జ్వాలా ద్వీప రహస్యం – 25 (ఆఖరి భాగం)


“అదన్న మాట జ్వాలా ద్వీప రహస్యం! గానానంద స్వామి మంత్ర మహిమ, అక్కడ ఉన్న ఆటవికులు వాడే దురగ గుండాకు, ఆ ద్వీపాన్ని అభేద్యంగా చేసాయి,” అన్నాడు నరస సింహుడు ఆత్రవిందతో.

“అవును పుట్టలో బంధింపబడి ఉన్న గానానంద స్వామి విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి, ఆ రహస్యం బయట పడకూడదని నన్ను ఆ ద్వీపంలో బంధీ చేశారు,” చెప్పింది ఆత్రవింద.

“అది సరే, మరి ఈ పండు కోతి ఆ రహస్యం బయట పెట్టలేదు కదా, దీన్ని కూడా ఎందుకు బంధించారు?” సందేహంగా అన్నాడు యువరాజు.

“దాన్ని బంధించింది మీరు దాని కోసం వస్తారని, అప్పుడు మీతో పాట పాడించవచ్చని,” సమాధానం చెప్పింది రాకుమారి.

“ఓ, నిజమే! కానీ నేను ఆయన్ని శాపవిముక్తుడిని చేయలేకపోయాను. యమ కింకరి, యమానంద లహరి పాడి ఉంటే బాగుండేది,” విచారంగా అన్నాడు నరస సింహుడు.

“పోనీ లెండి, మీరు అనుకున్నది సాధించారు కద! ఆ పాట ఇక్కడ మాత్రం పాడకండి. అసలే మేఘాల మధ్య పయనిస్తున్నాం. నేను ఎటూ వెళ్ళ లేని పరిస్థితి కూడా,” కాస్త భయంగా అంది ఆత్రవింద.

“గానానంద స్వామికి ఏ మాత్రం ఉపయోగ పడలేని నా గాత్రం అంటే నాకు విరక్తి కలిగింది. గాన వైరాగ్యం వచ్చింది. ఇక పాటలు పాడను, ఒక షట్ కళ్యాణిని పరిగెత్తించాలంటే తప్ప,” విషాదంగా అన్నాడు నరస సింహుడు.

“నన్ను జ్వాలా ద్వీపం నుంచి విడిపించినందుకు ఇప్పటికే మీకు ఋణపడి ఉన్నాను. ఈ నిర్ణయం తరువాత మీ మీద అభిమానం మరింత పెరిగింది,” సిగ్గు పడుతూ అంది ఆత్రవింద.

దానికి నరస సింహుడు బదులు చెప్పేంతలో తివాచీ బెంగ నగరం చేరుకుంది. సరిగ్గా నగరం మధ్యలో దిగి నేలకు ఒక అడుగు పైన ఆగింది. ఆ కూడలిలో ఉన్న ప్రజలు రాకుమారిని చూడగానే ఆనందోత్సాహలతో చుట్టు ముట్టారు.

“రాకుమారి తిరిగి వచ్చేసింది. పరదేశీ విజయుడై తిరిగి వచ్చాడు. నరస సింహుడికి జై. మహారాజు అశృ సింహులకు జై,” అంటూ జయ జయ ధ్వానాలు కావించారు.

అక్కడ ఉన్న ప్రజల్లోనే మత్స్య కుమారుడు కూడా ఉన్నాడు. “నా తెప్ప, నా తెడ్లు,” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని తీసుకున్నాడు.

నరస సింహుడు, ఆత్ర వింద, పండు కోతి తివాచీ పై నుంచి కిందకి దిగారు. వెంటనే తివాచీ రివ్వున గాలిలోకి ఎగిరి జ్వాలా ద్వీపం వైపు శర వేగంతో పయనిస్తూ కొద్ది క్షణాల్లో మాయమయ్యింది.

అశృ సింహుడికి అతి వేగంగా ఈ వార్త అందిపోయింది. హుటా హుటిన ఆయన అక్కడికి వచ్చేశాడు. ఆత్రవిందని చూడగానే ఆయన కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు జల జలా రాలాయి.

ఆత్రవింద తండ్రిని చూడగానే ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన అక్కున చేరింది. “భళా పరదేశీ, భళా! ఎవరూ వెళ్ళడానికి కూడా సాహసించని జ్వాల ద్వీపానికి వెళ్ళి మా పుత్రికని రక్షించి ఆమెతో క్షేమంగా తిరిగి వచ్చావు. నీ ఋణం తీర్చుకోలేను. అక్కడ ఎలాంటి సాహస కృత్యాలు చేశావో వినాలని కర్ణ కుతూహలంగా ఉంది,” అన్నాడు మహారాజు నరస సింహుడిని ఉద్దేశించి.

“తండ్రీ! ఆయన ఏ సాహసమూ చేయలేదు. కేవలం ఒక పాట పాడి నన్ను, తన పండు కోతిని విడిపించుకున్నారు,” చెప్పింది ఆత్రవింద.

“నిజమా? ఆ పాటేదో వినవలెనని మాకు ఎంతో కోరికగా ఉంది,” అన్నాడు అశృ సింహుడు.

“ఆ పాట పాడేశాను కద. కావాలంటే ఇంకొకటి పాడుతాను. యమ కింకరి, యమనంద లహరి అని ఉంది లెండి,” తను సిద్ధమే అని తెలియజేశాడు నరస సింహుడు.

“నహీ!” ఈ సారి ఆత్రవింద అరిచింది సంస్కృతంలో. “ఆ పాట అలా అల్లరి చిల్లరిగా పాడకూడదు. ఐనా, మీరు ఇంతకు ముందే కద, గాన వైరాగ్యం వచ్చింది అన్నారు,” చిరు కోపంగా అంది నరస సింహుడిని చూసి.

“నిజమే కదూ! మరిచి పోయాను. ఇక మళ్ళీ పాట పాడకూడదు అని నిర్ణయం తీసుకున్నాను, మహారాజా! క్షమించండి,” అన్నాడు నరస సింహుడు అశృ సింహుడితో.

“అది మా దురదృష్టము పరదేశీ,” బాధగా అన్నాడు మహారాజు. అంతలోనే ఆయన మొహం విప్పారింది.

