అందరికి అన్నీ ఇస్తాం!


రుబ్బు రోలు రెడ్డికి ఆ రోజు పొద్దున నిద్ర లేవగానే ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. రుబ్బు రోలు రెడ్డి తెగులు సినిమాతో పరిచయమున్న వారందరికి బాగా తెలుసు. ఆయన కళాకారులకు ఏ మాత్రం సేవ చేసే అవకాశమున్నా గద్దలా తన్నుకు పోతాడని ఆయనకి సినీ లోకం “కళా రాబందు” అనే బిరుదినిచ్చి సత్కరించింది కూడా.

అర్జెంట్‌గా తన సెక్రెటరినీ పురమాయించాడాయన. సెక్రెటరీ హాజరయ్యాడు.

“ఇదిగినోయి ఈ మధ్య నా తరపు నుండి కళా పోషణ తక్కువయినట్టు నాకు కూసింత అనుమానంగా ఉంది,” అన్నాడు రుబ్బు రోలు రెడ్డి.

“మొన్నే కద సార్, ఏదో ఫంక్షన్‌కి మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిస్తే అక్కడ పరమ శివుడి మీద మీకు తెలిసిన మంత్రాలన్ని చదివి వారికి దండిగానే విరాళం ఇచ్చి వచ్చారు?”

“అది ఎంతోయి, ఆటలో అరటి పండు! కాస్త ఘనంగా ఏదైనా చేయాలి.”

“ఏం చేద్దామంటారు?”

“ఈ సారి కని విని ఎరుగని రీతిలో ఒక అవార్డుల ఫంక్షన్ చేయాలి. తెగులు సినీ పరిశ్రమని గౌరవించాలి.”

“అలాగే, ఎవరెవరికి అవార్డులు ఇద్దామనుకుంటున్నారు? ఎవరిని పిలవాలంటారు?”

“మొత్తం తెగులు ఇండస్ట్రీలో ఉన్న అందరు నటీ నటులని, సాంకేతిక నిపుణలని ఆహ్వానించు.”

“ప్రాబ్లం అవుతుందేమో సార్. అవార్డులు రాని వారు సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లకి రావడానికి ఇష్టపడరు.”

“అవన్నీ నీకెందుకోయి? నేను చెప్పాను కద, ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ పంపించు!”

“చిత్తం!”

***

మొత్తం సెగట్రీకే వదిలేయకుండా, పెద్ద తలకాయలందరిని తనే స్వయంగా ఆహ్వానించాడు రుబ్బు రోలు రెడ్డి.

ముందుగా రిచంజీవికి కాల్ చేశాడు. ఆయన ఫోనెత్తగానే సంగతి వివరించాడు.

“మరి ఈ ఫంక్షన్‌లో నాకేదైనా…” నసిగాడు రిచంజీవి.

“అయ్యో ఎంత మాట! ఉత్తమ అవార్డ్ మీకే కద! అందుకే అందరికంటే ముందు మీకు కాల్ కొట్టాను.”

“మరి నేను ఆదరా బాదరలో ఉన్నాను. ఫంక్షన్ ఏమో హౌజాగ్‌లో…”

“మీకు కష్టం కలిగిస్తానా! మీకోసమే స్పెషల్ ఫ్లైట్ కూడా ఏర్పాటు చేశాను.”

“ఎంతైనా మీ అతిథి మర్యాదలు సూపర్. నేను తప్పకుండా వస్తాను.”

“సంతోషం,” అని ఫోన్ పెట్టేసి, బుజ్జి కృష్ణకి కాల్ చేశాడు రెడ్డి.

“ఓ, రెడ్డిగారా! ఏంటి మమ్మల్ని ఇలా గుర్తు చేసుకున్నారు?” అడిగాడు బుజ్జి కృష్ణ.

అవార్డుల ఫంక్షన్ గురించి చెప్పాడు రెడ్డి.

“కళాకారులని గౌరవించాలనే మీ తపన గొప్పది. మరి నేను అక్కడికి అంటే…”

“ఎంత మాట. ఉత్తమ అవార్డ్ మీకే కద! పైగా మీతో పాటు మిగతా ఆహ్వానితులందరికి కలిపి ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేస్తున్నా”

“ఇహ మీరు ఏం వర్రీ కాకండి. నేను తప్పకుండా వస్తున్నాను,” మాటిచ్చాడు బుజ్జి కృష్ణ.

