తోలుబోను మళ్ళీ వచ్చేసిందోచ్!

అందరు అనుకున్నదే అయ్యింది. కానీ తేడా ఏమిటంటే, ఎవరూ ఊహించనంత తొందరగా అయ్యింది. అరెమికా సైన్యాధికారులు తోలుబోను ఉగ్రవాదులు బాకుల్‌ని అరవయి రోజుల్లో ఆక్రమించుకుంటారు అని అంచనా వేశారు. మరి కొందరు యదార్థ వాదులు ఒక వారం పట్టొచ్చు అనుకున్నారు. ఒకప్పటి వీ.పీ, ప్రస్తుతపు అరెమికా పీ.పీ. (పిచ్చి ప్రెసిడెంట్) అయిన Widen అసలు అలా ఎప్పటికి జరగదు అని తన క్యాల్క్యులేటర్‌లో లెక్ఖలు వేసుకుని మరీ ప్రపంచానికి హామీ ఇచ్చాడు.

కానీ హాచ్హర్యం, ఒక రోజులోనే తోలుబోను, బాకుల్ నగరపు రాజప్రాసాదం మీద తమ జెండా ఎగురవేసింది.

ప్రపంచం నిర్ఘాంత పోయింది. వైడెన్ తన నోరు వైడ్‌గా తెరిచి, “తూచ్, నేనొప్పుకోను, తోలుబోను వారు తొండి చేశారు,” అని వాపోయాడు.

సర్లెండి, ఇదంతా కాదు కానీ, ముల్లు అరిటాకు సామెతలా, అసలు కష్టం వచ్చింది మాత్రం ఉఫ్ఘనిస్తాన్ ప్రజలకు. వారిలో ఈ మధ్యే కొంత ధైర్యం పెరిగింది. మగ పిల్లలు ఫుట్‌బాల్ ఆడడం, ఆడ పిల్లలు పెదవులకు రంగు వేసుకోవడం లాంటి దుశ్చర్యలు మొదలు పెట్టారు. వీళ్ళందరి గుండెలు అర్జెంటుగా దడదడలాడ్డం మొదలు పెట్టాయి.

1996 నుంచి 2001 వరకు తోలుబోను ఉఫ్ఘనిస్తాన్‌ని పరిపాలించింది. ఆ పాలనని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఫుట్‌బాల్ ఆడితే తప్పు, లిప్‌స్టిక్ పూసుకుంటే తప్పు, తమ గెడ్డం గొరుక్కోవడం తప్పు, వేరే వారి గెడ్డాన్ని గొరగడం ఇంకా తప్పు. అన్నీ తప్పులే. స్త్రీలకు కాదు కదా, పురుషుల శీలానికి కూడా రక్షణ లేని అంధకార యుగం అది.

వారిలో కొందరు, “బతికుంటే పాచిపోయిన పరాటాలు తినొచ్చు, మళ్ళీ వారి ఐదేళ్ళ పాలనలో ఎలా జీవించామో అలానే ఉందాం,” అని ప్రపోజ్ చేశారు. కానీ ఇంకొందరు, “అలా ఉన్నా లాభం లేదు. వాళ్ళు అధికారంలోకి రాగానే, గత ఇరవయి ఏళ్ళలో చేసిన తప్పులకి కూడా శిక్ష విధిస్తారు, ఈ దేశం వదిలి పారిపోవడం తప్ప వేరే దారి లేదు,” అన్నారు.

కానీ పారిపోవాలన్నా ఒక మార్గం ఉండాలి కద! విమానాల్లో దేశం వదిలిపెట్టే వెసులుబాటు అతి తక్కువ మందికి మాత్రమే ఉంది. బస్ చార్గీలకు కూడా గతి లేని వారే ఆ దేశంలో ఎక్కువ మంది. (అంటే, ఉఫ్ఘనిస్తాన్‌లో బస్సులు తెగ తిరిగేస్తున్నాయి అనుకోకండి సుమా! ఉదాహరణకు చెప్పాను అంతే.)

డబ్బులు లేని, పిక్కబలం మాత్రమే ఉన్న వారు పారిపొవాలంటే, వారికి ఉన్న ఆప్షన్స్, పీకిస్తాను, ఇకరాను, నైచా మరియు ఇంకా కొన్ని స్తానులు మాత్రమే. అక్కడికి పోయినా పరిస్థితి పెద్దగా మెరుగు పడే అవకాశం లేదు. ప్చ్!

ఐతే పారిపోవడం తప్ప వేరే దారి లేని వారు, ఉఫ్ఘనిస్తాన్‌ని ఉద్ధరిద్దామని అక్కడికి వలస వచ్చిన ఇతర దేశస్తులు మాత్రమే! తోలుబోను, తమ దేశంలో స్కూళ్ళూ-బిల్డింగులూ-బ్రిడ్జులూ కట్టిన వీరిని క్షమించే అవకాశమే లేదు. వాళ్ళంతా బిలబిలమంటూ ఎయిర్‌పోర్టు వైపు లగెత్తారు. వీరిలో బోలెడు చాలా మంది హిండియన్లు కూడా ఉన్నారు.

ఘనత వహించిన Widen వీరెవరికి ఉఫ్ఘనిస్తాన్‌ను ఖాళీ చేసేంత టైమ్ కూడా ఇవ్వలేదు కాబట్టి, వీరందరూ పారిపోవడం అసంభవం.

కాబట్టి ప్రపంచమంతా అనేక వింత దృశ్యాలను తిలకించాల్సి వచ్చింది. ఉదాహారణకు, ఎగురుతున్న విమానాల్లోంచి చోటు లేక కింద పడిపోతున్న ప్రయాణీకులు, అవే ప్లేన్లలోని లగేజ్ కంపార్ట్‌మెంట్లలో కూడా దూరిపోయిన నిర్భాగ్యులు, విమానాలని చేరుకునే ముందే ఎయిర్‌పోర్ట్‌లోనే తొక్కిసలాటలో మరణించిన ప్రజలు.

ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నా, పీకిస్తానులోని S.I.S. బిల్డింగ్‌లో మాత్రం సంబరాలు అంబరాన్ని అంటాయి.

“ఈ బాదూషా తిను అన్నయ్యా, లేకుంటే నా మీద ఒట్టే,” అంటున్నాడు ఒక ఉద్యోగి ఇంకో ఉద్యోగితో. “అదేం కుదరదు, నువ్వే ముందు నేను తెచ్చిన రసగుల్లా తినాలి,” గోముగా అన్నాడు ఆ ఇంకో ఉద్యోగి.

“అరెమికన్లు ఉఫ్ఘనిస్తాన్‌ని ఖాళీ చేశారు కాబట్టి, ఇక మనం ఎంచాక్కా ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వొచ్చు, వారిని హిండియాలోకి అచ్చోసిన ఆంబోతుల్లా తోలొచ్చు, మన పవిత్ర జిగాద్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు,” అంటూ మురిసిపోయాడు వారి ఆఫీసర్.

“ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే…” అన్న సామెత ఊరికే పుట్టలేదు మరి!

S.I.S. బిల్డింగ్ పైన ఎప్పుడూ కూర్చుని ఉండే తీతువ పిట్ట ఒకటి, వికృతంగా కూసింది.

(అశుభం)

Posted in 'కరెంట్' అఫైర్స్, భూగోళం | Leave a comment

ఈల ద్వీప రహస్యం – 3

ముగ్గురు యువతులు సభలోకి ప్రవేశించారు. “జయము, జయము మహారాజులకు,” అంటూ సింహాసనం ఉన్న వైపు తిరిగి దండం పెట్టారు.

“మేము ఇక్కడున్నాము,” కాస్త చిరాకుగా అన్నాడు నరస సింహుడు. అతను కూర్చున్న ఆసనం సింహాసనానికి బాగా కింద, కాస్త దూరంగా కూడా ఉంది.

“మీరు ఇక్కడుంటే, మరి సింహాసనం మీద పడుకున్నది ఎవరు?” అడిగింది వారిలో అందరి కంటే పెద్దగా కనిపిస్తున్న యువతి.

“ఆయన మా తండ్రి గారు.”

“నీరస సింహుల వారా? ఆయన మళ్ళీ సింహాసనం అధిరోహించారా, అంటే మీ పట్టాభిషేకాన్ని రద్దు చేశారా?”

పళ్ళు పట పటా కొరికాడు నరస సింహుడు. “లేదు, నేనే ఇప్పటికీ మహారాజుని, ఈ విషయాలు మీకు అప్రస్తుతం. మీ సమస్య ఏమిటో చెప్పండి. తీరుస్తాను.”

“ముందు మీ నామధేయాలు మహారాజుకి సెలవివ్వండి,” ఆజ్ఞాపించాడు వృద్ధ భట్టు.

“చిత్తము, మేము ముగ్గురము అప్ప చెల్లెళ్ళము. మా తండ్రి గారు ముచ్చట పడి ఒకే రకమైన పేర్లతో మాకు నామకరణం చేసినారు. నాకు పెట్టిన పేరు భద్రుక, నా మొదటి చెల్లి పేరు భౌమిక, నా రెండవ చెల్లెలి పేరు బదనిక,” చెప్పింది భద్రుక.

“పోనిలే, నాలుగో కూతురు కూడా పుట్టి ఉంటే, బడలిక అని నామకరణం చేసేవాడేమో వీరి తండ్రి, ఆ ముప్పు తప్పింది,” తనలో తాను అనుకున్నాడు నరస సింహుడు.

“ఇంతకి మీకు వచ్చిన సమస్య ఏమిటి?”

“చిత్తం. మా తండ్రి గారి వద్ద ఒక విలువైన వజ్రాల హారము ఉంది. అది ఆయన ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే మాలో ఎవరు ముందు కనిపిస్తారో, హారము వారి మెడలో వేస్తారు,” ఊపిరి పీల్చుకుంది భద్రుక.

“బహుశా, హారము ఆశ చూపెట్టి, వీరిలో పొద్దుననే నిద్ర లేచే క్రమ శిక్షణను నెలకొల్పడం వారి తండ్రి గారి ఉద్దేశం అనుకుంటాను, ప్రభు,” చెప్పాడు మంత్రి వృద్ధ భట్టు.

“సొబగు సొబగు, మంచి ఉద్దేశమే. ఇందువలన మీకు వచ్చిన కష్టమేమిటో?” ప్రశ్నించాడు నరస సింహుడు.

ఒక స్త్రీగా ఆత్రవిందకు వారి సమస్య ఏమిటో వెంటనే అర్థం అయిపోయింది, కానీ సభా మర్యాద ప్రకారం ఆమె నోరు మెదపలేదు.

“చిత్తం, మా మువ్వురికి ప్రతి రోజు ఆ హారం ధరించ వలెనని కోరిక. కావున మేము అంతా పోటీలు పడి ఒకరి కంటే ఒకరు ముందు నిద్ర లేవడం మొదలు పెట్టాము.”

“అదే కదా మీ నాన్న గారి కోరిక!”

“అవును ప్రభు, కానీ హారం ధరించే అవకాశం ఎక్కడ కొల్పోతామో అన్న భయంతో రోజు రోజుకి తొందరగా నిద్ర లేచి లేచి, చివరకు రాత్రి పడుకోవడమే మానేశాం,” చెప్పింది భౌమిక.

“మరి మీ విశ్రాంతి సంగతి?”

“పగటి పూట అంతా నిద్ర పోవడమే ప్రభు! దీని వలన ఇంటి పనులు జరగడం ఆగిపోయాయని, మా తండ్రిగారు కడుంగడు బాధ పడుతున్నారు. అటులని హారము ధరించే అవకాశం వదులుకోవడానికి మేమెవ్వరము సిద్ధముగా లేము. ఇదే మా సమస్య,” విన్నవించింది బదనిక.

