గూఢచారి 232 – ఒక్క సిగరెట్టు వెలిగించుకోవచ్చా?

(
జరిగిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.

232 అనుమానించినట్టే, ఫ్లైట్ టేక్-ఆఫ్ కాగానే ఆ ముగ్గురు ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఆశ్చర్యంగా వారు ముగ్గురూ రాణిమండ్రిలో పుట్టిన తెగులు వారే. హిండియా ఎలాంటి కాంప్రమైజ్‌కి తయారుగా ఉన్నా, తాము హైజాక్ చేయడం మాని ఉండే వారం కాదని, ఒక కారణం కాకపోతే ఇంకొక కారణం సృష్టించుకుని అయినా హైజాక్ చేసి తీరే వారమని చెప్తూ, పైలట్లు ఉన్న కాక్‌పిట్ వైపు బయలుదేరుతారు గడ్డాలు.

కాక్‌పిట్ చేరుకున్నాక అక్కడ పైలట్ల పని తీరు చూసి కోపగించుకుంటారు. ఆ తరువాత తమ షరతులు తెలియజేయడం కోసం కంట్రోల్ టవర్‌కి కనెక్ట్ చేయమంటారు. ఉగ్రవాదుల షరతులని తెలుసుకున్న కంట్రోల్ టవర్ అధికారి రామకోటి విషయాన్ని హోం మినిస్టర్‌కి చేరవేస్తాను అని హామీ ఇస్తాడు.

కంట్రోల్ టవర్ నుంచి కాల్ వచ్చేంత లోపల ప్రయాణీకులకి డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకి పురమాయిస్తారు టెర్రరిస్టులు. అలాంటి దృశ్యం ముందెన్నడూ చూడని కొందరు ప్రయాణీకులు మూర్ఛపోతారు. ఆలస్యానికి ఆగలేక మళ్ళీ కంట్రోల్ టవర్‌కి కాల్ చేసిన పెద్ద గడ్డానికి, హోం మినిస్టర్, ప్రైం మినిస్టర్ మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఫ్యూయెల్ అయిపోకముందే ఆగం పేట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయమన్నారని, కాస్త ఓపిక పట్టమన్నారని, చెప్తాడు రామకోటి.

ఆలస్యానికి చిరాకు పడ్డా మొత్తానికి పైలట్‌ని ఆగంపేట వైపు వెళ్ళమంటాడు పెద్ద గడ్డం. ఫ్లైట్ ఆగంపేటలో ల్యాండ్ అయ్యాక, హోం మినిస్టర్‌కి ఇంకో అర గంట టైం ఇద్దామని, ఆ తరువాత ఒకొక్క ప్రయాణీకుడిని లేపేద్దామని అంటాడు పెద్ద గడ్డం. అంతవరకు డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకు పురమాయిస్తాడు. ఇదంతా అయ్యక, సరిగ్గా పెద్ద గడ్డం సైకాలజిస్టుని చంపేంత లోపల, హిండియన్ ప్రభుత్వం గడ్డాల అన్ని షరతులకి ఒప్పుకుంది, అని వచ్చి చెప్తాడు పెద్ద పైలట్. అది విన్న 232 ఎలాగైనా తనే హైజాకర్లని ఎదుర్కోవాలని నిశ్చయించుకుంటాడు. తనకు కర్రాటే నేర్పిన గురువు ఫ్యూజుల శాన్ చెప్పినట్టుగా ఏకాగ్రత తెచ్చుకుని, ఆ తరువాత చిన్న గడ్డాన్ని టార్గెట్ చేయాలి అని నిశ్చయించుకుంటాడు. పెన్‌ని గన్‌లా వాడడంలో కాస్త పొరపాటు జరిగినా మొత్తానికి చిన్న గడ్డాన్ని మూర్ఛ పోయేలా చేస్తాడు 232.

ఇక చదవండి.

)


“అసలు మా వాడు ఇలా పడిపోయే ముందు ఏం జరిగింది?” చుట్టూ ఉన్న అందరిని ప్రశ్నించాడు పెద్ద గడ్డం.