“ఇచ్చిన మాట ప్రకారం, నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను. ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి…” అంటున్న అశృ సింహుడి వాక్ప్రవాహానికి అడ్డు కట్ట వేస్తూ, “అంత సమయం లేదు మాహారాజా! నేను త్వరగా దోమదేశం చేరుకోవాలి. మాములు పీటా పందిరి తోనే పెళ్ళి జరిపించండి,” అన్నాడు నరస సింహుడు.

“నీ ఇష్ట ప్రకారమే కానీ, పరదేశీ! నేనూ, మా ప్రజలూ నీకు సదా కృతజ్ఞులం,” అంగీకారం తెలియజేశాడు మహారాజు.

ఉన్న తక్కువ వ్యవధిలోనే పెళ్ళి ఎంతో ఘనంగా చేశాడు అశృ సింహుడు. బెంగ నగరం అంతా పెళ్ళికి తరలి వచ్చింది. పెళ్ళి అయ్యాక నృత్య గానాలు జోరుగా సాగాయి. మత్స్య కుమారుడు తెడ్లు రెండు చేతులతో పట్టుకుని గెంతుతూ పాడిన, “పెద్ద పెద్ద వాగులో, ఎన్ని వేల చేపలో! ఎన్నో ఉన్నవి కానీ, ఎల్లప్పుడు కాదులే!” పాట అందరికీ బాగా నచ్చింది.

ఆత్రవింద అత్త వారింటికి బయలు దేరాల్సిన సమయం వచ్చింది. రెండు రథాల నిండా సారె నింపి అరణంగా ఇచ్చాడు అశృ సింహుడు. అంతే కాకుండా పది దాసీలతో సహా ఇంకో రెండు రథాలు ఇచ్చాడు.

“ఇంత మంది దాసీలు ఎందుకు మామ గారూ! మా దగ్గర ఇప్పటికే బోలెడు మంది ఉన్నారు,” అభ్యంతరం తెలిపాడు నరస సింహుడు.

“ఫరవా లేదు అల్లుడు గారూ. మీదసలే పెద్ద రాజ్యం. ఇంకో పది మంది దాసీలు మీకు భారం కారు. కానీ మూడు పల్లెలే ఉన్న మా రాజ్యానికి కొంత ఖర్చు కలిసి వస్తుంది,” చెప్పాడు మహారాజు.

“ఓహో! ఇందుకన్న మాట అరణాలు పెట్టేది,” ఆశ్చర్య పోయాడు యువరాజు.

“ఇవే కాకుండా మీ ఇద్దరి కోసం ఇంకో రథం ప్రత్యేకంగా సిద్ధం చేశాం. మీరు అందులో బయలు దేరండి,” అన్నాడు అశృ సింహుడు.

“లేదు మామగారూ. నేనూ ఆత్రా, మా షట్‌కళ్యాణి మీదే ప్రయాణిస్తాం. అసలే దాని మనసు చాలా సున్నితమైనది. తిరుగు ప్రయాణంలో దాన్ని పట్టించుకోలేదని తన మనోభావాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది,” అన్నాడు యువరాజు.

“కానీ ఆ గుర్రం పరమ బద్ధకస్తురాలు. దాన్ని క్రితం సారి మేము పరిగెత్తించలేక, రథంలో తీసుకు వెళ్ల వలసి వచ్చింది,” సందేహం వ్యక్తం చేశాడు మహారాజు.

“దానికి ఒక చిట్కా ఉంది. షట్‌కళ్యాణికి ఒక పాట అంటే మిక్కిలి మక్కువ. అది పాడితే వెంటనే దౌడు తీస్తుంది. మీరు దాన్ని ఇక్కడికి రప్పించండి,” అర్థించాడు నరస సింహుడు.

షట్‌కళ్యాణి రాగానే ముందు తను అధిరోహించి, తరువాత ఆత్రవిందకు తన ముందు కూర్చోవడానికి సహాయం చేశాడు యువరాజు. పండు కోతి కిచ కిచలాడుతూ వచ్చి నరస సింహుడి వీపుని కరుచుకుంది. యువరాజు గొంతు సవరించుకున్నాడు.

“ఆగండి అల్లుడు గారూ! పాట పాడడం మానేశాను అన్నారు కద?” అడ్డు పడ్డాడు అశృ సింహుడు.

“మామగారూ! మీకు తెలీనిదేముంది? ‘వారిజాక్షులయందు, విత్తంబు యందు, వీర బాహుడి ముందు, షట్‌కళ్యాణి ముందు బొంక వచ్చును’ అన్న ఆర్యోక్తి వినలేదా?” గంభీరంగా అన్నాడు నరస సింహుడు.

“మొదటి భాగం విన్నట్టున్నాను. సరే అలాగే కానివ్వండి,” అడ్డు తొలిగాడు మహారాజు.

“అందరు ఇంట్లో వెచ్చగా, మనం బయట కచ్చగా. పదవే పదవే పోదాం,” అంటూ పాడాడు నరస సింహుడు.

షట్‌కళ్యాణి పరుగు మొదలు పెట్టింది. వెనుకనే సారె, దాసీలతో నిండి ఉన్న రథాలు దాన్ని అనుసరించాయి.

***

దోమ దేశం రాజ ధానిలోకి ప్రవేశించగానే దారికి ఇరు వైపులా బారులు తీరి నిలబడి ఉన్న జనం జయ జయ ధ్వానాలు పలుకుతూ వారిని ఆహ్వానించారు.

మళ్ళీ అదే సందేహం వచ్చింది నరస సింహుడికి. “వీరికి ఎటుల తెలియునో కానీ, మేము బయటకు వస్తే చాలు, బాటకు ఇరు వైపులా తయారగుదురు,” అనుకున్నాడు.

సూటిగా రాజ మందిరానికి చేరుకున్నాడు యువరాజు. కోతిని భుజం మీద ఎక్కించుకుని, ఆత్రవింద చేయి పట్టుకుని వడి వడిగా నీరస సింహుడి శయనాగారానికి వెళ్ళాడు.

“జయము, జయము యువరాజుల వారికి,” అంది ద్వారం దగ్గర నిలబడి ఉన్న చెలికత్తెలలో ఒకతి.

“తండ్రి గారు నిద్ర పోవుచున్నారా?” అడిగాడు ఆమెని నరస సింహుడు.

“లేదు యువరాజా! వారు తమ సభలో కొలువు తీరి ఉన్నారు,” వినయంగా సమాధానమిచ్చింది చెలికత్తె.