ఒళ్ళు మండింది నరస సింహుడికి. “అహో, రాజులన్నా రాజరికము అన్నా మీకెంత చులకన అయిపోయినది! ఇటువంటి సమస్యలు మేము పరిష్కరించుటయా? అసలు ఈ హారము నిబంధన పెట్టిన మీ తండ్రిగారిని శిక్షించవలె!” అంటూ గర్జించాడు.

“ఇంతకు ముందు మీరే కదా ప్రభు, సొబగు సొబగు అని ఆ షరతుని మెచ్చుకున్నారు,” గుర్తు చేశాడు వృద్ధ భట్టు.

“అవును మెచ్చుకున్నాము, అది ఇటువంటి విపరీతమైన పరిణామాలకు దారి తీస్తుందని అప్పుడు మేము ఊహించలేక పోయాము. వారి తండ్రి వద్దకు మన భటులని పంపించి ఈ మతి మాలిన నిబంధనని ఎత్తివేయమని చెప్పండి!”

“ఐతే మా మువ్వురిలో ఎవరికి హారం ధరించే అవకాశము ఇక లేనట్టేనా?” ఘొల్లుమన్నారు అప్ప చెల్లెళ్ళు.

అదిరి పడి చెవులు మూసుకున్నాడు నరస సింహుడు. “ఆపండి మీ ఏడుపు! కర్ణపుటములు వ్రయ్యలు అగుచున్నవి,” అంటూ చెయ్యెత్తి వారించాడు.

“మీరు అనుమతించిన ఎడల, ఈ సమస్యని నేను పరిష్కరించనా, ప్రభు?” వినయంగా అడిగింది ఆత్రవింద.

“ఏమి చేస్తావు ఆత్రవిందా? ఆ హారం వారి తండ్రి దగ్గరనుంచి లాక్కుని మన కోశాగారానికి చేరుస్తావా? హారం లేకపోతే సమస్య కూడా ఉండదు.” నరస సింహుడికి కొన్ని సంవత్సరముల క్రితం ముగ్గురు అన్నదమ్ముల సమస్యని ఇదే వైనాన తీర్చిన సంఘటన గుర్తుకి వచ్చింది.

“ముందు మీరు అనుమతించడి.”

“అస్తు!”

ముగ్గురు యువతుల వైపు చూస్తూ తన పరిష్కారాన్ని వెల్లడించింది ఆత్రవింద.

“మీలో ఎవరైతే ఆ రోజు ప్రతి ఒక్క ఇంటి పనిని చేస్తారో, ఆమెకే మరుసటి రోజు హారము ధరించే అవకాశం వస్తుంది. మా భటులు మీ తండ్రి గారికి ఈ తీర్పు అందచేస్తారు.”

భద్రుక, భౌమిక, బదనిక మొహాలు కళ తప్పాయి.

“అద్భుతమైన తీర్పు, మహారాణి,” ఆనందంగా అరిచాడు వృద్ధభట్టు. ఎందుకైనా మంచిది అని “మీకు ఈ తీర్పు ఇచ్చే అవకాశం ఇచ్చిన మహారాజుల వారు కూడా మిక్కిలి ప్రశంసా పాత్రులు,” అన్నాడు.

“మన అందరిలో పనివంతురాలవి నువ్వేనే భద్రుక, రోజు పనులు మొత్తం చేసి, నువ్వే ఆ హారము ధరించుము,” అంది భౌమిక.

“హారము వద్దు, ఏమియును వద్దు, అదేదో నువ్వే వేసుకుని ఊరేగుము. లేదా, బదనికని ఆ పాట్లు ఏవో పడమను,” కోపంగా చెప్పింది భద్రుక.

“చిన్న దానిని చేసి ఇంటి పనులు అన్నీ నాకంటగట్టె వలెనని మీ కుట్రయా? అందరము ప్రతి రోజు అన్ని పనులు కలిసి చేసుకుందాము. కావలెనంటే వంతుల వారిగా ఒకో రోజు ఒకొక్కరము హారము ధరించుదాము,” రాజీకి వచ్చింది బదనిక.

“ఆ వంతులేవో, మీరు ఇంటికి వెళ్ళి వేసుకొనుడు. ఇంకొక్క క్షణము ఇక్కడ ఉంటే, ఇంతకు ముందు చెప్పినట్టు, ఆ హారమును మేమే బలవంతంగా గైకొంటాము,” చెప్పాడు నరస సింహుడు మృదువుగా.

అప్ప చెల్లెళ్ళు అంతార్థానమైనారు.

వారు నిష్క్రమించాక, “మన తదుపరి కార్యక్రమం?” అడిగాడు నరస సింహుడు.

“ఈ రోజు మీరూ, మహారాణి వారూ, దోమాంబ వ్రతము ఆచరించవలె, ప్రభు,” చెప్పాడు వృద్ధ భట్టు.

ఈ సారి మొహంలో కళ తప్పడం నరస సింహుడి వంతయ్యింది.

(ఇంకా ఉంది)

Posted in ఈల ద్వీప రహస్యం | Leave a comment

మీరు నిజంగానే వెనక బడ్డారా? – 9

ప్రతి వర్గానికి తాము ఎక్కడో ఒక చోట వివక్షకు గురి అయ్యాము అనే భావన ఉంటుంది. హిండియాలో ఒక్క వర్గాన్ని చూపించండి, “అబ్బే, మా పట్ల ఏ విధమైన వివక్ష లేదు,” అనే వారిని. అర్చకులనుంచి అస్పృశ్యుల వరకు అందరు తాము వివక్షకి లోనయ్యామని భావించే వారే.

