నగ్న సత్యం:
అంధేరా ప్రదేశ్ అంతా వేలంట్ల మాధవ్ వీడియో వార్తతో అట్టుడుకిపోయింది. పత్రికాధిపతులు ఈ వార్తని విశదంగా కవర్ చేసి తమ సర్క్యులేషన్ పెంచుకోవచ్చని ఆనంద పడ్డారు. ఎగస్పార్టీ అయిన తెగులు దేశం పార్టి వై.నో. గగన్‌ని ఇరకాటాన పెట్టడానికి ఒక మంచి ఆయుధం దొరికింది అని సంబర పడింది. SRYCP పార్టీ వాళ్ళు ఈ విషయం చివికి చివికి గాలివానై రాబోయే ఎన్నికలలో ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తుందో అని ఖంగారు పడ్డారు. ఏ మాత్రం చింత లేనిది వేలంట్ల మాధవ్‌కు మాత్రమే.
పత్రికాధిపతులు, టీవీ చానెళ్ళు తమ తమ విలేఖరులని ఈ వార్త వెనక నిజాన్ని నిగ్గు తేల్చాలని ఆదేశించాయి. కానీ విలేఖరులు ఎదురు తిరిగారు. వెళ్ళమని మొరాయించారు.
“అదేంటయ్యా? ఆటమ్ బాంబ్ లాంటి వార్త అప్పనంగా మన చేతుల్లోకొచ్చి పడింది. ఏ విలేఖరి అయినా ఇలాంటి అవకాశం వస్తే సర్రున దూసుకుపొతాడు. మీరేంటి ఇలా?” అయోమయంగా అన్నాడు ఒక టీవీ చానెల్ అధినేత.
“మీకేం తెలుసు సార్ మా కష్టాలు. ఆ మాధవ్ దగ్గరికి వెళ్ళి వీడియో గురించి ఎవరైనా అడిగితే ఆయన వాళ్ళని అమ్మ/ఆలి బూతులు తిడుతున్నాడు. బాగా రాటు దేలిన మేమే తట్టుకోలేక పోతున్నాం. ఆ వీడియో నిజమో అబద్ధమో తెలీదు కానీ, ఆయన నోటి దురుసు మాత్రం నిజంగా నిజం,” బదులిచ్చాడు ఒక విలేఖరి.
మరో వైపు వై.నో. గగన్ తన ఆఫీసులో తల పట్టుకు కూర్చున్నాడు. “ఈ మాధవ్ ఏందన్నా, ఆ రోజు ఏదో సీ.జే. బ్రదర్స్ని మీసం మెలితెప్పి హెచ్చరిస్తే హీరో అనుకుని పార్టీ టికెట్ ఇచ్చినాము. ఈయన ఇలా నీలి వీడియోల్లో హీరో అయిపోతాడని అనుకోలేదబ్బా,” అంటూ వాపోయాడు.
“ఇదంతా ప్రతిపచ్చాల కుట్ర అట సార్. మీరొక చాన్స్ ఇస్తే వీడియో కాల్ చేసి మరీ వివరించుకుంటాడట,” చెప్పింది మంత్రి కూజా.
“వీడియో కాలా?” ఉలిక్కి పడ్డాడు గగన్. “నాదేమన్నా గుండెనా, చేపల చెరువా? నేను తట్టుకోలేను కానీ, తరువాత మాట్లాడతానని చెప్పు. ముందు ఈ విషయాన్ని పెద్దది కాకుండా చూడాలి మనం,”అన్నాడు.
“ఎన్నో కేసుల్లో ఇరుక్కుని దిగ్విజయంగా బయటకి వచ్చిన వారు. మీరే ఏదన్నా దారి చూపాలి,” వినయంగా అన్నాడు అజయ్ సాయి రెడ్డి. ఆయన గడ్డంలో వెతికినా ఒక్క నల్ల వెంట్రుక కనిపించదు.
“సరే, ఒక నిముషం నన్ను దేవుడితో మాట్లాడుకోనివ్వండి,” అంటూ కళ్ళు మూసుకున్నాడు గగన్. కాసేపటికి తెరిచాడు.
“ఆ! మన పార్టీ తరపున అందరికంటే గౌరవప్రద సభ్యుడైన మన అజయ్ సాయి గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి,” అన్నాడు ప్రశాంతంగా.
“నేనేం చెప్పాలి సార్?” ఆరాధనపూర్వకమైన గొంతుతో అడిగాడు అజయ్ సాయి.
