గూఢచారి 232 – ముక్కు పొడుం వాడడం చాలా దరిద్రమైన అలవాటు (ఆఖరి భాగం)

(
జరిగిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.

232 అనుమానించినట్టే, ఫ్లైట్ టేక్-ఆఫ్ కాగానే ఆ ముగ్గురు ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఆశ్చర్యంగా వారు ముగ్గురూ రాణిమండ్రిలో పుట్టిన తెగులు వారే. హిండియా ఎలాంటి కాంప్రమైజ్‌కి తయారుగా ఉన్నా, తాము హైజాక్ చేయడం మాని ఉండే వారం కాదని, ఒక కారణం కాకపోతే ఇంకొక కారణం సృష్టించుకుని అయినా హైజాక్ చేసి తీరే వారమని చెప్తూ, పైలట్లు ఉన్న కాక్‌పిట్ వైపు బయలుదేరుతారు గడ్డాలు.

కాక్‌పిట్ చేరుకున్నాక అక్కడ పైలట్ల పని తీరు చూసి కోపగించుకుంటారు. ఆ తరువాత తమ షరతులు తెలియజేయడం కోసం కంట్రోల్ టవర్‌కి కనెక్ట్ చేయమంటారు. ఉగ్రవాదుల షరతులని తెలుసుకున్న కంట్రోల్ టవర్ అధికారి రామకోటి విషయాన్ని హోం మినిస్టర్‌కి చేరవేస్తాను అని హామీ ఇస్తాడు.

కంట్రోల్ టవర్ నుంచి కాల్ వచ్చేంత లోపల ప్రయాణీకులకి డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకి పురమాయిస్తారు టెర్రరిస్టులు. అలాంటి దృశ్యం ముందెన్నడూ చూడని కొందరు ప్రయాణీకులు మూర్ఛపోతారు. ఆలస్యానికి ఆగలేక మళ్ళీ కంట్రోల్ టవర్‌కి కాల్ చేసిన పెద్ద గడ్డానికి, హోం మినిస్టర్, ప్రైం మినిస్టర్ మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఫ్యూయెల్ అయిపోకముందే ఆగం పేట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయమన్నారని, కాస్త ఓపిక పట్టమన్నారని, చెప్తాడు రామకోటి.

ఆలస్యానికి చిరాకు పడ్డా మొత్తానికి పైలట్‌ని ఆగంపేట వైపు వెళ్ళమంటాడు పెద్ద గడ్డం. ఫ్లైట్ ఆగంపేటలో ల్యాండ్ అయ్యాక, హోం మినిస్టర్‌కి ఇంకో అర గంట టైం ఇద్దామని, ఆ తరువాత ఒకొక్క ప్రయాణీకుడిని లేపేద్దామని అంటాడు పెద్ద గడ్డం. అంతవరకు డ్రింక్స్ సర్వ్ చేయమని ఎయిర్ హోస్టెస్‌లకు పురమాయిస్తాడు. ఇదంతా అయ్యక, సరిగ్గా పెద్ద గడ్డం సైకాలజిస్టుని చంపేంత లోపల, హిండియన్ ప్రభుత్వం గడ్డాల అన్ని షరతులకి ఒప్పుకుంది, అని వచ్చి చెప్తాడు పెద్ద పైలట్. అది విన్న 232 ఎలాగైనా తనే హైజాకర్లని ఎదుర్కోవాలని నిశ్చయించుకుంటాడు. తనకు కర్రాటే నేర్పిన గురువు ఫ్యూజుల శాన్ చెప్పినట్టుగా ఏకాగ్రత తెచ్చుకుని, ఆ తరువాత చిన్న గడ్డాన్ని టార్గెట్ చేయాలి అని నిశ్చయించుకుంటాడు. పెన్‌ని గన్‌లా వాడడంలో కాస్త పొరపాటు జరిగినా మొత్తానికి చిన్న గడ్డాన్ని మూర్ఛ పోయేలా చేస్తాడు 232. అలాగే ఆధునిక రావు ఇచ్చిన సిగరెట్ పొగ మొహమ్మీదకి ఊది, మధ్య గడ్డానికి స్పృహ తప్పిస్తాడు. ఇదంతా 232 పనే అని గ్రహించిన పెద్ద గడ్డం 232ని చంపడానికి నిశ్చయించుకుంటాదు.

ఇక చదవండి.

