గూఢచారి 232 – ఆగంపేటకి ఆగమనం

(
జరిగిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.

232 అనుమానించినట్టే, ఫ్లైట్ టేక్-ఆఫ్ కాగానే ఆ ముగ్గురు ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఆశ్చర్యంగా వారు ముగ్గురూ రాణిమండ్రిలో పుట్టిన తెగులు వారే. హిండియా ఎలాంటి కాంప్రమైజ్‌కి తయారుగా ఉన్నా, తాము హైజాక్ చేయడం మాని ఉండే వారం కాదని, ఒక కారణం కాకపోతే ఇంకొక కారణం సృష్టించుకుని అయినా హైజాక్ చేసి తీరే వారమని చెప్తూ, పైలట్లు ఉన్న కాక్‌పిట్ వైపు బయలుదేరుతారు గడ్డాలు.

కాక్‌పిట్ చేరుకున్నాక అక్కడ పైలట్ల పని తీరు చూసి కోపగించుకుంటారు. ఆ తరువాత తమ షరతులు తెలియజేయడం కోసం కంట్రోల్ టవర్‌కి కనెక్ట్ చేయమంటారు. ఉగ్రవాదుల షరతులని తెలుసుకున్న కంట్రోల్ టవర్ అధికారి రామకోటి విషయాన్ని హోం మినిస్టర్‌కి చేరవేస్తాను అని హామీ ఇస్తాడు.

కంట్రోల్ టవర్ నుంచి కాల్ వచ్చేంత లోపల ప్రయాణీకులకి డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకి పురమాయిస్తారు టెర్రరిస్టులు. అలాంటి దృశ్యం ముందెన్నడూ చూడని కొందరు ప్రయాణీకులు మూర్ఛపోతారు. ఆలస్యానికి ఆగలేక మళ్ళీ కంట్రోల్ టవర్‌కి కాల్ చేసిన పెద్ద గడ్డానికి, హోం మినిస్టర్, ప్రైం మినిస్టర్ మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఫ్యూయెల్ అయిపోకముందే ఆగం పేట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయమన్నారని, కాస్త ఓపిక పట్టమన్నారని, చెప్తాడు రామకోటి.

ఇక చదవండి.
)

“ఇంకా ఓపిక పట్టడం ఏంటి, నాన్సెన్స్! మేమేమైనా అంధేరా ప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారా, ఎవరు చెప్పినా ప్రత్యేక హోదా వస్తుంది అని నమ్మేస్తూ ఓపిక పట్టడానికి?” కోపంగా అరిచాడు పెద్ద గడ్డం.

“మీకు వాళ్ళకి పోలిక ఏంటి సార్! వాళ్ళు జస్ట్ నిరసనలు తెలియజేస్తారు. మీ దగ్గర ఐతే గన్స్ ఉన్నాయి కద. మీతో అలా నిర్లక్ష్యంగా ఉండరు లెండి,” నచ్చ చెప్పాడు రామకోటి.

“సరే! అదీ చూద్దాం. పైలట్ సాబ్. ఆగంపేట వైపు ప్లేన్‌ని పోనివ్వండి!” హుకుం జారీ చేశాడు పెద్ద గడ్డం.

“ఇంత సేపటికి నాకు చేతనైన ఒక పని చెప్పారు సార్, అలాగే పోనిస్తున్నా. ఇంకో అర గంటలో మనం అక్కడుంటాం,” చెప్పాడు పెద్ద పైలట్ ఆనందంగా.

“ఆగు! ఇంతకీ అక్కడ రన్‌వే గట్రా సరిగ్గా ఉన్నాయా?” అనుమానంగా అడిగాడు మధ్య గడ్డం.

“పోండి సార్, మీరు మరీనూ, మా రాజకీయ నాయకులు అంతా కన్‌వీనియెంట్‌గా ఉంటుందని ఆగం పేట నుంచే ఫ్లై అవుతారు. మాములూ జనాలు మాత్రం హంసాబాద్ వెళ్ళాల్సిందే.”

“మరి ఆ హంసాబాద్ ఎయిర్ పోర్ట్ ఎందుకు అంత దూరం కట్టారు?” ఆసక్తిగా అడిగాడు చిన్న గడ్డం.

“అంటే, ముందస్తుగా అక్కడ చుట్టూ భూములు అన్నీ కారు చవకకి మా పొలిటీషన్స్ అంతా కొనుక్కున్నారు సార్! తరువాత ఎయిర్ పోర్ట్ అక్కడ పెట్టారు. అంతే! ఆ భూముల ధరలు అమాంతం పెరిగి పోయాయి. దాని వల్ల వాళ్ళు బోలెడు డబ్బులు చేసుకున్నారు. ఎటొచ్చీ జనాలు…”

“ఇప్పుదు ఈ డిస్కషన్ మనకు అవసరమా? మనం వచ్చింది దేనికి? జిగాద్!” పొలికేక పెట్టాడు పెద్ద గడ్డం.