“అదేమిటి?” ఆశ్చర్యపోయాడు యువరాజు. “నేను కోతి కోసం బయలు దేరినప్పుడు చాలా నీరసంగా పక్క మీద శయనించి ఉన్నారు. ఇప్పుడేమో కొలువు తీరి ఉన్నారా?”

గిర్రున వెనక్కి తిరిగి, ఆత్రవింద, కోతితో సహా రాజసభ వైపు వడి వడిగా అడుగులు వేశాడు నరస సింహుడు. సభలో ప్రవేశించగానే విపరీతమైన ఆశ్చర్యం కలిగింది అతనికి. నీరస సింహుడు హుందాగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఏదో సమావేశం జరుగుతున్నట్టు ఉంది. మంత్రి వృద్ధ భట్టు చెప్తున్నది శ్రద్ధగా వింటున్నాడు మహారాజు.

“నాన్న గారు, నేను కొండ మీద కోతిని తీసుకుని వచ్చాను,” పెద్ద గొంతుతో ప్రకటించాడు నరస సింహుడు.

నీరస సింహుడు తల ఎత్తి చూశాడు. కుమారుని చూడగానే ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కాని ఆయన యువరాజు భుజం మీద కోతిని చూడ లేదు.

“అదేమిటి కుమారా, అందమైన నాతిని పక్కన పెట్టుకుని కోతి అంటున్నావు? దేశాటనం వల్ల నీకు మతి భ్రమణం కలగలేదు కద?” అన్నాడు మహారాజు.

“భుజం మీద చూడండి నాన్న గారూ,” కోపంగా అన్నాడు నరస సింహుడు.

మహారాజు తన భుజం మీద చూసుకున్నాడు. “ఎప్పటిలానే భుజ కీర్తులు ఉన్నాయి, అదేనా నువ్వు నన్ను చూడమంది?” అడిగాడు.

“అహో! మీ భుజం కాదు, నా భుజం మీద!” విసుగ్గా అన్నాడు యువరాజు.

అప్పుడు గమనించాడు నీరస సింహుడు పండు కోతిని. “ఓ, ఐతే మేము పంపిన సందేశం నీకు చేరలేదన్న మాట,” మెల్లగా అన్నాడు.

“సందేశమా? ఏం సందేశం?”

“వాయు కుమారుడనే వార్తాహారుడితో నీకు సందేశం పంపాను. అతను వాయువేగంతో పరిగెట్ట గల శక్తి ఉన్న వాడు. కానీ అతడు నిన్ను చేరుకోలేకపోయినట్టు ఉన్నాడు,” నీరసంగా అన్నాడు నీరస సింహుడు.

“నేను తూర్పు వైపు కద వెళ్ళింది! అతను బహుశా పడమటి వైపు పరిగెత్తి ఉంటాడు. ఇంతకీ సందేశం ఏమిటో చెప్తారా?”

“వైద్యుల వారు తన తాళపత్ర గ్రంథం తప్పుగా చదివారట. నేను తినాల్సింది కొండ మీది కోతి గుండె కాదట. కొండె మీది గోతి కుండె అట. అది చెప్పి నిన్ను వెనక్కి రప్పించడానికే వాయుకుమారుడిని పంపించాను.”

“గోతి కుండా? అదేమిటి?”

“అది ఒక అపురూపమైన వన మూలిక. మన దోమ దేశానికి ఈశాన్యంలో ఉన్న కొండెల్లో దొరుకుతుంది. అది తినగానే నా అస్వస్థత చిటికెలో మాయమయ్యింది. నన్ను మన్నించు కుమారా! ఎంతో కష్ట పడి కొండ మీద కోతిని తెచ్చావు. కానీ అది ఇప్పుడు మనకు అవసరం లేదు.”

“అయ్యో! అదేం మాట నాన్న గారూ! మీ ఆరోగ్యం బాగు పడింది, నాకంతే చాలు. నా అభిప్రాయం ప్రకారం పండు కోతికి కూడా ఈ విషయం పట్ల ఎలాంటి అభ్యంతరమూ ఉండ కూడదు.”

“అలా ఐతే నేను దీన్ని పెంచుకుంటా,” ఉత్సాహంగా అంది ఆత్రవింద.

“తప్పు ఆత్రా! ముసలి కోతులని పెంచుతాము అనకూడదు,” అన్నాడు నరస సింహుడు.

“ఇంతకీ ఈ కన్యామణి ఎవరు?” అడిగాడు నీరస సింహుడు.

“మీ మొదటి కోడలు నాన్న గారూ. కోతిని వెతుకుతూ నేను చేసిన యాత్రలో చింతదేశపు యువరాణి ఐన ఈ ఆత్రవిందని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆత్రా, ఈయనే మా నాన్న గారు,” అన్నాడు నరస సింహుడు ఆత్రవింద వైపు తిరిగి.

ఐతే ఆత్రవింద మొహం ఎరుపెక్కి ఉండడం చూసి ఆశ్చర్యపోయి, “అదేమిటి? ఎందుకంత కోపం?” అడిగాడు.

“లేకపోతే? నేను, మొదటి కోడలినా? దాని అర్థం మీకు ఇంకొన్ని వివాహములు చేసుకునే ఉద్దేశం ఉందనే కద?” హుంకరించింది ఆత్రవింద.

నాలుక కరుచుకున్నాడు నరస సింహుడు. “నేను వేరే వివాహములు చేసుకోకపోయినా కూడా, నువ్వు మా నాన్న గారి మొదటి కోడలివే అగుదువు కద. అదన్న మాట. ఆ! నాన్న గారూ, నాదొక చిన్న కోరిక,” అన్నాడు యువరాజు తండ్రి వైపు తిరిగి.

“చెప్పు కుమారా? ఏమా కోరిక?”

“ఈ దేశాటనం వల్ల నా ఖడ్గ శిక్షణకు అంతరాయము వాటిల్లినది. రేపే వీరబాహుడితో కత్తి యుద్ధానికి ఏర్పాటు చేయండి, చాలు,” అన్నాడు నరస సింహుడు.

“అలాగే!” మాట ఇచ్చాడు మహారాజు.

***

మళ్ళీ వ్యాయామ శాల వద్దే కత్తి సాముకి ఏర్పాట్లు జరిగాయి. ఐతే ఈ సారి పోటీని వీక్షించడానికి వేలమంది ప్రజలు తరలి వచ్చారు. దానికి కారణం, నరస సింహుడు ప్రతి ఒకరిని దండోరా వేయించి ఆహ్వానించడమే.

