండ్లో వాడతారు,” గర్వంగా చెప్పాడు క్లర్క్.

232 దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఉండడంతో క్లర్క్ ఇచ్చిన బోర్డింగ్ పాస్ తీసుకుని, డైరెక్టుగా సెక్యూరిటీ వైపు అడుగులు వేశాడు 232. ఎక్కువ మంది ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్నట్టు లేరు. ఓ ఇరవయి మంది దాకా ఉన్నారంతే. అందులో ముగ్గురు బవిరి గెడ్డాలతో ఉన్నారు. వాళ్ళని కూసింత ఆసక్తిగా గమనించాడు 232.

ఆ ముగ్గురి ప్రవర్తన చాలా భిన్నంగా ఉంది. వాళ్ళ కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. వాళ్ళు మిగతా ప్రయాణీకులని పట్టించుకోవడం లేదు. పొడుగాటి కుర్తా పైజామాలు ధరించి ఉన్నారు.

“కొంప దీసి ఈ ప్లేన్ హైజాక్ చేయడానికి కానీ రాలేదు కద?” అనుకున్నాడు 232. మళ్ళీ తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. “ఛ ఛ అలాంటిదేమీ ఉండి ఉండదులే. ఐనా జంబూ ద్వీపం సెక్యూరిటీ చాలా సమర్థవంతమైంది. వీళ్ళ పప్పులు ఏమీ ఉడకవు. పైగా ఏమన్నా ఐతే చూసుకోవడానికి తాను ఉన్నాడు కూడా.”

సెక్యూరిటీ దగ్గర ఎయిర్ హిండియా సిబ్బంది ప్రయాణీకులని తనిఖీ చేసారు. దానికి వాళ్ళు అవలంబించిన విధానం, ప్రతి ప్రయాణీకుడిని కితకితలు పెట్టడమే.

“కి కిక్కీ, ఏంటి ఈ చెకింగ్?” నవ్వుతూనే అడిగాడు 232.

“ఇది మా సైకాలజిస్టులు కనుక్కున్నారు. ఉగ్రవాది ఐతే ఎంత కిత కితలు పెట్టినా నవ్వడు. నవ్వే వాళ్ళతో డేంజర్ లేదన్న మాట,” చెప్పాడు చక్కిలిగింతలు పెడుతున్న ఒక ఉద్యోగి.

“మీ తెలివి సంతకెళ్ళా! ఇంక ఆపండి, నవ్వి నవ్వి డొక్కలు నొప్పి పుడుతున్నాయి,” ఒగరుస్తూ చెప్పాడు 232.

అతనికి బవిరి గెడ్డాలు ఈ చక్కిలి గిలితో ఎలా డీల్ చేస్తారో అన్న ఆసక్తి కలిగింది. ఎందుకంటే వాళ్ళ మొహాల్లో ఎక్కడ నవ్వే లక్షణాలు కనపడలేదు అతనికి.

కానీ ఆశ్చర్యంగా బవిరి గెడ్డాలు కూడా చక్కిలి గింతలు పెట్ట బడగానే, గుర్రాల్లా సకిలించారు.

“అది నవ్వులా లేదుగా?” అనుమానంగా అడిగాడు 232.

“ఊరుకోండి సార్. ఒక్కొక్కరు ఒక్కోలా నవ్వుతారు. నవ్వారా లేదా అన్నదే ఇంపార్టంట్,” చెప్పాడు సిబ్బందిలో ఒకతను.

“ఈ చక్కిలిగింతల భయానికి సగం మంది వీళ్ళ ఫ్లైట్లలో ప్రయాణం చేయడం మానుకున్నారు,” గొణిగాడు నా వెనకాల ఉన్న ఒక పెద్దాయన.

“మరి మీకు భయం లేదా?” అడిగాడు 232.

“నాకు తప్పదు లెండి, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎయిర్ హిండియాలో ప్రయాణిస్తేనే రి-ఇంబర్స్ చేస్తారు.”

“మీరు కూడా గవర్నమెంటుకి పని చేస్తారా?”

“అవును!”

“ఓహో, ఇక్కడ నాన్-గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరూ లేరా?”

“ఎందుకు లేరు? అటు చూడండి,” అంటూ పెద్దాయాన చూపించిన వైపు చూశాడు 232.

ఇద్దరు ప్రయాణీకుల హాండ్ బాగ్స్‌ని మొత్తం ఖాళీ చేసి వాటిలో వస్తువులన్ని కింద పడేసి మరీ సోదా చేసినట్టున్నారు వేరే సిబ్బంది. ఐతే తిరిగి సర్దేటప్పుడు మాత్రం ఒకరి వస్తువులు ఇంకొకరి బ్యాగ్‌లో పెట్టేశారు.

దానితో ఆ ప్రయాణీకులు పిచ్చి మొహాలు వేసుకుని మళ్ళీ పక్కన నేల మీద కూర్చుని తమ తమ వస్తువులు గుర్తు పట్టి ఏరుకుని మళ్ళీ బాగుల్లో సర్దుకుంటునారు.

“మీకు వాళ్ళని చూస్తేనే అర్థమయి పోవాలి, వాళ్ళకిదే ఫస్ట్ టైం అని. ఎరక్క పోయి వచ్చారని,” చెప్పాడు పెద్దాయన.

మొత్తానికి సెక్యూరిటీ చెక్ తరువాత అందరూ ఆదరా బాదరాకి వెళ్ళే ఎయిర్ హిండియా విమానం టేక్ ఆఫ్ చేసే గేట్ వద్దకు చేరుకున్నారు.

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

4 Responses to గూఢచారి 232 – ఎయిర్ హిండియాలో ప్రయాణిస్తే ఆ కిక్కే వేరబ్బా!

  1. kiran_babu217@yahoo.com says:

    super like murali garu

  2. Siva Kumar K says:

    LOL 😉 😛

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s