గూఢచారి 232 – చేస్తాం, హైజాక్ చేస్తాం

(పాకిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.)

(సాధారణంగా ఇలాంటి సీరియల్స్ రాసేప్పుడు, ప్రతి కొత్త భాగం ముందు జరిగిన కథ అని అప్పటి వరకు జరిగిన కథని సంక్షిప్తంగా చెప్తారు. అలా కాకుండా పాఠకులకోసం పాకిన కథ అని ఎందుకు రాశానో విజ్ఞులకు అర్థమయి ఉంటుంది.)

(ఈ పాకిన కథని, మరీ దేకిన కథ కాకుండా త్వర త్వరగా రాస్తానని ఒక ఉచిత హామీ కూడా పారేస్తున్నా.)

(ఇక చదవండి.)
———————————————————————————————————————–
ఫ్లైట్‌లోకి ప్రవేశించిన ప్రయాణీకులకు అపురూపమైన స్వాగతం లభించింది. ఎంట్రన్స్ దగ్గర ఎవరూ లేరు.

కాస్త కన్‌ఫ్యూజ్ అయ్యాడు 232. “ఎయిర్ హోస్టెసులు ఏరీ? ఇక్కడే నిల్చుని మనల్ని ఆహ్వానించాలి కద?” అడిగాడు పెద్దాయన్ని.

“ఎయిర్ హోస్టెస్సులని వదిలెయ్యండి. పైలట్లు ఉన్నారు అదే పది వేలు. మీరు ఎయిర్ హిండియా
హోస్టెసుల నుంచి మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు,” చెప్పాడు పెద్దాయన.

ఐతే నిజానికి ఎయిర్ హోస్టెసులు ఉన్నారు. ఐతే వెనకాల ఉన్న సీట్లలో నిద్ర పోతూ గురకలు పెడుతున్నారు. ఏ ఒక్కరి వయసూ 50 ఏళ్ళకి తక్కువ లేదు.

“పాపం, బాగా అలసి పోయినట్టున్నారు”, అన్నాదు సీతారాం.

“అలసిపోవడం ఏంటి, ఇది వాళ్ళకి డ్యూటీ టైం ఐతేనూ?” చిరాకుగా అన్నాడు హనుమంతరావు.

ఈ మాటలకి ఎయిర్ హోస్టెస్సులకి మెలుకువ వచ్చినట్టుంది. వారిలో అందరికంటే లావుగా ఉన్న ఒక పెద్దావిడ విసుక్కుంది, “ఏంటి ఈ గొడవ, నిద్ర పోతూంటే,” అంటూ.

“అదేంటండీ అలా అంటారు? మేము ప్రయాణీకులం,” కోపంగా అన్నాడు సదానంద్.

“ఆ! వచ్చారు లేవయ్యా, పెద్ద ప్రయాణీకులు. ఏం? మీరు రాకుంటే మా ఫ్లైట్లు ఎగరవనుకుంటున్నారా?” చిరాకుగా అంది ఇంకో ఎయిర్ హోస్టెస్.

“ఏందమ్మో, ప్యాసెంజర్స్ రాకుంటే మీ బిజినెస్ ఎట్ల నడుస్తది?” గదిమాడు యాదగిరి.

“హ హ హ. ఎయిర్ హిండియా ప్రభుత్వ సంస్థ. నీకు బొత్తిగా సోషలిజం గురించి తెలీదనుకుంటా. నష్టాలొచ్చినా మా కంపెనీ మూత బడదు. ఇష్టముంటే రండి, లేకపోతే లేదు. ఒక వేళ వస్తే కాళ్ళూ చేతులకు అడ్డు పడకుండా ఒక మూల నిల్చోండి లేదా కూర్చోండి,” అని చెప్పి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయింది.

భోరున ఏడ్చాడు యాదగిరి. అందరూ ఖంగారు పడ్డారు.

“అదేందన్నా అట్ల ఏడుస్తున్నావు, ఏం జరిగింది?” అడిగాడు రాజేశ్.

“చూడు తమ్మీ. నన్ను కూరలో కరివేపాకులా ఎట్ల తీసి పారేసిందో? మా వూర్ల నాకు ఎంత ఇజ్జత్ ఇస్తారు!” గద్గదంగా అన్నాడు యాదగిరి.

