గూఢచారి 232 – పెన్‌తో షూట్ చేయడం అంత వీజీ కాదు!

(
జరిగిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.

232 అనుమానించినట్టే, ఫ్లైట్ టేక్-ఆఫ్ కాగానే ఆ ముగ్గురు ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఆశ్చర్యంగా వారు ముగ్గురూ రాణిమండ్రిలో పుట్టిన తెగులు వారే. హిండియా ఎలాంటి కాంప్రమైజ్‌కి తయారుగా ఉన్నా, తాము హైజాక్ చేయడం మాని ఉండే వారం కాదని, ఒక కారణం కాకపోతే ఇంకొక కారణం సృష్టించుకుని అయినా హైజాక్ చేసి తీరే వారమని చెప్తూ, పైలట్లు ఉన్న కాక్‌పిట్ వైపు బయలుదేరుతారు గడ్డాలు.

కాక్‌పిట్ చేరుకున్నాక అక్కడ పైలట్ల పని తీరు చూసి కోపగించుకుంటారు. ఆ తరువాత తమ షరతులు తెలియజేయడం కోసం కంట్రోల్ టవర్‌కి కనెక్ట్ చేయమంటారు. ఉగ్రవాదుల షరతులని తెలుసుకున్న కంట్రోల్ టవర్ అధికారి రామకోటి విషయాన్ని హోం మినిస్టర్‌కి చేరవేస్తాను అని హామీ ఇస్తాడు.

కంట్రోల్ టవర్ నుంచి కాల్ వచ్చేంత లోపల ప్రయాణీకులకి డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకి పురమాయిస్తారు టెర్రరిస్టులు. అలాంటి దృశ్యం ముందెన్నడూ చూడని కొందరు ప్రయాణీకులు మూర్ఛపోతారు. ఆలస్యానికి ఆగలేక మళ్ళీ కంట్రోల్ టవర్‌కి కాల్ చేసిన పెద్ద గడ్డానికి, హోం మినిస్టర్, ప్రైం మినిస్టర్ మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఫ్యూయెల్ అయిపోకముందే ఆగం పేట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయమన్నారని, కాస్త ఓపిక పట్టమన్నారని, చెప్తాడు రామకోటి.

ఆలస్యానికి చిరాకు పడ్డా మొత్తానికి పైలట్‌ని ఆగంపేట వైపు వెళ్ళమంటాడు పెద్ద గడ్డం. ఫ్లైట్ ఆగంపేటలో ల్యాండ్ అయ్యాక, హోం మినిస్టర్‌కి ఇంకో అర గంట టైం ఇద్దామని, ఆ తరువాత ఒకొక్క ప్రయాణీకుడిని లేపేద్దామని అంటాడు పెద్ద గడ్డం. అంతవరకు డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకు పురమాయిస్తాడు. ఇదంతా అయ్యక, సరిగ్గా పెద్ద గడ్డం సైకాలజిస్టుని చంపేంత లోపల, హిండియన్ ప్రభుత్వం గడ్డాల అన్ని షరతులకి ఒప్పుకుంది, అని వచ్చి చెప్తాడు పెద్ద పైలట్. అది విన్న 232 ఎలాగైనా తనే హైజాకర్లని ఎదుర్కోవాలని నిశ్చయించుకుంటాడు. తనకు కర్రాటే నేర్పిన గురువు ఫ్యూజుల శాన్ చెప్పినట్టుగా ఏకాగ్రత తెచ్చుకుని, ఆ తరువాత చిన్న గడ్డాన్ని టార్గెట్ చేయాలి అని నిశ్చయించుకుంటాడు.

ఇక చదవండి.

)

అన్నిటికంటే ముందుగా గన్ను లాంటి పెన్నుని వాడుదామని నిశ్చయించడు 232. అది పెన్ లా ఉంటుంది కాబట్టి గడ్డాలు తనని అనుమానించే అవకాశం కూడా తక్కువ. క్యాజుయల్‌గా, చాలా క్యాజుయల్‌గా తన జేబులోంచి పెన్ తీశాడు. చిన్న గడ్డం అతనికి పది అడుగుల దూరం మాత్రమే ఉన్నాడు. మెల్లగా పెన్ ఎత్తి అతని వైపు గన్‌లా గురి పెట్టాడు.

కానీ అనుకోకుండా సడన్‌గా వెనక్కి తిరిగాడు చిన్న గడ్డం. పెన్నుని గన్నులా గురి పెట్టి నిలుచున్న 232ని చూసి కొద్దిగా షాక్ అయ్యాడు. 232 వైపు తన గన్ గురి పెడుతూ, “ఏయి, ఏంటది, పెన్నుని అలా గన్నులా పట్టుకున్నావు?” అని అడిగాడు కోపంగా. అతనికి ఇంకా ఆ పెన్ ఒక మినీ గన్ అయ్యుండచ్చు అన్న ఊహ రాలేదు.

