గూఢచారి 232 – మీ షరతులు మా ప్రభుత్వానికి ఓకే!

(
జరిగిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.

232 అనుమానించినట్టే, ఫ్లైట్ టేక్-ఆఫ్ కాగానే ఆ ముగ్గురు ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఆశ్చర్యంగా వారు ముగ్గురూ రాణిమండ్రిలో పుట్టిన తెగులు వారే. హిండియా ఎలాంటి కాంప్రమైజ్‌కి తయారుగా ఉన్నా, తాము హైజాక్ చేయడం మాని ఉండే వారం కాదని, ఒక కారణం కాకపోతే ఇంకొక కారణం సృష్టించుకుని అయినా హైజాక్ చేసి తీరే వారమని చెప్తూ, పైలట్లు ఉన్న కాక్‌పిట్ వైపు బయలుదేరుతారు గడ్డాలు.

కాక్‌పిట్ చేరుకున్నాక అక్కడ పైలట్ల పని తీరు చూసి కోపగించుకుంటారు. ఆ తరువాత తమ షరతులు తెలియజేయడం కోసం కంట్రోల్ టవర్‌కి కనెక్ట్ చేయమంటారు. ఉగ్రవాదుల షరతులని తెలుసుకున్న కంట్రోల్ టవర్ అధికారి రామకోటి విషయాన్ని హోం మినిస్టర్‌కి చేరవేస్తాను అని హామీ ఇస్తాడు.

కంట్రోల్ టవర్ నుంచి కాల్ వచ్చేంత లోపల ప్రయాణీకులకి డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకి పురమాయిస్తారు టెర్రరిస్టులు. అలాంటి దృశ్యం ముందెన్నడూ చూడని కొందరు ప్రయాణీకులు మూర్ఛపోతారు. ఆలస్యానికి ఆగలేక మళ్ళీ కంట్రోల్ టవర్‌కి కాల్ చేసిన పెద్ద గడ్డానికి, హోం మినిస్టర్, ప్రైం మినిస్టర్ మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఫ్యూయెల్ అయిపోకముందే ఆగం పేట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయమన్నారని, కాస్త ఓపిక పట్టమన్నారని, చెప్తాడు రామకోటి.

ఆలస్యానికి చిరాకు పడ్డా మొత్తానికి పైలట్‌ని ఆగంపేట వైపు వెళ్ళమంటాడు పెద్ద గడ్డం. ఫ్లైట్ ఆగంపేటలో ల్యాండ్ అయ్యాక, హోం మినిస్టర్‌కి ఇంకో అర గంట టైం ఇద్దామని, ఆ తరువాత ఒకొక్క ప్రయాణీకుడిని లేపేద్దామని అంటాడు పెద్ద గడ్డం. అంతవరకు డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకు పురమాయిస్తాడు.

ఇక చదవండి.

)

ఈ సారి రాధేశ్యాంకి మనోహరి ఆరంజ్ జూస్ సర్వ్ చేసినప్పుడు అతను కిక్కురుమనలేదు. ఇంతకు ముందు అయిన అనుభవం అతనికి బాగానే గుర్తు ఉంది. జూస్ ఇవ్వడమే తన అహోభాగ్యంగా భావించి చప్పరిస్తూ తాగేశాడు.

ఈ సారి జూస్‌తో పాటూ స్నాక్స్ కూడా వడ్డించాల్సి వచ్చింది మన ఎయిర్ హోస్టెస్‌లకి. ప్రయాణీకులు అంతా తిని, తాగే కార్యక్రమం ముగించాక అందరిని వరసగా బాత్‌రూంకి కూడా వెళ్ళనిచ్చారు గడ్డాలు.

