అందరు అనుకున్నదే అయ్యింది. కానీ తేడా ఏమిటంటే, ఎవరూ ఊహించనంత తొందరగా అయ్యింది. అరెమికా సైన్యాధికారులు తోలుబోను ఉగ్రవాదులు బాకుల్‌ని అరవయి రోజుల్లో ఆక్రమించుకుంటారు అని అంచనా వేశారు. మరి కొందరు యదార్థ వాదులు ఒక వారం పట్టొచ్చు అనుకున్నారు. ఒకప్పటి వీ.పీ, ప్రస్తుతపు అరెమికా పీ.పీ. (పిచ్చి ప్రెసిడెంట్) అయిన Widen అసలు అలా ఎప్పటికి జరగదు అని తన క్యాల్క్యులేటర్‌లో లెక్ఖలు వేసుకుని మరీ ప్రపంచానికి హామీ ఇచ్చాడు.
కానీ హాచ్హర్యం, ఒక రోజులోనే తోలుబోను, బాకుల్ నగరపు రాజప్రాసాదం మీద తమ జెండా ఎగురవేసింది.
ప్రపంచం నిర్ఘాంత పోయింది. వైడెన్ తన నోరు వైడ్‌గా తెరిచి, “తూచ్, నేనొప్పుకోను, తోలుబోను వారు తొండి చేశారు,” అని వాపోయాడు.
సర్లెండి, ఇదంతా కాదు కానీ, ముల్లు అరిటాకు సామెతలా, అసలు కష్టం వచ్చింది మాత్రం ఉఫ్ఘనిస్తాన్ ప్రజలకు. వారిలో ఈ మధ్యే కొంత ధైర్యం పెరిగింది. మగ పిల్లలు ఫుట్‌బాల్ ఆడడం, ఆడ పిల్లలు పెదవులకు రంగు వేసుకోవడం లాంటి దుశ్చర్యలు మొదలు పెట్టారు. వీళ్ళందరి గుండెలు అర్జెంటుగా దడదడలాడ్డం మొదలు పెట్టాయి.
1996 నుంచి 2001 వరకు తోలుబోను ఉఫ్ఘనిస్తాన్‌ని పరిపాలించింది. ఆ పాలనని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఫుట్‌బాల్ ఆడితే తప్పు, లిప్‌స్టిక్ పూసుకుంటే తప్పు, తమ గెడ్డం గొరుక్కోవడం తప్పు, వేరే వారి గెడ్డాన్ని గొరగడం ఇంకా తప్పు. అన్నీ తప్పులే. స్త్రీలకు కాదు కదా, పురుషుల శీలానికి కూడా రక్షణ లేని అంధకార యుగం అది.
వారిలో కొందరు, “బతికుంటే పాచిపోయిన పరాటాలు తినొచ్చు, మళ్ళీ వారి ఐదేళ్ళ పాలనలో ఎలా జీవించామో అలానే ఉందాం,” అని ప్రపోజ్ చేశారు. కానీ ఇంకొందరు, “అలా ఉన్నా లాభం లేదు. వాళ్ళు అధికారంలోకి రాగానే, గత ఇరవయి ఏళ్ళలో చేసిన తప్పులకి కూడా శిక్ష విధిస్తారు, ఈ దేశం వదిలి పారిపోవడం తప్ప వేరే దారి లేదు,” అన్నారు.
కానీ పారిపోవాలన్నా ఒక మార్గం ఉండాలి కద! విమానాల్లో దేశం వదిలిపెట్టే వెసులుబాటు అతి తక్కువ మందికి మాత్రమే ఉంది. బస్ చార్గీలకు కూడా గతి లేని వారే ఆ దేశంలో ఎక్కువ మంది. (అంటే, ఉఫ్ఘనిస్తాన్‌లో బస్సులు తెగ తిరిగేస్తున్నాయి అనుకోకండి సుమా! ఉదాహరణకు చెప్పాను అంతే.)
డబ్బులు లేని, పిక్కబలం మాత్రమే ఉన్న వారు పారిపొవాలంటే, వారికి ఉన్న ఆప్షన్స్, పీకిస్తాను, ఇకరాను, నైచా మరియు ఇంకా కొన్ని స్తానులు మాత్రమే. అక్కడికి పోయినా పరిస్థితి పెద్దగా మెరుగు పడే అవకాశం లేదు. ప్చ్!
ఐతే పారిపోవడం తప్ప వేరే దారి లేని వారు, ఉఫ్ఘనిస్తాన్‌ని ఉద్ధరిద్దామని అక్కడికి వలస వచ్చిన ఇతర దేశస్తులు మాత్రమే! తోలుబోను, తమ దేశంలో స్కూళ్ళూ-బిల్డింగులూ-బ్రిడ్జులూ కట్టిన వీరిని క్షమించే అవకాశమే లేదు. వాళ్ళంతా బిలబిలమంటూ ఎయిర్‌పోర్టు వైపు లగెత్తారు. వీరిలో బోలెడు చాలా మంది హిండియన్లు కూడా ఉన్నారు.
ఘనత వహించిన Widen వీరెవరికి ఉఫ్ఘనిస్తాన్‌ను ఖాళీ చేసేంత టైమ్ కూడా ఇవ్వలేదు కాబట్టి, వీరందరూ పారిపోవడం అసంభవం.
కాబట్టి ప్రపంచమంతా అనేక వింత దృశ్యాలను తిలకించాల్సి వచ్చింది. ఉదాహారణకు, ఎగురుతున్న విమానాల్లోంచి చోటు లేక కింద పడిపోతున్న ప్రయాణీకులు, అవే ప్లేన్లలోని లగేజ్ కంపార్ట్‌మెంట్లలో కూడా దూరిపోయిన నిర్భాగ్యులు, విమానాలని చేరుకునే ముందే ఎయిర్‌పోర్ట్‌లోనే తొక్కిసలాటలో మరణించిన ప్రజలు.
ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నా, పీకిస్తానులోని S.I.S. బిల్డింగ్‌లో మాత్రం సంబరాలు అంబరాన్ని అంటాయి.
“ఈ బాదూషా తిను అన్నయ్యా, లేకుంటే నా మీద ఒట్టే,” అంటున్నాడు ఒక ఉద్యోగి ఇంకో ఉద్యోగితో. “అదేం కుదరదు, నువ్వే ముందు నేను తెచ్చిన రసగుల్లా తినాలి,” గోముగా అన్నాడు ఆ ఇంకో ఉద్యోగి.
“అరెమికన్లు ఉఫ్ఘనిస్తాన్‌ని ఖాళీ చేశారు కాబట్టి, ఇక మనం ఎంచాక్కా ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వొచ్చు, వారిని హిండియాలోకి అచ్చోసిన ఆంబోతుల్లా తోలొచ్చు, మన పవిత్ర జిగాద్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు,” అంటూ మురిసిపోయాడు వారి ఆఫీసర్.
“ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే…” అన్న సామెత ఊరికే పుట్టలేదు మరి!
S.I.S. బిల్డింగ్ పైన ఎప్పుడూ కూర్చుని ఉండే తీతువ పిట్ట ఒకటి, వికృతంగా కూసింది.
(అశుభం)