పడమర పడగలు – 2


మొదటి వారం చాలా సరదాగా గడిచిపోయింది రవితేజకి. ఇంకా అతని యూనివర్సిటీలో క్లాసెస్ మొదలు కాకపోవడం వల్ల, ఆ టెన్షన్ లేదు. ప్రతి రోజు సినిమాలు చూడ్డం, పిల్లలతో ఆడుకోవడం, షాపింగ్‌కి వెళ్ళడం, ఇలాంటి వాటితో రోజులు త్వరగా గడిచిపోయాయి. ఆఖరికి groceries కోసం వెళ్ళిన షాపులు కూడా రవితేజకి తెగ నచ్చేశాయి.

“అహా ఇది అరెమికా కాదు, భూతల స్వర్గం,” అనుకున్నాడు రవితేజ. ఆ రోజు ఆదివారం. మరుసటి రోజే అతని యూనివర్సిటీ తెరుస్తున్నారు.

“మొదటి రోజే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడి ఏం వెళ్తావులే గానీ, బావ నిన్ను పొద్దున డ్రాప్ చేసి సాయంత్రం పికప్ చేసుకుంటాడు,” అనునయంగా చెప్పింది సుజాత. రవితేజకి మళ్ళీ కళ్ళు చెమర్చాయి.

అనుకున్నట్టుగానే రాజేశ్ మండే పొద్దున రవితేజని తన కార్‌లో డ్రాప్ చేశాడు. రెజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్ళి, ఫుల్‌టైం స్టూడెంట్ స్టాటస్ కోసమని మూడు కోర్సులకి ఫీజ్ కట్టేశాడు రవితేజ. తనలానే వచ్చిన మిగతా విద్యార్థులని పరిచయం చేసుకున్నాడు. తన క్లాస్ రూములు ఎక్కడో చూసుకున్నాడు. లంచ్‌కి సుజాత కట్టిచ్చిన పులిహోరన్నం తిన్నాడు. వింగ్లీష్ సినిమాల్లో లానే మాట్లాడుతున్న తెల్లవారిని చూసి అబ్బుర పడ్డాడు. సాయంత్రం మళ్ళీ రాజేశ్ అతన్ని పికప్ చేసుకున్నాడు.

మరుసటి రోజు అదేదో సినిమాలో చెప్పినట్టు, then started trouble. అంతకు ముందు రాత్రే రాజేశ్ సుజాత ఇద్దరూ కలిసి, రవితేజకి బస్సులు ట్రైన్లు పట్టుకుని యూనివర్సిటీకి ఎలా వెళ్ళాలో చెప్పారు.

“నీ మొదటి క్లాస్ ఎప్పుడు రా?” అడిగింది సుజాత.

“పొద్దున పది గంటలకి అక్కా!”

“ఐతే నువ్వు రేపు పెందలకడే ఐదు గంటలకి నిద్ర లేవు. ఆరు గంటలకి తయారు అయి ఉండు.”

“అయ్య బాబోయి అంత తొందరగానా? నేనెప్పుడూ, వేరే దేశాల్లో మన వాళ్ళు కిరికెట్టు ఆడుతూంటే తప్ప, అంత తొందరగా నా జీవితంలో నిద్ర లేవలేదు.”

“ఇక్కడ అలా కుదరదురా. టరేసీ నుంచి మీ యూనివర్సిటీకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడి వెళ్ళాలి అంటే నాలుగు గంటలు పడుతుంది. ముందు నువ్వు ట్రెయిన్ స్టేషన్‌కి వెళ్ళాలి. మన ఇంటి నుంచి అక్కడకి నడక 15 నిముషాలు. స్ట్రెయిట్‌గా మన ఇంటి ముందు రోడ్డు పట్టుకుని వెళ్ళిపోవడమే. ట్రెయిన్‌లో గంట జర్నీ. తరువాత నువ్వు ఫలానా చోట దిగి ఒక 20 నిముషాలు నడిస్తే బస్-స్టాప్ వస్తుంది. బస్‌లో మళ్ళీ గంట ప్రయాణం. ఫలానా చోట దిగి 30 నిముషాలు నడిస్తే ఇంకో బస్ స్టేషన్ వస్తుంది. అందులో ఎక్కితే ఒక 45 నిముషాల తరువాత మీ యూనివర్సిటీ ముందే ఆగతుంది. నువ్వు క్లాస్‌కి వెళ్ళడానికి ఒక 10 నిముషాలు అనుకున్నా, ఈ మాత్రం టైం కావాలి.”

“అక్కా, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కద!” కొంచెం భయంగానే అడిగాడు రవితేజ.

“లేదురా, ప్రామీస్! ఇంతకంటే షార్ట్ కట్ కూడా లేదు. నువ్వు రావడానికి ముందే మీ బావగారు బాగా రీసర్చ్ చేసి ఈ రూట్ కనిపెట్టారు. అన్నట్టు మరిచిపోకు. ఇంటికి రావడానికి కూడా నాలుగు గంటలు పడుతుంది. రాత్రి తొమ్మిది లోపు వచ్చేయి. అప్పటి వరకు మేలుకునే ఉంటాం.” అంది సుజాత.

“నహీ!” మనసులోనే గట్టిగా పొలికేక పెట్టాడు రవితేజ.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s