గూఢచారి 232 – ఎరక్క పోయి వచ్చాము, ఇరుక్కుపోయాము!

(జరిగిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.

232 అనుమానించినట్టే, ఫ్లైట్ టేక్-ఆఫ్ కాగానే ఆ ముగ్గురు ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఆశ్చర్యంగా వారు ముగ్గురూ రాణిమండ్రిలో పుట్టిన తెగులు వారే. హిండియా ఎలాంటి కాంప్రమైజ్‌కి తయారుగా ఉన్నా, తాము హైజాక్ చేయడం మాని ఉండే వారం కాదని, ఒక కారణం కాకపోతే ఇంకొక కారణం సృష్టించుకుని అయినా హైజాక్ చేసి తీరే వారమని చెప్తూ, పైలట్లు ఉన్న కాక్‌పిట్ వైపు బయలుదేరుతారు గడ్డాలు.
)

ఉగ్ర వాదులు ఒక పది అడుగులు కాక్‌పిట్ వైపు వేశారో లేదో, ఒక్క సారి ప్లేన్ ఉధృతంగా అటూ ఇటూ ఊగిపోయింది. గడ్డాలు ముగ్గురూ పట్టు తప్పి దబ్బున కింద పడ్డారు.

“వామ్మో ఇదేంటి? మనం హైజాక్ చేస్తున్నాం అన్న సంగతి తెలీక, ఇంకెవరన్నా అహ్మదీయ సోదరులు ఏ బజూకాతోనో కొట్టారంటావా?” అడిగాడు చిన్న గడ్డం.

“నహీ! నేనొప్పుకోను. ఈ హైజాకింగ్ మనది. బాంబులు వేసినా, బజూకాలు వేసినా మనమే వెయ్యాలి,” కోపంగా అరిచాడు మధ్య గడ్డం.

“ఓరి త్రాష్టుల్లారా, ఈ ప్లేన్ మీ అబ్బ సొత్తు కాదురా, బాంబులు, బరిసెలు వేసుకోవడానికి,” తనలో తాను పళ్ళు కొరుక్కుంటూ అనుకున్నాడు 232.

“నిజంగా బజూకా వేసి ఉంటే, ఈ పాటికి దేవుడికి ప్రీత్రి పాత్రులం అయ్యుండే వాళ్ళం. ఏదో ఒడిదుడుకు, అదే టర్బులెన్స్ వల్ల ప్లేన్ ఊగినట్టుంది,” సంగతి అర్థం చేసుకున్న పెద్ద గడ్డం చెప్పాడు.

“దేవుడికి ప్రీతిపాత్రం కావడం ఏంటండి? వీళ్ళు మాట్లాడేది త్రిలింగ భాషేనా?” 232 చెవుల్లో గుస గుసలాడాడు పెద్దాయన.

“దేవుడికి ప్రీతిపాత్రం కావడం అంటే దేవుడిని చేరుకోవడం అని, అంటే చావడం అని అర్థం,” తను కూడా గుస గుసలతోనే సమాధానం ఇచ్చాడు 232.

“ఓహో, ఇంకా తాము చావలేదు కాబట్టి, బజూకా అయ్యుండదు అని ఆయన కన్‌క్లూజనా?”

“అంతే, అంతే.”

లేచి నిలబడ్డానికి ప్రయత్నం చేసిన ప్రతి సారి, ప్లేను ఊగడం, మళ్ళీ అందరూ ఢామ్మని పడిపోవడం జరిగింది.

“ఐనా వెదర్ చెక్ చేశాం కద, వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని, కనీసం చెదురు మదురు జల్లులు కూడా ఉండవని చెప్పారు కద,” సాలోచంగా గడ్డం గీక్కుంటూ అన్నాడు పెద్ద గడ్డం.

సీతారాం చేయెత్తాడు.

“ఎందుకు చేయెత్తావు, ఏం కావాలి?” గద్దించాడు మధ్య గడ్డం.

“అంటే ఆయన ఏదో ప్రశ్న అడిగాడు కద, సమాధానం తెలిసి ఉంటే చేయెత్తడం చిన్నప్పటినుండి అలవాటైపోయింది.”

“ఓహో, ఐతే చెప్పు.”

“వాతావరణానికి, విమానం ఊగడానికి ఏం సంబంధం లేదండి. ఎయిర్ హిండియా పైలట్లు ఎలాంటి వాతావరణం అయినా ఇలానే నడుపుతారు.”

“నిజమా?”

“అవునండి. అప్పుడప్పుడు పైలట్ తూలి కంట్రోల్స్ మీద పడతాడు. అప్పుడప్పుడు కో-పైలట్ తూలి కంట్రోల్స్ మీద పడతాడు. అప్పుడప్పుడు ఇద్దరు తూలి కంట్రోల్స్ మీద పడుతారు…”

“అర్థమయ్యింది, ఇక చాలు. ఐనా ఫ్లైట్‌లో నిద్ర పోవడమేంటి అసహ్యంగా?”

“తమ విలువైన సమయాన్ని బయట ఉన్నప్పుడు నిద్ర పోవడానికి వాడడం వాళ్ళకి ఇష్టం ఉండదండి.”

“కాబట్టి ఇలా మనని పైకి పంపించే ప్రయత్నం చేస్తారన్న మాట.”

“ఏమోనండి.”

“అన్నా! ఈ పైలట్ నాయాళ్ళు, కాసేపు తూలకుండా ఉంటే మనం కాక్‌పిట్ చేరుకోవచ్చు. అప్పుడు వాళ్ళ పని పడదాం,” కసిగా అన్నాడు చిన్న గడ్డం.

