గూఢచారి 232 – ఏంటీ? ఇప్పటి దాకా ప్లేన్ ఎక్కలేదా?

(
జరిగిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.

232 అనుమానించినట్టే, ఫ్లైట్ టేక్-ఆఫ్ కాగానే ఆ ముగ్గురు ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఆశ్చర్యంగా వారు ముగ్గురూ రాణిమండ్రిలో పుట్టిన తెగులు వారే. హిండియా ఎలాంటి కాంప్రమైజ్‌కి తయారుగా ఉన్నా, తాము హైజాక్ చేయడం మాని ఉండే వారం కాదని, ఒక కారణం కాకపోతే ఇంకొక కారణం సృష్టించుకుని అయినా హైజాక్ చేసి తీరే వారమని చెప్తూ, పైలట్లు ఉన్న కాక్‌పిట్ వైపు బయలుదేరుతారు గడ్డాలు.

కాక్‌పిట్ చేరుకున్నాక అక్కడ పైలట్ల పని తీరు చూసి కోపగించుకుంటారు. ఆ తరువాత తమ షరతులు తెలియజేయడం కోసం కంట్రోల్ టవర్‌కి కనెక్ట్ చేయమంటారు. ఉగ్రవాదుల షరతులని తెలుసుకున్న కంట్రోల్ టవర్ అధికారి రామకోటి విషయాన్ని హోం మినిస్టర్‌కి చేరవేస్తాను అని హామీ ఇస్తాడు.

కంట్రోల్ టవర్ నుంచి కాల్ వచ్చేంత లోపల ప్రయాణీకులకి డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకి పురమాయిస్తారు టెర్రరిస్టులు. అలాంటి దృశ్యం ముందెన్నడూ చూడని కొందరు ప్రయాణీకులు మూర్ఛపోతారు. ఆలస్యానికి ఆగలేక మళ్ళీ కంట్రోల్ టవర్‌కి కాల్ చేసిన పెద్ద గడ్డానికి, హోం మినిస్టర్, ప్రైం మినిస్టర్ మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఫ్యూయెల్ అయిపోకముందే ఆగం పేట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయమన్నారని, కాస్త ఓపిక పట్టమన్నారని, చెప్తాడు రామకోటి. ఆలస్యానికి చిరాకు పడ్డా మొత్తానికి పైలట్‌ని ఆగంపేట వైపు వెళ్ళమంటాడు పెద్ద గడ్డం.

ఇక చదవండి.

)

“అమ్మో, కడుపులో ఏదోలా ఉంది. చెవులు దిబ్బెళ్ళు పడిపోతున్నాయి,” భయంగా అరిచాడు చిన్న గడ్డం.

“ప్లేన్ ల్యాండ్ అయ్యేప్పుడు అంతే అంట,” తను కూడా చెవులు మూసుకుంటూ అరుస్తూ చెప్పాడు మధ్య గడ్డం.

“అంట అంటే, నీకు కూడా తెలీదా?” అనుమానంగా అడిగాడు చిన్న గడ్డం.

“లేదు ఏదో పుస్తకంలో చదివాను. ఎయిర్ ప్రెషర్ వల్ల అలా జరుగుతుందంట,” సమాధానం ఇచ్చాడు మధ్య గడ్డం.

“ఏంటి, మీరు ఇంత వరకు ప్లేను ఎక్కలేదా?” ఆశ్చర్య పోయాడు పెద్దాయన.

“ఏం? ప్లేన్ హైజాక్ చెయ్యాలి అంటే ముందు ప్రయాణం చేసి ఉండాలాని రూలేమైనా ఉందా? రాణి మండ్రిలో గతుకుల రోడ్ల మీద ప్రయాణం చేసిన వాళ్ళం ఆ మాత్రం ప్లేను హ్యాండిల్ చేయలేమా?” కోపంగా అన్నాడు పెద్ద గడ్డం.

“పైగా ఎన్నో సినిమాల్లో కూడా చూశాం ప్లేన్ ప్రయాణం గురించి,” వత్తాసు పలికాడు మధ్య గడ్డం.

“నిజానికి పూర్వానుభవం ఉంటేనే ఏదైనా పని చేయగలం అనుకోవడం పొరపాటు. ఉదాహరణకు శ్యాం గోపాల్ వర్మనే తీసుకోండి. ఏ అనుభవం ఉంది అని అతను మొదటి సినిమానే ‘విశ’ లాంటిది తీయగలిగాడు,” తను కూడా సంభాషణలో పాల్గొన్నాడు సైకాలజిస్ట్.

