స్టార్ నా కొడుకులు (ఆధునిక బేతాళ కథలు – 4)


పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పై నుంచి శవాన్ని తీసి భుజాన వేసుకుని ఎప్పటి లాగే మౌనంగా స్మశానము కేసి నడువ సాగాడు.

అప్పుడు శవంలోని  బేతాళుడు, “రాజా, నీ శ్రమ, దీక్ష చూస్తూంటే నాకు ముచ్చటేస్తూంది. ఐతే కేవలం వర్తమానమే కాకుండా, భవిష్యత్తు మీద కూడా దృష్టి పెట్టిన వాడే జీవితంలో విజయం సాధిస్తాడు. ఇప్పుడు నీకు అలాంటి కథే ఒకటి చెప్తాను, విను,” అంటూ మొదలు పెట్టాడు.

******************

బోసు బాబు తెగులు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో. పైగా యువ నటుడు. అంటే మరీ బాలా కుమారుడేమీ కాదు కానీ, ఒక 35 ఏళ్ళు ఉంటాయి. పెళ్ళి కూడా అయ్యింది. ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఇది తన బ్యాక్ గ్రౌండ్.

పరిస్థితి ఇలాగే ఉంటే ఈ కథ ఉండేదే కాదు. కానీ బోసు బాబుకి మూడో సంతానంగా మగ పిల్ల వాడు పుట్టాడు. దీనితో మన తెగులు ఇండస్ట్రీలో సంచలనం పుట్టింది.

బోసు బాబుకి బోలెడు మంది అభిమానులు ఉన్నారు. అతని కులానికి, ఛీ ఛీ, సామాజిక వర్గానికి చెందిన వారు మన తెగులు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు.

మిగతా హీరోల అభిమానులు, అతను ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో మనగలిగింది దాని వల్లే అని అభాండాలు వేస్తారు. నటనలో బోసి అని వారి అభిప్రాయం కాబట్టి, బోసు బాబుని వాళ్ళంతా బోసి బాబు అని పిలుచుకుంటారు.

బోసు బాబు తన కొడుక్కి వాసు బాబు అని నామకరణం చేశాడు. పురోహితుడు బార సాల ముహూర్తం నిర్ణయించాక, పిలవాల్సిన వాళ్ళందరి లిస్ట్ తయారు చేసుకుంటూ ఉంటే, ఫోన్ మోగింది. అది నిర్మాత దేబిరేశ్ నుంచి వచ్చింది.

“చెప్పండి దేబిరేశ్ గారు, మీ కొత్త సినిమా “పాలేరు ఇన్స్‌పెక్టర్” రెండు వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేయబోతున్న విజయోత్సవానికి, నన్ను ఆహ్వానించడానికి ఫోన్ చేశారా,” నవ్వుతూ అడిగాడు బోసు బాబు.

“దాని మీద ఆల్‌రెడీ ఐదు కోట్లు నష్టం వచ్చింది. విజయోత్సవం నిర్వహిస్తే ఇంకో రెండు కోట్లు ఖర్చు అవుతుంది. ఎందుకు లెండి ఆ తద్దినం నాకు. నేను కాల్ చేసింది మీ అబ్బాయి వాసు బాబు గురించి.”

“ఓ, బారసాల ఎప్పుడనా! పంతులు గారు వచ్చే ఆదివారం ముహూర్తం పెట్టారండి. ఇంకాసేపైతే మిమ్మల్ని ఫంక్షన్‌కి ఇన్‌వైట్ చేస్తూ, మీకే నా నుండి ఫోన్ వచ్చుండేది.”

“అహహా. బారసాలకు మీరు పిలవకుండా ఉంటారా, నేను రాకుండా ఉంటానా. దానికి కాదు నేను చేసింది.”

“మరి?”

“నాకు 2027లో కాల్‌షీట్స్ కావాలి. అందుకు చేశాను.”

“2027లోనా? ఇంకా పన్నెండేళ్ళు ఉంది. అఫ్ కోర్స్, ఇంకో పాతికేళ్ళైనా నా కెరియర్ ఉజ్వలంగా ఉంటుందనుకోండి. అయినా అంత తొందరెందుకు? ఇప్పుడే బుక్ చేసుకోకపోతే అప్పుడు దొరకవనా?” కించిత్ గర్వంగా అడిగాడు బోసు బాబు.