అస్పృశ్యులకి జరిగిన అన్యాయం, మన దేశంలో ఇంకెవ్వరికి జరగలేదు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. (వారి పట్ల చూపించిన వివక్ష కంటే దారుణమైన వివక్ష ఇంకొకటి ఉంది అంటే, అది అరెమికాలో ఎన్నో ఏళ్ళు బానిసలుగా మగ్గిన నల్ల వారి పట్ల మాత్రమే అని చెప్పాల్సి వస్తుంది.)

కాబట్టి, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, ఈ అస్పృశ్యులని ఉద్ధరించడానికి డిజర్వేషన్లు ఒక మార్గం అని కొందరు భావించడంలో కాస్త అర్థం ఉంది. కనీసం ఉద్దేశం మంచిది.

కానీ ఈ సదరు వెనక బడ్డ వర్గాల సంగతి ఏమిటి? ఇంతకు ముందు చెప్పినట్టు వీరి పట్ల కూడా వివక్ష చూపింపబడి ఉండవచ్చు. కానీ అది అస్పృశ్యుల పట్ల చూపించిన దానిలో ఒకటో వంతు కూడా ఉండదు.

ఈ వెనకపడ్డ వర్గాల నుంచి, రాజులు, చక్రవర్తులు, సాధువులు, నాయకులు అందరూ వచ్చారు. గౌరవింపబడ్డారు, పూజింప బడ్డారు. మీకు ఉదాహరణలు కావాలంటే కోకొల్లలు దొరుకుతాయి, ప్రస్తుతం ఎంతో మందికి మార్గ దర్శకుడైన ఒక బాబా, మన ప్రస్తుత ప్రధాన మంత్రి, అహ్మదీయులని సమర్థవంతంగా ఎదుర్కుని ఛత్రపతి ఐన ఒక వీరాధి వీరుడు, ఇలా ఎందరో “వెనుక బడిన” వారే!

వీరిలో ప్రతిభ ఉన్న వారిని ఎవరూ ఆపలేక పోయారు. మరి ఈ కుల ప్రతినిధులమని చెప్పుకునేవారికి వచ్చిన బాధ ఏంటి? వీళ్ళు నిజంగానే తాము వెనకబడ్డామని నమ్ముతున్నారా? ముమ్మాటికి కాదు. ఈ కులాలలో ఒక్కరు కూడా తాము వెనకబడిన కులాలకు చెందిన వారము అని ఆత్మ న్యూనతా భావంతో ఉన్న వారు లేరు. పైపెచ్చు వారి వారి కులాలని సగర్వంగా చెప్పుకుంటారు. (ఇది తప్పు అని నేనడం లేదు. ఇది “వెనుక పడిన” వారి లక్షణం కాదు అని మాత్రమే నేను చెప్పదలుచుకుంది.)

మరి ఎందుకు వీరంతా మేము వెనుక పడి పోయాం, మమ్మల్ని ముందుకు తీసుకు రండి అని ఘోషిస్తున్నారు? దీనికి ఒకే ఒక కారణం వారు కూడా డిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందాలన్న ఉద్దేశం మాత్రమే.

ఒక్క విషయం కొన్ని దశాబ్దల కిందే అందరికి అర్థం అయిపోయింది. మన దేశపు జెండా డిజైన్ ఇప్పట్లో మారడం ఎంత ఆసాధ్యమో, అస్పృశ్యులకు డిజర్వేషన్లు అనేవి ఎత్తి వేయడం కూడా అంతే కష్టం అని.

కాబట్టి వీరంతా ఈ సమస్యని వేరే కోణం నుంచి “పరిష్కరించడం” మొదలు పెట్టారు. ఈ పరిష్కారం తాము కూడా ఈ డిజర్వేషన్లలో భాగస్వాములు కావడమే.

బండల్ కమీషన్ గురించీ అందరికి తెలిసే ఉంటుంది. ఏ క్షణాన ఈ కమీషన్ ఆవిర్భవించిందో, ఆ క్షణంలోనే, సామాజిక న్యాయం అనే సిద్ధాంతానికి బీటలు వారడం మొదలు అయ్యింది.

ఏ క్షణాన అయితే ఒకప్పటి ప్రధాన మంత్రి, వెర్రి పీనుగ సింగ్ (ఈయన్నే వీ.పీ. సింగ్ అని కూడా అంటారు లెండి), ఈ కమీషన్ సిఫార్సులను అమలు పరచాలని నిర్ణయం తీసుకున్నాడో, ఆ క్షణమే వివక్షకి సంబంధించి కాస్తంత అయినా నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవడం అనేది భూస్తాపితం అయ్యింది.

ఆ క్షణం నుంచి ఒకటే సిద్ధాంతం. దోచుకోవడానికి అవకాశం ఉన్నంత వరకు దోచుకోవడం, ఒక దొమ్మీ కేసులో పాత కక్షలని తీర్చుకున్న చందాన, ఈ ప్రతి దోపిడిని సామాజిక న్యాయం ఖాతాలోకి తోసేయడం.

దీన్ని వల్ల వింత వింత వాదనలు వెలుగులోకి వచ్చాయి. ఈ వాదనల ప్రకారం జనాభాలో ఉన్న నిష్పత్తిని పట్టి అన్ని పంపకాలు జరగాలి అన్నది ఒకటి.

1931 జనాభా లెక్ఖల ప్రకారం, వెనుకపడ్డ వర్గాలు మన దేశంలో 51 శాతం అట; (నిజానికి సింధువుల్లో ఉన్న వర్గాలని మాత్రమే లెక్ఖలోకి తీసుకుంటే, అందులో సగం కూడా ఉండరు, అది వేరే విషయం), కాబట్టి ఉద్యోగాల్లో, చదువుల్లో, ప్రమోషన్లలో అన్నిటిలోనూ, ఈ సదరు వెనక పడ్డ వర్గం వారు 51 శాతం ఉండాలట.