“ఇంత మంది ఎందుకు యువరాజా? అసలే ఆ వీర బాహుడు జనన్ని చూస్తే మదించి పోతాడు. వానికి కీర్తి కండూతి ఎక్కువ. మీకు వీలైనన్ని ఎక్కువ గాట్లు పెట్టునేమో?” సందేహం వెలిబుచ్చాడు వృద్ధ భట్టు.

“పెక్కు మంది ముందు వాని పీచమణచుట కొరకే ఈ ఏర్పాటు,” గంభీరంగా అన్నాడు నరస సింహుడు.

“కత్తి సాము ప్రారంభించండి,” ఆజ్ఞాపించాడు మహారాజు.

ఆత్రవిందను చూసి కన్ను గీటి, దోమాంబకు మనసులోనే నమస్కారం చేసుకొని గోదాలోకి దిగాడు యువరాజు.

“మీరు దేశాటనకు వెళ్ళిన రోజు నుండి ఈ కత్తిని పదును పెడుతూనే ఉన్నాను. చాలా వాడిగా ఉంది,” అన్నాడు వీర బాహుడు.

“ఉండును, ఉండును. నా దగ్గర ఉన్నది కూడా ప్రత్యేకమైన ఖడ్గమే. ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి,” గర్జించాడు నరస సింహుడు.

అలా అన్న వెంటనే వేగంగా కదిలి తన కత్తిని వీర బాహుడి చేతులకు, కాళ్ళకు, భుజాలకు, చాతీకి తగిలించాడు.

“ఇదేమి విన్యాసము? ఒక్క రక్తపు బొట్టు కూడా చిందలేదు,” హేళనగా అంటూ యధా విధిగా యువరాజు ఒంటి నిండా గాట్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు వీరబాహుడు.

అంతలోనే అకస్మాత్తుగా ఒంటి మీద ఏవో పురుగులు పాకుతునట్టు మెలికలు తిరిగిపోయాడు వీరబాహుడు. కింద పడిపోయి దొర్లడం మొదలు పెట్టాడు. నరస సింహుడు ఆ అవకాశం వదులుకోకుండా శర వేగంగా కదిలి వీరబాహుది ఒంటి నిండా పదునైన గాట్లు పెట్టాడు.

ఒకే ఒక నిముషంలో పోరాటం ముగిసి పోయింది. కేకలు పెడబొబ్బలు పెడుతున్న వీరబాహుడిని నలుగురు మల్ల యోధులు గోదానుంచి లేవనెత్తి బయటకు తీసుకుని వెళ్ళిపోయారు.

“భళా కుమారా, నీ ఖడ్గ విద్యా విన్యాసం సంస్తుతి పాత్రం!” మెచ్చుకున్నాడు నీరస సింహుడు. కత్తి సాము వీక్షించడానికి వచ్చిన ప్రజలంతా హర్ష ధ్వానాలు చేశారు. ఆత్రవింద, వృద్ధ భట్టు లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు.

నరస సింహుడు విజయ గర్వంతో తల ఎగరేశాడు. అతని పెదవుల మీద చిరు మందహాసం రూపు దిద్దుకుంది. జ్వాలా ద్వీపం వదిలి వస్తున్నప్పుడు గండ్ర మండ్రలని అతను అడిగింది కొంత దురద గుండాకు ఇమ్మని. అదే ఆకు పసరుని తన కత్తికి పట్టించి, వీరబాహుడిని కత్తి సాములో సులువుగా ఓడించగలిగాడు నరస సింహుడు.

ఆ తరువాత యువరాజు సాహస యాత్ర విజయవంతంగా ముగిసినందుకు దేవికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, దోమాంబ ఆలయం దిశగా బయలుదేరింది నీరస సింహుడి పరివారం.

(అయిపోయింది)

జ్వాలా ద్వీప రహస్యం – 24


గొంతు సవరించుకున్నాడు నరస సింహుడు. గాననంద స్వామి కళ్ళు తడిబారాయి. ఆత్రవింద యువరాజు వైపు ఓర చూపులు చూసింది. ఆటవికులు కూడా చెవులు రిక్కించారు. పండు కోతి కిచ కిచలాడడం మానేసింది. ఆఖరికి ప్రకృతి కూడా మౌనం వహించింది.

“శ్రీ తుంబుర నారద బాధామృతం,” గొంతు చించుకున్నాడు నరస సింహుడు. పల్లవి పూర్తి కాక ముందే రెండు పక్షులు గాలిలో ఎగురుతున్నవి అలాగే టక్కున నేల రాలిపోయాయి. పండుకోతి రెండు చేతులతో చెవులు మూసుకుంది. ఆత్రవింద మేలిముసుగుని చెవుల్లో కుక్కుకుంది. గోచీలు కట్టుకున్న ఆటవికులకు ఆ అవకాశం లేక ఆకులు చెవుల్లో దూర్చుకున్నారు. ఆటవిక రాజూ, రాణీ, మెడలో వేసుకున్న పూసల దండలు తెంపి ఆ పూసలు కుక్కుకొని తమ కర్ణేంద్రియాలు రక్షించుకున్నారు.

ఏమీ చేయలేకపోయింది గానానంద స్వామి మాత్రమే! పుట్టలో చేతులు ఇరుక్కుపోవడం వల్ల వాటిని బయటకు తీయలేక, తన కర్ణభేరులు రక్షించుకోలేక, ఆయన తల్లడిల్లి పోయాడు.

తడిబారిన ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్ళు బొట బొటా రాలడం మొదలు పెట్టాయి. నరస సింహుడు తన చుట్టూ జరుగుతున్న భీభత్సం పట్టించుకోకుండా పల్లవి ముగించి చరణం మొదలు పెట్టాడు.”సప్త వర్ణముల మృత్యుకగా, శప్త వర్ణముల డోలికగా,” అంటూ.

“ఒరే నాయనల్లారా! ఎవరన్నా వచ్చి నా చెవులు మూయండ్రా!” బిగ్గరగా అరిచాడు గానానంద స్వామి అక్కడున్న వాళ్ళని ఉద్దేశించి.

అక్కడున్న వాళ్ళందరికి గానానంద స్వామి ఏదో తమతో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడని అర్థమయ్యింది. కానీ ఎవరికీ తమ చెవుల్లో ఉన్న అడ్డు తీసే ధైర్యం లేకపోయింది. అప్పటికే వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా, ఎంతో కొంత ధ్వని వాళ్ళ చెవుల్లో దూరుతూనే ఉంది. అడ్డు తీస్తే ఇంకేమైనా ఉందా!