“పడి పోయే ముందు ఈయనతో మాట్లాడారండి. ఈయనేదో కవిత రాస్తున్నా అని చెప్పారు. మీ తమ్ముడు గారు ఏదీ వినిపించు అన్నారు. ఈయన వినిపించారు. అసయ్యంగా ఉంది అని మీ తమ్ముడు గారు వెనక్కి తిరిగారు. అంతే! పైన ఓవర్‌హెడ్ క్యాబిన్ తెరుచుకోవడం, ఆ హ్యాండ్ బ్యాగ్ మీ తమ్ముడి గారి తల మీద పడడం, ఆయన మూర్ఛ పోవడం అన్నీ వెంట వెంటనే జరిగాయి,” 232 వైపు చూపిస్తూ చెప్పాడు సైకాలజిస్ట్.

“అలాగా, ఏంటా కవిత, నాకు కూడా వినిపించు,” 232ని ఆర్డర్ చేశాడు పెద్ద గడ్డం.

“విమానం గాల్లో ఎగురుతుంది,
ఓడ నీటి మీద తేలుతుంది”

మొదలు పెట్టాడు 232.

“సార్! మీకు పుణ్యం ఉంటుంది. ఇంతకు ముందు ఆ కవిత విన్న ఎఫెక్ట్ నుంచి ఇంకా తేరుకోలేదు. మీ తమ్ముడు గారు కూడా మొత్తం వినలేక పోయారు,” బతిమాలుకున్నాడు పెద్దాయన.

“అవును, అవును!” కోరస్‌గా అరిచారు మిగతా అందరు.

“ఓహో, మా తమ్ముడికి నచ్చ లేదు అంటే, నాకు కూడా నచ్చదు. మా ఇద్దరి టేస్ట్ ఒకటే. మొన్నటికి మొన్న శ్యాం గోపాల్ వర్మ ‘బిస్కట్’ సిరీస్‌లో లేటెస్ట్ పిక్చర్ చూసి ఇద్దరం ఒక టైంలో డోక్కున్నాం,” అంటూ 232ని కవిత చెప్పడం ఆపమని సైగ చేశాడు పెద్ద గడ్డం.

ఇంతలో చిన్న గడ్డం బాత్‌రూంలో రాధే శ్యాంని పడేసి తిరిగి వచ్చాడు.

“పద తమ్ముడు వీడిని మోసుకెళ్ళి ముందు పడుకో పెడదాం,” అన్నాడు పెద్ద గడ్డం.

ఇద్దరు గడ్డాలు మూడో గడ్డాన్ని మోసుకుని వెళ్ళిపోయారు.

ఇంక మిగిలింది ఇద్దరు అనుకున్నాడు 232. తన మీద అనుమానం రాక పోవడం తనకు కలిసి వచ్చే విషయమే. ఇప్పుడు మధ్య గడ్డాన్ని టార్గెట్ చేయాలి.

మళ్ళీ ఫ్యూజుల శాన్ చెప్పిన ఒక ముఖ్యమైన విషయం గుర్తుకి వచ్చింది 232కి.

*************************************************************************************

“ఒక్క విషయం గుర్తు పెట్టుకో 232-శాన్. యుద్ధంలో శత్రువుని ఓడించడానికి అతి ముఖ్యమయినది ఆశ్చర్యం,” గంభీరంగా చెప్పాడు ఫ్యూజుల శాన్.

“అంటే శత్రువుని చూడగానే మనం ఆశ్చర్య పోవాలా, గురువు గారు,” అడిగాడు 232.

“నీ మొహం! శత్రువుకి ఆశ్చర్యం కలిగేలా మనం అతన్ని దెబ్బ తీయాలి. ఊహించని విధంగా అటాక్ చేయాలి. అర్థమయ్యిందా?”

“ఏదో కాస్త అర్థమైనట్టే ఉంది.”

“సరే ఇప్పుడు నువ్వు నా ప్రియ శిష్యుడు బల్బుల-శాన్‌తో తల పడబోతున్నావు. నన్-చాకు మీ ఆయుధం. నేను మిగతా శిష్యులు ఏం చేస్తున్నారో చూసి వస్తాను. కనీసం బల్బుల-శాన్‌ని ఐదు నిముషాలు అయినా ఆపడానికి ప్రయత్నించు.”

“అలాగే గురువు గారు!”

ఫ్యూజుల-శాన్ అక్కడినుంచి నిష్క్రమించాడు.