“చూశారా, మనందరం, మతానికి ముందు మనుషులం. ఉగ్రవాదులు అంటూ ఎప్పుడూ ఆడిపోసుకోవడమే కానీ వారిలో దాగి ఉన్న ఆ కరుణని గుర్తించారా? మనందరికి ఇబ్బంది కలగకుండా ఎలా బాత్‌రూంకి పంపిస్తున్నారో,” గద్గద స్వరంతో అన్నాడు మన్‌మోహన్ దాస్. అతి కష్టం మీద ఆయన తన నోట్లో కుక్కి ఉన్న న్యాప్‌కిన్స్ బయటకు ఉమ్మేసి మళ్ళీ మాట్లాడగలిగాడు.

ఈ సారి 232కి ముందు యాదగిరి రియాక్ట్ అయ్యాడు. “నీ యవ్వ, మీ వామ పక్షమోళ్ళకి దమాక్ మోకాల్లో ఉంటాదివయ్య? మనం ఈడనే బాత్‌రూం పోతే గా కంపు భరించలేక ఆల్లు ప్లేన్‌ల కెల్లి దుంకాల్సొస్తది. అందుకని వదిలిర్రు,” అంటూ ఈ సారి నాలుగు న్యాప్‌కిన్స్ కుక్కి మన్‌మోహన్ నోరు మూయించాడు అతను.

అందరూ బాత్‌రూం తంతు ముగించాక, పెద్ద గడ్డం ఒక సారి తన సెల్‌ఫోన్లో టైం చూసుకున్నాడు. “అరే, నలభై నిముషాలు అయిపోయింది, ఇంకా హిండియా ప్రభుత్వం స్పందించలేదు. లాభం లేదు మనం ఏంటో వాళ్ళకి చూపించాల్సిందే! అరేయి తమ్ముడూ, ఆ సైకాలజిస్ట్‌ని లాక్కుని రారా,” చిన్న గడ్డానికి ఆర్డర్ వేశాడు.

సీట్ వెనక నక్కి ఉన్న సైకాలజిస్ట్‌ని బలవంతంగా లేపి పెద్ద గడ్డం దగ్గరికి తీసుకు వచ్చాడు చిన్న గడ్డం.

“సార్, ఈ హైజాక్ అయ్యాక మీకు రకరకాల మానసిక రుగ్మతలు రావచ్చు. మీకు ఒక సైకాలజిస్ట్ అవసరం పడతాడు. నేను మీ ముగ్గురు అన్నదమ్ములకి ఫ్రీగా జీవితాంతం ట్రీట్ చేస్తాను. నన్నొగ్గెయ్యండి,” బతిమాలుకున్నాడు సైకాలజిస్ట్.

“రుగ్మత అంటే ఏమిటి?” అనుమానంగా అడిగాడు మధ్య గడ్డం.

“అదే, పాల్‌మాలిక అని ఆయన అర్థం,” వాయలసీమలో పుట్టి పెరిగిన శ్రీనివాస్ చెప్పాడు.

“ఏడ్చినట్టుంది. ఎవరన్నా అర్థం చెప్పమంటే సులువైన పదాలతో వివరించమని అర్థం. అంతే కానీ ఇలా నోరు తిరగని పదాలతో చెప్పమని కాదు,” విసుక్కున్నాడు మధ్య గడ్డం.

“సారీ, సారీ! రుగ్మత అంటే డిస్-ఆర్డర్,” తనే చెప్పేశాడు సైకాలజిస్ట్.

“పిచ్చివాడా, మాకు ఎలాంటి రుగ్మతలు లేవు, రావు, రాబోవు. ఐనా ఎంతో మంది పేషెంట్స్‌కి ధైర్యం చెప్పి ఉంటావు. చావు అంటే ఎందుకు అంత భయపడుతున్నావు?” అడిగాడు పెద్ద గడ్డం.

“అదేంటో తెలీదు సార్, ఆ సైకాలజిస్ట్ కుర్చీలో కూర్చుంటే ఎక్కడలేని కాన్‌ఫిడెన్స్ వస్తుంది. అందరికి సలహాలు ఇవ్వాలి అనిపిస్తుంది. ఇప్పుడేమో నా ఆఫీస్‌లో లేనూ, కుర్చీనూ లేదు. తెగ భయంగా ఉంది.”