)

“నేను నిన్ను చూసినప్పుడే అనుమానించాను. ఈ గవర్నమెంట్ గుంపులో నువ్వు ఫిట్ కావట్లేదని అనిపించింది. పైగా మమ్మల్ని ఒకటే అనుమానంగా చూస్తున్నావు. కానీ నువ్వూ మిగత ప్రయాణీకుల్లానే గప్‌చుప్‌గా ఉండడం చూసి వదిలేశాను. ఇలా నా తమ్ముళ్ళిద్దరూ స్పృహ తప్పాక అర్థమయ్యింది, నా అనుమానం నిజమేనని,” కరకుగా అన్నాడు పెద్ద గడ్డం.

ఇక బుకాయించి లాభం లేదని అర్థం అయ్యింది 232కి. బుకాయించాల్సిన అవసరం కూడా లేదు. పెద్ద గడ్డం ఒకడే మిగిలాడు. ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చేసింది.

“అవును నేనే నీ ఇద్దరు తమ్ముళ్ళకి స్పృహ పోగొట్టింది. ఒక హిండియన్ సిటిజెన్‌గా అది నా కర్తవ్యం,” తను కూడా కరకుగా గొంతు మార్చి అన్నాడు 232.

“అసలు ఎవరు నువ్వు, ఏం చేస్తూంటావు?”

“వ్యవసాయం చేస్తూంటాను!”

“వ్యవసాయమా?”

“నీ లాంటి కలుపు మొక్కలని, చీడ పురుగులని ఏరేస్తూంటాను.”

“ఇదెక్కడో విన్నట్టుంది. ఆ! ఇది డోకిరి సినిమాలోది కద! పంచ్ డయలాగ్స్ ఆపేసి అసలు సంగతి చెప్పు.”

“సరే! నేను గూఢచారి 232ని. ఛీ.బీ.ఐ.కి పని చేస్తాను.”

“232 ఏంటి? కొత్తగా ఉంది?”

“నేను 116 కంటే డబుల్ రెట్టింపు పవర్‌ఫుల్ కాబట్టి నాకా పేరు.”

“ఓహో!” సాలోచనగా తల పంకించాడు పెద్ద గడ్డం. “మంచిది. మా ఆశయం తీరడమే కాకుండా, నాకు ఛీ.బీ.ఐ.కి చెందిన అతి పెద్ద గూఢచారిని చంపే అవకాశం కూడా వచ్చింది. సరే, చావడానికి సిద్ధంగా ఉండు,” అంటూ గన్ 232వైపు ఎక్కు పెట్టాడు.

“నా ఆఖరి కోరిక తీర్చవా?”

“ఎందుకు తీర్చాలి? ఇదేమన్నా ఉరి శిక్ష అనుకున్నావా? ఇదొక ఉగ్రవాది కక్ష!”

“తీరిస్తే నీకే మంచిది.”

“అదెలా?”

“నువ్వు నన్ను చంపేస్తావు, ఎలాగూ మా గవర్నమెంట్ ఉగ్రవాదుల్ని విదదల చేస్తుంది. అందుకు ఎక్స్‌చేంజ్‌గా నువ్వు మా ప్రయాణీకుల్ని వదిలేస్తావు. కాబట్టి వారందరి ముందు నా ఆఖరి కోరిక తీర్చావనుకో, బయటకు వెళ్ళాక వాళ్ళంతా ఈ విషయం చెప్తారు. దాంతో నీకు గొప్ప పేరొస్తుంది.”

“అవునా? ఎందుకు?”

“ఎందుకేంటి, మా దేశంలో ఉన్న ఎర్ర మేధావులు ఎప్పుడూ ఉగ్రవాదాన్ని మానవతా దృష్టితో చూడాలని వాదిస్తూంటారు. టెర్రరిజం అనేది యువకులకు ఉద్యోగాలు లేక, చదువు లేక పుట్టుకొచ్చిందని, లేక పోతే వారంతా మంచివారే అని నమ్మ బలుకుతూంటారు.”

“అలాంటి మూర్ఖులు కూడా ఉన్నారా?

“బోలెడు మంది ఉన్నారు. ఎప్పుడూ శ్యాంగోపాల్ వర్మ సినిమాలు చూడడం ఆపేసి కాస్త అధోగతి రాయి లాంటి వాళ్ళ రాతలు చదివితే అర్థం అవుతుంది. ఉగ్రవాదులకు ఎంత సింపతీ ఉందో!”

“ఓహో!”