232, బల్బుల శాన్‌ల మధ్య నన్-చాకూలతో పోటీ మొదలు అయ్యింది. ఒక శిష్యుడికి ఇవ్వాల్సిన ఆరెంజ్ బెల్ట్ మరిచిపోవడంతో, ఫ్యూజుల-శాన్ రెండు నిముషాల్లోనే వెను తిరిగి మళ్ళీ 232 ఉన్న చోటికి వచ్చాడు. అతనికి ఒక్క 232 మాత్రమే కనపడ్డాడు.

“అదేంటి, బల్బుల-శాన్ ఎక్కడ? ఇంకా రాలేదా? పోటీ జరగలేదా?” ఆశ్చర్యంగా అడిగాడు ఫ్యూజుల-శాన్ 232ని.

“రావడం, పోటీ చేయడం, అయిపోవడం అన్నీ జరిగి పోయాయి గురువు గారు,” తాపీగా సమాధానం ఇచ్చాడు 232.

“మరి బల్బుల-శాన్ ఏడీ?”

“కింద చూడండి.”

కింద చూసి షాక్ తిన్నాడు ఫ్యూజుల శాన్. బల్బుల శాన్ ఒళ్ళంతా రక్తసిక్తమై విరుచుకు పడిపోయి ఉన్నాడు.

“ఓరి నాయనో! వీడు అరివీర భయంకరుడు. నన్-చాకూ యుద్ధంలో వీడికి తిరుగే లేదు. వీడిని ఎలా ఓడించావు?”

“మీరు చెప్పిన పద్ధతే వాడాను గురువు గారూ!”

“నేను చెప్పిన పద్ధతా?”

“అదే, ఆశ్చర్యం! శత్రువుని ఊహించని విధంగా దెబ్బ తీయాలి అన్నారు కద. అందుకే నన్-చాకూ పడేసి, ఈ దుంగతో వాడిని చితక బాదాను,” పక్కనే పడి ఉన్న దుంగని చూపిస్తూ చెప్పాడు 232.

“ఓరి నికృష్టుడా! ఇది శిక్షణరా. నువ్వు నేర్చుకోవల్సింది నన్-చాకూతో మెలకువలు. ఇలా దుంగతో దొంగ దెబ్బ తీయడం కాదు.”

“దొంగ దెబ్బ కాదు గురువు గారూ, ఆశ్చర్యపు దెబ్బ.”

“అయ్యయ్యో నా ప్రియ శిష్యుడు ఇప్పుడు కోలుకోవడానికి ఎంత కాలం పడుతుందో! ఛీ! నిన్ను నా స్కూల్‌లో చేర్చుకోవడం నేను చేసిన అతి పెద్ద తప్పు. ఒరే వైరుల-శాన్, స్విచ్చుల-శాన్! వీడిని మన స్కూల్ ప్రహరీ గోడ అవతల పడేయండి. తిరిగి ఈ ఏరియాలో కనిపిస్తే కాళ్ళు విరగ్గొట్టండి,” ఆర్డర్ జారీ చేశాడు ఫ్యూజుల శాన్.

శిష్య ద్వయం 232ని బయటకు ఈడ్చుకుపోయారు.

*************************************************************************************

తిరిగి ప్రస్తుతంలోకి వచ్చాడు 232. ఆశ్చర్యం. ఇప్పుడు అదే తన ఆయుధం. ఆధునిక రావు ఇచ్చిన సిగరెట్‌ని బయటకు తీశాడు. దాన్ని ఎలా వాడాలో చెప్పిన ఆయన మాటలు గుర్తుకు వచ్చాయి అతనికి. “అది కాల్చుకోవడానికి కాదు. అది వెలిగించాక వచ్చే పొగ వాసన పీలిస్తే ఎదుటి వాడు మూర్ఛ పోతాడు,” అన్నది వాటి సారాంశం.

మధ్య గడ్డం ప్లేన్ మధ్య భాగంలో ఉన్నాడు. పెద్ద గడ్డం ప్లేన్ ముందు భాగంలో పచార్లు చేస్తున్నాడు. “హలో సార్, నాదొక చిన్న రిక్వెస్ట్,” మధ్య గడ్డాన్ని ఉద్దేశించి గట్టిగా అన్నాడు 232. ఏమిటి అన్నట్టు కనుబొమ్మలేగరేశాడు అతను.