దీని అర్థం, ఒక కంపెనీలో 100 ఉద్యోగాలు ఉంటే, 25 శాతం అస్పృశ్యులకి ఇవ్వాలి. 51 శాతం వెనక పడ్డ వర్గాలకి ఇవ్వాలి. ఇలా వంతులు వేస్తూ పోతే సదరు అగ్ర వర్ణాల వారికి ఏ పదిహేను శాతమో మిగిలితే అది మాత్రం open quotaగా ప్రకటించాలి.

ఇది చదువుతూ ఉన్నప్పుడు, మీకు మక్యూనిజం యొక్క కంపు సిద్ధాంతాల వాసన గప్పున కొడితే అందులో తప్పేమి లేదు.ఇది అలాంటి వితండ వాదమే.

ఈ వాదం ఎంత డొల్లదో పరిశీలిద్దాం. ఈజీరెయిల్ దేశంలో ఉన్నా వ్యూదులు, ఇప్పటి దాక ప్రకటింప బడిన ప్రతిష్టాకరమైన బోనెల్ ప్రైజులని దాదాపు యాభై శాతం గెలుచుకున్నారు. కానీ ప్రపంచ జనాభాలో వీరు ఒక శాతం కూడా ఉండరు. ఎంత అన్యాయం కదూ! వింటూంటేనే గుండె రగిలిపోవడం లేదు?

కాబట్టి పైన చెప్పిన వాదం ప్రాతిపదికన ఈ వ్యూదులకి ఒక్క శాతం మాత్రం ప్రైజులని కట్టబెట్టి, వారికొచ్చిన మిగతా వాటిని వారి నుంచి లాక్కొని మిగతా ప్రపంచ ప్రజలకు వారి నిష్పత్తిని బట్టి కట్ట పెట్టాలి. అలా చేయలేదు అనుకోండి, ఈ మిగతా వర్గాల్లో ఆత్మ న్యూనతా భావం పెరిగి, వారు ఎప్పటికి అభివృద్ధి చెందరు. ఎప్పటికి పీడిత తాడిత ప్రజల్లానే ఉండిపోతారు. ప్చ్!

ఇది మీకు కామెడీగా అనిపిస్తే, వెనక పడ్డ వర్గాలకు వారి జనాభా నిష్పత్తిని బట్టి కాలేజీలలో సీట్లు, ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు ఇవ్వాలి అనడం కూడా అంతే కామెడీ. (ఒక వేళ ఇది మీకు సహేతుకమైన వాదనే అనిపిస్తే, ఎలాగూ మీరు ఇంత వరకు చదివి ఉండే అవకాశమే లేదు. ఈ సిరీస్‌లో మొదటి భాగం చదవగానే నన్ను ఒక బూర్జువా కింద జమ కట్టి, బూజులా దులిపివేసి ఉంటారు.)

వీ.పీ. సింగ్ పేరు వినగానే కాస్త తెలివితేటలు ఉన్న ప్రతి సింధువు ఖాండ్రించి ఉమ్మివేయడానికి కారణం ఇదే. ఇతను చేసిన పని సింధువులని నిట్ట నిలువుగా చీల్చింది. ఆ చీలిక ఇంకా అలాగే ఉంది.

అహ్మదీయులు, కిరస్తానీలు, మక్యూనిస్టులు సింధువులని చీల్చడానికి ఎప్పటినుంచో ముప్పేట దాడి చేస్తూనే ఉన్నారు. కానీ వీ.పీ. సింగ్ చేసిన ద్రోహం వీటన్నిటికంటే చాలా నీచమైనది.

ఈ పై ముగ్గురు శత్రువులని నిందించడానికి ముందు, మన తప్పు మనం సరి దిద్దుకోవాలి. ఎప్పటివరకైతే ఈ “వెనక పడ్డ” వర్గాలకి డిజర్వేషన్లు ఉంటాయో, అప్పటి వరకు మనం పూర్తిగా అభివృద్ధి చెందడం అనేది అసంభవం.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇది స్వచ్ఛందంగా జరిగే పని కాదు. ఈ సదరు వెనక పడ్డ వర్గాల్లో నాకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు. వారిలో కొందరు పాపం ఈ డిజర్వేషన్లు అనైతికం అని భావించి వాటిని ఉపయోగించుకొవడానికి నిరాకరించారు. Open quotaలోనే కాలేజ్ సీట్లు, ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కానీ వారిని మెచ్చుకోవడం పక్కన పెట్టి మిగతా అగ్ర వర్ణాల ప్రజలు వారిని తిట్టి పోశారు! అన్యాయంగా open quotaలో సీట్ పొందగలిగే అవకాశం ఉన్న ఒక అగ్ర వర్ణం వాడి కడుపు కొట్టారు అని నిందించారు.

ఇంకో వైపు వారి వర్గపు ప్రజలు, మన వర్గంలో పుట్టిన వారే మనం వెనకపడి లేము అని అంటారా అన్న కోపంతో, వీరిని రివర్సులో ఇంకో రెండింతలు తిట్టిపోశారు. కాబట్టి స్వచ్ఛందంగా వెనుక పడ్డ వర్గాల వారే, తామంతట తాము, డిజర్వేషన్లు వద్దు అనే అవకాశమే లేదు. అప్పనంగా వచ్చేదానిని వదులుకోవడం అంత సులభం కాదు. ఈ పని ప్రభుత్వమే చేయాలి. వెనక పడ్డ వారికి డిజర్వేషన్లు అనేవి రాజ్యంగపరంగానే బహిష్కరించాలి.

ఒక వైపు జే.బీ.పీ సింధువులని కూడగట్టుకోవడానికి, కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్న ధోరణిలో ప్రవర్తిస్తూంది. సింధువులలో ఎవరినీ నొప్పించకుండా ఉండాలనే చూస్తూంది. కానీ ఈ పద్ధతి పరిమితమైన ఫలితాలను మాత్రమే ఇస్తుంది.

