గూఢచారి 232 – అనివార్యం యుద్ధం!

(
జరిగిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.

232 అనుమానించినట్టే, ఫ్లైట్ టేక్-ఆఫ్ కాగానే ఆ ముగ్గురు ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఆశ్చర్యంగా వారు ముగ్గురూ రాణిమండ్రిలో పుట్టిన తెగులు వారే. హిండియా ఎలాంటి కాంప్రమైజ్‌కి తయారుగా ఉన్నా, తాము హైజాక్ చేయడం మాని ఉండే వారం కాదని, ఒక కారణం కాకపోతే ఇంకొక కారణం సృష్టించుకుని అయినా హైజాక్ చేసి తీరే వారమని చెప్తూ, పైలట్లు ఉన్న కాక్‌పిట్ వైపు బయలుదేరుతారు గడ్డాలు.

కాక్‌పిట్ చేరుకున్నాక అక్కడ పైలట్ల పని తీరు చూసి కోపగించుకుంటారు. ఆ తరువాత తమ షరతులు తెలియజేయడం కోసం కంట్రోల్ టవర్‌కి కనెక్ట్ చేయమంటారు. ఉగ్రవాదుల షరతులని తెలుసుకున్న కంట్రోల్ టవర్ అధికారి రామకోటి విషయాన్ని హోం మినిస్టర్‌కి చేరవేస్తాను అని హామీ ఇస్తాడు.

కంట్రోల్ టవర్ నుంచి కాల్ వచ్చేంత లోపల ప్రయాణీకులకి డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకి పురమాయిస్తారు టెర్రరిస్టులు. అలాంటి దృశ్యం ముందెన్నడూ చూడని కొందరు ప్రయాణీకులు మూర్ఛపోతారు. ఆలస్యానికి ఆగలేక మళ్ళీ కంట్రోల్ టవర్‌కి కాల్ చేసిన పెద్ద గడ్డానికి, హోం మినిస్టర్, ప్రైం మినిస్టర్ మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఫ్యూయెల్ అయిపోకముందే ఆగం పేట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయమన్నారని, కాస్త ఓపిక పట్టమన్నారని, చెప్తాడు రామకోటి.

ఆలస్యానికి చిరాకు పడ్డా మొత్తానికి పైలట్‌ని ఆగంపేట వైపు వెళ్ళమంటాడు పెద్ద గడ్డం. ఫ్లైట్ ఆగంపేటలో ల్యాండ్ అయ్యాక, హోం మినిస్టర్‌కి ఇంకో అర గంట టైం ఇద్దామని, ఆ తరువాత ఒకొక్క ప్రయాణీకుడిని లేపేద్దామని అంటాడు పెద్ద గడ్డం. అంతవరకు డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకు పురమాయిస్తాడు. ఇదంతా అయ్యక, సరిగ్గా పెద్ద గడ్డం సైకాలజిస్టుని చంపేంత లోపల, హిండియన్ ప్రభుత్వం గడ్డాల అన్ని షరతులకి ఒప్పుకుంది, అని వచ్చి చెప్తాడు పెద్ద పైలట్. అది విన్న 232 ఎలాగైనా తనే హైజాకర్లని ఎదుర్కోవాలని నిశ్చయించుకుంటాడు.

ఇక చదవండి.

)

గూఢచారి 232 మదిలో రూపు దిద్దుకుంటున్న ఆలోచన అలా రూపు దిద్దుకుంటూనే ఉంది. ఎంత సేపైనా సరే రూపం పూర్తి అయ్యేలా అనిపించక పోవడంతో విసుగెత్తి ఆలోచించడం మానేశాడు అతను.

“అయినా ఇలాంటి సమయంలో కావల్సింది ఆలోచన కాదు, యాక్షన్! ఇలానే మీనమేషాలు లెక్ఖ పెడుతూ కూర్చుంటే, ఈ హైజాకింగ్ ఘట్టం కూడా పూర్తి అవుతుంది. దాని తరువాత ఈ సారి శాతకర్ణి గారు నిజంగానే తనను హిండియా అంతా గస్తీ తిరగమని పంపించినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. కాబట్టి తనే ఏదైనా చేయాలి. మిగతా ప్రయాణీకుల సహాయం దొరుకుతుంది అనే గ్యారంటీ లేదు. కాబట్టి ముగ్గురు హైజాకర్లని తనే ఎదుర్కోవడానికి సిద్ధ పడాలి. తను శిక్షణ పొందిన గూఢచారి, పైగా తన దగ్గర ఆధునిక రావు ఇచ్చిన రకరకాల ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి తనే ఏదో ఒకటి చేయాలి,” ఒక నిర్ణయానికి వచ్చాడు 232.

ఆధునిక రావు తనకు ఇచ్చిన ఆయుధాల లిస్ట్ ఒక సారి గుర్తుకు తెచ్చుకున్నాడు 232. ఒకటి, గన్ను లాంటి పెన్ను. అది రాయడానికి కాదు, నొక్కితే బుల్లెట్స్ వస్తాయి. ఇంకోటి కళ్ళద్దాలు. అది తొడుక్కుంటే మనం చూస్తున్న దాన్ని ఫోటో తీయొచ్చు. వేరొకటి ముక్కు పొడుం డబ్బా. అందులో నశ్యాన్ని ఉండ కట్టి విసిరితే బాంబులా పేలుతుంది. మరొకటి సిగరెట్. అది కాలిస్తే వచ్చే పొగను పీలిచిన వాడు స్పృహ తప్పి పోతాడు, వాడే కాదు, ఒక వేళ ఆ పొగ పీలిస్తే, సిగరెట్టు తాగే వాడు కూడా మూర్ఛ పోతాడు.