“ఈయనెవరు?” కాస్త కోపంగా అడిగాడు పెద్ద గడ్డం.

“ఈయన ఒక సైకాలజిస్ట్,” చెప్పాడు 232.

“ఇలా మధ్యలో దూరి ఏదేదో మాట్లాడుతున్నాడేంటి?”

“అది ఆయన వృత్తి ధర్మం. మీరు ప్లేన్ హైజాక్ చేయకుండా ఉండి ఉంటే, ఈ పాటికి ఎవరో ఒక పేషెంట్‌ని కూలంకషంగా అనలైజ్ చేస్తూ ఉండే వాడు. ఆ అవకాశం లేక ఇలా కలగజేసుకున్నాడు. అసలు ఇంత సేపు మాట్లాడకుండా ఉండడమే గ్రేట్.”

“ఓహో, అలానా. అరేయి తమ్ముడూ, గుర్తు పెట్టుకోరా. ఒక వేళ మనం ఎవరన్నా ప్రయాణీకుల్ని లేపేయ్యాల్సి వస్తే ముందు ఈయన్నే వేసేద్దాం,” మధ్య గడ్డానికి చెప్పాడు పెద్ద గడ్డం.

“బాబోయి నన్నా? ఎందుకు?” వణుకుతూ అన్నాడు సైకాలజిస్ట్.

“ఒకటి, ఇలా మధ్యలో మాట్లాడే వాళ్ళంటే, అందులో ఎడ తెరపి లేకుండా మాట్లాడే వాళ్ళంటే, నాకు చిరాకు. రెండు, నువ్వు శ్యాం గోపాల్ వర్మ ఫ్యాన్‌లా ఉన్నావు. అందుకే ఆ డొక్కు ఎగ్జాంపుల్ ఇచ్చావు. ఈ మధ్య ఆయన తీసిన ‘బిస్కట్’ సిరీస్ చూసినట్టు లేదు. నేను చూసి మంచాన పడ్డానులే. మా తమ్ముళ్ళు సేవ చేయబట్టి టైముకు కోలుకున్నాను. లేకపోతే ఈ హైజాకింగ్ కూడా చేయగలిగే వాడిని కాదు,” ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు పెద్ద గడ్డం.

“ఓహో, శ్యాం గోపాల్ వర్మ సినిమాల వల్ల ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయన్న మాట,” తనలో తాను అనుకున్నాడు 232.

“ముందు ముందు పరిస్థితిలో ఏదన్నా తేడా వస్తే హిండియన్ గవర్నమెంట్‌ని భయపెట్టడానికి ఒక్కో ప్రయాణీకుడిని చంపక తప్పదు. అదేదో నీతోనే మొదలు పెడతాను,” పెద్దగా నవ్వాడు పెద్ద గడ్డం.

“క్షమించండి సార్! ఈ సారి అడిగినా నా అనాలసిస్ చెప్పను,” బావురుమన్నాడు సైకాలజిస్ట్.

“ముందు మీరు ఊరుకోండి సార్. ఆయనకి ఇంకా కోపం తెప్పించకండి,” సలహా ఇచ్చాడు 232. సైకాలజిస్ట్ వెంటనే సైలెంట్ అయిపోయాడు.

ఈ సంభాషణ అయ్యేంతలో ప్లేన్, ఆగం పేట ఎయిర్‌పోర్ట్‌లో టచ్‌డౌన్ చేసింది.

పైలట్ అనౌన్స్‌మెంట్ మొదలయ్యింది. “నమస్తే, ఆదరా బాదరాకి, ఆగం పేట ఎయిర్‌పోర్ట్‌కి ఎయిర్ హిండియా తరపున మా స్వాగతం. ఇప్పుడు సమయం రాత్రి 8 గంటలు కావస్తుంది. వాతవరణం ప్రశాంతంగా ఉంది. ఉష్ణోగ్రత 34 డిగ్రీలు. మీ ప్రయాణం సుఖవంతంగా సాగిందని ఆశిస్తున్నాము. భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసే అవకాశాన్ని మాకే ఇవ్వండి,” అంటూ. వెంటనే అదే అనౌన్స్‌మెంట్‌ని ఆగ్లంలో హిందీలో కూడా చెప్పాడు.