“వాన జల్లుల వేళ ఆ వక్ర వాకాల, ఆ ఆ ఆ, వాన జల్లుల వేళ ఆ వక్రవాకాల, హర్షాతిరేకాలు దెయ్యతమే” నరస సింహుడు ఉత్సాహం పుంజుకున్నాడు.

ఆటవిక రాజూ, ఆటవిక రాణీ కూర్చుని ఉన్న వేదిక చుట్టూ భూమి బీటలు బారింది. మేలు ముసుగు శబ్దాన్ని ఆపలేకపోయినట్టు ఉంది, ఆత్రవింద కూడా కొన్ని ఆకులు కుక్కుకుని తన చెవులకు అధిక రక్షణ ఇవ్వడానికి ప్రయత్నించింది.

గానానంద స్వామి తనకు తెలిసిన మంత్రాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేక పోయింది. నరస సింహుడి పాట ఆయన్ని కుదురుగా ఆలోచింపనీయడం లేదు. కాబట్టి ఏదన్నా మంత్రం ఉపయోగించి నరస సింహుడి గొంతు స్తంభింప చేద్దామన్నా ఆయనకు వీలు పడలేదు.

“మ గ మ గ రి, గ రి గ రి స,” తారా స్థాయికి చేరుకో సాగింది నరస సింహుడి గొంతు. అదిగో అప్పుడే ఎవరూ ఊహించని సంఘటన జరిగి పోయింది. పండు కోతి చెవులు మూసుకునే చెంగు చెంగున గెంతుతూ వచ్చి నరస సింహుడి భుజాల మీదకెక్కి అతని నోరు గట్టిగా మూసేసింది. పాట ఆగిపోయింది!

యువరాజు దేహం దహించుకుపోయింది. కోతి చేతులు పక్కకి లాగేసి, “ఎందుకు నా గాన ప్రవాహానికి అడ్డు పడ్డావు?” కోపంగా అడిగాడు. కోతి కిచ కిచలాడుతూ గానానంద స్వామి వైపు వేలు పెట్టి చూపించింది.

అటు కేసి చూసి గతుక్కుమన్నాడు నరస సింహుడు. గానానంద స్వామి చెవులు ఎర్రగా కంది పోయి ఉన్నాయి.

కోతి మళ్ళీ కిచ కిచలాడి అదే వేలితో చుట్టూతా చూపించింది. అప్పుడు గమనించాడు యువరాజు, చచ్చి పడిన పక్షులని, బీటలు వారిన నేలని, ఆకులు చెవుల్లోంచి తీస్తున్న ఆత్రవిందని, ఆటవికులని.

“ఏమయ్యింది వీళ్ళందరికీ?” ఆశ్చర్యంగా అడిగాడు నరస సింహుడు. గానానంద స్వామి గొంతు సవరించుకున్నాడు. కాని మాటలు బయటకు రాలేదు.

“అయ్యో మీ పుట్ట యదాతథంగా ఉందే. ఈ కోతి నన్ను పాట పూర్తి చేయనీయలేదు. అందుకే కాబోలు మీ శాప నివారణ కాలేదు. ఏం ఫర్లేదు. ఈ సారి ఇంకో గొప్ప పాట అందుకుంటాను,” అన్నాడు నరస సింహుడు ఆయన్ని ఉద్దేశించి.

“నహీ!” సంస్కృతంలో గట్టిగా అరిచాడు గానానంద స్వామి. “ఇంకో పాట వింటే పుట్ట కరిగిపోవడం అటుంచి నేను అరిగిపోయేలా ఉన్నాను. దయ చేసి ఆ ఆలోచన మానుకో,” అంటూ పుట్టపై నుంచి ఎంత దీనంగా అర్థించగలడో అంత దీనంగా అర్థించాడు.

అయోమయంగా చూశాడు నరస సింహుడు. “అదేంటి? మరి మీ శాప నివారణ ఎలా అవుతుంది?” అడిగాడు.

“నాకు శాప విమోచనా మార్గం చెప్పిన ఋషి ఇంకో విషయం కూడా చెప్పాడు. ప్రతి వంద ఏళ్ళకూ ఒక రాజ కుమారుడు ఈ ద్వీపానికి వస్తాడట. కాబట్టి ఫర్లేదు. ఇంకో వందేళ్ళు వేచి ఉంటాలే. నీ దారిన నువ్వు పో.”

“అలా ఎలా పోతాను స్వామి. మీకు శాప విమోచన చేస్తేనే కద నాకు ఆత్రవింద, పండు కోతి దక్కేది. మరి అది జరగాలి అంటే నేను పాట పాడాలి. నాకు ఇంకో అద్భుతమైన పాట వచ్చు. యమ కింకరి, యమానందల హరి అని ఉంది లెండి. అది పాడితే తప్పక ఈ పుట్ట కరిగిపోతుంది.”

“వద్దురా నాయనా. కావాలంటే వాళ్ళని నిస్సంకోచంగా తీసుకుపో. నువ్వు పాట పాడకుంటే చాలు. ఆటవికులు చూడు ఆకులు చెవుల దగ్గర పెట్టుకుని ఎలా తయారయ్యారో?”

“నిజంగా? ఐతే సరే! కానీ తిరిగి వెళ్ళడానికి నా తెప్ప, తెడ్లు లేవే?”

కళ్ళు మూసుకుని ఏదో మంత్రం జపించాడు గానానంద స్వామి. అంతే! తెప్ప తెడ్లు నరస సింహుడి ముందు ప్రత్యక్షమయ్యాయి.

“మర్చిపోయాను స్వామి. ఈ తెప్ప చాలా చిన్నది. నా ఒక్కడికైతే సరి పోయింది. ఇప్పుడు ముగ్గురం ఉన్నాము. తెడ్లు నేనొక్కడినే వెయ్యాలి. చాల కష్టమైన పని,” వినయంగా అన్నాడు యువరాజు.

“ఐతే నన్నేం చేయమంటావు? గాలిలో ఎగిరే మాయా తివాచీ ఇవ్వమంటావా?” పళ్ళు పట పటా కొరికాడు గానానంద స్వామి.

“అదిగో! మీకు కోపం వచ్చింది. పాట పాడి మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటాను,” చిన్న బుచ్చుకున్నాడు నరస సింహుడు.