ఏం చెప్పాలో అర్థం కాలేదు 232కి. ఇలా అడ్డంగా దొరికిపోవడం అతనికి చిరాకు కలిగించింది. ఐతే 232 మహా మేధావి కాబట్టి, చిన్న గడ్డానికి ఇంక తన పెన్ గురించి ఏ అనుమానం రాలేదన్న విషయం పసిగట్టాడు.

“కవిత్వం,” అన్నాడు అప్రయత్నంగా.

“కవిత్వమా?” చిన్న గడ్డానికి ఆ సమాధానం అర్థం కాలేదు.

“అవును కవిత్వమే! నాకు కవిత్వం రాయాలని మూడ్ వచ్చినప్పుడంతా నేను ఇలా చటుక్కున పెన్ ఎత్తుతాను. గన్‌లా పట్టుకుంటాను.”

“గన్‌లా ఎందుకు పట్టుకోవడం?”

“ఒక కవికి సైనికుడికి తేడా లేదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఒక సోల్జర్ ఎలా ఐతే యుద్ధంలోకి దూకే ముందు గన్ ఎత్తుతాడో, కవితం రాయడానికి మూడ్ వచ్చినప్పుడు నేను అలానే పెన్ ఎత్తుతాను.”

“ఏమో! నాకేదో అనుమానంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఒక కవిత రాసి వినిపించు, చూద్దాం,” సవాలు విసిరాడు చిన్న గడ్డం.

“రాయడమెందుకు సార్! ఆయన నోట్లో కవిత రెడీగా ఉంది కద, చెప్పెయ్యమనండి,” సజెస్ట్ చేశాడు సైకాలజిస్ట్. అప్పటికి ఆయనకు కొంత ధైర్యం వచ్చింది.

“మొదటి సారి కాస్త సెన్సిబుల్‌గా మాట్లాడవు,” మెచ్చుకోలుగా సైకాలజిస్ట్ వైపు చూశాడు చిన్న గడ్డం. 232 వైపు తిరిగి, “విన్నావుగా, ఆ కవితేదో చెప్పు,” అంటూ గద్దించాడు.

“చెప్తాను కానీ, పెన్ ఇలా చేతిలోనే పట్టుకుంటాను, లేకపోతే నాకు మూడ్ రాదు,” అన్నాడు 232, సైకాలజిస్ట్ వైపు అసహ్యంగా చూస్తూ.

“సరే, అఘోరించు. కానీ కవిత నాన్-స్టాప్‌గా చెప్పాలి, ఏ మాత్రం తడబడినా నీ సంగతి ఏమవుతుందో తెలుసుగా?”

“దేవుడికి ప్రీతిపాత్రం అవుతాడు, అంతే కదండి,” అన్నాడు పెద్దాయన.

“కరెక్ట్, సడన్‌గా మీరందరు భలే లాజికల్‌గా మాట్లాడేస్తున్నారే! నువ్వు కానివ్వు!” 232ని అజ్ఞాపించాడు చిన్న గడ్డం.

“విమానం గాల్లో ఎగురుతుంది,

ఓడ నీటి మీద తేలుతుంది,

కారు భూమ్మీద నడుస్తుంది,

కానీ ఒక మనిషి మాత్రం వీటన్నిటీ మీద తిరుగుతాడు,”

అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు 232.

“అదుగో గ్యాప్ ఇస్తున్నావు,” హెచ్చరించాడు చిన్న గడ్డం.

“అబ్బే, జస్ట్ ఊపిరి పీల్చుకుంటున్నా,” అని కవిత కంటిన్యూ చేశాడు 232.

“కుక్కలు పగటి పూట తిరుగుతాయి,

పిల్లులు రాత్రి పూట మేల్కొంటాయి,

దెయ్యాలు అసుర సంధ్య వేళ వచ్చేస్తాయి,

కానీ ఒక మనిషి మాత్రం అన్ని వేళల్లో పారాడతాడు.”

ఈ సారి 232 ఊపిరి పీల్చుకోవడానికి ఆగినప్పటికీ, చిన్న గడ్డం అభ్యంతరం చెప్పలేదు. ఒక్క సైకాలజిస్ట్ తప్ప అందరూ బిక్క మొహాలు వేశారు.

“గాడిదలు చిన్నప్పుడు సోమరిగా ఉంటాయి,

ఆవులు మధ్య వయసులో లేజీగా మారుతాయి.

ఏనుగులు ముసలి వయసులో బద్దకిస్తాయి.

కానీ ఒక మనిషి మాత్రం అన్ని వయసుల్లోనూ సోంభేరిలా మెయింటెయిన్ చేస్తాడు.”

“ఆపు”, గట్టిగా అరిచాడు చిన్న గడ్డం.

