నాకు ముందే తెలిసుంటేనా!


హిండియా అంతా ఎదురు చూస్తున్న తీర్పు రానే వచ్చింది. అది మస్లాన్ ఖాన్ విషయంలో. ఈ కేస్ గురించి మీకు కొంత చెప్పాలి.

మస్లాన్ ఖాన్ 2002లో తప్ప తాగి కారుని పేవ్‌మెంట్ మీదకి పోనిచ్చి దాని మీద పడుకున్న వారి మీద ఎక్కించేసి వెయ్యుల్లా అనే ఒక వ్యక్తిని చంపి, నలుగురిని గాయ పరిచాడని ఆయన మీద అభియోగం మోపబడింది. డుంబాయి సెషన్స్ కోర్ట్ మస్లూ భాయిని దోషిగా నిర్ధారించి ఐదేళ్ళ పాటు శిక్ష వేసింది. కాని ఇప్పుడు వచ్చిన తీర్పు, డుంబాయి హై కోర్ట్‌ది. వారు మస్లాన్ మీద కేస్ కొట్టేశారు. మస్లాన్‌ని శిక్షించడానికి తగిన ఆధారాలు లేవని చెప్పడంతో పాటూ, సెషన్స్ కోర్ట్ సరిగ్గా విచారణని నిర్వహించలేదని మొట్టికాయ కూడా వేశారు.

“చూశారా శంకర్రావు గారూ, విచారణ సరిగ్గా చేయలేదట,” అన్నారు కేశవరావు గారు. వారిద్దరూ టీవీ చూస్తున్నారు.

“అదేంటండి? ఆ ఆక్సిడెంట్‌ని చూసిన ప్రత్యక్ష సాక్ష్యులు ఇద్దరు ఉన్నారు. పైగా అందులో ఒకతను, అదే కారులో ప్రయాణిస్తున్న వరీంద్ర పాటిల్. వరీంద్ర పోలీస్ కానిస్టేబుల్ కూడా. వరీంద్ర పాటిల్‌ని ప్రభుత్వమే మస్లాన్‌కి అంగరక్షకుడిగా నియమించింది. ఆ సమయంలో కారు మస్లానే నడుపుతున్నాడని, వరీంద్ర చూస్తూండగానే ఈ త్రాష్టుడు ఫూట్‌పాత్ మీదకి కార్ ఎక్కించాడని, అతను స్పష్టంగా చెప్పాడు. వరీంద్ర పాటిల్ 2007లో అనుమానస్పదమైన పరిస్థితుల్లో మరణించాడు. డుంబాయి అండర్‌గ్రౌండ్ మాఫియా, మస్లాన్‌ని రక్షించడానికి, వరీంద్రని చంపేశారని చాల మంది అనుమానం. అతను బతికి ఉంటే ఈ తీర్పు విని ఎంత క్షోభ పడే వాడో!” బాధగా అన్నారు శంకర్రావు గారు.

“అంటే, సెషన్స్ కోర్ట్ వారు మస్లాన్ ఖాన్ కేస్ సరిగ్గ విచారించి ఉంటే, వారికి మస్లాన్ భాయి పవర్ తెలిసేది కద! ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి పనికి మాలిన తీర్పులు ఇవ్వడానికి బదులు, కేస్ కొట్టేసి ఉంటే, ఎంత డబ్బు అడిగితే అంత ఇచ్చుండేవాడని. అలా కాకుండా, ఒక వేళ డబ్బుకి లొంగకుంటే, తమ శాల్తీలు కూడా వరీంద్ర పాటిల్ లాగా గల్లంతు అయిపోయి ఉండేవని. సరిగ్గా విచారణ చేయకపోవడం వల్ల వాళ్ళు ఈ అమూల్యమైన ఇన్‌ఫర్మేషన్ మిస్ అయ్యారని డుంబాయి హై కోర్ట్ అభిప్రాయం అనుకుంటా!”

“అదేనేమో వాళ్ళ ఉద్దేశం. హై కోర్ట్ వాళ్ళు మాత్రం ఆ ఇన్‌ఫర్మేషన్ సరిగ్గానే వాడుకున్నట్టున్నారు. ఆ జడ్జ్ R.A. జోషీ గారు ఇంకో పది తరాలకి సరి పడేంత డబ్బు సంపాదించే ఉంటారు. అసలే ఇలాంటి విషయాల్లో మస్లాన్ చేతికి ఎముక లేదని, దాన కర్ణుడి కంటే కొద్దిగా మాత్రమే తక్కువ అని, డుంబాయి సినిమా ఇండస్త్రీ అంతా ఘోషిస్తుంది. అందుకే మస్లాన్‌ని వారంతా బంగారం లాంటి వ్యక్తి అని కూడా అంటూ ఉంటారు,” కాస్త కసిగా అన్నారు శంకర్రావు గారు.

