అడ్వర్టైజ్‌మెంట్స్ ఎలా పుడతాయంటే…


“రండి, కేశవరావు గారు! మీరు ఊరికి వెళ్ళినప్పటి నుండి, మీ కంపెనీ చాలా మిస్ అవుతున్నాను. చాలా రోజులయ్యింది మనం ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుని,” ఆహ్వానించారు శంకర్రావు గారు.

“ఇదిగోండి, కాఫీ,” అంటూ తెచ్చి టేబుల్ మీద పెట్టారు పార్వతమ్మ గారు.

“అదేంటి, నేను అడగకుండానే తెచ్చేశావు?” ఆశ్చర్య పోయారు శంకర్రావు గారు.

“మీరు చెప్పే తరువాయి డయలాగ్ అదే అని నాకు తెలుసు కద,” నవ్వుతూ అక్కడినుంచి వెళ్ళిపోయారు ఆవిడ.

కాసేపు వారిద్దరు గత మూడు నెలలుగా జరిగిన విషయాలన్ని ఒక్కసారి మళ్ళీ నెమరు వేసుకున్నారు.

“ఆ నక్కయ్య గాడు, మన దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాక, వాడిని మన మేధావి వర్గం వెనకేసుకు రావడంతో అసహ్యం పుట్టుకొచ్చి కొన్ని రోజులు న్యూస్ చదవడం, చూడడం మానేశాను శంకర్రావు గారు,” చీకాకుగా మొహం పెడుతూ అన్నారు కేశవరావు గారు.

“మరైతే మీకు కాలక్షేపం ఎలా?”

“ఎలాగూ మన టీవీ చానెల్స్‌లో సగం అడ్వర్టైజ్‌మెంట్సే కద! కాబట్టి, వాటిని చూడడం మొదలు పెట్టాను.”

“…”

“అవాక్కయ్యారా, శంకర్రావు గారు?”

“దాదాపు అలాంటిదే. అందరం సాధారణంగా అడ్వర్టైజ్‌మెంట్స్ వచ్చినప్పుడు టీవీ చూడడం మానేసి వేరే పనులు చూసుకుంటాం కద.”

“అదే మనందరం చేసే తప్పు. అసలు అడ్వర్టైజ్‌మెంట్స్‌లో ఎంత కళాత్మకత దాగి ఉందో మీకు తెలీదు. అరవై లేదా తొంభై సెకండ్లలో ఒక ఐడియాని ప్రేక్షకులకు చేరవేయాలంటే ఎంత కష్టం చెప్పండి?”

“మీరు చెప్తూంటే అలాగే అనిపిస్తూంది. ఇంతకీ, మీకు బాగా నచ్చిన అడ్వర్టైజ్‌మెంట్ ఏది?”

“సంతకెళ్ళే సోప్ ఉంది చూడండి, దాని అడ్వర్టైజ్‌మెంటులో ఉమేష్ బాబు యాక్టింగ్ సూపర్. అరే, మాటల్లోనే వచ్చింది, చూడండి,” చాలా ఎగ్జైట్‌మెంట్ ఫీల్ అవుతూ టీవీకేసి చూపించారు కేశవరావు గారు.

ఆ ప్రకటనని చాలా శ్రద్ధగా చూశారు శంకర్రావు గారు.

అందులో ఉమేష్ బాబు ఒక అందమైన అమ్మాయిని సెట్స్ మీద చూసి పొరబడతాడు. “హీరోయిన్?” అని పక్కన ఉన్నతన్ని అడుగుతాడు. అతను, “కాదండి, మీ ట్రెయినర్,” అని బదులిస్తాడు. అప్పుడు ఉమేష్, “వావ్!” అంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్ల వచ్చి ఆ అమ్మాయిని, “మమ్మీ!” అంటూ వాటేసుకుంటుంది. ఉమేష్ సంభ్రమ పడిపోయి, “మమ్మీ?” అంటాడు. తీయాల్సిన షాట్ పూర్తయ్యాక, ఉమేష్ ఆ పాపతో వాళ్ళ మమ్మీని చూపించి, “సూపర్‌స్టార్ !” అంటాడు. ఆ తరువాత కట్ చేస్తే, సదరు అమ్మాయి లాంటి మమ్మీ సంతకెళ్ళే సోప్‌తో స్నానం చేస్తూంటుంది.

“చూశారా నాలుగు ముక్కల్లో, సంతకెళ్ళే సోప్ ఒక అమ్మాయిని ఎలా సూపర్‌స్టార్‌లా చేస్తుందో చెప్పారు. ఇప్పుడు ఏమంటారు?” నవ్వుతూ అన్నారు కేశవరావు గారు.

“మీరు చెప్పింది నిజం సుమండి! అడ్వర్టైజ్‌మెంట్లు తీయడం ఇంత కష్టమని నాకు తెలీదు,” ఒప్పుకున్నారు శంకర్రావు గారు.

==================================

అడ్వర్టైజ్‌మెంట్ వెనక నడిచిన అసలు కథ
==================================

సంతకెళ్ళే సోప్ అడ్వర్టైజ్‌మెంట్ షూట్ చేస్తున్న డైరెక్టర్, స్క్రిప్ట్ చదువుకుని తృప్తిగా తలాడించాడు. “వండర్‌ఫుల్! చాలా క్లియర్‌గా ఉంది స్క్రిప్ట్. మన ఐడియా ప్రజల్లోకి దూసుకుని వెళ్ళిపోతుంది,” అనుకుంటూ సంబర పడ్డాడు.

అసిస్టెంట్‌ని పిలిచి, “ఇదిగో, ఈ స్క్రిప్ట్‌ని ఉమేష్ బాబు గారికి ఇచ్చి కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి రా. బాబు రేటెంతో కూడా ఫైనలైజ్ చేస్కొని రా,” అంటూ పురమాయించాడు.