“ఈ వీడియో వల్ల మన తల్లులకి అక్క చెల్లెమ్మలకి ఎంత క్షోభ కలిగిందో SRYCP పార్టీ అర్థం చేసుకుంది. కాబట్టి మన తాత ఒకాయన చెప్పినట్టు మనం చెడు వినవద్దు, అన వద్దు, కన వద్దు! ఆ వీడియో ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే కళ్ళు మూసుకుని డిలీట్ చేసేయ్యండి. దాని గురించి మాట్లాడమాకండి. ఎవరన్న మాట్లాడితే చెవ్వులు మూసుకోండి. ఇవన్నీ మీరు చేస్తే, మీకే కష్టం రాకుండా గగనన్న తన వంతు కృషి తాను చేస్తాడు. నమ్మండి! అని చెప్పండి అజయ్ సాయి గారు,” చేతులు నులుముకుంటూ చెప్పాడు వై.నో. గగన్.
సినీ బంద్
తెగులు సినీ నిర్మాతలందరూ ఒక చోట సమావేశమయ్యారు.
నిల్ రాజు గొంతు సవరించుకున్నాడు. “నా ప్రియతమ సహ నిర్మాతలారా. మనమెందుకు ఇక్కడ సమావేశం అయ్యామో మీకు తెలుసు. సినీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. దీనికి కారణం పెరిగిపోయిన ప్రొడక్షన్ ఖర్చులే. బడ్జెట్ తగ్గించుకుంటే కానీ ఈ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మీరంతా తమ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను,” అని ముక్తాయించాడు.
డీ. కళ్యాణ్ గొంతు సవరించుకున్నాడు. “అందరికి తెలిసిన విషయమే ఇది. హీరోలకు, దర్శకులకు ఇస్తున్న రెన్యూమరేషన్ సినిమా ఖర్చులో ముప్పాతిక వంతు ఉంటూంది. ఇది అరాచకం. వీరు కనుక తమ పారితోషికం తగ్గించుకుంటే మన సినిమాలు ఆటోమ్యాటిక్‌గా లాభాల బాట పడతాయి,” అన్నాడు.
“అయితే వెంటనే ఈ పారితోషికాలు ఏవో అదుపులో వచ్చేవరకు మనమంతా షూటింగులు ఆపేద్దాం. ఇది నిర్మాతల సమ్మె. తగ్గేదే లేదు,” ప్రకటించాడు నిల్ రాజు.
తరువాత పనులు చక చకా జరిగిపోయాయి. సినీ పరిశ్రమలోని అందరూ తమ తమ పారితోషికాలు తగ్గించుకోవాలని, ముఖ్యంగా హీరోలు, దర్శకులు ఈ నియమం పాటించాలని ఫోన్ల ద్వారా తెలియజేయడమైంది.
ఒక వారం తరువాత అందరు నిర్మాతలు మళ్ళీ సమావేశమయ్యారు. “ఏమయ్యింది, మన సూచనలకు అందరూ ఒప్పుకున్నారా?” ఆదుర్దాతో అడిగాడు నిల్ రాజు.
“మిగతా వాళ్ళు ఎవరూ ఇంకా బదులు చెప్పలేదు కానీ, ఆ ఆరుగురూ మాత్రం ఒక్క పైస కూడా తగ్గించుకోరంట,” నీరసంగా చెప్పాడు డీ. కళ్యాణ్.
“ఈ ఆరుగురు ఎవరయ్యా? ఆ నలుగురి గురించి విన్నాం కానీ!”
“మన ఇండస్ట్రీలో టాప్ హీరోలు సార్: రిచంజీవి, మార్ చరణ్, సొల్లు అర్జున్, ఉమేశ్ బాబు, వాయు కళ్యాణ్, Jr. TNR.”
“వీళ్ళు ఒప్పుకోరు అని నేను ముందే అనుకున్నాను. పోనిలే, ఇంకా చాలా మంది సమాధానం ఇవ్వాలి కద,” తనకు తానే సరి చెప్పుకున్నాడు నిల్ రాజు.
గంటలో కొత్త అప్‌డేట్ వచ్చేసింది.
“ఆ ఆరుగురు కూడా ఒప్పుకోరట,” చెప్పాడు డీ. కళ్యాణ్..
“ఈ ఆరుగురు ఎవరు?” నీరసంగా అన్నాడు రాజు.
“ఈ సారి దర్శకులు లెండి. W.W. వినాయక్, నో.నో. రాజ్ మౌళి, చతుర్ విక్రం, సునీల్ రావిపూడి, కొరకొరా శివ, గాయపాటి శీను.”
