పప్పు లాంటి మనిషి


శోకేశ్ బాబు వాళ్ళ తాత గారు నటించిన “నిప్పు లాంటి మనిషి” సినిమాని తన ఆఫీసులో ఉన్న బిగ్ స్క్రీన్ టీవీ మీద చూస్తున్నాడు. ఎప్పటికైనా తన తాత గారంతటి వాడు కావాలన్నది శోకేశ్ కోరిక. ఒక్క శోకేశే కాదు, తాత గారి వారసులంతా కూడా ఆయనలా అయిపోదామని ఫీల్ అవుతూంటారు. (కొందరు దాదాపు అయి పోయామని కూడా అనుకుంటూంటారు లెండి.)

ఈ సీనుని రూం బయటనుండి గమనిస్తున్న బర్రెల రామకృష్ణుడు, బుచ్చెం నాయుడు చూసి పళ్ళు కొరుక్కున్నారు. “ఈ సినిమా చూసినంత మాత్రాన పెద్దాయనలా అయిపోతాడు అనుకోవడంలోనే చినబాబు తెలివితేటలన్నీ బయట పడుతున్నాయి,” కసిగా అన్నాడు బుచ్చెం నాయుడు.

“తనకి తెలివితేటలు ఉన్నాయో లేదు పక్కనుంచు. మనకు అసలు లేవు అనుకుంటాడు కద. అందుకే మన మంత్రిత్వ శాఖల్లో వేళ్ళు కాళ్ళు కూడా పెట్టేసి మనల్ని శోకంలో ముంచెత్తుతున్నాడు,” బాధగా అన్నాడు రామకృష్ణుడు.

“అవును, మనమంతా వెళ్ళి సూర్యబాబు నాయుడుతో, “యాండీ, మీ అబ్బాయి ఒక రాజ్యాంగేతర శక్తి, అదే extra constitutional power లా తయారు అయ్యాడు,” అని చెప్పడమే మనం చేసిన పెద్ద పొరపాటు,” వాపోయాడు బుచ్చెం నాయుడు.

“అవును, దాంతో ఆయన నొచ్చుకుని, అసలే నేను చండ శాసనుడిని, పార్టీకి చెడ్డ పేరు వస్తే భరించలేను, అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని, దీనికి ఒకటే పరిష్కారం, చినబాబుని మంత్రిని చేసేస్తున్నా, ఇంక వాడు రాజ్యాంగేతర శక్తి కాదు, రాజ్యాంగ లోపలి శక్తే అని, శోకేశ్‌ని మంత్రిని చేసి పారేశాడు,” ఘొల్లుమన్నాడు బర్రెల రామకృష్ణుడు.

“మంత్రయ్యాక మనోడి అవాకులు చెవాకులు పదింతలు పెరిగి పోయాయండి. అప్పుడే బెటర్. సైలెంట్ గా మనల్ని హింసించే వాడు. మంత్రయ్యాక ఒకటే స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అని భయపడి చస్తున్నాం,” కసిగా అన్నాడు బుచ్చెం నాయుడు.

“నువ్వు చెప్పింది నిజమే, పద, వెళ్ళి సూర్యబాబు గారి చెవులు కొరుకుదాం. చినబాబుకి ఇంకా మంత్రి పదవి నిర్వహించేంత పరిణితి రాలేదు, కొన్ని రోజులు, రాజ్యాంగేతర శక్తిగానే ఉండనివ్వండి అని సలహా ఇద్దాం,” అంటూ బుచ్చెం నాయుడుని తీసుకుని సూర్యబాబు చేంబర్స్ వైపు బయలుదేరాడు బర్రెల రామకృష్ణుడు.

****

“ఐతే చినబాబు వల్ల మన పార్టీ ప్రతిష్టలు మసక బారుతున్నాయి అంటారు,” కళ్ళ జోడు పై నుండి ఇద్దరినీ తీక్షణంగా చూస్తూ అన్నాడు సూర్యబాబు నాయుడు. ఆయన అప్పుడే మోస్తా తీర ప్రాంతాల దగ్గరి సముద్రానికి “సూర్యన్న సాగరం” అని పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఎలాగూ పథకాలన్నిటికి తన పేరు పెట్టేశాడు, సముద్రాలని, నదులని, పిల్ల కాలువలని కూడా ఎందుకు వదలాలి అన్నది ఆయన ఆలోచన.

“ఆయ్, మసక బారిపోవడం కాదండి, ఆయన స్టేట్‌మెంట్స్‌ని మీడియాకి సర్ది చెప్పలేక మాకు మెంటల్ వచ్చేస్తుంది,” వినయంగా చెప్పాడు రామకృష్ణుడు.

“వేరే మంత్రిత్వ శాఖల గురించి నీకెందుకు అని నన్ను ఎప్పుడో కోప్పడ్డారు కదండి. ఇప్పుడేమో చినబాబుగారు, నా మంత్రిత్వ శాఖని నిర్వహించడానికి కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదండి,’ గుర్రుగా కంప్లైంట్ చేసాడు బుచ్చెం నాయుడు.

“ఇంతకి వాడు ఇచ్చిన డ్యామేజింగ్ స్టేట్‌మెంట్స్ ఏంటో చెప్పండి,” పురమాయించాడు సూర్యబాబు.

“చిత్తం,” అంటూ జేబులోంచి ఒక పెద్ద చిట్టా తీశాడు రామకృష్ణుడు.

“ఎహే, మిమ్మల్ని అడిగింది చిట్టా చదవమని కాదు, వాడి టాప్ 5 డ్యామేజింగ్ స్టేట్‌మెంట్స్ చెప్పండి చాలు,” చిరాకు ద్వనించింది సూర్యబాబు గొంతులో.