ఈ ఆయుధాలు వాడి, ముఖ్యంగా తన సమయస్ఫూర్తిని ఉపయోగించి, ఈ హైజాకర్ల పని పట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా తను మానసికంగా ఒక అలౌకిక స్థితికి చేరుకోవాలి. అది ఎలాంటి స్థితి అయి ఉండాలి అంటే తనకు ఇంకేమీ గుర్తు రాకూడదు. అర్జునుడికి చిలక ఒకటే కనిపించినట్టు తనకు తన లక్ష్యం తప్ప ఇంకేమీ కనిపించకూడదు.

232కి తను చీ.బీ.ఐలో చేరినప్పుడు తన ట్రెయినింగ్‌లో భాగంగా జపాంగ్ దేశానికి వెళ్ళినప్పుడు, తనకు కర్రాటే నేర్పించిన గురువు, ఫ్యూజుల శాన్ చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయి. తనకు అతి కఠోరమైన శిక్షణ ఇచ్చి కర్రాటేలో ఎల్లో బెల్ట్ ఇప్పించాడు ఫ్యూజుల శాన్. ఆ రోజులు కళ్ళల్లో మెదిలాయి 232కి.

*************************************************************************************

“చూడు 232-శాన్, మన శక్తి ఉన్నది మన శరీరంలో కాదు, మన మస్తిష్కంలో. మన మనసుని పూర్తిగా అధీనంలోకి తెచ్చుకుంటే, ఎలాంటి ఆపదనైనా, ఎలాంటి పరిస్థితిని అయినా మనం ఎదుర్కోగలం,” చెప్పాడు ఫ్యూజుల శాన్. జపాంగ్‌లో అందరిని శాన్ అనే సంబోధిస్తారు.

“గొప్ప మాట చెప్పారు. కానీ నన్ను 232-శాన్ అని పిలుస్తూంటే, కొంత ఇబ్బందిగా ఉంది,” చెప్పాడు 232.

“సరే, ఐతే 2+3+2, 7 అవుతుంది కాబట్టి, నిన్ను ఏడు-శాన్ అని పిలుస్తాను.”

“ఇది మరీ ఏడిసినట్టు ఉంది. దీనికంటే 232-శాన్ అనే పిలవండి,” రాజీకి వచ్చాడు 232.

“అలాగే కానీ! నీ ఏకాగ్రత పెరగడానికి నీతో ఒక ఎక్సర్‌సైజ్ ప్రాక్టీస్ చేయిస్తాను. అదిగో! ఆ కనపడుతున్న బండ రాయి మీద ఒంటి కాలితో నిలబడి ఆ చెట్టు మీద పండునే చూస్తూండు. కాసేపయ్యాక నీకు అది తప్ప ఇంకేం కనపడకూడదు. ఒక్కటే గుర్తుండాలి,” ఆర్డర్ వేశాడు ఫ్యూజుల శాన్.

“అలాగే,” అంటూ ఒంటి కాలి మీద ఆ బండ పై కొంగలా నిలబడ్డాడు 232, సారీ, సారీ, 232-శాన్.

అర గంట తరువాత తిరిగి వచ్చిన ఫ్యూజుల శాన్, 232 ఇంకా బండ మీదే ఉండడం చూసి తృప్తిగా తలాడించాడు.

“ఫర్లేదు, నీలో మెల్ల మెల్లగా ఏకాగ్రత పెరుగుతూంది. ఇప్పుడు నీకు ఒక్కటే విషయం గుర్తుండాలి? అవునా?”

“అవును, ఒకే విషయం గుర్తుంది.”

“ఏంటది?”

“నా అరి కాలు!”

“అరి కాలా? అదేంటి, పండు కాదా?”

“మీ మానాన మీరు నన్ను బండ మీద నిలబెట్టి వెళ్ళారు. ఎండకి ఈ బండ వేడెక్కి పోయింది. నా అరికాలు చుర్రు మంటూ కాలుతూంది. అది తప్ప ఇంకోటి ఎలా గుర్తుంటుంది?”

పళ్ళు పట పటా కొరికాడు ఫ్యూజుల శాన్. “నీకు కర్రాటే నేర్పించడం ఏమో కానీ నా బుర్ర మీద నేనే ఒక కర్రతో కొట్టుకోవాలనిపిస్తూంది. నిన్ను చూడమంది ఒక పండుని మాత్రమే, నీకు అది మాత్రమే గుర్తు ఉండాలి. అరి కాలు, మోకాలు కాదు.”

“మోకాలు బానే ఉంది. ఎటొచ్చి అరి కాలు మాత్రమే…”

“ఈఈఈఈఈ”

*************************************************************************************

మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చాడు 232. తనకు ఇప్పుడు కావల్సింది అదే. ఏకాగ్రత. ఈ సారి కాలుతున్న బండ లేదు కాబట్టి కాస్త వీజీగానే ఏకాగ్రత సాధించవచ్చు.

ఈ ముగ్గురు గడ్డాలని ఒకే సారి ఎదుర్కోవడం మంచిది కాదు. పైగా ఆ గొడవలో ప్రయాణీకులకు కూడా ఆపద సంభవించవచ్చు. కాబట్టి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ పోవాలి. ముందుగా తన దృష్టిని చిన్న గడ్డం మీద సారించాడు 232.

యుద్ధం మొదలయ్యింది. ఎస్!

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232, సీరియల్స్. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s