రాఘవ మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగించిన, షాక్మీరు యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని ఎత్తి వేసిన, మూడు సార్లు ఒక పదాన్ని ఉచ్చరించి అహ్మదీయులు విడాకులు తీసుకునే సాంప్రదాయానికి స్వస్తి పలికిన కాషాయ ధారులే ఈ పనికి కూడా పూనుకోవాలి. కానీ వారు ఆ పని చేస్తారా?

(ఇంకా ఉంది)

Posted in నేను సింధువుని ఎట్లైత? | Tagged | Leave a comment

ఈల ద్వీప రహస్యం – 2

"రాజాధి రాజ, రాజ మార్తాండ, సర్వ సద్గుణ సంపన్న, సకల కళా వల్లభ, అరి వీర భయంకర, నరస సింహ మహారాజా, పరాక్, బహు పరాక్!" అంటూ వంది మాగధులు కైవారములు కావిస్తూ ఉండగా, నరస సింహుడు సతీ సమేతుడై, సభలోకి ప్రవేశించాడు. సభలో ప్రవేశించగానే నరస సింహుడి దృష్టి తను అధిరోహించబోయే సింహాసనం మీద పడింది. అది ఎప్పటిలానే ఎంతో ఎత్తులో ఉంది. నరస సింహుడు తాను రాజయ్యాక ఆ సింహాసనం ఉన్న ఎత్తుని తగ్గిద్దామని విశ్వ ప్రయత్నం చేశాడు కానీ నీరస సింహుడు ఆ ప్రయత్నాలేవి సాగనియ్య లేదు. "ఉత్తమం ఉన్నతాసనం అని పెద్దలు అంటారు. మన రాచ బిడ్డలు ఎంత ఎత్తైన ఆసనం అధిరోహిస్తే అది మనకు అంత గౌరవం," అంటూ వాదించాడు ఆయన. "భవిష్యత్తులో ప్రజల వద్దకే పాలన అని కూడా ఈ పెద్దలే అంటారు. ఈ సింహాసనం మీద కూర్చుంటే ప్రజల మొహాలే కనపడడం లేదు, జనకా! రాజ్య పాలన చేయాలంటేనే నీరసంగా ఉంది," అని నాలుక కర్చుకున్నాడు నరస సింహుడు. నీరస సింహుడికి ఆ పదం బొత్తిగా నచ్చదు. “అహో యువరాజావారూ! ఆ పదం మాకు గిట్టదు అని మీకు తెలుసు కద. వినగానే మా పేరు మాకు గుర్తుకి వస్తుంది. మా తండ్రిగారికి తెలుగు భాషా జ్ఞానం సరిగ్గా లేక, అన్ని రసాలు కలిసిన నీరసం అగునని, ఒక అపోహతో మాకా పేరు పెట్టినారు," పళ్ళు పట పటా కొరికాడు నీరస సింహుడు. "మన్నించండి. అయినా మీ దంతములు అసలే కడు బలహీనము. అలా పట పటా కొరుకుట మీ ఆరోగ్యానికి మంచిది కాదు," అంటూ ఆయనని శాంతింపజేశాడు నరస సింహుడు. "ఏమి, సింహాసనం ముందు అటుల నిలబడిపోతిరి? అధిరోహింపుడు!" కర్తవ్యం గుర్తు చేసింది ఆత్రవింద. ఒక నిట్టూర్పు విడిచి, ఆత్రవిందతో పాటూ, సింహాసనానికి దారి తీసే మెట్లు ఎక్కడం మొదలు పెట్టాడు అతను. యాభై మెట్లు ఎక్కిన్ తరువాత సింహాసనం చేరుకున్నారు వారు. "హమ్మయ్య, ఈ రోజుకి సింహాసనం చేరుకునే పని పూర్తి అయినది," అంటూ మీసం మెలి తిప్పాడు నరస సింహుడు. రాజు గారు ఏదో ఘనకార్యం చేశారు కాబోలు అని, వంది మాగధులు వెంటనే, "రాజాధి రాజ, రాజ మార్తాండ, ..." అని అరుపులు మొదలు పెడుతూంటే, "ఛీ నోర్లు మూయుడు, ప్రస్తుతానికి సింహాసనమును మాత్రమే చేరుకుంటిని. దానికే ఇంత ఆర్భాటం చేయనక్కరలేదు," అని వారిని కసురుకున్నాడు అతను. సింహాసనం వైపు చూసి ఉలిక్కి పడ్డారు వారిద్దరు.దాని మీద నీరస సింహుడు చిన్న గురక పెడుతూ నిద్ర పోతున్నాడు. "తండ్రి గారు హంసతూలికా తల్పం మీద పరుండక ఇక్కడ పడుకున్నారేమిటి?" ఆశ్చర్య పోయాడు నరస సింహుడు. "నాకునూ ఏమీ పాలు పోకున్నది," జవాబిచ్చింది ఆత్రవింద. "నాన్న గారూ, నాన్న గారూ, నిదుర లేవుడు," అభ్యర్తించాడు మహారాజు. లాభం లేక పోయింది. ఇంకాస్త గట్టిగా అరిచాడు. లాభం లేక పోయింది. నీరస సింహుడు నిద్ర లేవ లేదు. "ఇది నా వల్ల జరిగే పని కాదు కానీ, వంది మాగధులూ, మన దోమాంబ ప్రార్థన గీతాన్ని ఆలపించండి," ఆజ్ఞ జారీ చేశాడు అతను. అత్యంత ఉత్సాహంతో వంది మాగధులు గొంతెత్తి దోమాంబ ప్రార్థనా గీతాన్ని అందుకున్నారు. అది చాలా శక్తివంతైన గీతం. ఆ గీతం వినగానే ఎంత గాఢ నిద్రలో ఉన్న వారైనా లేచి కూర్చుంటారు. "అంబా రా! దోమాంబా రా! మా రక్తం నీకే అంకితం, మా సర్వం నీకే సమర్పితం, కరిచినా కరుణించినా నీకే మేము దాసోహం" అంటూ కంఠం చించుకుని పాడడం మొదలు పెట్టారు వారు. రెండే రెండు నిముషాల్లో నీరస సింహుడిలో కదలిక వచ్చింది. మూడో నిముషానికి అతను దిగ్గున లేచి కూర్చున్నాడు. "ఏమి ఈ రణగొణ ధ్వని, ఎవరు మా నిద్రను భంగం చేశారు?" అంటూ. "అది రణగొణ ధ్వని కాదు, దోమాంబ ప్రార్థనా గీతము. లెంపలు వేసుకోండి. ఇంతకీ అంతఃపురంలో శయనించకుండా మీరు నా సింహాసనము మీద స్థిర పడినారు ఏల?" కాస్త చికాకుగా అడిగాడు నరస సింహుడు. "ఏమీ చెప్పుదును కుమారా! నాకు ఈ మధ్య రాత్రి పూట నిద్ర కరువైనది. నిద్ర పట్టకుండా నిశాచరుడినై తిరుగున్న నేను ఒక రాత్రి మన సభకి చేరుకున్నాను. సింహాసనము మీద కూర్చుని ఎందులకు మాకు నిద్ర రావుటలేదు అని ఆలోచించుండగా, తెలియకుండానే దాని మీద నిద్ర పోయాను." "ఏమిటీ, ఎక్కడ నిద్ర పట్టని మీకు నా సింహాసనం మీద నిద్ర పట్టినదా?" ఆశ్చర్య పోయాడు నరస సింహుడు. "అందులకు ఒక కారణం ఉన్నది, మేము మహారాజుగా ఉన్నప్పుడు ఎప్పుడు సభలో సింహాసనం మీద కొలువు దీర్చినా మాకు నిద్ర ముంచుకుని వచ్చేది. కానీ వయసులో ఉండుట వల్ల ఆ రోజుల్లో రాత్రి కూడా హాయిగా నిద్ర పోగలిగే వాడిని. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినది, ఇక మాకు ఈ సింహాసనమే శరణు," నిట్టూర్చాడు నీరస సింహుడు. "మరి నేను సభ తీర వలెనంటే ఎక్కడ కూర్చొనవలెను?" "చింతించకు కుమారా! ఈ రోజుకి నువ్వు ఈ పక్కనే ఉన్న ఆసనమును అధిష్టించుము. ఈ రాత్రి నుండి నేను కాలయాపన చేయకుండా తొమ్మిది గంటలకే వచ్చి సింహాసనం మీద శయనించెదను. తెల్లవారగానే నీకు అడ్డు రాకుండా ఖాళీ చేసెదను." "మొత్తానికి సింహాసనం మాత్రం వదలరు అన్న మాట. సరే, చేయునదేమున్నది, ఈ రోజుకి నేను ఈ పక్కన ఉన్న ఆసనముతోనే సరి పెట్టుకుందును," అంటూ సతీ సమేతముగా సింహాసనం పక్కన దాని కంటే బాగా తక్కువ ఎత్తులో ఉన్న ఒక చిన్న ఆసనాన్ని అధిరోహించాడు నరస సింహుడు. కొలువు తీరిన తరువాత పక్కనే ఉన్న మంత్రి వృద్ధ భట్టుని చూస్తూ, "ఈ రోజు ప్రజలెవరైనా సమస్యలు తీర్చమని మా దర్శనము కోరుతున్నారా?" అడిగాడు అతను. "చిత్తము, ముగ్గురు అప్ప చెల్లెళ్ళు వచ్చినారు ప్రభు! ప్రవేశ పెట్టమందురా?" వినయంగా చెప్పాడు వృద్ధ భట్టు. "వారిని రమ్మనండి," హుందాగా అన్నాడు నరస సింహుడు. (ఇంకా ఉంది)

