వారసత్వపు రాజకీయాలా! బంధు ప్రీతా! అబ్బెబ్బే, చొచ్చొచ్చో!


యధావిధిగా సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే ప్రయత్నంలో భాగంగా నేను ధన్వంతరి గాడి ఇంటికి చేరుకున్నాను. ఈ సారి ఏ పాటను భ్రష్టు పట్టిస్తాడో అన్న భయం ఒక వైపు ఉన్నప్పటికీ, సివిల్స్ పరీక్షల్లో నెగ్గాలన్న ఆశయం దాన్ని జయించింది.

కానీ ఏ కళలో ఉన్నాడో కానీ ఈ సారి ధన్వంతరి పాట పాడుతూ ఎదురవ్వలేదు. “రా రా! ఈ రోజు న్యూస్‌ని వివిధ చానెల్స్‌లో చూసి లోక జ్ఞానం పెంచుకుందాం,” అన్నాడు.

ఊ టీవీలో సూర్యబాబు నాయుడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక విలేఖరి, “మీరు వారసత్వపు రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారని, మీకు బంధు ప్రీతి ఎక్కువ అని ఒక అపవాదు ఉంది. దానికి మీ సమాధానం?”

“చూడండి. నాకు బంధు ప్రీతి లేదు అని మా బంధువులందరికి తెలుసు. 1995లో మా మామ గారిని పదవి నుంచి తప్పించింది ఎందుకనుకున్నారు? మామా అల్లుడూ ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే అందరూ అపార్థం చేసుకోరూ? అందుకే ఆయన్ని దింపేసి నాకు బంధు ప్రీతి లేదని నిరూపించుకున్నాను. అలాగే మా బావ మరిది బుజ్జి కృష్ణని పార్టీలో సైడ్‌లైన్ చేసేశాను. ఇంకో బామ్మర్ది వరి కృష్ణని అసలు ఏ పదవి ఇవ్వకుండా గల్లంతు చేశాను. బంధు ప్రీతి నా రక్తంలోనే లేదు,” ఆవేశంగా సమాధానమిచ్చాడు సూర్య బాబు.

“మరి ప్రపంచేష్ బాబు సంగతేంటి? ఆయన ఒక రాజ్యాంగేతర శక్తి గా ఎదుగుతున్నాడట?”

“వాడు రాజ్యాంగేతర శక్తేంటి? ఇంకా బొడ్డూడని బుడ్డోడు. అయినా సరే ఎవరూ నన్ను వేలెత్తి చూపకుండా వాడిని ఎప్పుడూ ఏదో ఒక విదేశీ పర్యటన మీద పంపిస్తున్నాను. ‘డ్యాడీ, డ్యాడీ! నేను కూడా ఎం.ఎల్.సీ సీట్లు మన పార్టీ సభ్యులకి పంచే ఆట ఆడుకుంటా డ్యాడీ,’ అంటే, పిల్లకాయ ముచ్చట పడుతున్నాడు అని ఏదో కాస్త ఆ బాధ్యత అప్ప జెప్పాను, అంతే! నామీద చిన్న మచ్చ పడినా నాకు జ్వరం వచ్చేస్తుంది. ఇలాంటి అపవాదులు నాపై వేయకండి,” గద్గద స్వరంతో అన్నాడు బాబు.

“నిజమేరా, బాబు గారికి అసలు బంధు ప్రీతి లేదు! చానెల్ మార్చు,” అన్నాను నేను.

ఈ సారి ఛాఛీ చానెల్‌కి మార్చాడు ధన్వంతరి.

బంధు ప్రీతి గురించి ఆయన్ను కూడా ఎవరో అడిగినట్టున్నారు. వై.నో. గగన్ కోపంతో చండ్ర నిప్పులు కక్కుతున్నాడు.

“నాకు బంధు ప్రీతి లేదని అందరికి తెలుసు. మా చిన్నాయన వినోదానంద రెడ్డి గారిని పార్టీ నుంచి తోలేశాను. మా చెల్లయి ఊర్మిళను మాకు ఎలాంటి ఫాలోయింగ్ లేని బృందగానాకి ఇన్-చార్జ్ చేశాను. ఆఖరి మా అమ్మని కూడా ఖచ్చితంగా ఓడిపోయే నియోజక వర్గం నుంచి పోటీ చేయించాను. కాబట్టి నాకున్నది బంధు ప్రీతి కాదు, ఉత్తి స్వప్రీతి మాత్రమే!”

“సరే, ఐతే ఈయనకు కూడా బంధు ప్రీతి లేదన్న మాట, చానెల్ మార్చరా!” అన్నాను నేను.