“ఎయిర్ హిండియాలో ప్రయాణం చేయాలంటే గుండె నిబ్బరం చేసుకోవాలి బాబు,” ఊరడించాడు పెద్దాయన.

చేసేది ఏమీ లేక ప్రయాణీకులంతా వాళ్ళ సీట్లు వెదుకున్నారు. ఆల్‌రెడీ బోలెడు ఆలస్యం అయ్యింది కనుక వెంటనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే నిద్ర పోదామని కొందరు రెడీ అయ్యారు. కానీ గంట అయినా ఫ్లైట్ ఎగిరే సూచనలు ఏవీ కనిపించలేదు.

కాసేపయ్యాక ధైర్యం చేసుకుని మన్‌మోహన్ దాస్ ఒక ఎయిర్ హోస్టెస్‌ని నిద్ర లేపాడు.

“అబ్బబ్బా మీతో చచ్చి పోతున్నాం. మళ్ళీ ఏం వచ్చింది?” విసుక్కుంది ఆవిడ.

“రావడం కాదండి, పోవడం లేదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడం లేదు,” వినయంగా చెప్పాడు మన్‌మోహన్.

“మీరు ఫ్లైట్ ఎక్కి ఎంత సేపయ్యింది?”

“గంట అయినట్టుందండి.”

“మరి అప్పుడే టేక్ ఆఫ్ ఎలా అవుతుంది? అది మా సాంప్రదాయాలకే విరుద్ధం. కనీసం ఒక రెండు గంటలన్నా ప్యాసెంజర్స్‌ని వెయిట్ చేయించనిదే మా పైలట్లు కంట్రోల్స్ ముట్టుకోరు,” వివరించి మళ్ళీ నిద్రలోకి జారుకుంది ఆవిడ.

అప్పటి వరకు ఏం జరుగుతున్నా తమకు పట్టనట్టు ఉన్న బవిరి గడ్డాల్లో కూడా మొదటి సారి కాస్త అసహనం కనిపించింది. ఆ చిరాకును సునిశితమైన 232 కళ్ళు వెంటనే పసిగట్టాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టే అతని సెవెంత్ సెన్స్ అలారం బెల్స్ మోగించడం మొదలు పెట్టింది.

“నాకెందుకో వీరిని చూస్తూంటే అనుమానంగా ఉంది మేస్టారూ,” పక్కనే కూర్చుని ఉన్న పెద్దాయన చెవులు కొరికాడు 232.

“ఏమని?”

“వీరి వాలకం చూస్తూంటే ఈ ఫ్లైట్‌ని హైజాక్ చేయడానికి వచ్చిన వారిలా అనిపిస్తూంది.”

“మరి ఇంతకు ముందు సెక్యూరిటీ చెక్‌లో కిత కితలు పెట్టినప్పుడు వీళ్ళు కూడా నవ్వారు కద! ఉగ్ర వాదులైతే నవ్వరట కద?”

“మీరు ఈ ఎయిర్ హిండియా నిర్వాకం చూశారు కద. వాళ్ళలో ఎవరో పనికి రాని సైకాలజిస్ట్ అలా చెప్పి ఉంటాడు. వీళ్ళు ఫ్లైట్ కిడ్నాప్ చేయడానికే వచ్చారని నా సెవెంత్ సెన్స్ ఘోషిస్తూంది.”

“సెవెంత్ సెన్సా? సిక్స్త్ సెన్స్ కాదా? ”

“టాపిక్ డైవర్ట్ చేయకండి. మనం వీళ్ళని ఎలాగైనా ఆపాలి.”

“అంతగా ఆపాలి అనుకుంటే నువ్వు ఆపు బాబు. నేను నిద్ర పోతాను.”

“నిద్ర పోతారా? ఇంత ప్రమాదం పెట్టుకుని?”

“అవును, మా బాబా గారు చెప్పారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కోలేకపోతే, కనీసం వేరే మంచి పని ఏదైనా చేయమని. నాకు తెలిసిన మంచి పని ఇదే!”

“నిజం?”

“అవును. బాబా గారు రోజుకి 22 గంటలు నిద్ర పోతూంటారు. మెలకువగా ఉన్నప్పుడు ఈ సూక్తి చెప్పి మళ్ళీ పడుకున్నారు.”