Posted in ఈల ద్వీప రహస్యం | Leave a comment

ఈల ద్వీప రహస్యం – 1

(ఈ మధ్య కష్టాలు, కన్నీళ్ళు ఎక్కువయిపోయాయి. వాటిని తక్కువ చెయాలని నా ఉద్దేశం కాదు, కానీ పాఠకులకు కాస్త వినోదాన్ని పంచితే బాధలు తట్టుకునే మనోస్థైర్యం వస్తుందని ఒక ఆశ. అందుకే మీ ముందుకు వస్తూంది, ఈల ద్వీప రహస్యం.)


“రాజాధి రాజ, రాజ మార్తాండ, విజయీ భవ దిగ్విజయీ భవ!”
“ప్రపంచమంతా పనులలో మునిగినది. జాగు చేయక ఇక నిదుర లెమ్ము ప్రభూ!”
ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు నరస సింహుడు.

“తండ్రి గారు ఉన్నారుగా కొలువు తీర్చడానికి, ఆయన చూసుకుంటారు లెండి, నన్ను కాసేపు నిద్ర పోనివ్వండి,” తన చెవుల్లో కుక్కుకోవడానికి, దిండు కింద దాచుకున్న దూది కోసం వెతికాడు నరస సింహుడు.

దోమదేశంలో ఆచారాలు ఎక్కువ. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలి. నిద్ర లేచినప్పటినుంచి మళ్ళీ పడుకునే వరకూ రక రకాల రివాజులు పాటించాలి.

“మహా ప్రభువులు మర్చిపోయినట్టున్నారు, తండ్రి గారు గద్దె దిగి, మిమ్మల్ని రాజుని చేసి రెండు సంవత్సరాలు అయినది. కొలువు తీర్చాల్సింది తమరే రాజా,” మేలుకొలుపు బృందంలోని ఒక పరిచారకుడు వినయంగా అన్నాడు.

