పడమర పడగలు – 3


పొద్దున్నే సుజాత అతని రూంలో పెట్టిన అలారం క్లాక్ మోగి రవితేజకి మెలకువ తెప్పించింది. గణ గణమంటున్న ఆ శబ్దానికి ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడతను. తొందరగానే తయారు అయిపోయి కిందకి వచ్చాడు. వాళ్ళక్కయ్య చెప్పినట్టు సిరియల్స్ పాలలో వేసి తినాలని ప్రయత్నించాడు. కాని అంత పొద్దున్నే తినే అలవాటు లేక, అలాంటి తిండి పడక, ఎక్కువగా తినలేకపోయాడు. అంతకు ముందు రోజు పులిహోర చేసిచ్చిన సుజాత ఈ సారి ఏమీ చేసినట్టు లేదు. రాత్రి మిగిలిన అన్నం, కూరని ఒక బాక్స్‌లో పెట్టుకుని, ప్లాన్ ప్రకారం ఆరు గంటలకు ఇంటి నుంచి బయట పడ్డాడు.

ట్రెయిన్ స్టేషన్‌కి పదిహేను నిముషాల్లో వెళ్ళిపోవచ్చన్న వాళ్ళ బావ అంచనా, కేవలం ఆరున్నర అడుగుల అజానుబాహులకు మాత్రమే వర్తిస్తుందని కాస్త దూరం నడవగానే అర్థమయ్యింది రవితేజకి. మిగతా సగం దూరం పరిగెడితే కానీ ట్రెయిన్‌ని సరైన టైంకి అందుకోలేకపోయాడు. టికెట్ ఏమో, వన్ వేనే ఐదు డాలర్లు. గుండె గతుక్కుమంది రవితేజకి. “వామ్మో, ఈ లెక్కన చూస్తే తను రెండు సెమిస్టర్లకి తెచ్చుకున్న డబ్బు రెండు నెలలకే ఎగిరిపోయేలా ఉంది,” అనుకున్నాడు.

తరువాత రెండు బస్సులు మారి ఇంకో ఐదు డాలర్లు చెల్లించుకున్నాక యూనివర్సిటీ ముందు దిగాడు. “హబ్బ, ఈ ప్రయాణం చేసి బాగా అలిసిపోయాను, ఇంటికెళ్ళగానే అక్కని కాఫీ అడగాలి,” అనుకున్నాడు రవితేజ. వెంటనే అతనికి గుర్తుకి వచ్చింది, తను ఇంతసేపు ప్రయణం చేసి వచ్చింది యూనివర్సిటీకి అని, ఇంకా జస్ట్ పొద్దునే అయ్యిందని, ఇంకా రోజు మొత్తం ముందు ఉందని. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, సాయంత్రం ఈ ప్రయాణాన్ని రిపీట్ చెయ్యాలని. విరక్తిగా తనలో తాను నవ్వుకున్నాడు అతను.

రవితేజకి ఆ రోజు రెండు క్లాసులు ఉన్నాయి. ఒకటి పది గంటలకైతే ఇంకోటి మూడుకి. సరిగ్గా ఐదుకి రెండో క్లాస్ అయిపోతుంది. అప్పటి నుంచి మళ్ళీ ఇంకో నాలుగు గంటల ప్రయాణం చేస్తే ఇంటికి చేరుకుంటాడు. అదీ సరిగ్గా అన్నీ టైంకి అందుకుంటేనే! కొంచెం అటూ ఇటూ ఐనా ఏ పదకొండో పడుతుంది.

క్లాసుల మధ్య ఇంటినుంచి తెచ్చుకున్న లంచ్ తిన్నాడు రవితేజ. తరువాత సాయంత్రం క్లాస్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. ఆ యూనివర్సిటీలో అతను తప్ప అందరూ బిజీగా ఉన్నట్టు అనిపించింది అతనికి. తన సాటి హిండియన్ స్టూడెంట్స్ కూడా మొదటి క్లాస్ కాగానే కనపడకుండా పోయారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టో అనుకున్నాడు తనలో తాను.

క్లాస్ అయ్యాక రక రకాల విన్యాసాలు చేస్తూ ఎలాగైతేనేం రాత్రి తొమ్మిదికి ఇంటికి చేరుకున్నాడు రవితేజ. అప్పటికే అందరూ నిద్రపోయారు. రాజేశ్, సుజాత ఏడున్నరకే ఇంటినుంచి బయట పడతారు. పిల్లల్ని డే కేర్‌లో దింపేసి వారి వారి ఆఫీసులకు పోతారు. కాబట్టి తొందరగా నిద్రపోతారు.

తనకోసం టేబుల్ మీద పెట్టిన తిండి పదార్థాలతో ఒంటరిగా డిన్నర్ ముగించాడు రవితేజ. తరువాత తన రూంకి వెళ్ళి కాసేపు క్లాసులో రాసుకున్న నోట్స్ చదువుకోవడానికి ట్రై చేశాడు, కానీ నిద్ర ముంచుకు రావడంతో అవి పక్కకు పడేసి బెడ్ మీద నడుము వాల్చాడు. ఎదురుగా కనపడుతున్న అలారం క్లాక్‌ని దిగులుగా చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s