తరువాత కొన్ని గంటల పాటు తెగులు సినిమాలోని పెద్ద నటీ నటులకి, సాంకేతిక నిపుణులకి అందరికి కాల్ చేసి, ఉత్తమ అవార్డ్ వారికేనని హామీ ఇచ్చి, అందరితోనూ ఫంక్షన్‌కి తప్పకుండా వచ్చేలా మాట పుచ్చుకున్నాడు రుబ్బు రోలు రెడ్డి.

***

హౌజాగ్ నగరంలోని అతి పెద్ద ఆడిటోరియంని బుక్ చేశాడు రెడ్డి. ముందుగా తనకు మాత్రమే అరేంజ్ చేసిన స్పెషల్ ఫ్లైట్‌లో రిచు విచ్చేశాడు. ఆ తరువాత బుజ్జి కృష్ణతో సహా మిగతా నటీ నటులు విచ్చేశారు. ఇంకో బ్యాచ్‌లో దర్శకులు, సంగీత దర్శకులు, కమెడియన్‌లు, వగైరాలు వేంచేశారు.

“వాయ్యో! అసలు ఇంతమంది సినీ ప్రముఖులు ఒకే కప్పు కింద చేరడం ఇదే మొదటి సారి అయ్యుంటుంది. వీళ్లందరిని మా బాస్ ఎలా మ్యానేజ్ చేస్తాడబ్బా? అసలే వీళ్ళందరికి వల్ల మాలిన ఈగోలు,” తనలో తాను అనుకున్నాడు సెగట్రీ.

“అవార్డ్ ట్రోఫీలు తీసుకొస్తున్న ఇసుక లారీలు ఇంకా రాలేదేంటి,” ఆందోళనగా అన్నాడు రుబ్బు రోలు రెడ్డి, సెగట్రితో.

“ఇసుక లారీలలో అవార్డులు తెప్పిస్తున్నారా? అంతంత పెద్ద ట్రోఫీలా?” ఆశ్చర్యంగా అడిగాడు రిచంజీవి.

“అహహా, ట్రోఫీల సైజు మామూలే, జస్ట్ వాటి సంఖ్య ఎక్కువ, అంతే!” చెప్పాడు రెడ్డి.

“అదిగోండి, లారీలు వచ్చేశాయి,” ఆనందంగా అన్నాడు సెగట్రీ.

***

“నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికి నా ధన్యవాదాలు. అసలే ఫంక్షన్ నిడివి చాలా పెద్దది కాబట్టి, ఈ సారికి నా ఇష్ట దైవమైన పరమ శివుడి మంత్రాలు స్కిప్ చేస్తున్నా. డైరెక్ట్‌గా అవార్డుల్లోకి వెళ్ళిపోదాం,” అనౌన్స్ చేశాడు రుబ్బు రోలు రెడ్డి.

అక్కడ ఉన్న యావన్మంది చప్పట్లు కొట్టి తమ ఉత్సాహం ప్రకటించారు.

“వీళ్ళు చప్పట్లు కొట్టింది మా సార్ మంత్రాలు చదవను అన్నందుకా, లేకా వెంటనే అవార్డుల్లోకి వెళ్ళిపోదాం అన్నందుకా?” సందేహం కలిగింది సెగట్రీకి.

“ఇప్పుడు మొదటి అవార్డ్ బుజ్జి కృష్ణ గారు బహుకరిస్తారు,” ఆనందంగా అన్నాడు రెడ్డి.

బుజ్జి కృష్ణ ఉలిక్కి పడ్డాడు. “ఇదేంటి ఉత్తమ అవార్డ్ ఇస్తాను అన్న వాడు, తనతో అవార్డ్ ఇప్పిస్తున్నాడేంటి?” అనుకున్నాడు కోపంగా. ఐనా వేదిక మీదకి వెళ్ళక తప్పలేదు బుజ్జి కృష్ణకి.

తనకిచ్చిన కవర్‌ని చించి అందులో ఉన్న పేరు చదివాడు బుజ్జి కృష్ణ. “ఉత్తమ స్టార్, రిచంజీవి!”

అందరి కరతాళ ధ్వనుల మధ్య స్టేజ్ మీదకి వెళ్ళి బుజ్జి కృష్ణ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు రిచంజీవి. బుజ్జి కృష్ణ పళ్ళు పట పటా కొరుక్కున్నాడు.

ఆ తతంగం అయిపోగానే వెను తిరుగుతున్న ఇద్దరు నటులని ఆపి, “ఆగండి, అప్పుడే వెళ్తారేంటి? ఇప్పుడు నెక్స్ట్ అవార్డ్ రిచంజీవి గారు ఇస్తారు,” చెప్పాడు రెడ్డి.

