గూఢచారి 232 – కబడ్డీ ఆడితే అసలు టైం తెలీదబ్బా!

గేట్ దగ్గరకి చేరుకున్నారు కాని కాబోయే ప్రయాణీకులకి రాబోయే ఫ్లైట్ కాదు కద, కనీసం ఏ సిబ్బంది కూడా కనపడ లేదు.

“ఏంటంతా ఖాళీగా ఉంది, టేక్ ఆఫ్ టైం అయ్యింది కద?” అడిగాడు 232 తనతో పాటూ ఉన్న పెద్దాయన్ని.

“మీకు తెలీనిదేముంది. ఇది నిన్న వెళ్ళాల్సిన ఫ్లైట్. ఆల్‌రెడీ 24 గంటలు ఆలస్యం. ఇప్పుడు మాత్రం ఠంచనుగా బయలుదేరుతుందని ఎలా అనుకున్నారు? మెల్లగా వస్తారు లెండి,” సమాధానమిచ్చాడు పెద్దాయన.

అందరూ ఒక అర్ధ గంట భారంగా గడిపారు. కానీ ఎయిర్ హిండియాకి సంబంధించిన ఒక్క పురుగు కూడా రాలేదు.

ఇంకో గంట తరువాత అందరి మొబైల్ ఫోన్స్‌లో చార్జ్ కూడా అయిపోయింది.

కొంతమంది బయటకి వెళ్దామని ప్రయత్నించారు. వాళ్ళని సెక్యూరిటీ ఆపేశారు.

“చెకింగ్ అయ్యాక బయటకి వెళ్ళలేరు,” కరకుగా చెప్పాడు ఒక ఆఫీసర్.

“కానీ గంటన్నర నుంచి ఎవరూ రాలేదు,” కంప్లెయిన్ చేశాడు ఒక ప్రయాణీకుడు.

“అదంతా మాకు తెలీదు. మీరు ఇక్కడే ఉండాలి,” చెప్పాడు ఆఫీసర్.

లాభం లేక అందరూ వెనక్కి వచ్చేశారు.

కొంతమదికి చేతులు కాళ్ళు వణకడం మొదలు పెట్టాయి.

“అయ్యయ్యో ఏమయ్యింది వీళ్ళకి?” ఆందోళనగా అడిగాడు 232.

“మొబైల్ ఫోన్ చార్జ్ అయిపోయింది కద, వాళ్ళకు కాళ్ళు చేతులు ఆడ్డం లేదు. ఎప్పుడూ మాట్లాడుతూనో, మెయిల్ చెక్ చేస్తూనో, బ్రౌసింగ్ చేస్తూనో, టెక్స్టింగ్ చేస్తూనో గడిపే వారు. ఇప్పుడు ఏం చేయాలో తెలీక ఇలా అయిపోతున్నారు,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు పెద్దాయన.

“ఇప్పుడు వీళ్ళ వణుకుడు ఆపాలంటే ఒకటే దారి!” గంభీరంగా అన్నాడు 232.

“ఏంటది? కాళ్ళూ చేతులూ కదలకుండా కట్టేయ్యడమా?” ఆసక్తిగా అడిగాడు పెద్దాయన.

“కాదు, ఏదైనా ఆటలు ఆడి వాళ్ళ మనసు మళ్ళించాలి. డిస్ట్రాక్ట్ చేయాలి,” చెప్పాడు 232.

“ఐడియా బాగానే ఉంది, కానీ ఏం ఆట ఆడాలి?”

“అది అందరినీ అడిగి కనుక్కుందాం,” అంటూ 232, మిగతా ప్రయాణీకుల వైపు తిరిగి, “డియర్ ఫ్రెండ్స్, నాదొక సజెషన్. ఈ ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో ఎవరికీ తెలీదు. ఎలాగూ మీ మొబైల్ ఫోన్స్ లో కూడా చార్జ్ అయిపోయింది కాబట్టి, మనందరం ఏవైనా గేంస్ ఆడదాం,” అన్నాడు.

అక్కడ ఉన్న వారిలో ఒకాయన తన గొంతు సవరించుకున్నాడు. “నేను వృత్తి రీత్యా ఒక సైకాలజిస్ట్‌ని. ఇలా గేంస్ ఆడ్డం మంచిది కాదు. మనం ఉదయం నిద్ర లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు రక రకాలా అబద్ధాలు చెప్తూ ఉంటాం. గేంస్ ఆడుతూ ఉంటాం. కొన్ని సార్లు అలా చేయడం తప్పదు. ఐతే అవసరం లేనప్పుడు కూడా గేంస్ ఆడ్డం మంచిది కాదు. దీని గురించి జంగ్ అనే మానసిక శాస్త్రవేత్త ఏమన్నాడంటే..”

ఆయన్ని మధ్యలోనే కట్ చేశాడు 232. “నేను చెప్పేవి ఆ గేంస్ కావండి. టైం పాస్ కావడానికి ఆడుకునే గేంస్ ఏవైనా. ఉదాహరణకు అంత్యాక్షరి లాంటివి,” కాస్త విసుగ్గా చెప్పాడు.