“చచ్చినా ఇవ్వం,” కోపంగా అరిచారు కొందరు ప్రయాణీకులు.

“చస్తే ఎలాగూ ఇవ్వలేరు. నోరు మూయండి,” హుంకరించాడు మధ్య గడ్డం.

ఇంతలో పెద్ద గడ్డం చటుక్కున ప్లేన్ విండో వైపు వెళ్ళి బయటకు చూశాడు. “అదేంటి, ఈ పాటికి ప్లేన్ చుట్టూతా ప్యారా మిలటరీ సైనికులు నిలబడి ఉంటారని అనుకున్నా. ఎవరూ లేరేంటి?” అన్నాడు నిరుత్సాహంగా.

“మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారనుకుంటాను. మా వాళ్ళు అంత తొందరగా రియాక్ట్ అయ్యే టైప్ ఐతే ఇంకేముంది. మొన్న డుంబాయిలో చూశారు కద. హోటెల్‌ని నరహంతకులు ఆక్రమించాక కూడా, మొత్తం ప్రపంచానికి అంతా తెలిసిపోయినా కూడా, మా కమాండోస్‌కి ఆరు గంటలు పట్టింది అక్కడికి చేరుకోవడానికి,” చెప్పాడు 232.

“నిజమే కదు!” నాలుక కర్చుకున్నాడు పెద్ద గడ్డం.

“సరే మొత్తానికి ల్యాండ్ అయ్యింది కద, ఇప్పుడు ఏం చేద్దాం?” అడిగాడు చిన్న గడ్డం.

“ఏముంది, ఆ హోం మినిస్టర్ డెసిషన్ తీసుకునే వరకు వెయిట్ చెయ్యడమే,” అన్నాడు మధ్య గడ్డం.

“ఈయన చెప్పింది విన్నావు కద. వాళ్ళ కోసం వెయిట్ చేస్తే, చేస్తూనే ఉంటాం. ఒక అరగంట చూద్దాం. జవాబు రాకపోతే ఈ సైకాలజిస్ట్‌ని లేపేద్దాం. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మనం ఎంత సీరియస్సో!” క్రూరంగా అన్నాడు పెద్ద గడ్డం.

ఘొల్లుమన్నాడు సైకాలజిస్ట్. కానీ గడ్డాలు అతన్ని ఉరిమి చూడగానే వెంటనే నోరు మూసేసుకున్నాడు.

“మరప్పటి వరకు ఏం చేద్దాం?” పట్టు వదలని విక్రమార్కుడిలా అడిగాడు చిన్న గడ్డం.

“ముందు ఆ ఎయిర్ హోస్టెస్‌లని మళ్ళీ అందరికీ డ్రింక్స్ సర్వ్ చేయమనండి. నాక్కూడా దాహం వేస్తూంది,” చెప్పాడు పెద్ద గడ్డం.

మధ్య గడ్డం తన గన్ ఆఖరి వరసలో పడుకుని ఉన్న ఎయిర్ హోస్టేస్‌ల వైపు తిప్పి, ఆ ఆర్డర్ వినిపించాడు.

ఎయిర్ హోస్టెస్‌లు భయంతో దిగ్గున లేచి మళ్ళీ ట్రాలీలు తోసుకుంటూ బయలుదేరారు.

“వీడి అమ్మ కడుపు మాడా! నా సర్వీస్‌లో ఇంత పని ఎప్పుడూ చేయలేదు అక్కా,” గొణిగింది సౌందర్య, లావణ్య చెవిలో.

“మరేనమ్మా, ఎయిర్ హిండియాలో ఉద్యోగం వచ్చిందని నలభై ఏళ్ళ కింద పడిన ఆనందమంతా ఆవిరి అయి పోతూంది ఈ వెధవల వల్ల,” మెటికెలు విరిచింది లావణ్య.

ఐనా సరే చేసేది లేక, గుడ్ల నీరు కుక్కుకుని పనిలో పడ్డారు నలుగురు ఎయిర్ హోస్టెస్‌లు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

5 Responses to గూఢచారి 232 – ఏంటీ? ఇప్పటి దాకా ప్లేన్ ఎక్కలేదా?

  1. కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ says:

    సాంకేతిక కారణాలా? పూర్తిపాఠం మధ్యలో కొన్ని అంతరాలు? ఏది ఏమైనా, కధనం బాగుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s