అంతా టీవీలో మద్యాహ్నం నుంచి అరిగిపోయిన రికార్డ్‌లా వేస్తున్న న్యూస్ బుల్లెటిన్‌ని మళ్ళీ ఒక సారి చూశారు. దాని సారాంశం ఇది. హై కోర్ట్ జడ్జ్ R.A. జోషి, మస్లాన్‌ని దోషి అని ప్రాసిక్యూషన్ వారు నిస్సందేహంగా నిరూపించలేకపోయారు కాబట్టి, కేస్ కొట్టి వేస్తున్నామని తన తీర్పులో పేర్కొన్నారు. అంతే కాకుండా వరీంద్ర పాటిల్ సాక్ష్యం నమ్మదగిందిగా కూడా లేదు అని ఆయన సెలవిచ్చారు. పైగా దాన్ని బల పరిచే తోటి సాక్ష్యం కూడా లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇంతకు ముందు చెప్పుక్కున్నట్టుగానే ఆయన ఏకంగా సెషన్స్ కోర్ట్ వ్యవహార శైలిని కూడా తప్పు పట్టారు. తీర్పు వినగానే మస్లాన్ ఎలా వెక్కి వెక్కి ఏడ్చాడో వివరిస్తూ ఆ బుల్లెటిన్ ముగిసింది.

“వరీంద్ర పాటిల్ సాక్ష్యం నమ్మ దగిందిగా లేకపోవడమేంటి? అతను అదే కార్‌లో ఉన్నాడు. పైగా ఆక్సిడెంట్ అయ్యాక పోలీసులకి ఫోన్ చేసి పిలిచింది అతనే. ఇంకేం కావాలంట?” కోపంగా అడిగారు శంకర్రావు గారు.

“అంటే, పాటిల్‌ని బలపరిచే ఇంకో సాక్షి లేడని…,” నసిగారు కేశవరావు గారు.

“అంటే మీ ఉద్దేశమేంటి? ఏ నేరానికైనా ఇద్దరు సాక్షులు కంపల్‌సరీగా ఉండాలనా? పైగా ఆ వరీంద్ర పాటిల్ ఎవరో కాదు. ప్రభుత్వమే మస్లాన్ రక్షణకోసం నియమించిన కానిస్టేబుల్. ఆయన సాక్ష్యానికే విలువ లేకపోతే ఇంకెవరి సాక్ష్యానికి విలువ ఉంటుంది? అది అలా ఉంచినా, రెండో సాక్షి కూడా ఉన్నాడు. అదే ఫుట్‌పాత్ మీద పడుకుని ఉన్న మట్టి ఖాన్ కూడా కారు నడుపుతున్నది మస్లానే అని, తన స్నేహితుడు వెయ్యుల్లాని చంపింది అతనే అని కోర్ట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. కాబట్టి R.A. జోషీ చెప్తున్నది పచ్చి అబద్ధం. న్యాయమూర్తే ఇలా ఉంటే న్యాయం ఎలా బతుకుతుంది,” బాధగా అన్నారు శంకర్రావు గారు.

“నాన్నోయి, మస్లాన్ దోషి కాకపోతే, వెయ్యుల్లాని చంపింది ఎవరు? మస్లాన్ చెప్తున్నట్టు అతని కార్ నడుపుతున్న డ్రైవర్ శోక్ సింగా? అతన్ని శిక్షిస్తారా మరి?” అయోమయంగా అడిగాడు కుమార్.

“జడ్గ్‌గారు ఆ విషయాన్నే పట్టించుకోలేదురా. వెయ్యుల్లా చనిపోయాడు అని మాత్రం పెద్ద మనసుతో అంగీకరించారు. మస్లాన్ కార్ నడపట్లేదు అని ధృడంగా నిర్ధారించారు. ఆ పైన కోర్టుకి మిగతా విషయాలు అనవసరమని చేతులు దులుపుకున్నారు!” చెప్పారు శంకర్రావు గారు.

ఇంతలో స్క్రీన్ మీద మస్లాన్ ఖాన్ మొహం ప్రత్యక్షమయ్యింది. ఎంతో మంది విలేఖరులు ఆయన్ని ప్రశ్నించడానికి ఎగబడుతూ కనిపించారు.

“ముందస్తుగా, హిండియా న్యాయ వ్యవస్థకు నా ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,” నవ్వుతూ చెప్పాడు మస్లాన్ ఖాన్.

“ఇప్పుడైతే నవ్వుతున్నారు, ఇంతకు ముందు వెక్కి వెక్కి ఏడ్చారట. ఎందుకో?” అడిగాడు ఒక విలేఖరి.

“అంటే, ఈ కేస్ నడుస్తున్నప్పుడు, నా స్నేహితుడు సింగర్ కభిజీత్ చెప్పాడు కద. కుక్కల్లా రోడ్ మీద పడుకున్న వాళ్ళు కుక్కల్లానే చావాలి అని! ఆ మాట నాకెంతో నచ్చింది. ఇలా తీర్పు అనుకూలంగా వస్తుందని నాకు ముందే తెలిసుంటేనా! ఇంకో నాలు ఫుట్‌పాత్‌ల మీద కార్ నడిపి సిటీని ఇంకాస్త క్లీన్ చేసి ఉండే వాడిని. అలా జరగలేదు అన్న బాధతో ఏడ్చాను,” దిగులుగా చెప్పాడు మస్లాన్. అంతలోనే ఒక వెర్రి నవ్వు నవ్వాడు.

“ఈ నవ్వు దేనికి?” ఇంకో విలేఖరి కుతూహలంగా అడిగాడు.

“నేనేం చేసినా నా వెన్నంటే ఉండి, నన్నే దేవుడిలా ఆరాధించే నా అద్భుతమైన ఫ్యాన్స్ గుర్తొచ్చి,” నవ్వు కంటిన్యూ చేస్తూ చెప్పాడు మస్లాన్.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s