“అంటే కాల్‌షీట్స్ మీవి కాదండి, మీ అబ్బాయి వాసు బాబువి.”

“వాడివా? అప్పటికి పన్నెండేళ్ళు నిండుతాయి వాడికి. వాడినేం చేసుకుంటారు?”

“అప్పటికి ప్రీ-టీనేజ్ లవ్ స్టోరీస్ పాపులర్ అవుతాయండి. కాబట్టి 12 సరైన వయసు. మీ వాసు బాబు మొదటి సినిమా మేమే తీద్దామనుకుంటున్నాం. మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ బ్యానర్ మీద బాబుని లాంచ్ చేస్తాము. సినిమా పేరు కూడా రిజిస్టర్ చేశాం!”

“ఏం పేరు?”

“క్లాసులో పాసు. బాబు పేరుతో రైమ్ అవుతుంది కూడా.”

“అంతా బానే ఉంది కానీ, మీరు మరీ తొందర పడుతున్నారనిపిస్తూంది. అసలు వాడు ఆ వయసుకి ఎలా ఉంటాడో, ఏంటో, ఏమీ ఐడియా లేకుండా…”

“అదంతా నాకు వదిలేయండి సార్. మీరు ఊ అనండి చాలు. మిగతా అంతా నేను చూసుకుంటాను.”

“సరే లెండి, ఆలోచించి ఏ విషయమూ చెప్తాను,” ఫోన్ పెట్టేశాడు బోసు బాబు.

ఒక ఐదు క్షణాలు కూడా కాలేదు, బోసు బాబు ఫోన్ మళ్ళీ మోగింది. ఈ సారి కాల్ చేసింది నిర్మాత శోకేశ్.

“బోసు బాబు గారు, మీ అబ్బాయి కాల్ షీట్స్ నాకు 2027లో కావాలి. మా క్రై క్రై క్రై బ్యానర్ మీదే వాసు బాబ్ డెబ్యూ జరగాలని ఫిక్స్ అయి పోయాం. సినిమా పేరు కూడా దొరికేసింది. “మాస్ బాబు”! ఏమంటారు?”

“అంటే, అదీ…” సణిగాడు బోసు బాబు.

“కొంప దీసి మీకు ఆ దేబిరేశ్ ఆల్‌రెడీ కాల్ చేశేశాడా? వాణ్ణి అసలు నమ్మొద్దు సార్! గొప్ప కళాఖండం తీస్తాను అని ఆ సోకు బాబుకి మాటిచ్చి, ఆ “పాలేరు ఇన్స్‌పెక్టర్” లాంటి డోకు సినిమా తీశాడు. మీ బాబుని వాడి చేతిలో అసలు పెట్టకండి. నాకు ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు.”

“అలాగే లెండి. నాకు కాస్త టైమ్ ఇవ్వండి,” ఫోన్ హాంగ్ అప్ చేసి, ఆలోచనలో పడ్డాడు బోసు బాబు.

*******

“ఇప్పుడు చెప్పు రాజా, వాసు బాబు కాల్ షీట్స్ బుక్ చేసుకోవడానికి నిర్మాతలంతా అలా ఎందుకు పోటెత్తారు? పన్నెండేళ్ళ తరువాత అతని రూపు రేఖలు ఎలా ఉంటాయి అన్న అవగాహన లేకుండానే, ఎందుకు అంత రిస్క్‌కి సిద్ధ పడ్డారు? సమాధానం నీకు తెలిసి కూడా చెప్పకపోతే, ఆ “పాలేరు ఇన్స్‌పెక్టర్” సినిమా నీకు వంద సార్లు వరసగా చూపిస్తాను,” బెదిరింపు స్వరంలో అన్నాడు బేతాళుడు.

“బాబోయి, అంత పని చేయొద్దు. దాని కంటే తల బద్దలు చేయించుకోవడమే శ్రేయస్కరం. సమాధానం చెప్తాను విను.