“ఓ! ఆ గేంసా. అలా ఐతే కాస్త వొళ్ళు కదిలించే గేంస్ ఆడ్డం బెటర్ కద. వ్యాయమం గురించి దారా సింగ్ ఏమన్నాడంటే…”

“మీరు చెప్పినట్టే చేద్దాం. ఏ ఆట ఆడదాం అంటారు?” గబ గబా అడిగేశాడు 232.

“ఇక్కడ ఏం ఆట ఆడతాం! ఏ కబడ్డీనో, కోతీ కొమ్మచ్చో ఆడాలి, ” కాస్త నిరుత్సాహంగా అన్నాడు ఆయన. దార సింగ్ అభిప్రాయాలు తనని చెప్పనివ్వలేదన్న బాధ స్పష్టంగా కనపడింది ఆయన మొహంలో.

“ఇక్కడ ఎంత మందికి కబడ్డి ఆట తెలుసు, ఎంత మందికి కోతీ కొమ్మచ్చి ఆట తెలుసు?” అందరినీ అడిగాడు 232.

చాలా మందికి కబడ్డీ ఆటే తెలుసని నిర్ణయింపబడింది.

“సరే కబడ్డీనే ఆడదాం. దీనికి మొత్తం రెండు జట్లు కావాలి,” చెప్పాడు 232.

“ఏ ఏ జట్టులో ఎవరుండాలో కూడా మీరే చెప్పండి,” అన్నాడు ఒకాయన.

“అలాగే అంటూ,” అక్కడున్న 21 మందిని రెండు జట్లుగా విభజించాడు 232. ఎందుకైనా మంచిది అని, బవిరి గడ్డాలందరినీ ఒకే జట్టులో పెట్టాడు. మొత్తానికి ఒక్కో జట్టులో పది మంది లెక్ఖ తేలారు.

“మరి నేను ఏ జట్టు?” అడిగాడు సైకాలజిస్ట్.

“మీరు అంపైర్,” చెప్పాడు 232.

“నేనెందుకు అంపైర్? ఆ గడ్డం వాళ్ళల్లో ఎవర్నైనా పెట్టొచ్చుగా?”

“మీకున్నంత వైడ్ నాలెడ్జ్ వాళ్ళకుండే చాన్సు లేదండి. మీకైతే కబడ్డి ఆట రూల్సే కాదు, అసలు కబడ్డి ఆట గురించి మన వ్యాస మహర్షి ఏం చెప్పాడో కూడా తెలిసి ఉంటుంది.”

“అంతే అంటావా?” కన్విన్స్ అయిపోయాడు సైకాలజిస్ట్.

జట్లు ఈ విధంగా ఉన్నాయి.

మొదటి జట్టులో: 232, పెద్దాయన, మొదటి సారి ఎయిర్ హిండియాలో ప్రయాణం చేస్తున్న ఇద్దరు ప్రయాణీకులు (ఒకరు పొడుగ్గా ఇంకొకరు పొట్టిగా ఉండడంతో వాళ్ళిద్దరికి లంబు జంబు అని తన మనసులోనే నామకరణం చేశాడు 232), సదానంద్, రాజేశ్, యాదగిరి, మల్లేశ్, మన్మోహన్ దాస్, సీతారాం ( వీళ్ళంతా సెంట్రల్ గవర్న్మెంట్ ఉద్యోగులు) మెంబర్స్ ఐతే,

రెండో జట్టులో: ముగ్గురు బవిరి గడ్డాలు, రవి కిరణ్, కణ్ణన్, రాధేశ్యాం, రమణా, శ్రీనివాస్, హనుమంత రావు, మహేంద్ర (వీళ్ళందరూ అంధేరా ప్రదేశ్ విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఢిల్లీలో ఏదో కాంఫరెన్స్ అటెండ్ అయ్యి ఆదరాబాదరాకి తిరిగి వెళ్తున్నారు) ఉన్నారు.

అక్కడ వెయిటింగ్ ఏరియానే కబడ్డి బరిగా మార్చేసి, తమ చెప్పులతో మధ్యలో లైన్ సృష్టించి, ఆట మొదలు పెట్టారు.

ముందుగా 232నే బరిలోకి దిగాడు. “కబడ్డి కబడ్డి,” అని కూత పెట్టుకుంటూ ముందుకు కదిలాడు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

One Response to గూఢచారి 232 – కబడ్డీ ఆడితే అసలు టైం తెలీదబ్బా!

  1. ఆట ఆరంభం కాకముందే ఆసక్తి రేకెత్తించింది. ఆట నడుస్తోంది. కూతలు పెడుతున్నారు. కొంతమంది వాళ్ళవాళ్ళ కారణాలతో వాకౌట్ చేస్తున్నారు కూతపెట్టే ‘ దమ్ము ‘ చాలక. క్షమించాలి. తెలుగు సినిమాలు చూసి రాబోయే సీనులు ఊహించటం, ఊహించినవి అలాగే రావటం అలవాటుగా మారినందువలన ఈ తొందరపాటు. మీ కధనకుతూహలానికి చక్కని ఆలాపన.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s