ఒక్క సారి నిట్టూర్చి మళ్ళీ కళ్ళు మూసుకుని మంత్రం పఠించారు స్వామి వారు.

గాలిలో తేలుతున్న మాయా తివాచి ప్రత్యక్షమయ్యింది.

“దీని మీద మీరు ముగ్గురూ సులువుగా ప్రయాణం చేయవచ్చు. కావాలంటే తెప్ప, తెడ్లు కూడా పట్టుకెళ్ళండి,” అన్నాడు గానానంద స్వామి.

“తెప్ప తెడ్లు తప్పకుండా తీసుకు వెళ్ళాలి. అసలే మత్స్య కుమారుడికి మాటిచ్చాను. మరి ఈ తివాచీ మీకు ఇవ్వడానికి నేను తిరిగి రావాలేమో?”

“వద్దు! మీరు గమ్యం చేరాక ఆ తివాచి దానంతట అదే నా వద్దకు తిరిగి వచ్చేస్తుంది. త్వరగా వెళ్ళండి.”

“ఆగండి స్వామీ! నాకు గండ్ర, మండ్రతో కాస్త పని ఉంది. అది పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను,” అన్నాడు నరస సింహుడు.

ఆ తరువాత గండ్ర, మండ్రని ఏదో అడిగాడు యువరాజు. మండ్ర తల ఊపి ఒక గుడిసెలోకి వెళ్ళి చిన్న సంచి తెచ్చి నరస సింహుడి చేతిలో పెట్టాడు.

ఆత్రవింద, పండు కోతి, తెప్ప, తెడ్లు, నరస సింహుడు అధిరోహించిన తివాచీ బెంగ నగరం వైపు ఆకాశ మార్గాన బయలు దేరింది.

(ఇంకా ఉంది)

జ్వాలా ద్వీప రహస్యం – 23


“అదొక పెద్ద కథ, నాయనా!” అంది పుట్ట మీద ఉన్న తల. అప్రయత్నంగానే ఉలిక్కి పడ్డాడు యువరాజు. “ఫర్లేదు చెప్పండి స్వామీ! నాకు ఓపిక ఎక్కువ,” అన్నాడు తమాయించుకుని.

“వినడానికి నీకు ఉన్నా చెప్పడానికి నాకు ఓపిక లేదు బిడ్డా. క్లుప్తంగా నేనొక శాపగ్రస్తుడిని. నా అహంకారం వల్ల ఇలా పుట్టలో ఇరుక్కుపోయి కాలం వెళ్ళదీస్తున్నాను,” గద్గదమైన గొంతుతో అన్నాడు గానానంద స్వామి.

“అవును, మా పూర్వీకులు ఈ ద్వీపానికి రావడానికి ముందే సాములోరు ఈ పుట్టలో ఖైదు కాబడి ఉన్నారు. ఈయన మహిమ గుర్తించి, మా పెద్దలు ఈ పుట్ట చుట్టూ గూడెం కట్టారు,” చెప్పాడు మండ్ర.

“అయ్యో పాపం! కానీ ఇందులో నేను చేయగలిగింది ఏముంది స్వామీ?” అడిగాడు యువరాజు.

“చేయగలిగిందంతా నువ్వే నాయనా, నాకు శాపమిచ్చిన ఋషే నా శాప విమోచన ఎలా అవుతుందో కూడా చెప్పాడు. ఏదో ఒక రోజు ఒక రాజ కుమారుడు ఈ ద్వీపానికి వస్తాడని, అతని ద్వారానే నేను ఈ పుట్ట నుంచి బయట పడతానని సెలవిచ్చాడు.”

“ఐతే ఈ పుట్టని తవ్వడం మొదలు పెట్టమంటారా స్వామీ?”

“తొందర వద్దు నాయనా! నువ్వు తవ్వినా లాభం లేదు. ఇది సామాన్యమైన పుట్ట కాదు.”

“ఓహో! మీకు సహాయం చేస్తే, ఒక కోతినీ, నాతినీ త్వరగా వెతుక్కోవచ్చు అనుకున్నాను.”

“నువ్వు ఇక్కడికి వచ్చిన పని నాకు తెలుసు నాయనా. నన్ను శాపవిముక్తుడిని చేస్తే వాళ్ళు నీకు వెంటనే లభ్యమవుతారు. అటు చూడు!”

“ఎటు స్వామీ?”

“అదే నా చూపుడు వేలు ఎటుకేసి ఉందో, అటు!”

“పుట్టలో ఉన్న మీ వేలు నాకు ఎలా కనిపిస్తుంది, చెప్పండి?

నాలుక కరుచుకుంది పుట్ట మీది తల. “నీ ఎడమ వైపు చూడు బిడ్డా!”

అటు వైపు చూడగానే ఉద్విగ్నుడయ్యాడు నరస సింహుడు. అక్కడ పండు కోతీ, రాచరికం ఉట్టి పడుతున్న ఒక కన్యా, కనిపించారు అతనికి. వారిద్దరి చుట్టూ బల్లేలు పట్టుకుని నలుగురు ఆటవికులు నిలబడి ఉన్నారు. అతనికి తెలీకుండానే అటు వైపు ఒక అడుగేశాడు.

“ఆగు నాయన! ఆ అమ్మాయికే ఆత్రం అనుకున్నాను. నీకు కూడా చాలానే ఉంది. తొందర వద్దని ముందే చెప్పాను. నాకు శాప విమోచనం కలిగించిన వెంటనే వాళ్ళు నీ సొంతం అవుతారు,” అన్నాడు గానానంద స్వామి.

ఆయన మృదువుగా చెప్పినప్పటికీ ఆ గొంతులో దాగి ఉన్న కాఠిన్యాన్ని పసిగట్టాడు యువరాజు.

“సరే స్వామీ, ఏం చేయమంటారో చెప్పండి.”

“నాకు శాపమిచ్చిన ఋషి, అలా ఈ ద్వీపానికి వచ్చిన రాకుమారుడు గొంతెత్తి గానం చేస్తే, ఆ పాట ప్రభావానికి ఈ పుట్ట కరిగిపోయి, నేను విడుదల పొందుతానని చెప్పాడు. అదే సమయంలోనే నాకు గానానంద స్వామి అని నామకరణం చేసి ఆయన దారిన ఆయన పోయాడు. కాబట్టి నువ్వు నీ గానపటిమతో నన్ను ఈ చెర నుంచి విడిపించు. అన్నట్టు నీకు పాడడం వచ్చు కద?”