నమస్తే బృందగానా చానెల్ పెట్టాడు ధన్వంతరి.

“వారసత్వపు రాజకీయాలు అన్న మాట ఇంటేనే నాకు కక్కొస్తది. ఎన్నికలకి ముందు మా అల్లుడు హరాస్ రావు దూకుడు జూసి, ప్రభుత్వంలోకి రాగానే తోక కట్ జేసిన. బరల్, నాయకత్వ లేమి ఉండకూడదని మా పోరగాడిని తీసుకొచ్చిన అనుకో! గట్లనే బంధు ప్రీతి లేదు అనేందుకే నా బిడ్డ తవికను స్టేట్‌ల ఉండొద్దని పార్లమెంట్‌కి పంపిన. గంతెందుకు వయ్యా! బంధువుల సంగతి వదిలేయుండ్రి. దోస్తుల సంగతి సూడుర్రి. ఉద్యమంలో నాతో పాల్గొన్న ఒక్కడైన ఇప్పుడు ఈ చాయల కనిపిస్తున్నడా? మీరే జెప్పుండ్రి,” అంటున్నాడు వీ.సీ.ఆర్. ఒక విలేఖరితో.

ఆయన వాదనా పటిమకి నేను ముగ్ధుడిని అయిపోయాను.

ధన్వంతరి హెమినీ చానెల్ పెట్టాడు.

నెత్తిన గుడ్దలు వేసుకుని కూర్చున్న కొందరు గాంక్రెస్ నాయకులు రిపోర్టర్స్‌తో ఆవేశంగా వాదిస్తున్నారు. “ఇదిగోండి, వారసత్వ రాజకీయాలు అనేవి మా హెన్రూ గారి వంశంతో ఆగిపోయాయి. మా వెర్రమ్మ, వాళ్ళ ఫ్యామిలిలో తప్ప ఇంకెక్కడైనా ఎవరైనా సరే వారసత్వపు రాజకీయాలు చేస్తున్నారని తెలిస్తే, వారి అంతు చూస్తుంది. వై.నో. గగన్ సంగతి తెలుసు కద,” అంటున్నాడు గాంక్రెస్ చీఫ్ ఉత్త కుమార్ రెడ్డి.

“అంతే అంటారు. అది సరే కానీ, మీరంతా ఎందుకు ఇక్కడ గుమిగూడారు?” అడిగాడు ఒక విలేఖరి.

“సాహుల్ బాబు గారు బృందగాన పర్యటనకి వస్తున్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం.”

“ఓహొ!”

“సరేరా, మన నాయకులు అందరూ కడిగిన ముత్యాల్లాంటి వాళ్ళని నాకు అర్థం అయ్యింది,” అనౌన్స్ చేశాను నేను.

“ఇంతా చూసి, నువ్వు తెలుసుకున్నది ఇదా? నీ మొహంలా ఉంది! సరే, ఇంతటితో కంబైన్‌డ్ స్టడీస్ అయిపోయాయి,” అంటూ ఒక లావుపాటి పుస్తకంలో తల దూర్చేశాడు వాడు.

ఇంక నేను బయలుదేరాల్సిన సమయం ఏతేంచిందని నాకు అర్థం అయ్యింది. లేచి వాడి అపార్ట్‌మెంట్ నుండి బయట పడ్డాను.

“అమృతం తాగిన వాళ్ళు దేవతలూ, దేవుళ్ళూ! పదవులు కన్న బిడ్డలకు పంచే వాళ్ళు రాజకీయ నాయకులు,” అంటూ పాడుతున్న ధన్వంతరి గాడి గొంతు నేను రోడ్ ఎక్కేంతవరకు వినిపిస్తూనే ఉంది.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

2 Responses to వారసత్వపు రాజకీయాలా! బంధు ప్రీతా! అబ్బెబ్బే, చొచ్చొచ్చో!

  1. Srikanth Vandanapu says:

    “ఉద్యమంలో నాతో పాల్గొన్న ఒక్కడైన ఇప్పుడు ఈ చాయల కనిపిస్తున్నడా?” So true…very well written Murali.

  2. A Amun says:

    last punch baavundi 🙂

    “అమృతం తాగిన వాళ్ళు దేవతలూ, దేవుళ్ళూ! పదవులు కన్న బిడ్డలకు పంచే వాళ్ళు రాజకీయ నాయకులు,” అంటూ పాడుతున్న ధన్వంతరి గాడి గొంతు నేను రోడ్ ఎక్కేంతవరకు వినిపిస్తూనే ఉంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s