“కాబట్టి ఆ వర్గానికి నువ్వు నా ఆఖరి కోర్కె తీర్చారని తెలిసింది అనుకో, వెంటనే నువ్వు ఉగ్రవాదివి కాదని, విలువలు కలిగిన ఒక వీరుడివని, మా హిండియన్ గవర్నమెంటే ఏదో తప్పు చేసుంటందని, అందుకే నువ్వు ఇలా అయ్యావని, పేపర్లో రాసేసి, టీవీలో ఉపన్యాసాలు దంచేస్తారు. నీకు పిచ్చ పాపులారిటీ, సపోర్ట్!”

“అబ్బో!”

“ఆలోచించుకో మరి!”

“సరే!” ఒక నిర్ణయానికి వచ్చాడు పెద్ద గడ్డం. “మా సిద్ధాంతం విజయం సాధించడానికి ప్రచారం కూడా అవసరం. నీ ఆఖరి కోర్కె తీరిస్తే నాకు పోయేదేమీ లేదు. వచ్చేది చాలా ఉంది. అలాగే!”

“థాంక్యూ!” సిన్సియర్‌గా అన్నాడు 232.

“అందరూ ఇటు రండి,” దూరంగా ఉన్న ప్రయాణీకుల్ని పిలిచాడు పెద్ద గడ్డం. “ఇతని ఆఖరి కోర్కె తీర్చి తరువాత చంపబోతున్నాను. మీరందరూ దానికి సాక్ష్యం!”

అంతా వచ్చి ప్లేన్ చివరి భాగంలో గుమి గూడారు.

“చెప్పు, నీ ఆఖరి కోర్కె ఏమిటో?” 232ని అడిగాడు పెద్ద గడ్డం.

“నాకు ఈ నల్ల కళ్ళజోడు తొడుక్కుని, ముక్కుపొడుం పీల్చాలని ఉంది,” సిగ్గు పడుతూ చెప్పాడు 232.

“ముక్కు పొడుం వాడడం చాలా దరిద్రమైన అలవాటు.”

“హైజాక్ చేయడం కంటే ఏమీ కాదు.”

“సర్లే. ఆ కళ్ళజోడు దేనికి?”

“చనిపోయే టైంలో కూడా గ్లామర్ మెయింటెయిన్ చేయాలి అన్నది నా ఆశయం. డెబ్భై ఏళ్ళు వచ్చినా, పద్దెనిమిది ఏళ్ళ హీరోయిన్స్‌తో చిందులు వేసే మా త్రిలింగ హీరోలే ఇందులో నాకు ఆదర్శం.”

“సరే, అఘోరించు!”

232 నల్ల కళ్ళజోడు ధరించాడు. అదే సమయంలో తన ముందు ఉన్న పెద్ద గడ్డాన్ని, మిగతా ప్రయాణీకులని, దాని సహాయంతో ఒక సీక్రెట్ ఫోటో తీశాడు. ముక్కు పొడుం డబ్బా జేబులోంచి తీసి దాన్ని ఓపెన్ చేశాడు. దాన్ని ఉండగా చుట్టి, ఆధునిక రావుని తల్చుకుంటూ సడన్‌గా పెద్ద గడ్డం మీదకి విసిరాడు.

అంతే, పెద్ద విస్ఫోటం!

232 విసిరిన ముక్కు పొడుం ఉండ, పెద్ద గడ్డం పైన ఉన్న ప్లేన్ పై కప్పుకి తగిలి పేలడంతో, ఆ కప్పు విరిగి పెద్ద గడ్డం, 232 ఇద్దరి తలల మీద పడింది.

“జిగాద్,” అని అరుస్తూ పెద్ద గడ్డం నేలకి ఒరిగాడు. తన కళ్ళ ముందు నల్లటి వలయాలు కనిపిస్తూండగా, 232 కూడా కుప్ప కూలిపోయాడు.ఉప సంహారం:

232కి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ఒక్క క్షణం తనెక్కడున్నాడో అర్థం కాలేదు. నెమ్మదిగా తను ఏదో హాస్పిటల్‌లోని ఒక బెడ్ మీద పడుకుని ఉన్నాడు అని గ్రహించగలిగాడు.

మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్న ఆకారం తనకు సుపరిచితమైనట్టు అనిపించింది. కాస్త పరీక్షగా చూస్తే అది తన బాస్ శాతకర్ణి గారిదని అర్థమయ్యింది.

“హైజాక్..” గొణిగాడు 232.