ఈ సారి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి నరస సింహుడికి. “రాచ బిడ్డకు ఆసాధ్యం కానిదేమీ లేదు కుమారా! నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలి,” అని.

వెంటనే, “నేను చతు:షష్టీ కళా విశారదుడిని స్వామీ!” అన్నాడు బింకంగా.

“మంచిది నాయన. ఇన్ని రోజులకి నేను మళ్ళీ స్వేచ్చా వాయువులని పీల్చుకోబోతున్నానన్న మాట. నీ పాట మొదలు పెట్టు,” అన్నాడు గానానంద స్వామి.

(ఇంకా ఉంది)

జ్వాలా ద్వీప రహస్యం – 22


“మామూలుగా ఐతే కలిసేవాడినేమో కానీ చాలా జరుగురు పని మీద వచ్చాను. కావాలంటే ఆ పని అయ్యాక కలుస్తానులే,” అన్నాడు నరస సింహుడు.

“ఇది విన్నపం కాదు, పుంజూ! గానానంద సాములోరి ఆజ్ఞ. నీ అంతట నువ్వు రాకపోతే…” మధ్యలో ఆగాడు మండ్ర.

“విషం పూసిన బాణాలు నా మీద ప్రయోగిస్తారు. అంతే కద?” అన్నాడు యువరాజు.

“కాదు మా ద్వీపంలో పెరిగే దురద గుండాకు వొంటి నిండా పట్టిస్తాం. ఆ తరువాత నువ్వు లాక్కోలేక, గోక్కోలేక చావాలి,” చిలిపిగా నవ్వుతూ చెప్పాడు గండ్ర.

వొళ్ళు జలదరించింది నరస సింహుడికి. “ఇంకా ఏదో పరువుగా యుద్ధం చేస్తారనుకున్నాను, నీచుల్లారా! సరే, వస్తాను, ఐతే నాదొక షరతు,” అన్నాడు.

“నువ్వు బుద్ధిగా మా వెంట వస్తే దురద గుండాకు పూయము లే!” భరోసా ఇచ్చాడు మండ్ర.

“ఎహే! అది కాదు. నన్ను పుంజు అని సంబోధించకూడదు. నాకో చక్కని పేరు ఉంది, నరస సింహుడు అని. అలా పిలవాలి.”

“అదేం పేరు? మాలా చిన్నగా ముద్దుగా పెట్టుకో వచ్చు కద? సరేలే అలాగే పిలుస్తాము,” హామీ ఇచ్చాడు గండ్ర.

వారు నలుగురూ ముందు దారి తీయగా, వెనక బయలుదేరాడు నరస సింహుడు. కాసేపయ్యాక గండ్ర, మండ్ర, ఉండ్ర, తండ్రాలు నివసించే గూడెం వచ్చింది. చుట్టూ ఒక కంచె కట్టి ఉంది. లోపల దాదాపు వంద గుడిసెలు ఉన్నాయి. కంచె బయట ఇద్దరు ఆటవికులు కాపలా నిలబడి ఉన్నారు. తలపాగాలూ, మెడలో పూసలూ, ఎర్ర రంగు పంచెలు ధరించి ఉన్నారు.

“వీళ్ళెందుకు మీలా గోచీల్లో లేరు?” అడిగాడు యువరాజు.

“మేము సైనికులం. గోచీలు వేసుకోవడం మాకు సౌకర్యంగా ఉంటుంది. కానీ వాళ్ళు గూడేనికి కాపలా దారులు. అలాగే గూడెం మర్యాదకు కూడా రక్షకులే. అందుకే వాళ్ళకు ఆ వేషం,” వివరించాడు గండ్ర.

“అహో! మీరు కూడ ఇంత ఆలోచించి దుస్తులు ధరిస్తారన్న మాట,” ఆశ్చర్యపోయాడు నరస సింహుడు.

కంచె దాటి గూడెం మధ్యకు చేరుకున్నారు వారంతా. అక్కడ ఒక వేదిక ఉంది. దాని మీద రెండు పెద్ద కుర్చీల్లో ఒక మగ, ఆడ కూర్చుని ఉన్నారు. “బహుశా ఈ గూడెం రాజు, రాణి అయి ఉంటారు,” అనుకున్నాడు యువరాజు. చుట్టూతా ఆ గూడెం ప్రజలు కామోసు, ఒక వలయంగా నిలబడి ఉన్నారు.

వేదిక ముందే ఒక పుట్ట ఉంది. “గూడెం మధ్యలో ఈ పాముల పుట్టేంటో! ఈ ఆటవికులకు ఎంతైన ధైర్యం ఎక్కువ,” నిట్టూర్చాడు నరస సింహుడు.

సూటిగా వెళ్ళి ఆ పుట్ట ముందు ఆగారు నరస సింహుడిని అక్కడికి తెచ్చిన ఆటవికులు.

“ఎవరు ఈ పుంజు?” అడిగాడు వేదిక మీద కూర్చుని ఉన్న మగ మనిషి.

“ఇతన్ని నరస పుంజు, కాదు కాదు, నరస సింహుడు అంటారు. సాములోరు తీసుకుని రమ్మంటే వెంట పెట్టుకొచ్చాం,” వినయంగా చెప్పాడు మండ్ర. అలాగా అన్నట్టు తల పంకించాడు ఆయన.

“గానానంద సాములోరికి దండం పెట్టుకో నరస సింహా!” అన్నాడు గండ్ర.

“కనిపిస్తే అలాగే పెట్టుకుంటాను. కానీ ఆయన ఎక్కడ?” అయోమయంగా అడిగాడు నరస సింహుడు.

“ఎక్కడ ఏంటి? నీ ముందే ఉంటే!” పుట్టను చూపిస్తూ చెప్పాడు మండ్ర.

ఒకసారి ఆ పుట్టని తేరిపారా చూసి ఉలిక్కి పడ్డాడు యువరాజు. ఆ పుట్ట పై భాగంలో ఒక మనిషి తల ఉంది. గడ్డాలు, మీసాలు పెరిగిపోయి మొహమంతా మట్టి కొట్టుకు పోవడం వల్ల అది కూడా పుట్టలో ఒక భాగంలా ఉంది.

“హతవిధి! ఈయన ఇలా పుట్టలో బంధీ ఆయాడేంటి?” కొండంత ఆశ్చర్యంతో అడిగాడు నరస సింహుడు.