“హిండియాకి స్వాంతంత్ర్యం వచ్చి 66 ఏళ్ళు అయ్యింది అన్నాడండి. వచ్చి 69 ఏళ్ళు కదండి అయ్యింది,” గొణిగాడు బుచ్చెం నాయుడు.

“రిపబ్లిక్ కానంత వరకు మనం పూర్ణ స్వతంత్ర్యులం కాదు అని వాడి అభిప్రాయం. అందుకే 1950 నుంచి లెక్క పెట్టాడులే, నెక్స్ట్?”

“అలా అనుకున్నా 67 ఏళ్ళు అయినట్టు కద?” బర్రెల రామకృష్ణుడి చెవిలో రహస్యంగా అన్నాడు బుచ్చెం నాయుడు.

“నువ్వు నోరు మూయి, ఇంత చెప్పిన వాడు, ఒక సంవత్సరం తేడా వస్తే ఏమవుతుంది అని కూడా అంటాడు,” కసురుకున్నాడు రామకృష్ణుడు.

“ఏంటా గుసగుసలు? తరువాత స్టేట్‌మెంట్ చెప్పండి!” గద్దించాడు సూర్యబాబు.

“మొన్నటికి మొన్న మన రాజ్యాంగ కర్త జయంతి రోజు, అందరికి ఆయన వర్ధంతి శుభాకాంక్షలు చెప్పాడు,” నసిగాడు రామకృష్ణుడు.

“అంటే ఆయన మన మధ్య లేడు అన్న విషయం గుర్తొచ్చి ఉంటుంది. అందుకే పొరపాటున అలా అని ఉంటాడు లే!”

“అంతే అంటారా, మరి ప్రమాణ స్వీకారం రోజు శ్రద్ధా పూర్వకంగా అనడానికి బదులు శ్రద్ధాంజలి ఘటించాడు కద?” ఇది బుచ్చెం నాయుడు.

“అదా, మన రాష్ట్రంలో మంత్రి పదవుల్లో ఉండి కీర్తిశేషులైన ఎందరో మహానుభావులని గుర్తు చేసుకుని అలా ఘటించి ఉంటాడులే.”

“ఒక సభలో, వచ్చే ఎన్నికల్లో మన పార్టీ కనీసం 200 సీట్లు గెలుస్తుందని కమిట్ అయ్యాడు. మన రాష్ట్రం మొత్తంలోనే అన్ని సీట్లు లేవు కద,” బాధతో బర్రెల రామకృష్ణుడి గొంతు వణికింది.

“ఓరి పిచ్చోళ్ళలారా! అప్పటికి రీ-ఆర్గనైజేషన్ వల్ల మన రాష్ట్రంలో 250 సీట్లు ఉంటాయిలే!”

“ఇంతకంటే దారుణం ఏంటంటే, బంధు ప్రీతి, కుల పిచ్చి ఉన్న పార్టీ కేవలం మనదే అన్నాడు,” ఉక్రోశంగా అన్నాడు బుచ్చెం నాయుడు

“నిజమే చెప్పాడు కద!” అని నాలుక కరుచుకున్నాడు సూర్యబాబు. తరువాత, “సరేలే నేను వాడితో మాట్లాడతాను. రాజకీయాల్లో ఇంత నిజాయితీ పనికి రాదు అని అర్థమయ్యేలా చెప్తాను,” అంటూ భరోసా ఇచ్చాడు.

“ఈ చెప్పడాలు, బుజ్జగించడాలు ఎందుకు సార్, చినబాబుకి మంత్రి పదవి, కాస్త రాజకీయ పరిణితి వచ్చాక ఇస్తే సరిపోయేది కద?” ఈ సారి ఇద్దరు ముక్తకంఠంతో అన్నారు.

“అక్కడికి మనమందరం రాజకీయ పరిణితి వచ్చాకే మంత్రులు అయినట్టు! వెళ్ళండి వెళ్ళండి, మీ పని, అదే చినబాబు ఇచ్చిన పని చూసుకోండి,” కసురుకున్నాడు సూర్యబాబు.

 

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

5 Responses to పప్పు లాంటి మనిషి

 1. Siva Kumar K says:

  ROFL 😀 😀 😀

 2. రాజకీయ పరిణితి వచ్చాకే పదవులు ఎక్కాలంటే ఎలాగండీ మీరు మరీనూ.

  • hai.S.babu says:

   కొత్తగా పెళ్ళీన ఆదవాళ్ళు (మా బంగారంతో సహా!) “ఇవ్వాళ్ళ కూరలోఎ ఉప్పెలా వుంది,సరిపోయిందా?”,”నిన్న ఎక్కువయిందన్నారుగా,ఇవ్వాళ సరిపోయిందా?” లాంటి ముందస్తు సూచనలు ఇవ్వకుండా తప్పించుకునే ఉపాయాలు దొరకనివ్వకుండా మొగుడి మీద ప్రయోగాలు చేసి వంట నేర్చూన్నట్టు రాజకీయ నాయకిల్ల్లో చాలామంది సూర్యబాబ్లులా వెన్నుపోటు ప్రయత్నాల తోనూ కచరా గారిలా వేర్పాటు ఉద్యమాలతోనూ ప్రయోగాత్మకంగా అధికారంలోకి వచ్చి తర్వాతెప్పుడో అనుభవం తెచ్చుకుంటున్నవాళ్ళే!

   ఇక్కడ శోకేష్ అక్కడ కుటీర్!

 3. Anamika says:

  HIHIHIHI,,Super

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s