“జరగలేదు. హైజాకర్ల ముఠా నాయకుడిని గాయపరిచే ప్రయత్నంలో నువ్వు కూడా స్పృహ కొల్పోయావు. మిగతా ప్రయాణీకులకు ఏం కాలేదు. పైలట్ కంట్రోల్ టవర్‌కి వెంటనే ఈ విషయాన్ని తెలియపరిచాడు. రామకోటి పోలీసులని కాంటాక్ట్ చేశాడు. వాళ్ళు వచ్చి ముగ్గురు హైజాకర్లని అదుపులోకి తీసుకుని, నిన్ను హాస్పిటల్‌కి పంపించారు. గత 72 గంటలుగా నువ్వు అపస్మారక స్థితిలో ఉన్నావు. మన వాళ్ళంతా వంతుల వారీగా నీకు కాపలా కాస్తున్నారు. ఈ రోజు నా వంతు,” వివరించారు శాతకర్ణి గారు.

విజయగర్వంతో ఒక చిరు నవ్వు చిందించాడు 232. శాతకర్ణి గారు మొహం ఇంకా ముడుచుకుని ఉండడం చూసి అంతా సజావుగా జరగలేదని అతనికి అర్థం అయ్యింది. ఏమయ్యుంటుంది?

అతని ఆలోచనలు గ్రహిస్తూ సమాధానమిచ్చారు శాతకర్ణి గారు. “నువ్వనుకుంటున్నది నిజమే! హైజాక్ ఆపావు అన్న కృతజ్ఞత కూడా లేకుండా ఎయిర్ హిండియా వాళ్ళు, తమ ప్లేన్‌ని ధ్వంసం చేశావని, నీ మీద అంటే ఛీ.బీ.ఐ. మీద, హోం మినిస్టర్ దగ్గర ఫిర్యాదు చేశారు.”

పళ్ళు కొరికాడు 232. “ఈ సారి అవకాశం వచ్చినప్పుడు మొత్తం ప్లేన్‌ని లేపేస్తాను,” ఆవేశంగా అన్నాడు.

“నీకా చాన్స్ ఇప్పట్లో రాదులే. హోం మినిస్టర్‌కి అసలే ఛీ.బీ.ఐ. అంటే పడదు. ఈ వంక చూసుకుని నిన్ను సంవత్సరం సస్పెండ్ చేయాలని ఆర్డర్ వేశారు. ఏదో నువ్వు కళ్ళజోడు వాడి తీసిన సీక్రెట్ ఫోటో చూపించి, నా ఇన్‌ఫ్లూయెన్స్ వాడి నీకు నెల నెలా జీతం వచ్చే ఏర్పాటు మాత్రం చేయగలిగాను.”

“నహీ!” అరిచాడు 232.

(అయిపోలేదు)

ఉదయించే సూర్యుడిని, నిదరొచ్చే సోమరిని ఎవరూ ఆపలేరు. 232 కూడా మళ్ళీ మన ముందుకొస్తాడు.

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

4 Responses to గూఢచారి 232 – ముక్కు పొడుం వాడడం చాలా దరిద్రమైన అలవాటు (ఆఖరి భాగం)

 1. aksastry says:

  డియర్ మురళి!

  అప్పుడే చివరి భాగమా?…..అనుకున్నాను. ఇంకా “అయిపోలేదు” అనగానే భలే సంతోషం వేసింది! ఇంకా చాలా వ్రాయండి మరి!

  • Murali says:

   అంటే, ప్రస్తుతానికి అయిపోయినట్టే అండి. మళ్ళీ 232ని డిటెక్టివ్ కథల్లో హీరోగా పెట్టి (సింగిల్ ఎపిసోడ్స్) రాయాలని ఆలోచన ఉంది. అందుకే మళ్ళీ వస్తాడు అని వ్రాశాను.

   ఈ సీరియల్ రాయడం నాకు ఒక వైపు ఎంతో ఆనందాన్ని ఇచ్చినప్పటికి, ఇంకో వైపు నన్ను మిగతా విషాయాల మీద వ్రాసే తీరిక లేకుండా చేసింది. పైగా అటు కేంద్రంలో ఇటు తెలుగు రాష్ట్రల్లో ప్రభుత్వాలు ఏర్పడి సంవత్సరం అయ్యింది కద! కాస్త మన నాయకుల మీద దృష్టి సారించాలి. 🙂

 2. క్లైమాక్సు అదిరింది!మన గవరనమెంటులో ఒక సాఖకీ మరో శాఖకీ అట్టాంటి జట్టీలు ఉంటాయి మరి,ఉందకపోఏ చీ చీ నెహ్రూ ఆత్మ బాధపడుద్ది మరి నేను పుట్టించిన వ్యవస్థ ఇంతగా మారిపోయిందా అని!

 3. A Amun says:

  ఉదయించే సూర్యుడిని, నిదరొచ్చే సోమరిని ఎవరూ ఆపలేరు 🙂
  nice!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s