“సరేలే, నువ్వెలా పోతే నాకేంటి? పోవడం మాత్రం నాకు ముఖ్యం. ఇలా మోకాళ్ళ మీద కూర్చో. నిన్ను దేవుడి దగ్గరకు పంపించాలి.”

“మా దేవుడి దగ్గరకా సార్?”

“ఛీ, నీ మొహం మండా! ఉన్నది ఒక్కడే దేవుడు. ఆయనే మా దేవుడు. ఎంతమందిని చంపినా, ఎన్ని మర్డర్లు చేసినా మీకు ఆ విషయం అర్థం కావడంలేదేంట్రా?”

“నాకు ఏ దేవుడి దగ్గరకు వెళ్ళలి అని లేదు సార్!” బావురుమన్నాడు సైకాలజిస్ట్.

అతని ఏడుపు పట్టించుకోకుండా తన చేతిలోని గన్‌ని అతని తల వెనక భాగానికి ఆనించాడు పెద్ద గడ్డం.

“ఊరికే బుల్లెట్స్ వేస్ట్ చేయకండి సార్! ముందు ముందు మీకు ప్రతి బుల్లెట్‌తోనూ అవసరముంటుంది,” అంటూ ఒక గొంతు వినిపించింది వెనక నుంచి.

“చాలా పవర్‌ఫుల్ డయలాగ్! అసలు తాను చెప్పి ఉండవలసింది. ఈ కొత్త క్యారక్టర్ ఎవరు?” కాస్త అసూయ పడ్డాడు తనలో తాను 232.

ఇంతకీ ఆ డయలాగ్ చెప్పింది పెద్ద పైలట్, అప్పుడే కాక్‌పిట్ నుంచి బయటకు రావడంతో అతన్ని చూడలేదు వారెవ్వరూ.

“ఏం, ఎందుకు కాల్చకూడదు?” కనుబొమ్మలెగరేశాడు పెద్ద గడ్డం.

“మా ప్రభుత్వం నుంచి కాల్ వచ్చింది. మీ షరతులకు ఒప్పుకున్నారు. అందరు ఉగ్రవాదుల్ని వదిలేస్తారట. విగ్రహాలు కూడా కట్టిస్తారట. ఐతే మాములు రాతి విగ్రహాలే కట్టిస్తారట. పాలరాతితో కట్టించడం కుదరదు అని చెప్పమన్నారు.”

“జిగాద్!” ఆనందంతో గట్టిగా అరిచారు ముగ్గురు గడ్డాలు.

“చూశారా తమ్ముళ్ళూ, మన కల నెరవేరింది. యాకంగా అందరినీ వదిలేస్తారట.” ఆనంద భాష్పాలు తుడుచుకుంటూ అన్నాడు పెద్ద గడ్డం.

పరిస్థితిలో మార్పు గమనించిన సైకాలజిస్ట్ మెల్లగా లేచి నిలబడి విమానం వెనక వైపుకి జారుకున్నాడు. మిగతా ప్రయాణీకులంతా కూడా “హమ్మయ్య” అనుకున్నారు. ఎటొచ్చి ఏ మాత్రం ఆనందం లేనిది 232 ఒక్కడికే.

“ఎంత అవమానం. ముగ్గురు హైజాకర్లకి భయపడి అందరు ఉగ్రవాదుల్ని వదిలేస్తారా! నో! అలా జరగడానికి వీలు లేదు. ఎలా అయినా దీన్ని ఆపాలి,” అనుకున్నాడు 232. అతని సునిశితమైన మస్తిష్కంలో ఒక ఆలోచన రూపు దిద్దుకోసాగింది.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232, సీరియల్స్. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s