ధబీ ధబీలో దబిడి దిబిడే!


ఆ రోజు ఆదివారం. అలారం సరిగ్గా ఆరు గంటలకు మోగగానే దభీమని లేచి కూర్చున్నాడు వీరభద్ర. “త్వరగా తయారై ఆఫీస్‌కి వెళ్ళాలి. ఈ రోజు చాలా పని ఉంది అసలే,” అనుకున్నాడు.

అదేంటి ఆదివారం ఆఫీసేంటి అనుకుంటున్నారా, ఐతే మీరు పప్పు, సారీ, మటన్ బిర్యానిలో కాలేసినట్టే. చురుకైన పాఠకులకు వీరభద్ర ధబీ ధబీలో పని చేస్తున్న విషయం గుర్తు ఉండే ఉంటుంది. అతను పని చేసే కంపెనీకి ఆదివారం వర్కింగ్ డే.

స్నానం ముగించి తన బెడ్‌రూమ్‌లో ఉన్న దేవుడి ఫోటోకి దండం పెట్టుకుంటూ, “అదే హిండియాలో అయితే చక్కగా ప్రతి ఆదివారం గుడికి వెళ్ళే వాడిని. ఈ ధబీ ధబీలో ఆ ఛాన్సే లేదు,” అనుకున్నాడు కాస్త బాధగా.

ధబీ ధబీలో సింధువుల గుడులు ఉండవు. (ఆశ్చర్యంగా దీన్ని అహ్మదీయుల మత మౌఢ్యానికి ఒక ప్రతీక అని ఎవరు బయటకు అనరు. మత పిచ్చి ఉన్నది ఒక సింధువులకే అన్న విషయం అందరికి తెలిసిందే. మనకు ఇప్పుడు అర్థం కాక పోయినప్పటికీ, అహ్మదీయులు రాజ్యమేలే చోటంతా, వేరే మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు కట్టనివ్వక పోవడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వేరే దేశాల్లో అహ్మదీయులు ఎగబడి వారి ప్రార్థనా మందిరాలు కట్టుకోవడానికి ఇంకా బలమైన కారణం డెఫినెట్‌గా ఉండి ఉంటుంది. ఆ! గుర్తొచ్చింది! అహ్మదీయులు పరాయి దేశాల్లో మాత్రమే పర మత సహనం గురించి పోరాడతారు. స్వదేశాల్లో స్వమత సహనం మాత్రమే పాటిస్తారు.)

పరాయి మతస్తుల మీద, పరాయి దేశస్తుల మీద ఇంకా చాలా ఆంక్షలు ఉంటాయి. అహ్మదీయులు ఉపవాసం చేసే రోజుల్లో ఎవరు బయట తింటూ తాగుతూ కనిపించకూడదు. అక్కడ పని చేయడమే తప్ప మొన్న మొన్నటి వరకు ప్రాపర్టీ కొనే అవకాశమే లేదు. (ఇప్పుడు కొన్ని స్పెషల్ జోన్స్‌లో విదేశీయులని ఇళ్ళు కొనుక్కోనిస్తున్నారు.) ధబీ ధబీలో అన్ని చోట్ల జాతి వివక్షత కనిపిస్తూనే ఉంటుంది. తెల్ల వారికి ఎప్పుడూ హిండియన్స్ కంటే గౌరవం ఎక్కువే. అక్కడ కూలి పనులు చేసుకోవడానికి వచ్చిన పరాయి దేశస్తుల మీద ధాష్టీకం ఉంటుంది అని అంటారు కానీ, నిజం చెప్పాలంటే అక్కడ ఉన్న పరాయి వారంతా కూలీల కిందే లెక్ఖ.

ఆఫీసుకి వెళ్ళి తన సీటులో కూర్చోగానే అతని బాస్ శ్రీకర్ రావు పలకరించాడు. “ఏంటోయి, ఆరు నెల్ల తరువాత హిండియాకి ట్రిప్ ఉందా?” అని. ఆయన కూడా తెగులు వాడే.

“లేదు సార్, మన సీనియర్ డైరెక్టర్ గారు సంవత్సరం వరకు కుదరదు అని చెప్పారు. అప్పటికైనా నా పాస్‌పోర్ట్ ఇస్తారో లేదో. అసలు అదే నా చేతిలో ఉంటే ఈ రోజే హిండియాకి వెళ్ళిపోవాలని ఉంది,” చిరాకుగా అన్నాడు వీరభద్ర.

“హుష్! గట్టిగా మాట్లాడకు. నువ్విలా మాట్లాడుతున్నావని తెలిస్తే ఇంకో సంవత్సరం పొడిగిస్తారు. అది అటుంచు. నా బాధ ఎవరితో చెప్పుకోను! ఈ సారి కూడా ప్రమోషన్‌కి, సీనియారిటీ అనుభవం ఉన్న నన్ను బైపాస్ చేసి, ఆ రాబర్ట్ గాడికి ఇచ్చారు. ఇక్కడ కుక్క చాకిరి చేసినా లాభం లేదోయి,” అన్నాడు కాస్త బాధగా శ్రీకర్ రావు.

“సర్లెండి, మనకు ఇవన్నీ తెలియవా ఏంటి? అందరం ఇక్కడికి వచ్చింది డబ్బు కోసమే కద,” అంటూ తన కంప్యూటర్ ఆన్ చేశాడు వీరభద్ర.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s