గూఢచారి 232 – మీ షరతులు పరిశీలుస్తున్నాం. కాస్త ఓపిక పట్టండి.

(
జరిగిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.

232 అనుమానించినట్టే, ఫ్లైట్ టేక్-ఆఫ్ కాగానే ఆ ముగ్గురు ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఆశ్చర్యంగా వారు ముగ్గురూ రాణిమండ్రిలో పుట్టిన తెగులు వారే. హిండియా ఎలాంటి కాంప్రమైజ్‌కి తయారుగా ఉన్నా, తాము హైజాక్ చేయడం మాని ఉండే వారం కాదని, ఒక కారణం కాకపోతే ఇంకొక కారణం సృష్టించుకుని అయినా హైజాక్ చేసి తీరే వారమని చెప్తూ, పైలట్లు ఉన్న కాక్‌పిట్ వైపు బయలుదేరుతారు గడ్డాలు.

కాక్‌పిట్ చేరుకున్నాక అక్కడ పైలట్ల పని తీరు చూసి కోపగించుకుంటారు. ఆ తరువాత తమ షరతులు తెలియజేయడం కోసం కంట్రోల్ టవర్‌కి కనెక్ట్ చేయమంటారు. ఉగ్రవాదుల షరతులని తెలుసుకున్న కంట్రోల్ టవర్ అధికారి రామకోటి విషయాన్ని హోం మినిస్టర్‌కి చేరవేస్తాను అని హామీ ఇస్తాడు.

ఇక చదవండి.
)

“రెండు గంటలు అంటే చాలా టైం ఉంది. అసలే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసి చాలా సేపు అయ్యింది. పాపం ప్రయాణీకులు కూడా టెన్షన్లో ఉన్నారు. మరి ఎయిర్ హోస్టెస్‌లని డ్రింక్స్/స్నాక్స్ సర్వ్ చేయమని చెప్పమంటారా?” వినయంగా అడిగాడు పెద్ద పైలట్.

సరే అన్నట్టు తల ఊపాడు పెద్ద గడ్డం.

“అన్నోయి, ఇంకా ఈ సంప్రదింపులకి ఎంత టైం పడుతుందో మనకు తెలీదు. ఉన్న తిండి పదార్థాలని జాగ్రత్తగా వాడుకోవడం మంచిది,” వారించాడు మధ్య గడ్డం.

“బాగా చెప్పావు భాయ్,” అన్నాడు చిన్న గడ్డం.

“ఫుడ్ కంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఫ్యూయెల్ గురించి హైజాకర్ గారు. ఆదరా బాదరాకి ఇంకో అర గంటలో వచ్చేస్తాం. ఒక వేళ ఇలానే ల్యాండ్ కాకుండా గాలిలోనే చక్కర్లు కొట్టినా ఇంకో గంటలో ఫ్యూయెల్ అయిపోతుంది. మన దగ్గర ఫుడ్ ఇంకో మూడు మీల్స్‌కి సరిపోతుంది. కాబట్టి ఫుడ్ కంటె ఫ్యూయెల్ గురించి ఆలోచించండి,” చెప్పాడు చిన్న పైలట్.

“అంటే మనకు సమాధానం తెలిసేంతలో ఫ్యూయెల్ ట్యాంక్ ఖాళీ అన్న మాట. ఇందుకేనా ఆ రామకోటి గాడు, రెండు గంటలు టైం అడిగాడు?” కోపంగా అరిచాడు పెద్ద గడ్డం.

“ఆయనకి అంత తెలివితేటలు లేవు లెండి. మా గవర్నమెంటుతో దేనికైనా బోలెడు టైం పడుతుంది. అంతే. ఇంతకీ ఫ్యూయెల్ గురించి ఏం చెయ్యమంటారు?”

“మనం ముందుగా ఎక్కడన్నా ల్యాండ్ అయి ఫ్యూయెల్‌ని కాపాడుకోవాలి. దగ్గర్లో ఏదైనా ఎయిర్‌పోర్ట్ ఉందా?”

