అన్‌బేరెబుల్ టాక్ షో

“రండి రండి కేశవరావు గారు,” ఆహ్వానించారు శంకర్రావు గారు.

“మీరు ఈ రోజు ఎపిసోడ్‌లో బుజ్జి క్రిష్ణ గారు, తన అన్ బేరెబుల్ షోలో, సూర్య బాబు గారిని ఇంటర్‌వ్యూ చేస్తారు, కాబట్టి కలిసి చూద్దాం అని ఆహ్వానించారు కద, అందుకే వచ్చేశాను,” చెప్పారు కేశవరావు గారు.

“ఈ రోజు బుజ్జయ్య తన బావ గారిని కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతాడట. బాబు గారికి కూడా చెప్పక తప్పదు. అసలు MTR గారు 1995లో పదవీచ్యుతుడైన వైనం గురించి సంచలనమైన నిజాలు బయట పడతాయని అందరు ఎదురూ చూస్తున్నారు.”

“ఇంక నేను ఆగలేను, టీవీ ఆన్ చేయండి!”

“అలాగే!”

అన్ బేరెబుల్ షో మొదలయ్యింది. బుజ్జి కృష్ణ ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చాడు. హుందాగా వేదిక మీదకి వస్తూ, “నేనెవరో మీకు తెలుసు, నా స్థానం మీ మనసు, మీ లాంటి అభిమానులు నాకు కంట్లో నలుసు!” అని ప్రకటించాడు. స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల కరతాళ ధ్వనాలు మిన్ను ముట్టాయి.

ఒకరిద్దరు మరింత ఔత్సాహికులు చక చకా వేదికపైకి పరిగెత్తుకుంటూ వచ్చి, బుజ్జయ్య కాళ్ళు మొక్కబోయారు. బుజ్జి కృష్ణ ఒకరి తరువాత ఒకరిని తన లెఫ్ట్ లెగ్‌తో ఫెడీ ఫెడీమని తన్నాడు. కిందకి దొర్లుకుంటూ పోయిన వారిని మిగతా అభిమానులు వచ్చి చుట్టుముట్టి, బుజ్జయ్యతో దెబ్బలు తినే అదృష్టం కలిగినందుకు వారిని అభినందించారు.

“ఆహ ఏమి అభిమానం, ఎంత ఆదరణ! ఎన్ని జన్మలు ఎత్తితే ఈ భాగ్యం లభిస్తుంది చెప్పండి,” గద్గద స్వరంతో అన్నారు కేశవరావు గారు.

“నిజమేనండోయి!”

బుజ్జయ్య ఏమీ జరగనట్టే ప్రేక్షకుల వైపు తిరిగి, “ఈ రోజు మన మధ్యకి ఒక ప్రత్యేక అతిథి రాబోతున్నారు. ఆయన ఎవరో కాదు, నాకు బావ గారు, మీకు బాబు గారు, ఆయన పదవిలో లేడని మా కుటుంబమంతా భోరు, భోరు,” అన్నాడు.

చప్పట్లు.

సూర్య బాబు నాయుడు గారు రంగ ప్రవేశం చేశారు.

ఇద్దరూ ఆసీనులయ్యాక, “బావ గారూ, అన్ బేరెబుల్ షోకి స్వాగతం. మీరు మా ఇంటి అల్లుడయ్యే ముందు యవ్వనంలో, మీరు చేసిన మోస్ట్ రోమాంచకమైన, ఐ మీన్ రొమాంటిక్ పనేంటి?” మొదటి ప్రశ్న సంధించాడు బుజ్జి కృష్ణ.

“చాలా చేశాను, మీరు సినిమాల్లో చేశారు. మేము మీ సినిమాలు ఆడే హాళ్ళ వెనకాల చేశాము,” చిలిపిగా సమాధానమిచ్చారు బాబు గారు.

“భలే భలే! ఇంతకి మా చెల్లాయిని మీరు ఏమని పిలుస్తారు బావా?”

“పుష్ప అని పిలుస్తాను. పుష్ప అంటే ఫ్లవర్ అనుకునేవు. ఫైరు!”

మళ్ళీ చప్పట్లు.

ఇంతలో బాబు గారి అబ్బాయి, చిన బాబు శోకేశ్ కూడా ఎంటర్ అయ్యాడు. కార్యక్రమం మరింత రంజుగా తయారయ్యింది.

“మందలగిరిలో ఎం.ఎల్.యే.గా పోటీ చేసి ఓడిపోయావు. మరి అక్కడినుంచే తిరిగి ఎందుకు పోటీ చేస్తున్నావు?” ఇది శోకేశ్‌కి బుజ్జయ్య సంధించిన ప్రశ్న.

“చిన్నప్పుడు గోలీలాటలో ఎక్కడ మొత్తం పోగొట్టుకునే వాడినో, అక్కడే మళ్ళీ ఆడి గెలుచుకునే వాడిని, మావయ్య! అదే సెంటిమెంట్ ప్రకారం ఈ సారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నా!”

“అది పులి బిడ్డంటే! మీ నాన్నను ఈ డ్రెస్ కాకుండా వేరే దుస్తుల్లో ఎప్పుడైనా చూశావా?”

“నాన్నారు నేను నిద్ర లేచే ముందే ప్రజా సేవకని బయలుదేరి వెళ్ళిపోయేవారు. నేను పడుకున్నాక తిరిగి వచ్చే వారట. కాబట్టి, అదే డ్రెస్ మాట దేవుడెరుగు, నాన్నారిని అసలు చూడ్డమే అపురూపం. ఏదో మీ షో దయ వల్ల ఈ రోజు ఇక్కడ చూస్తున్నాను.”