రిచంజీవి తనకిచ్చిన కవర్‌ని చించి అందులో పేరు చదివాడు. “ఉత్తమ నటుడు, బుజ్జి కృష్ణ!” ఆడిటోరియం మారు మోగే చప్పట్ల మధ్య రిచు నుంచి ట్రోఫీ తీసుకున్నాడు బుజ్జి కృష్ణ.

ఆ తరువాత ఉత్తమ కథా నాయకుడి అవార్డుని సొల్లు అర్జున్ అభాస్‌కి ఇచ్చాడు. అభాస్ ఏమో ఉత్తమ నృత్య నాయకుడి అవార్డుని సొల్లు అర్జున్‌కి ఇచ్చాడు.

విషయం మెల్లగా అక్కడికి వచ్చిన ఆహ్వానితులకి అర్థం కావడం మొదలయ్యింది. ఇసుక లారీల్లో ట్రోఫీలు తెప్పించాల్సిన అగత్యం ఎందుకో బోధపడింది.

రకరకాల బిరుదులతో, ఫంక్షన్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవార్డ్ వచ్చేలా చూసుకున్నాడు రుబ్బు రోలు రెడ్డి.

సంగీత దర్శకులకి ఏమో ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ దరువు రాజు, ఉత్తమ డప్పు ప్రభువు లాంటి అవార్డులు దక్కాయి

దర్శకులకి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నట నిర్దేశకుడు, ఉత్తమ కళా దర్శకుడు, ఉత్తమ అమోఘ దర్శకుడు లాంటి అవార్డులు వచ్చాయి.

క్యారక్టర్ నటులందరికి ఏమో ఉత్తమ విలక్షణ నటుడు, ఉత్తమ సలక్షణ నటుడు, ఉత్తమ అవలక్షణ నటుడు లాంటి అవార్డ్స్ ఇవ్వబడ్డాయి.

కమెడియన్స్‌కి ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ కమెడియన్, ఉత్తమ జోకర్, ఉత్తమ నవ్వుల రాజు లాంటి అవార్డ్స్ దొరికాయి.

ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినయ్యా వాయనం టైపులో ఒకరికొకరు అవార్డ్స్ ఇచ్చుకోవడంతో ఫంక్షన్ చాలా సరదాగా సాగిపోయింది.

అందరు తమ తమ అవార్డులని చంకల్లో పెట్టుకున్నాక, చివరాఖరికి ఒక ట్రోఫీ మిగిలింది.

“అయ్యో, ఇదేదో ఎక్స్‌ట్రా ట్రోఫీ మిగిలిపోయిందే, దీన్నేం చేద్దాం,” కాస్త బాధగా అన్నాడు రెడ్డి.

“ఉత్తమ అవార్డ్ బహుమతి కర్తగా మీరే ఆ ట్రోఫీ తీసుకోండి,” అంటూ రిచంజీవి, బుజ్జి కృష్ణ కలిసి జమిలిగా రుబ్బు రోలు రెడ్డి చేతుల్లో ఆ ట్రోఫీని పెట్టారు.

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

6 Responses to అందరికి అన్నీ ఇస్తాం!

 1. Naga Muralidhar Namala says:

  ఈ పోస్ట్ ఆయన చూస్తే ఉత్తమ పేరడీ బ్లాగర్ అవార్డ్ మీకు ఖాయం

  • Murali says:

   అంతే అంటారా? ఐతే ఆ ఇసుక లారీలలోని ఒక ట్రోఫీ నాకు దొరుకుతుందన్న మాట! 🙂

 2. Pavan says:

  అదరగొట్టేసారు మేష్టారు.

 3. రవి says:

  భయప్రద రెగ్యులర్ కద, ఆమె కే అవార్డూ ఇవ్వలేదా రుబ్బురోలు రెడ్డి ?

 4. Lalitha TS says:

  మీ ఈ పోస్ట్ పుణ్యమా అని నాకూ కొన్ని నవ్వులు రివార్డుగా దొరికాయి 😊

 5. bkrmaadhav says:

  ఆ మధ్య టైం దొరికినప్పుడల్లా, కనబడ్డ వాళ్ళందరికీ రెడ్డిగారు ఎవార్డులు ఇచ్చేసారు. సాదర పారాయణరావు గారి అభిజాత్యం సీరియల్ జీళ్ళ పాకం లా సాగతీసినందుకు, వారిక్కూడా.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s