ఇక పెద్దాయనతో లాభం లేదు, ఏది చేసినా, తనే చేయాలి అనుకున్నాడు 232.

ఇంకో గంట భారంగా గడిచింది. చేసిన ఆలస్యానికి సంతోషించినట్టున్నారు, ఎయిర్ హిండియా సిబ్బంది ఎట్టకేలకు ఫ్లైట్ టేక్-ఆఫ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఫ్లైట్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి (ఫ్లైట్ ఇంకా అంబరంలోకి ఎగరలేదనుకోండి). ప్రయాణీకులు ఒకరినొకరు విష్ చేసుకున్నారు.

“ఈ రోజు చూస్తానని అనుకోలేదు,” గద్గదమైన స్వరంతో అన్నాడు రాధేశ్యాం.

“ఫ్లైట్ టేక్-ఆఫ్ కాబోతూంది అంటేనే నా ఒళ్ళు కరెంట్ షాక్ కొట్టినట్టు జలదరిస్తూంది,” అన్నాడు మహేంద్ర.

ఆఖరికి బవిరి గడ్డాలు కూడా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎయిర్ హిండియా ఫ్లైట్ టేక్-ఆఫ్ చేసింది. ఫ్లైట్ కావల్సిన ఎత్తుకి చేరుకోగానే, పైలట్ యొక్క అనౌన్స్‌మెంట్ మొదలయ్యింది.

“Ladies and Gentlemen and all the Air Hindiya employees on this flight, thanks for flying Air HimDiya. Your bravery is appreciated and noted. Make yourselves comfortable if you can. Please don’t get in the way of our employees and let them perform their duties if they want to. God willing, the flight will reach Aadara Baadaraa in 2 hours. Thank you!”

ఇక ఒక నిముషం కూడా ఆలస్యం చేయడం ఇష్టం లేనట్టు చటుక్కున లేచి నిలబడ్డారు బవిరి గడ్డాలు. అందరికంటే పెద్ద గడ్డం ఉన్న వ్యక్తి, “ఎవరు కదలకండి, మేము ఈ ఫ్లైట్‌ని హైజాక్ చేస్తున్నాం,” అంటూ గట్టిగా అరిచాడు.

“ఇంకా టేక్-ఆఫ్ అయి ఐదు నిముషాలు కూడా కాలేదు. అప్పుడే హైజాకా? నహీ!” ఘొల్లుమన్నాడు పెద్దాయన.

“నే చెప్తే విన్నారా? నాకు తెలుసు ఈ గడ్డపు వెధవలు ఇలాంటి పని ఏదో ఒకటి చేస్తారని,” నిష్టూరంగా అన్నాడు 232.

మిగిలిన ప్రయాణీకులు కూడా హాహాకారాలు చేశారు.

“పోనీ, ఆ జూసులూ, గట్రా ఏవో ఇస్తారు కద, అవి తాగాక చేద్దామా?” సజెస్ట్ చేశాడు, బవిరి గడ్డాల్లో మధ్య సైజు గడ్డం ఉన్నతను.

“నోరు మూయి. ఇదేమన్న పిక్నిక్ అనుకున్నావా? రిఫ్రెష్‌మెంట్స్ ఇచ్చేవరకూ ఆగడానికి. హైజాక్. అహ్హహ్హ!” వికటాట్టహాసం చేసాడు పెద్ద గడ్డం.

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

4 Responses to గూఢచారి 232 – చేస్తాం, హైజాక్ చేస్తాం

 1. Siva Kumar K says:

  😉 😀

 2. karthik says:

  “పోనీ, ఆ జూసులూ, గట్రా ఏవో ఇస్తారు కద, అవి తాగాక చేద్దామా?” సజెస్ట్ చేశాదు, బవిరి గడ్డాల్లో మధ్య సైజు గడ్డం ఉన్నతను

  kevvest 😀

 3. భలే రాశారండీ. సూపరసలు. అసలు పేర్ల కంటే మీరు పెట్టే కొసరు పేర్లే భలేగుంటాయండీ 😉

 4. ఇంతేనా..!!?? ఇంకా ఉందా..!!!

  బలే దేకింది కథ, అదే సాగింది గా… 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s