ఒక రెండు గంటల తరువాత మొహం వేలాడేసుకుని వచ్చాడు అసిస్టెంట్.

“ఏం జరిగింది? రేట్ ఫైనలైజ్ అయ్యిందా?” ఆత్రుతగా అడిగాడు డైరెక్టర్.

“లాభం లేదు సార్, మనమా రేట్ భరించలేము. ఆయన ఫీజ్ మొత్తం యాభై కోట్లట!”

“కెవ్వు! యాభై కోట్లా? అంతెందుకు? దానితో యాకంగా ఆయనతో సినిమానే తీయొచ్చు కద?”

“మీరు రాసిన స్క్రిప్ట్ అలా ఉంది మరి!” నిష్టూరంగా అన్నాడు అసిస్టెంట్.

“నా స్క్రిప్టుకేమయ్యిందయ్యా, బంగారం కద!”

“ఒకసారి పైకి చదవండి!”

డైరెక్టర్ స్క్రిప్ట్ బయటకు చదివాడు.

ఉమేష్ బాబు ఒక అందమైన అమ్మాయిని సెట్స్ మీద చూసి పొరబడతాడు. “ఎంతందంగా ఉంది! అసలు అమ్మాయిలింత అందంగా ఉంటారని నేనెప్పుడూ అనుకోలేదు. నా మూవీకి కొత్త హీరోయిన్‌ని సెలెక్ట్ చేశారు అంటే ఎవరో అనుకున్నాను. ఈవిడ వస్తే ఇండస్ట్రీలో మిగతా హీరోయిన్లంతా బిచాణా ఎత్త్యెయ్యాలి ” అని అంటాడు.

పక్కన ఉన్న అతను, “ఆమె హీరోయిన్ కాదండి, మీ ట్రెయినర్,” అని బదులిస్తాడు.

అప్పుడు ఉమేష్, “వావ్! నమ్మలేక పోతున్నాను. పొనీలే, మన హీరోయిన్లందరూ బ్రతికి పోయారు,” అంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్ల వచ్చి ఆ అమ్మాయిని, “మమ్మీ!” అంటూ వాటేసుకుంటుంది. ఉమేష్ సంభ్రమ పడిపోయి, “ఓమైగాడ్, ఈమె ఒక పాపకి తల్లా? అసలు ఈమె అందం వెనకున్న రహస్యం ఏంటి?” అని ఆలోచనలో పడిపోతాడు.

తీయాల్సిన షాట్ పూర్తయ్యాక, ఉమేష్ ఆ పాపతో, “నిజమైన సూపర్‌స్టార్ నేను కాదు. మీ మమ్మీ! ఎనీ డౌట్స్?” అంటాడు వణుకుతున్న గొంతుతో.

ఆ తరువాత కట్ చేస్తే, సదరు అమ్మాయి లాంటి మమ్మీ సంతకెళ్ళే సోప్‌తో స్నానం చేస్తూంటుంది.

“ఆ చదివాను, ఈ స్క్రిప్ట్‌తో ప్రాబ్లెం ఏంటి?” కాస్త విసుగ్గా అన్నాడు.

“లెక్కెట్టుకోండి, ఇందులో ఉమేష్ బాబు చెప్పే మాటలు మొత్తం యాభై ఉన్నాయి. ఆయనకు అసలే అడ్వర్టైజ్‌మెంట్స్ అంటే చిరాకట. ఆయన రేట్ ఒక్క మాటకి ఒక కోటి అట. వెరసి మొత్తం యాభై కోట్లు,” వివరించాడు అసిస్టెంట్.

“అట అంటున్నావు. ఇదంతా ఉమేష్ బాబు చెప్పలేదా?”

“సర్లెండి. అడ్వర్టైజ్‌మెంట్‌కని వెళ్తే, ముందు వాళ్ళావిడ, గర్వతాని కలవాలి. ఆవిడే ఉమేష్ గారి అడ్వర్టైజ్‌మెంట్లు అన్నీ ఓకే చేసేది. ఆవిడ చెప్పారు.”

“ఈ అడ్వర్టైజ్‌మెంట్‌కి మన బడ్జెట్ నాలుగున్నర కోట్లు. ఇప్పుడెలా?”

“స్క్రిప్ట్ మార్చెయ్యండి సార్! నాలుగు మాటల్లో కానిచ్చెయ్యండి, చాలు! మెసేజ్ ఇంపాక్ట్ తగ్గుతుందని మీరు వర్రీ కాకండి. బాబు నవరసాలని అద్భుతంగా పోషిస్తాడు. అలా చేస్తే, నాలుగు కోట్లతో పోతుంది. మిగతా అర కోటితో మనం అడ్వర్టైజ్‌మెంట్ అంతా లాగించేయొచ్చు,” సలహా పారేశాడు అసిస్టెంట్.

“తప్పుతుందా! అలాగే చేస్తాను,” ఉక్రోశంగా అన్నాడు డైరెక్టర్.

అదండి! అలా పుట్టుకొచ్చింది ఆ అడ్వర్టైజ్‌మెంట్!

Advertisements
This entry was posted in అతుకుల బొంత, సినిమాలు. Bookmark the permalink.

4 Responses to అడ్వర్టైజ్‌మెంట్స్ ఎలా పుడతాయంటే…

 1. kinghari010 says:

  బహుకాలపు దర్శనం!
  చతురమీ దరహాసం!

 2. Padmaja says:

  Awesome post, meeku idea lu bhale vastayandi. 🙂

  • Murali says:

   ఐడియాలు రావడంలో కష్టం ఏముందండి? చుట్టు పక్కల జీవితమే ఇంత వినో(వా)దాన్ని పంచుతూంటే. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s