శంకర్రావు గారు, కేశవరావు గారు వారి ఈవినింగ్ వాక్ కి వెళ్తుండగా జరిగింది ఈ సంఘటన. వాళ్ళింటికి దగ్గరలోనే ఉన్న రంగ మహల్ థియేటర్ లోంచి, మ్యాట్నీ విడిచారేమో, జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. కానైతే వాళ్ళు మామూలుగా నడుస్తూ రావడం లేదు. పరిగెట్టుకుంటూ వస్తున్నారు.
“ఏమయ్యిందయ్యా, అలా పరిగెత్తుకొస్తున్నారు?” ఆందోళనగా అడిగారు శంకర్రావు గారు.
“అమ్మో, అబ్బో, ఏం దెబ్బలండీ బాబూ!” వగరుస్తూ అన్నాడు ఒక ప్రేక్షకుడు.
“కుయ్యో మొర్రో,” అంటూ అతనికి వత్తాసు పలికారు, మిగతా ప్రేక్షకులు. వారి మొహాల్లో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తూంది.
“మరి మీ వొంటిమీద దెబ్బలు తిన్న చిహ్నాలు ఏవీ కనిపించడం లేదే,” అనుమానంగా అడిగారు కేశవరావు గారు.
“పోలీసు దెబ్బల టైప్ లెండి. పైకి కనపడక పోవచ్చు, కానీ లోపల ఇంపాక్ట్ చాలా పవర్‌ఫుల్ గా ఉంది,” బదులిచ్చాడు మొదటి ప్రేక్షకుడు.
“ఇంత మంది దెబ్బలు తిన్నారు అంటే, అటు వైపు కూడా చాలా మంది ఉండాలే?”
“అబ్బే, ఇద్దరే.”
“ఇద్దరు ఇంత డ్యామేజ్ చేశారా? ఎవరు వాళ్ళు?”
జవాబుగా చెయ్యి పైకెత్తి రంగ మహల్ ముందున్న పోస్టర్‌ని చూపించాడు మొదటి ప్రేక్షకుడు.
మిత్రులిద్దరూ ఒకే సారి అటు వైపు చూశారు.
అది ఆ రోజే విడుదలైన, “టయన్” సినిమా పోస్టర్. దాని మీద ప్రముఖంగా దర్శకుడు సారీ జగన్నాధ్ ఇంకా హీరో అజయ్ దేవరబండ ముఖ చిత్రాలు ఉన్నాయి.
“ఈ టయన్ ఏమిటి, శంకర్రావు గారూ?”
“నాకు మాత్రమేమి తెలుసు కేశవరావు గారు!”
“టయన్ అంటే, టైగర్‌కి, లయన్‌కి పుట్టిన జంతువు అండి. క్రాస్ బ్రీడ్ అన్న మాట,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఇంకో ప్రేక్షకుడు.
“ఓహో, ఇప్పుడేదో చదివినట్టు గుర్తొస్తూంది. ఇందులో హోలీవుడ్ నటుడు టైక్ మైసన్ కూడా ఉన్నాడట కద?” అడిగారు కేశవరావు గారు.
“అలా అనుకునే వెళ్ళామండి, కానీ ఆయనొచ్చేంత లోపలే కళ్ళు భయిర్లు కమ్మాయండి. కాబట్టి చూసినట్టు గుర్తు లేదు. ఉండే ఉండుంటాడు.”
“మరి ఈ పోలీసు దెబ్బలు?”
“అబ్బే, ఇవి టైక్ మైసన్ కొట్టినవి కాదండి. మన హీరోగారే సినిమా మొదలైనప్పటినుండి ఆఖరి వరకు నాన్-స్టాప్ గా అందరిని ఉతుకుతూ ఉంటారండి. ఆ ఉతుకుడు చూసి చూసి మాకు కూడా చితికి పోయినట్టు అనిపించింది.”
“ఒక్క వొళ్ళే కాదు సార్. చిన్న మెదడు కూడా,” కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇంకో ప్రేక్షకుడు.
“అయ్యో పాపం, మరి ఇప్పుడు మీరంతా ఏం చేయబోతున్నారు?”
“ఏం చేయగలిగితే అది చేస్తామండి. పెద్ద చాయిస్ కోసం వెదక దల్చుకోలేదు.”
అదే ఊపులో అక్కడి నుండి నిష్క్రమించారు ప్రేక్షకులు. తుఫాన్ తరువాత ప్రశాంతత అక్కడ నెలకొంది.
వాకింగ్ కంటిన్యూ చేశారు మిత్రులిద్దరు.
“ఒక రకంగా ఇది కూడా మన మంచికే లెండి, కేశవరావు గారు.”
“అదెలా?”
“ఒక వేళ ఈ సినిమా హిట్ అయి ఉంటే, ఇంక వరుస పెట్టి, హైటా (హైనా + చీటా), క్యామెలిఫెంట్, (క్యామెల్ + ఎలిఫెంట్), హాంకీ (హార్స్ + డాంకీ) లాంటి వేరే సినిమాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేవి.ఆ బాధ తప్పింది మనకు.”
“అంతే కాదండోయి, టయన్-2, టయన్-3 లాంటి సీక్వెల్స్ కూడా వచ్చేసేవి!”
“నిజమే సుమా!”
“సింపు” అంటే బాగుంటుందేమో?
టయన్ హిట్ అయ్యుంటే అలాంటి సినిమాలు బోలెడు చాలా వచ్చేవి సార్. మన తెగులు ఫీల్డ్‌లో సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఇంక అలాంటి పేర్ల జోలికి పోరు అని ఆశిస్తున్నాను.
సంపూ(ర్ణేష్ బాబు) తో పేరడీ కామెడీ తీయొచ్చు, “సింపు” అని .
Murali garu, Looking for your post regarding Adipurush trailer.
రావణ పాత్రధారి ఆహార్యాన్ని చూసిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదండి. ఆ మహత్తర దృశ్య కావ్యం మీద సెటైర్ కూడానా?