“అసలు ఖర్చులకు ముఖ్య కారణం, ఈ దర్శకులూ, నటులే కాదయ్యా! వీరు తగ్గించుకోకుంటే ఇక మనం ఏం సాధించినట్టు?”
“అన్నట్టు నో.నో. రాజ్ మౌళీ గారు మనతో ఫోన్లో ఐదు నిముషాలు మాట్లాడినందుకు తన అమూల్యమైన సమయం వృధా అయ్యింది కాబట్టి, పరిహారంగా ఒక ఐదు లక్షలు పంపమన్నారు కూడా,” చెప్పాడు కళ్యాణ్.
పళ్ళు పటా పటా కొరికాడు రాజు.
“ఇప్పుడేం చేద్దాం,” అడిగారు గిల్డ్ లోని మిగతా నిర్మాతలు.
“ఏదో ఒకటి చేయకుండా ఈ సమ్మె విరమించుకుంటే, మనకు చాలా అవమానం. కాబట్టి, జూనియర్ ఆర్టిస్టులు ఇంకా లైట్ బాయ్స్ లాంటి వారి జీతంలో ఒక ఐదు శాతం కోత విధించి సమ్మె ఆపేద్దాం. కాస్త పరువు దక్కుతుంది,” చెప్పాడు నిల్ రాజు.
దుంకులాట
బీమార్ రాష్ట్ర గవర్నర్ ఇంటికి పొద్దున్నే ఒక విజిటర్ ఏతెంచాడు. ఆయన ఎవరో కాదు, బీమార్ రాష్ట్ర ముఖ్య మంత్రి సతీష్ కుమార్.
“ఏంటయ్యా, ఇంత పొద్దున్నే వచ్చావు?” కళ్ళు నులుముకుంటూ అడిగాడు గవర్నర్.
“నా రాజీనామా ఇవ్వడానికి సార్!”
“అదేంటి ఎన్నికలకింకా మూడేళ్ళ సమయం ఉంది కద?”
“ఈ జే.బీ.పీ వాళ్ళతో నాకు పొసగడం లేదు సార్. అందుకే ఈ రాజీనామా.”
“ఓహో. అయితే మధ్యంతర ఎన్నికలు ప్రకటించాలా?” అయోమయంగా అడిగాడు గవర్నర్.
“ఛీ, ఛీ! రేపు పొద్దున్నే మళ్ళీ నా ప్రమాణ స్వీకారం. మీరు తప్పకుండా రావాలి,” నవ్వుతూ చెప్పాడు సతీష్ కుమార్.
“అదేంటి!!??”
“బూజశ్వీ యాదవ్ నాకు మద్దతు ప్రకటించాడు. కాబట్టి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అన్న మాట.”
“అదేంటయ్యా, వాళ్ళతో పొసగకనే జే.బీ.పీ.తో కలిసావు కద!”
“ఇప్పుడు వీళ్ళతో పొసగడం లేదు సార్. అర్థం చేసుకోండి!”
“అయినా ఇలా ఎన్ని సార్లు ప్రమాణ స్వీకారం చేస్తావయ్యా? విసుగ్గా లేదూ?” చిరాకుగా అడిగాడు గవర్నర్.
“మీరు మరీనూ. ఒక్క సారి బర్త్‌డే చేసుకున్నామని ఇంక చేసుకోకుండా ఉంటామా సార్? ప్రతి ఏడాది చేసుకోవాలి కద,” విశాలంగా నవ్వుతూ సెలవిచ్చాడు సతీష్ కుమార్.
“పోనీలే, కొంత మంది తమ ఆచారం ప్రకారం నెలకొకసారి బర్త్‌డే చేసుకుంటారు. మా అదృష్టం కొద్ది, సంవత్సరానికి ఒక సారితో సరిపెట్టావు,” నిట్టూర్చాడు బీమార్ గవర్నర్.
నగ్న సత్యం చదువుతూ నవ్వు ఆపుకోలేక పోయాను మురళి గారు. Nice one
ధన్యవాదాలు, పవన్ గారు!
nil raju part absolutely correct. Veellu chinna artistula kadupulu kottadamlo siddahastulu.
చినచేపను పెదచేప ……….
సినిమాలను చూసి వదిలెయ్యడమే ఉత్తమం. ఆ రంగం జనాల గురించి అనుకోవడం కూడా అనవసరం.
హలో మురళి గారు,
ఇప్పుడు బ్లాగ్ లోకం లో చాలా తక్కువమంది చదువరులు ఉన్నారు. దయచేసి మీ బ్లాగ్ పోస్ట్ లను telugu quora లో కూడా పోస్ట్ చెయ్యండి.
https://te.quora.com/
అలాగే సార్.