“బాగా చెప్పావు తమ్ముడూ. కానీ మరీ ప్లేన్ నడపలేనంత ఇదిగా చావగొట్టొద్దు. ఇంకొన్ని గంటలు వాళ్ళు మనకి కావాలి. అప్పటివరకు మెల్లగా పాకుతూ వెళ్దాం,” సజెస్ట్ చేశాడు పెద్ద గడ్డం.

ముగ్గురు గడ్డాలు గన్‌లతో సహా పాకుతూ కాక్‌పిట్ వైపు బయలు దేరారు. సరిగ్గా అరగంట తరువాత వారు కాక్‌పిట్ చేరుకున్నారు. గోడలను ఆసరా చేసుకుని కష్టంగా లేచి నిలబడ్డారు. అప్పటి వరకు 232తో సహా మిగిలిన ప్రయాణీకులంతా ఈ దృశ్యన్ని సరదాగా వీక్షించారు.

కాక్‌పిట్ తలుపు పట్టుకుని గట్టిగా లాగాడు పెద్ద గడ్డం. లాక్ చేసినట్టు లేదు. వెంటనే తెరుచుకుంది. లోపల ఎయిర్ హిండియా యూనిఫారంలో ఉన్న ఇద్దరు పైలట్లు, సీతారాం చెప్పినట్టుగానే, కునికిపాట్లు పడుతున్నారు.

“మీ అమ్మా కడుపులు మాడా! దరిద్రుల్లారా! ఈ గవర్నమెంట్ సంస్థలు ఎలా పని చేస్తాయో తెలిసి కూడా ఎయిర్ హిండియా ఫ్లైట్ హైజాక్ చేయడం మాదే బుద్ధి తక్కువ. మాటి మాటికి ఆ కంట్రోల్స్ మీద పడడం ఏంట్రా? మరీ డ్యూటీ అంటే ఇంత అశ్రద్ధా!” గట్టిగా అరిచాడు పెద్ద గడ్డం.

“మరి కంట్రోల్స్ మీద కాకుండా పక్కకు పడ్డామంటే, కింద పడి తల బొప్పి కడుతుంది. అందుకే కంట్రోల్స్ మీద తెలివిగా పడుతూంటాం.,’ చెప్ప్పాడు వారిలో కాస్త పెద్ద వయస్కుడిలా కనిపిస్తున్న ఒక పైలట్.

“ఛీ, సిగ్గు లేకపోతే సరి! మేము ఈ ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నాం. హ్యాండ్స్ అప్!” అరిచాడు పెద్ద గడ్డం. ఇద్దరు పైలట్లు చేతులు పైకెత్తారు.

“భాయి, స్టీరింగ్ వదిలేసి చేతులు పైకెత్తారు. ప్లేన్ పడిపోతుందేమో,” ఆందోళనగా అన్నాడు చిన్న గడ్డం.

“మళ్ళీ ఛీ! ఇదేమన్నా నువ్వు నడిపే ఆటో అనుకున్నావా? ప్లేన్‌రా, ప్లేన్! ఇదిగో, మీ కంట్రోల్ టవర్‌కి కాల్ చేయండి. మిమ్మల్నీ, ప్రయాణీకుల్నీ, వదిలి పెట్టాలంటే, మా షరతులు చెప్పాలి,” గద్దించాడు పెద్ద గడ్డం.

“మేము సాధారణంగా ల్యాండ్ చేసేప్పుడే కంట్రోల్ టవర్‌కి కాల్ చేస్తామండి. వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో?” అనుమానం వెలిబుచ్చాడు చిన్న పైలట్.

“హైజాక్ చేయబడ్డాం అని చెప్పండి. వెంటనే వాళ్ళే స్పందిస్తారు,” గంభీరంగా అన్నాడు పెద్ద గడ్డం.

“ఏమో సార్, టేక్-ఆఫ్‌కి ముందు ప్రయాణీకుల లిస్ట్ చూశాను. కనీసం ఒక ఎం.ఎల్.ఏ. కొడుకు కూడా ట్రావెల్ చేయడంలేదు. అసలు పట్టించుకుంటారో లేదో! సరే లెండి, మీరు చెప్పినట్టే కాల్ చేస్తున్నా,” అంటూ కంట్రోల్ టవర్‌కి కనెక్ట్ చేశాడు పెద్ద పైలట్.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232, సీరియల్స్. Bookmark the permalink.

4 Responses to గూఢచారి 232 – ఎరక్క పోయి వచ్చాము, ఇరుక్కుపోయాము!

 1. Siva Kumar K says:

  కంట్రోల్స్ మీద తెలివిగా పడుతూంటాం ——— 😀 😀 😀

  Nice as usual…!!

 2. karthik says:

  పాకిన కథ అని కదా ఉండాలి? జరిగిన కథగా ఎందుకు మార్చారు? ఎలాగూ మన గడ్డం బాబాయిలు పాకుతూ వెళ్ళి హైజాక్ చేశారు..

  • Murali says:

   ఇంసల్ట్! నేను పాకిన కథ అని జోక్ వేసుకుంటే మీరు కూడా వేసేస్తారా? హన్న!

   • Jitu says:

    यथा भूमिस्तथा तोयं, यथा बीजं तथाऽङ्कुरः ।
    यथा देशस्तथा भाषा, यथा राजा तथा प्रजा ॥

    😀 😀 😀

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s