“మరే, బాబు గారు ప్రజా సేవ కోసమే పుట్టారు. ఆ, బావ గారు, మీకు ఒక కఠినమైన ప్రశ్న. మీ జీవితంలో తీసుకున్న అత్యంత కష్ట తరమైన నిర్ణయం ఏమిటి?”

సడన్‌గా స్టూడియోని నిశ్శబ్దం అలుముకుంది. టీవీ చూస్తున్న మిత్రులిద్దరు కూడా ఊపిరి బిగబట్టారు.

“1995లో,” బాబు గారి కళ్ళల్లో తడి స్పష్టంగా కనిపించింది. “నీకు తెలుసుగా, కేవలం మన పార్టీని రక్షించాలన్న ఉద్దేశంతో MTR గారి కాళ్ళు పట్టుకుని బతిమాలాను. కానీ లాభం లేకపోయింది. ఇంతకు ముందు మీరు మీ ఫ్యాన్స్‌ని తన్నినట్టే ఆయన నన్నూ ఫెడీమని తన్నారు. అయినా ప్రాధేయ పడ్డాను. ఆయన వినలేదు. అందుకే ఇక తప్పని సరిగా రెండో సారి ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ సారి కాళ్ళు పట్టుకుని లాగేశాను.” భోరుమన్నారు బాబు గారు.

బుజ్జయ్య కూడా ఆగలేక ఏడ్చేశాడు.

“మిమ్మల్ని వ్యక్తిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఆ రోజు మనం చేసింది తప్పంటారా?” ముక్కు ఎగ బీలుస్తూ అడిగారు బాబు గారు.

“ఆ రోజు నాకు గుర్తుంది బావా. ఇంకో కాలు పట్టి నేనూ లాగాను కద. తప్పు లేదు బావా, ముమ్మాటికి లేదు. మన తెగులు ప్రజలకోసం మన పార్టీ కోసం బా బా బా, ఆ మాత్రం త్యాగం చేయడం తప్పు లేదు బా!”

“మీకు తెలీనిదేముంది బుజ్జయ్య గారు, ఆయన నా ఆరాధ్య దైవం,” వణుకుతున్న గొంతుతో చెప్పాడు సూర్య బాబు నాయుడు.

“నాకు అంత కంటే ఎక్కువ,” ఘొల్లుమన్నాడు బుజ్జి కృష్ణ.

ఈ సారి స్టూడియోలో ఉన్న ప్రేక్షకులు కూడా గుక్క పట్టి ఏడ్చారు.

టీవీ ఆఫ్ చేస్తూ, “దీని వల్ల తెలిసింది, మనము బాబు గారిని బుజ్జయ్యని ఎంత అపార్థం చేసుకున్నమో! ఇన్ని రోజులూ, పచ్చి పదవీ దాహంతో, పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి, ప్రజలు MTRకి కట్ట పెట్టిన అధికారాన్ని ఈయన నిర్దాక్షిణ్యంగా లాక్కున్నాడు అని అనుకున్నాను. పాపం కేవలం ప్రజల కోసం, పార్టీ కోసమట! చొచొచ్చో!” బాధగా అన్నారు శంకర్రావు గారు.

“అవును సుమండి! ఈ షో చూడ్డం వల్లే మనకు ఆ చారిత్రాత్మక నిజం తెలిసింది.”

This entry was posted in 'కరెంట్' అఫైర్స్, అతుకుల బొంత. Bookmark the permalink.

8 Responses to అన్‌బేరెబుల్ టాక్ షో

  1. Ravi ENV says:

    ఎన్నో ఏండ్ల తర్వాత ఇటొచ్చానండి. సూపర్. నిన్ననే యాభై చెట్ల గురించి మాట్లాడుకున్నాం. 🙂

    • Murali says:

      థాంక్యూ రవి గారు, అబ్బో యాభై చెట్లంటే మాటలా? యాభై ఏళ్ళు మాట్లాడినా చాలదు!

      • విన్నకోట నరసింహారావు says:

        మీరిద్దరు ఏదో కోడ్ భాషలో మాట్లాడుకున్నారల్లే ఉంది. మాకేం అర్థమవలా. “యాభై చెట్లు” అంటే? కొంచెం క్లూ ఇవ్వండి ప్లీజ్.

        • Murali says:

          ఏమీ లేదండి. రవి గారు నేను కొన్ని ఏళ్ళ కిందట వ్రాసిన “విజయానికి యాభై చెట్లు” అనే టపా గురించి మాట్లాడుతున్నారు. లంకె కింద ఇచ్చాను.

          విజయానికి యాభై చెట్లు

  2. విన్నకోట నరసింహారావు says:

    అర్థమయింది, అర్థమయింది, అన్యాపదేశం అర్థమయింది 😁.

    “చెట్ల” గురించి మీరు లింకిచ్చిన Feb 2009 నాటి మీ పోస్ట్ అద్భుతః 👌😁. ఆ పోస్ట్ నేనిదే మొదటిసారి చదవడం. Thanks. నా కామెంట్ ఆ పోస్ట్ క్రిందే వ్రాసాను ఇందాకనే.

  3. బుచికి says:

    Super satire.👌

Leave a reply to Murali Cancel reply