“బాగా చెప్పారు సార్. మన ప్రజలకు కూడా ఇలాంటి పనికి మాలిన విషయాలు అక్కర్లేదు. ఏదో, కిరికెట్టు, సినిమాలు, టీవీ సీరియల్స్ వస్తూంటే చాలు,” అంటూ పెద్ద పైలట్ ప్లేన్‌ని ఆగం పేట వైపు తిప్పాడు.

అంతటితో ఆగకుండా మైక్ తీసుకుని అనౌన్స్ కూడా చేశాడు, “ఇంకో ముప్పై నిమిషాల్లో మనం ఆదరా బాదరా చేరుకోబోతున్నాం,” అంటూ.

ప్రయాణీకులు అంతా తమ హర్షాన్ని వెలిబుచ్చారు.

“అంటే హైజాకర్లు తమ ఉద్దేశం మార్చుకున్నారా, హైజాక్ చేయడం లేదా?” అడిగాడు లంబు ఆశగా.

“వీళ్ళు హైజాకర్లు. పైగా ఉగ్ర వాదులు. వీళ్ళకి ఫోకస్ ఎక్కువట. ఎక్కడో చదివాను. ఇలా మాటి మాటికి మనసు మార్చుకోరనుకుంటాను,” అన్నాడు జంబు.

“మీరు కరెక్ట్‌గా చెప్పారు. ఇలా గాలిలో యే తీరు తిన్నూ లేకుండా ఎగురుతూ ఉంటే ఫ్యూయెల్ అయిపోతుందని ఈ డెసిషన్ తీసుకున్నట్టున్నారు,” గంభీరంగా చెప్పాడు 232.

దాంతో మళ్ళీ అందరూ ఢీలా పడిపోయారు. “ఇంకా నేను రాత్రి 10 లోపల వెళ్ళిపోతాం కద, ‘ఎంగిలి మెతుకులు’ సీరియల్ చూద్దామనుకున్నాను,” బాధగా అన్నాడు రవికిరణ్.

“ఆ సీరియల్ ఇంకా ప్రసారం అవుతూందా?” ఆసక్తిగా ప్రశ్నించాడు రాజేశ్.

“ఎహే, హైజాక్ ఏం ఆగిపోలేదు అని చెప్పాను కద! మీరు కొన్ని రోజుల వరకు ‘ఎంగిలి మెతుకులు’ కాదు కదా, ‘అంట్ల సంబంధం’ సీరియల్ కూడా చూడలేరు,” చిరాగ్గా చెప్పాడు 232.

“‘అంట్ల సంబంధం’ లాస్ట్ ఎపిసోడ్ మిస్ అయ్యాను. కాస్త కథ చెప్తారా ప్లీజ్?” రిక్వెస్ట్ చేశాడు కణ్ణన్.

232 దవడ కండరం కోపంతో బిగుసుకుంది. కానీ అతను ఏదో అనేంత లోపల పైలట్ మళ్ళీ అనౌన్స్ చేశాడు, ” ఇంకో 10 నిముషాల్లో మనం ల్యాండ్ కాబోతున్నాం. దయ చేసి ఎవరి సీట్లలో వారు కూర్చోండి. సీటు బెల్టులు వేసుకోండి. ఎయిర్ హోస్టెస్‌లు ప్రయాణీకులకు సహాయం చేయక పోయినా ఫర్లేదు, కాళ్ళకు చేతులకు అడ్డం పడకుండా ఒక మూల కూర్చోండి లేదా పడుకోండి,” అంటూ.

కాక్‌పిట్‌లో అతని పక్కనే ఉన్న పెద్ద గడ్డం అతని మెడకి తన గన్ తగిలించాడు.

“ఆ అన్నట్టు ఇంకో విషయం. మన హైజాకరు బాబులు మాత్రం ఏ రూలూ పాటించరు. వారికి అందరూ పూర్తిగా సహకరించండి,” అంటూ తన అనౌన్స్‌మెంట్ ముగించాడు పైలట్.

“ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా ఉండాలని నా ఆస్తులన్నీ అమ్మేసి హంసాబాద్ దగ్గర ఒక చిన్న ప్లాట్ కొనుక్కుని అందులో ఒక పూరి గుడిసె వేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఆగంపేటలో ల్యాండ్ చేస్తే నా పరిస్థితి ఏంటి. బాగా దూరం అయిపోతుంది కద,” ఆందోళనగా అన్నాడు మహేంద్ర.

“ఊరుకో బాబు, ముందు ఈ హైజాకర్ల బారి నుంచి తప్పించుకుంటే నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు,” నచ్చచెప్పాడు పెద్దాయన.

అందరూ తమ తమ సీట్లలో కూర్చున్నారు. ఎయిర్ హోస్టెస్‌లు ఎవరికీ కనపడలేదు కాబట్టి ప్లేన్ వెనకాతల కునుకు తీస్తున్నారు అని అంతా భావించారు.

గడ్డాలు ముగ్గురు తమ గన్స్ ప్రయాణీకుల వైపు గురి పెట్టి నిలుచున్నారు.

ప్లేన్ మెల్లగా కిందకి దిగడం మొదలు పెట్టింది.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s