“ఎక్కడ పడితే అక్కడ ఎయిర్‌పోర్ట్ ఉండడానికి ఇదేమన్న అరెమికానా సార్? కావాలంటే మనం తిరిగి డిల్లీకి వెళ్ళొచ్చు.”

“మనం ముందుకే పోదాం. ఆదరా బాదరా పాత ఎయిర్ పోర్ట్ ఆగంపేట్ ఉంది కద. అటు వైపు వెళ్ళండి,” హుకుం జారీ చేశాడు పెద్ద గడ్డం.

“నువ్వు సూపర్, అన్నా. ఆ హంసాబాద్ ఎయిర్‌పోర్ట్ వచ్చాక దీని గురించే మర్చి పోయాను,” మెచ్చుకున్నాడు మధ్య గడ్డం.

“సర్లే. మీరిద్దరూ వెళ్ళి ప్రయాణీకులకి స్నాక్స్ డ్రింక్స్ ఇవ్వమని ఎయిర్ హోస్టెస్‌లకు పురమాయించండి,” అన్నాడు పెద్ద గడ్డం.

చిన్న గడ్డం, మధ్య గడ్డం బయటకు వెళ్ళి ఎయిర్ హోస్టెస్‌ల కోసం వెదికారు. నలుగురు ఎయిర్ హోస్టెస్‌లు వారికి ఆఖరి వరుసలో నిద్ర పోతూ కనిపించారు.

“లేవండి, లేవండి! ప్రయాణీకులకు రిఫ్రెష్మెంట్స్ సర్వ్ చేయండి,” గద్దించాడు చిన్న గడ్డం.

బద్ధకంగా కళ్ళు నులుముకుంటూ లేచారు ఎయిర్ హోస్టెస్‌లు. “ఎవరయ్యా నువ్వు? ఆఖరికి మా పైలట్ సాబే మాకు ఇలా ఆర్డర్స్ ఇవ్వడు. నీ అరుపులేమిటి?” అడిగింది అందరికంటే పెద్ద ఎయిర్ హోస్టెస్.

“మీ పైలట్ సాబ్ ఇవ్వక పోవచ్చు. కానీ నేను టెర్రరిస్ట్ సాబ్‌ని. చేతిలో గన్ చూశారు కద, ఇంక లేవండి.”

ఉలిక్కిపడి లేచి నిలబడ్డారు ఎయిర్ హోస్టెస్‌లు.

“ఇప్పుడు మేం వీరందరికి సర్వ్ చేయాలా?” ఆందోళనగా అడిగింది పెద్ద ఎయిర్ హోస్టెస్. ఆవిడ పేరు సౌందర్య అని నేం ట్యాగ్ మీద రాసి ఉంది. దాదాపు అరవయి ఏళ్ళు ఉంటాయి.

“మహా ఐతే ముప్పయి మంది ఉంటారు. అంత షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చావేంటి,” అన్నాడు మధ్య గడ్డం.

“ఏదో మీరు గన్ చూపించి బెదిరిస్తున్నారు కద, చేస్తాం లెండి. మామూలుగా ఐతే, ప్రయాణీకులు కింద పడి గిల గిల కొట్టుకుంటే కానీ మేము మంచి నీళ్ళు కూడా ఇవ్వం,” మూతి విరుస్తూ చెప్పింది సౌందర్య.

“సంతోషించాం. ఇంక ఆ పని మీద ఉండండి,” కరకుగా అన్నాడు చిన్న గడ్డం.

“ఎప్పుడో సర్వీస్ మొదలు పెట్టిన రోజు, ఇలా కార్ట్ తోసుకుంటూ బయలుదేరాను,” గొణుక్కుంటూ బయలుదేరింది సౌందర్య. ఆమె వెనకాలే దాదాపు ఆమె సమ వయస్కులైన మనోహరి, లావణ్య, సుకుమారి కూడా ఫాలో అయ్యారు.

నలుగురు ఎయిర్ హిండియా హోస్టెస్‌లు అలా తమ సేవలు అందించడానికి బయలుదేరడం చూసి, సగం మంది ప్రయాణీకులు కూర్చున్న చోటే మూర్ఛ పోయారు. పెద్దాయన కూడా మూర్ఛ పోబోతూంటే 232 ఆయన్ని పడకుండా పట్టుకున్నాడు.