నాలిక కరుచుకున్నంత పని చేశాడు నరస సింహుడు. “అవును కదూ, మరిచే పోయాను. మహారాణి ఆత్రవింద నిద్ర లేచినదా మరి?”

“నిద్ర లేవడం, తయారు కావడం, దోమాంబని స్తుతిస్తూ, రోజూ పాడే ప్రార్థనా గీతం పాడడం, అన్నీ అయిపోయాయి ప్రభు.”

దోమ దేశానికి మూల దైవం దోమాంబ. ఆవిడకి పెద్ద గుడి కట్టి, నిత్యం పూజలూ పునస్కారాలూ చేయడం వల్లే, తమ దేశంలో దోమలు మాయం అయ్యాయి అని ప్రజల యొక్క, పాలకుల యొక్క నమ్మకం. (ఇంకొన్ని వివరాలకి ఈ టపా చదవండి.)

“హమ్మయ్యా, పాట అయిపోయిందా! ఐతే ఇంక నిద్ర లేవచ్చు. అన్నట్టు ఈ రోజు వీపు గోకే పరిచారకుడు వచ్చాడా లేదా? నిన్న చెప్పకుండా సెలవు తీసుకున్నాడు, దాని వల్ల నాకు స్నానం చేయడం కడుంగడు కష్టమైనది. అలవాటు లేక పోవడం వల్ల, నా వీపు నేనే గోక్కోలేక చచ్చాను,” కోపంగా అన్నాడు నరస సింహుడు.

“గుర్తున్నది ప్రభు, మీ వీపు గోక్కునే ప్రయత్నంలో మమ్మల్ని కూడా కడుంగడు రక్కినారు. అందుకే నిన్నే వాడి ఇంటికి వెళ్ళి మరీ బెదిరించి వచ్చాం. అలా పనికి నాగా పెడితే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని,” చెప్పాడు ఇంకొక పరిచారకుడు.

“తీవ్ర పరిణామాలు నా నుంచా?”

“కాదు, ప్రభూ, ముందు మా నుంచి. అందుకే ఈ రోజు అందరికంటే ముందే వాడు ఏతెంచినాడు.”

“ఇక ఆలస్యం దేనికి, మేము కూడా తయారయి, ఆత్రవిందా దేవిని దర్శించుకుంటాం. పదండి” పక్క మీద నుంచి లేచాడు నరస సింహుడు.


ఆత్రవింద నరస సింహుడికి ఆప్యాయంగా ఆహ్వానం పలికింది.

“ఆత్రా, ఈ రోజు నిన్నటికంటే అందముగా తయారైనావు,” మెచ్చుకోలుగా అన్నాడు నరస సింహుడు.

“అందుకే నాఉ దేహం దహించుకుపోయేది. నన్ను ఆత్రా, మాత్రా అని అలా క్లుప్తంగా పిలవ వద్దు అని ఎన్ని మార్లు చెప్పితిని? పూర్తి పేర్తుతో ఆత్రవిందా అని పిలవండి.”

“నిక్కము, తప్పు నాదే. ఇంతకి మా అలంకరణ ఎలా ఉందో చెప్పుము.”

నరస సింహుడిని తేరిపారా చూసిండి ఆత్రవింద. ఖరీదైన జలతారు దుస్తులు, మెడలో పలు హారాలు, అన్ని వేళ్ళకు ఉంగరాలు, శిరమున ధగ ధగలాడుతున్న కిరీటం ధరించి మిరుమిట్లు కొలుపుతున్నాడు అతగాడు.

“కాస్త మీ తల వంచండి,” గోముగా అడిగింది ఆత్రవింద.

“ఈ దోమ దేశానికి అంతా సార్వభౌముడనే కానీ, నీకు మాత్రం నేను సేవకుడిని. అలాగే దేవి!” తల వంచాడు నరస సింహుడు.

కంటికి కనపడనంత వేగంగా కదిలి అతని మెడలోని హారాలన్నీ లాక్కుంది ఆత్రవింద.

“ఇది ఏమి దారుణం,” కీచు గొంతుతో అరిచాడు మహారాజు.

“కాదు, ఇది సరి అయిన న్యాయం. మీకు ఒక జబ్బు ఉన్నది, ఎవరు మిమ్మల్ని కాస్త పొగిడినా చాలు, మెడలోంచి ఒక హారం తీసి విసిరేస్తారు. ఇలా అయితే అతి త్వరలో దోమ దేశం దివాలా తీయుట తథ్యం! అందుకే ఈ ముందు జాగ్రత్త చర్య.”

“పొనీలే, హారములు తీసుకున్నా, ఉంగరములు వదిలితివి అది చాలు,” కాస్త ఆనందంగా అన్నాడు నరస సింహుడు.

“బాగా గుర్తు చేశారు,” అని అతని వేళ్ళపై ఉన్న అన్ని ఉంగరాలు కూడా లాక్కుంది ఆత్రవింద.

“ఇది నిలువు దోపిడి,” అరిచాడు మహారాజు.

“కాదు, ఒక భార్య పడే జాగ్రత్త,” అంటూ అతని కిరీటం వంక పరీక్షగా చూసింది మహారాణి.

“బాబోయి, కిరీటం అటులనే ఉంచుము. అది ఎట్టి పరిస్థితుల్లోనూ, నేను ఎవ్వరికి బహుమతిగా ఇవ్వను,” ప్రాధేయపడ్డాడు నరస సింహుడు.

“సరే, కానీ మర్చి పోకండి. మిమ్మల్ని ఒక కంట కనిపెట్టే ఉంటాను,” హెచ్చరించింది మహారాణి.

“ఇక సభకి పోదామా?” నీరసంగా అన్నాడు నరస సింహుడు.

“పదండి, మీదే ఆలస్యం!”

(ఇంకా ఉంది)

Posted in ఈల ద్వీప రహస్యం | 3 Comments