(ఇంకా ఉంది)

జ్వాలా ద్వీప రహస్యం – 21


అదే దారిలో ముందుకు నడిచాడు నరస సింహుడు. కొంత సేపటికి అతనికి తనను ఎవరో గమనిస్తున్న అనుభూతి కలిగింది.

చుట్టూతా చూశాడు యువరాజు. ఎవరూ కనిపించలేదు కానీ, అతని మనసులో అనుమానం అలానే ఉండిపోయింది. “దెయ్యాలు కానీ వెంబడిస్తున్నాయా?” అనుకున్నాడు.

కానీ వెంటనే అతని సునిశిత మేధస్సుకు తోచింది. “ఇప్పుడు పగలు. దెయ్యాలు ఉండవు,” అనుకుని తృప్తి పడ్డాడు. “మరైతే తనకు ఎందుకలా అనిపిస్తూంది?” మళ్ళీ అనుమానం వచ్చింది.

ఈ సారి ఊపిరి కూడా పీల్చకుండా నెమ్మదిగా నడిచాడు. చెవులు రిక్కించి శ్రద్ధగా వింటే, చాలా చిన్న సవ్వడులు వినిపించాయి.

సందేహం లేదు. ఎవరో అతి రహస్యంగా తనను వెంబడిస్తున్నారు. వారిని ఎలా బయటకు రప్పించడం? అతనికి వీరబాహుడి మాటలు గుర్తుకి వచ్చాయి.

“మనల్ని ఎవరన్నా వెంబడిస్తూ ఉంటే, వాళ్ళను బయటకు రప్పించడానికి ఒకే మార్గం. ఏదో ఒక చోట దాక్కోవాలి. ఇక కదలకూడదు. అప్పుడు విసుగు పుట్టి వాళ్ళే వస్తారు,” నరస సింహుడి భుజం మీద ఇంకో గాటు పెడుతూ చెప్పాడు వీరబాహుడు.

వెంటనే ఆ సలహా అమలు పరిచాడు యువరాజు. చెంగున గెంతి పక్కనే ఉన్న పొదలో దూరాడు. అలా దూరాక అక్కడే ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు.

వీరబాహుడి సలహా మంత్రం పని చేసినట్టు పని చేసింది. ఒక పది నిముషాలయ్యాక ఒక నలుగురు ఆటవిక జాతికి చెందిన వాళ్ళు చెట్ల వెనుకాతల నుంచి బయటకు వచ్చారు. ఆకుల సందులోంచి వారి ఆకారాలు మసక మసకగా కనపడ్డాయి నరస సింహుడికి.

“పట్నం పుంజు ఈ పొదలోనే దూరింది. ఎంత సేపటికి బయటకు రాదేమిటి?” అన్నాడు వారిలో ఒకడు.

చెప్పొద్దూ, యువరాజు దేహం కోపంతో దహించుకుపోయింది. “తనలాంటి రాచ బిడ్డని పట్టుకుని జంతువులా సంబోధిస్తాడేంటి ఈ ఆదిమవాసి,” అనుకున్నాడు.

“మన ఈటెలతో ఈ పొదని పొడిచి చూద్దామా? అప్పుడు పుంజు అదే బయటకు వస్తుంది,” ఉత్సాహంగా అన్నాడు ఇంకొక ఆటవికుడు.

నరస సింహుడి మానసిక స్థితి కోపం నుంచి భయానికి పరివర్తన చెందింది. “ఆగండి, తొందర పడద్దు. కాస్తో కూస్తో నాకు కత్తి గాట్లు అలవాటు కానీ, ఈటె పోట్లు అస్సలు అలవాటు లేదు,” అంటూ తనే పొద నుంచి బయటకు వచ్చాడు.

“ఈటె అన్న మాట వినగానే పుంజు ఎలా బయటకు పరుగున వచ్చిందో చూసినావురా, గండ్రా!” అన్నాడు మొదటి ఆటవికుడు.

“బాగా చెప్పావురా మండ్రా!” అన్నాడు గండ్ర.

ఒక సారి వారివంక తేరిపారా చూశాడు యువరాజు. నెత్తిన ఈకలూ, మొహనికి రంగులూ సమృద్ధిగా ఉన్నాయి కానీ, వొంటి మీద బట్టలే లేవు. నలుగురూ గోచిపాతల్లాంటి జంతు చర్మాలు ధరించారు.

“ఛీ ఛీ! ఇలా సిగ్గు లేకుండా, ఏమీ వేసుకోకుండా బయటకు వస్తారా, అనాగరికుల్లారా!” కళ్ళు మూసుకుంటూ అన్నాడు నరస సింహుడు.

ఈ సారి దేహం దహించుకుపోవడం ఆటవికుల వంతు అయ్యింది.

“మరి అడవి మనుషులంటే ఎలా ఉంటారేమిటి? అసహ్యంగా వొంటి నిండా బట్టలు కట్టుకుంటారా? ఐనా మాకు కొంత నాగరీకం అలవాటు అయ్యింది కాబట్టి, మా తాతల మల్లే కాకుండా ఈ మాత్రం బట్టలు వేసుకున్నాము,” కోపంగా అన్నాడు గండ్ర.

వాళ్ళ తాతలు ఏం ధరించేవారో ఊహించడానికి కూడా ఇష్టపడలేదు నరస సింహుడు.

“ఇంతకీ మీరెవరు?” అడిగాడు వాళ్ళని.

“నా పేరు గండ్ర, వీడి పేరు మండ్ర. వాళ్ళిద్దరి పేర్లు…”

“చెప్పక్కర్లేదు. ఉండ్రా, తండ్రా,” కసిగా అన్నాడు యువరాజు.

“అరే! నీకెలా తెలిసింది? గుడిసె పెకిలించి నీకు కూడా మా గానానంద సాములోరిలా కాల జ్ఞానం ఉందా?” ఆశ్చర్యంగా అడిగాడు మండ్ర.

“కాల జ్ఞానం లేదు కానీ, ఈ గానానంద స్వామి ఎవరు?” ప్రశ్నించాడు నరస సింహుడు.

“మా అందరికి దేవుడిలాంటి వాడు. ఆయన ఆజ్ఞాపిస్తేనే నిన్ను తీసుకు పోవడానికి వచ్చాం,” అన్నాడు గండ్ర.

(ఇంకా ఉంది)

Next Page »