అది కాకపోతే కనీసం ఇదైనా ఇవ్వచ్చుగా!


“ఈ వార్త చదివారా, కేశవరావు గారూ?” చదువుతున్న పేపర్‌లోంచి తల ఎత్తి అడిగారు శంకర్రావు గారు.

“ఏ వార్త సార్? రేడియోలో వచ్చే వార్త అయ్యుంటే తప్పక వినే ఉంటాను,” సమాధానమిచ్చారు కేశవరావు గారు.

“అది నాకెలా తెలుస్తుంది? అయినా మీరు ఇంకా రేడియోలో వార్తలు వినడమేంటండి?”

“ఏం చెప్పమంటారు శంకర్రావు గారు! మా ఆవిడ తన సీరియల్స్ చూడడం కోసం, మా ఇంట్లో టీవీని కబ్జా చేసేసింది. అలా అని న్యూస్ పేపర్ చదువుకుందామంటే, ఎలాగూ టీవీలో సీరియల్స్ మధ్యన న్యూస్ వస్తాయి కద, మళ్ళీ న్యూస్ పేపర్ ఎందుకు దండగా అని మానిపించేసింది. అందుకే దిక్కు లేక, మా ఇంట్లో ఉన్న పాత ట్రాన్సిస్టర్ బూజు దులిపి దాని మీద బేస్ అయిపోయాను.”

“మీ బాధలు వింటూంటే, నాకు సడన్‌గా మా ఆవిడ మీద గౌరవం పెరిగిపోయింది. పాపం, తను నాకు ఎక్కడా అడ్డం రాదు.”

“మీరు పెట్టి పుట్టారు, శంకర్రావు గారు! ఇంతకి ఆ వార్త ఏంటి?”

“వింగ్లాండ్ దగ్గరున్న హోకినూర్ వజ్రం, మనదేనని, కాబట్టి దాన్ని మనకు ఇచ్చేయ్యాలని హిండియా పోరాడుతున్న విషయం మీకు తెలిసిందే కద?”

“తెలుసు, తెలుసు! కానీ అలా ఎప్పుడో ఎత్తుకు పోయినవి అడిగినంత మాత్రాన ఇచ్చేస్తారా?”

“అది చాలా కష్టం లెండి. మన చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎవరు ఎవరి దగ్గర ఎంత దోచుకున్నారో లెక్ఖలు కట్టడానికి మన మానవ మాత్రుల వల్ల కాదు.

ఐతే హోకినూర్ వజ్రం ఎన్నో వందల సంవత్సరాలుగా హిండియాలో ఉందని, దాన్ని వింగ్లీష్ ప్రభువులు పట్టుకెళ్ళి, crown jewelsలో కలిపేశారని ప్రపంచానికి అంతా తెలుసు కాబట్టి, పైగా హోకినూర్ వజ్రాన్ని హిండియన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు కాబట్టి, ఇది మనకు తిరిగి ఇవ్వాల్సిందే అని చాలా మంది హిండియన్స్ అభిప్రాయం.

కానీ వాళ్ళ ప్రధాని మొన్న హిండియాకి వచ్చినప్పుడు తేల్చి చెప్పాడు. ఇలా ఇస్తూ పోతే మా మ్యూజియాలు అన్నీ ఖాళీ అయిపోతాయి, కాబట్టి మేము ఇవ్వమూ అని.”

“పాపం నిజమే కద, వారి దగ్గర ఉన్న సంపద అంతా ఎవరో ఒకరి నుంచి దోచుకున్నదే. అలా అన్నీ తిరిగి ఇచ్చేస్తే పాపం వింగ్లాండ్ బిడ్డలు అన్యాయం అయిపోరూ? ఇదంతా సరే, శంకర్రావు గారు! ఇది పాత న్యూసే! మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న రభసే ఇది. కొత్త న్యూసేంటో చెప్పండి.”

“మన పక్కన ఉన్న మన శ్రేయోభిలాషి, మిత్ర దేశం ఐన పీకిస్తాన్‌కి ఈ మధ్యే సడన్‌గా మెలకువ వచ్చింది. ఇది వారి దేశంలో భాగమైన పుంజాబు రాష్ట్రాన్ని ఒకప్పుడు పాలించిన సింజిత్ సింగ్ మహరాజుదట. ఇప్పుడు ఆ భాగం పీకిస్తాన్‌లో ఉంది కాబట్టి, హోకినూర్ వారికి ఇచ్చేయాలట.”

“ఇదేం చోద్యమండి. మొన్నటి దాక అసలు వాళ్ళు ఈ గొడవలోనే లేరు కద! పైగా ఆ సింజిత్ సింగ్ అంటేనే వారికి వొళ్ళంతా మంట కూడా!”

“వజ్రాలు కావాల్సి వచ్చినప్పుడు ఇంకా పాత ద్వేషాలు ఎందుకు మెయిన్‌టెయిన్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు సింజిత్ సింగ్ వారికి యుగపురుషుడితో సమానం.

ముఖ్యంగా, హిండియా చేస్తున్న ఒత్తిడి వల్ల వింగ్లాండ్ వారు హోకినూర్ తిరిగి ఇచ్చేస్తారేమో అన్న భ్రమ వారికి కలిగినట్టుంది. హిండియాకి సంబంధించింది ఏదైనా అప్పనంగా కొట్టేయాలన్నదే మొదటి నుంచి వారి సిద్ధాంతం కద! కాబట్టి పీకిస్తాన్ రాయబారి హిండియన్ గవర్నమెంట్‌కి అర్జీ కూడా పెట్టుకున్నాడట.”

“ఏమని?”

“ఎలాగూ షాక్మీర్ ఇవ్వట్లేదు, కనీసం ఇదైనా ఇవ్వండి అని. వింగ్లాండ్ వారు మనకు హోకినూర్ ఇచ్చీ ఇవ్వగానే, వెంటనే అది పీకిస్తాన్‌కి పంపేయాలట!”

“మరి ఇన్నేళ్ళుగా పోరాడింది మనం కద?”

“అందుకే ఒక ప్రపోజల్ కూడా చేశాడట ఆ రాయబారి. ఒక వేళ మనం పీకిస్తాన్‌కి హొకినూర్ ఇచ్చేస్తే…”

“ఆ, ఇచ్చేస్తే?”

“ఒక నెల రోజుల పాటు షాక్మీర్‌ని వారికివ్వమని గొడవ చేయరట!”

“!”

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

2 Responses to అది కాకపోతే కనీసం ఇదైనా ఇవ్వచ్చుగా!

 1. kinghari010 says:

  ఒక నెల రోజుల పాటు షాక్మీర్‌ని వారికివ్వమని గొడవ చేయరట!

  haribabu:
  ఒక నెలరోజుల పాటు పర్శాంతంగా ఉండొచ్చు,బాహుల్ బాబు ప్రధానైతే ఈ ప్రపోజల్ ఒప్పుకుంటాడేమో!

  • Murali says:

   నిజమే, సాహుల్ గాంధికి ఉన్నంత పరిణితి మోడీకి లేదు. ఏం చేస్తాం? ప్చ్!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s