“మీరే కద నాన్-స్టాప్‌గా చెప్పమన్నారు.”

“నేనే ఆపెయ్యమని కూడా అంటున్నాను. నీ దిక్కుమాలిన కవితని చెప్పడం మానేసి పేపర్ మీదే రాసుకో! అదే బెటర్,” అంటూ అక్కడినుంచి వెను తిరిగాడు చిన్న గడ్డం.

అప్పుడు కదిలాడు 232. చిన్న గడ్డం అటు వైపు తిరిగి ఉండడాన్ని అడ్వ్యాంటేజ్‌గా తీసుకుంటూ, తన చేతిలోని పెన్‌ని అతని వైపు తిప్పి గట్టిగా విదిల్చాడు. (ఆ పెన్‌తో అలానే కాల్చాలని ఆధునిక రావు అతనికి చెప్పి ఉన్నాడు.) అయితే ఆ ప్రయత్నం వికటించింది. బుల్లెట్ గురి తప్పి ప్యాసెంజర్ సీట్ల మీదున్న లగేజ్ కంపార్ట్‌మెంట్ తలుపుని తాకింది. దాంతో ఆ తలుపు ఓపెన్ అయి ఒక హ్యాండ్ బ్యాగ్ చిన్న గడ్డం నెత్తిన పడింది. ఒక్క దెబ్బకి కుప్ప కూలిపోయాడు అతను. అందరూ హహా కారాలు చేశారు.

ఆ గొడవ విని ముందు వైపు నుంచి పెద్ద గడ్డం, చిన్న గడ్డం పరిగెత్తుకుంటూ వచ్చారు. పడిపోయిన తమ తమ్ముడిని చూసి షాక్ తిన్నారు.

“ఒరే తమ్ముడూ, నీకేమయ్యిందిరా? ఎవరూ ఈ పని చేసింది,” పొలికేక పెట్టాడు పెద్ద గడ్డం.

“ఇది ఒక ఆక్సిడెంట్ సార్. పై నుంచి హ్యాండ్ బ్యాగ్ నెత్తిన పడి మూర్ఛ పోయాడు,” చెప్పాడు పెద్దాయన.

“హ్యాండ్ బ్యాగ్ పడితేనా? అంత వీక్ కాదే మా వాడు?” అంటూ హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూశాడు పెద్ద గడ్డం. అందులో రాళ్ళున్నాయి.

“ఓర్నాయనో, హ్యాండ్ బ్యాగ్‌లో ఈ రాళ్ళేమిటి?” అరిచాడు మధ్య గడ్డం.

“అ బ్యాగ్ నాదే సార్,” కాస్త భయంగానే చెప్పాడు రాధే శ్యాం.

“నీ పాసి గూలా. ఢిల్లీ డాలీ నుంచి రాళ్ళు ఎందుకు తెస్తున్నావు?”

“పక్కింటి వాళ్ళ కోసం సార్. ఖాళీ బ్యాగ్‌తో వెళ్తే అవమానం జరుగుతుంది. అదే ఇలా బరువుగా ఉన్న బ్యాగ్‌ని మోసుకుంటూ వెళ్ళననుకోండి, బోలెడు వస్తువులు ఢిల్లీ డాలీ నుంచి తెచ్చాను అనుకుంటారు.”

చిన్న గడ్డం ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు పెద్ద గడ్డం. “పర్లేదు, శ్వాస ఆడుతూంది. ఒరే తమ్ముడూ ఈ ప్యాసెంజర్ గాడిని తీసుకెళ్ళి టాయిలెట్ రూంలో పడేయి. బయటకు వస్తే కాల్చేయి,” ఆదేశించాడు తన మిగిలి ఉన్న తమ్ముడిని.

“సార్, ఇది దారుణం. ఎయిర్ హిండియా టాయిలెట్‌లో అయిదు నిముషాల కంటే ఎక్కువ ఉంటే చస్తాను. నన్ను వదిలెయ్యండి,” భయంగా వేడుకున్నాడు రాధే శ్యాం.

“అందుకే నిన్ను అక్కడికి పంపిస్తుంది. బుల్లెట్స్ వేస్ట్ కాకుండా చస్తావు,” క్రూరంగా అన్నాడు పెద్ద గడ్డం.

కేకలు పెడుతున్న రాధే శ్యాంని బలవంతంగా టాయిలెట్ వైపు లాక్కుపోయాడు చిన్న గడ్డం.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

2 Responses to గూఢచారి 232 – పెన్‌తో షూట్ చేయడం అంత వీజీ కాదు!

  1. Anuradha says:

    పిల్లులు రాత్రి పూట మేల్కొంటాయి… అవునా ?

    నేను గుడ్లగూబలు రాత్రి పూట మేల్కొంటాయి ,అనుకున్నాను 🙂

    కవిత్వం బాగుంది అండి :))​

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s