“చాలా సేపటి నుండి సిగరెట్ కాల్చక పళ్ళు పీకేస్తున్నాయి. ఒక సిగరెట్ కాల్చుకోవచ్చా?”

“ఇదెక్కడో విన్న డైలాగ్‌లా ఉందే! ఆ! రిచంజీవి, “ఖైదీన్రోయి” సినిమాలో, పోలీసు జీప్‌లో వెళ్తున్నప్పుడు ఇదే డయలాగ్ చెప్తాడు. సిగరెట్ ఇవ్వగానే దాన్ని కాల్చి డ్రైవర్ మెడ మీద తుపుక్కున ఉమ్ముతాడు. జీపు కంట్రోల్ తప్పుతుంది. రిచంజీవి తప్పించుకుంటాడు. అదేనా నీ ప్లాన్ కూడా?”

“ఏడ్చినట్టుంది. ఇది ల్యాండ్ అయి ఉన్న ప్లేన్. మీ మెడ మీద నేను సిగరెట్ ఊసినా, మీకు చురుక్కుమంటుందేమో కానీ, ఏ హానీ జరగదు. ఆ తరువాత మీరు మీ దగ్గరున్న గన్‌తో నన్ను దేవుడికి ప్రీతి పాత్రుడిని చేస్తారు. పైగా మీరు నాకు సిగరెట్ ఇవ్వక్కర్లేదు. నా దగ్గర ఉంది. మీరు లైటర్ ఇస్తే చాలు,” మృదువుగా చెప్పాడు 232.

“నా దగ్గర లైటర్ ఉంది అని నీకెలా తెలుసు?”

“సార్! మీరు హైజాకర్లు. మీ దగ్గర కాల్చేసేవీ, పేల్చేసేవీ బోలెడు సాధనాలు ఉంటాయి.”

“ఫర్లేదు, తెలివైన వాడివే! సరే అలాగే కానీయి. పిచ్చి వేషాలు వేయాలని మాత్రం ప్రయత్నించకు!” లైటర్ బయటకు తీసాడు మధ్య గడ్డం.

“భలే వారు సార్!” అంటూ ఆధునిక రావు ఇచ్చిన సిగరెట్ తీసి మధ్య గడ్డం ముందుకు చాచిన లైటర్‌తో వెలిగించుకున్నాడు 232.

ఆ తరువాత పొగని లోపలికి పీల్చుకోకుండా, ఊపిరి బిగబట్టి, మధ్య గడ్డం మొహం మీదకు ఊదాడు.

“ఏయి! ఏంటిది? చనువిస్తే చంకనెక్కేలా ఉన్నా…..” అంటూనే, కళ్ళు తేలేస్తూ దబ్బున పడిపోయాడు మధ్య గడ్డం.

మళ్ళీ అందరూ హాహాకారాలు చేశారు. ముందు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు పెద్ద గడ్డం. “ఇదేంటి, వీడు కూడా మూర్ఛ పోయాడు?” అని అడుగుతూనే అక్కడే ఉన్న 232ని గమనించాడు. 232 పెద్ద గడ్డం మొహం మీద కూడా ఊదుదాం అనుకున్నాడు కానీ, అప్పటికే ఊపిరి బిగబట్టినందు వల్ల గుండెలు పిండేసినట్టు నొప్పి కలగడంతో, సిగరెట్‌ని పక్కకు ఊసేసి, గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.

“హ్యాండ్సప్!” కరకుగా అన్నాడు పెద్ద గడ్డం.

“అదేంటి సార్, సిగరెట్ ఊస్తే అంత కోప్పడతారు, కావాలంటే తీసి డస్త్‌బిన్‌లో పడేస్తాను లెండి,” అమాయకంగా మొహం పెడుతూ అన్నాడు 232.

“నోర్మూయి! నా ఇద్దరు తమ్ముళ్ళూ స్పృహ తప్పినప్పుడు, సీన్లో నువ్వే ఉన్నావు. నువ్వే ఏదో చేస్తున్నావు. నిన్ను వదలను. పద వెనకాలకి! నిన్ను అక్కడే చంపుతాను,” గర్జించాడు పెద్ద గడ్డం.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s