ఇందులో పెద్ద మిస్టరీ ఏమీ లేదు. గత పాతికేళ్ళ నుంచి తెగులు ఇండస్ట్రీ హీరోలు, ఒకరో ఇద్దరో తప్ప, మిగిలిన అందరూ స్టార్ నా కొడుకులే, అంటే ఒకప్పటి హీరోల బిడ్డలే.

దీని వల్ల కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి.

మొదటిది, వాళ్ళ తండ్రుల ఫ్యాన్ బేస్ ఈ స్టార్ నా కొడుకులకి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

రెండోది, వాళ్ళని జనం ఆక్సెప్ట్ చేసేంతవరకు సినిమాలు తీయగలిగిన సత్తా వారి తండ్రులకి ఉంటుంది.

మూడోది, వారి కులపు ప్రేక్షకులకు గ్యాప్ లేకుండా ఆరాధించడానికి ఒక హీరో దొరుకుతాడు. దాని వల్ల మిగతా కులాల వారి ముందు వారు తల దించుకోవలసిన అవసరం రాదు. ఆ కృతజ్ఞతా భారంతో వాళ్ళు ఈ స్టార్ నా కొడుకులకు జీవితాంతం విధేయులుగా పడి ఉంటారు.

నాలుగోది, దీని వల్ల తెగులు సినిమాల్లో సమానత్వం వస్తుంది. ఏ స్టార్ నా కొడుక్కి యాక్టింగ్ రాదు కాబట్టి, ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువా అనే భేదాలే ఉండవు. తద్వారా ప్రేక్షకుల స్టాండర్డ్స్ పాతాళానికి జారి ఏ చెత్త సినిమా తీసినా కిక్కురుమనకుండా చూస్తారు.

ఐదవది, స్టార్ నా కొడుకుల రూపు రేఖల గురించి వర్రీ కావాల్సిన అవసరం అస్సలు లేదు. ఆది మానవుడి రూపంతో పుట్టినా అరవయి సర్జరీలు చేసి వాళ్ళ తండ్రులు స్టార్ నా కొడుకులని ఒక షేప్‌కి తీసుకు వస్తారు.

ఇన్ని అడ్వాంటేజెస్ ఉండగా, దేబిరేశ్ శోకేశ్‌లు వాసు బాబు కాల్ షీట్ల వెనక పడడంలో ఆశ్చర్యం ఏమీ లేదు,” అంటూ ముగించాడు విక్రమార్కుడు.

ఆ సమాధానం కరెక్ట్ కావడంతో, అతని భుజం మీదనుంచి మాయమై మళ్ళీ చెట్టెక్కాడు బేతాళుడు. ఇక చేసేది లేక విక్రమార్కుడు ఆ రోజే కొత్తగా రిలీజ్ అయిన ఒక స్టార్ నా కొడుకు సినిమా చూడడానికి బయలు దేరాడు.

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

6 Responses to స్టార్ నా కొడుకులు (ఆధునిక బేతాళ కథలు – 4)

 1. రవి says:

  ఎట్లాగూ తెలుగు ప్రేక్షకుడిగా మానమర్యాదలూ, సిగ్గూ శరం కోల్పోయాం కాబట్టి “నటపోరాట్” (Is it ok?) వాసుబాబు సినిమా కోసం కళ్ళు కాయలు, పండ్లూ కాచేట్టు ఎదురుచూస్తాం.

 2. eshwar says:

  entho kastapadi chadivina IAS IPS ofiicers kuda values marchipoyi behave chesthunnaru. Inke ee movie heroes nunchi values expect cheyyatam gora thappidam.
  Ikkadundi values gurunchi matladuthunnam kani, valla position lo unte manam kuda ala behave cheyyamani guarantee ledu.

  • Murali says:

   వాల్యూస్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు సార్? జస్ట్ వాళ్ళ అదృష్టం చూసి కుళ్ళుకుంటున్నాం అంతే. ప్చ్!

 3. సుజాత says:

  బ్లాగ్ పోస్ట్ టైటిల్ ఎంత ఖసి గా పెట్టారో! సూపర్

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s