“ఏమయ్యింది, ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయా మీ అందరికి?” ఆందోళనగా అడిగాడు.

“ఆహాహా, ఇలా నలుగురు ఎయిర్ హిండియా హోస్టెస్‌లు ఒకేసారి నిలబడి ఉండడం చూస్తూంటే నమ్మలేక పోతున్నాం, బాబూ!”

“పోనీ లేండి, హైజాక్ చేయడం వల్ల ఈ అపురూపమైన దృశ్యం చూడగలిగాం,” తను కూడా థ్రిల్ ఫీలయ్యాడు 232.

మద గజాల్లా కదులుతూ ఒక అరగంటలో, ఉన్న అందరు ప్రయాణీకులకి డ్రింక్స్/స్నాక్స్ సర్వ్ చేసారు ఎయిర్ హోస్టెస్‌లు.

రాధేశ్యాం మనోహరిని ఇంకో గ్లాస్ జూస్ తెమ్మన్నాడు. వెంటనే అతని కాలర్ పట్టుకుంది మనోహరి. “ఏం తిక్క తిక్కగా ఉందా? ఏదో ఒక సారి సర్వ్ చేశాం అని ధైర్యం పెరిగినట్టుందే! ఎవరనుకున్నావు నన్ను?” హుంకరించింది.

“సారీ తప్పయి పోయింది. ఈ ఆనందంలో నేను ఉన్నది ఎయిర్ హిండియా ఫ్లైట్ అని మర్చిపోయాను. నన్ను వొగ్గేయి తల్లోయి,” బతిమాలుకున్నాడు రాధేశ్యాం.

“సరే, అందరూ మళ్ళీ ఎక్కడి వారక్కడే సెటిల్ అయిపోండి,” ఆర్డర్ వేశాడు మధ్య గడ్డం. మళ్ళీ అందరూ బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు.

రెండు గంటలు కాకపోయినా, ఓపిక లేక పెద్ద గడ్డం మళ్ళీ పైలట్‌తో రామకోటికి కాల్ చేయించాడు.

రామకోటి ఫోన్ ఎత్తగానే, “ఏమయ్యింది, మా షరతులు తెలియజేశావా?” ఆదుర్దాగా అడిగాడు పెద్ద గడ్డం.

“ఓ, చేశాను సార్. అనుకోకుండా చాలా తొందరగా పనులు జరిగి పోయాయి. అంతా మీకోసం స్వర్గంలో ఎదురు చూస్తున్న అప్సరసల చలువ అనుకుంటా. విషయం హోం మినిస్టర్ గారి వరకు వెళ్ళిపోయింది. ఆయన ప్రైం మినిస్టర్ గారితో ఇప్పుడు మీటింగ్‌లో ఉన్నారు,” రిపోర్ట్ చేశాడు రామకోటి.

“సరే, ఇక్కడ మాకు ప్లేన్‌లో ఫ్యూయెల్ అయిపోవస్తూంది…”

పెద్ద గడ్డాన్ని మధ్యలోనే కట్ చేసి, “తెలుసు సార్! హోం మినిస్టర్ గారు మిమ్మల్ని ఆగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వమని చెప్పారు,” చెప్పాడు రామకోటి.

“ఓహో, మా ఐడియానే ఆయనకూ వచ్చింది అన్న మాట. ఇంకా ఏం చెప్పారు?”

“మీ షరతులు పరిశీలిస్తున్నాం, కాస్త ఓపిక పట్టండి అని కూడా చెప్పారు”

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232, సీరియల్స్. Bookmark the permalink.

One Response to గూఢచారి 232 – మీ షరతులు పరిశీలుస్తున్నాం. కాస్త ఓపిక పట్టండి.

  1. nmraobandi says:

    నన్ను వొగ్గేయి తల్లోయి,” బతిమాలుకున్నాడు రాధేశ్యాం…
    just hilarious…
    waiting for the refresher …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s