సీ రామ రాజ్జం


“ఒరే బుడుగూ, ఒరే బుడుగూ” పెద్ద పెద్ద అరుపులతో నన్ను నిద్ర లేపింది సీ గాన పెసూనాంబ. ఇక్కడ ఈ నిద్ర లేపే వాళ్ళ గురించి కుంచెం చెప్పాలి. వాళ్ళకు నిద్ర పట్టి చావదు కాబట్టి, వాళ్ళు మేల్కున్నప్పుడు మనం మాత్రం ఎందుకు నిద్ర పోవాలనే కుళ్ళుతో వాళ్ళు మన్ని నిద్ర లేపుతారు. పోనీ ఆ విషయం ఒప్పుకుంటారా అంటే అదీ లేదు. బద్ధకం మంచిది కాదని, పొద్దున్నే లేస్తే ఎన్నో పనులు అవుతాయని బొంకుతారు. అంతా ఉత్తినే. అసలు వాళ్ళు నిద్ర లేచాక చేసే పనే, వేరే పడుకున్న వాళ్ళని నిద్ర లేపడం.

ఇంతకీ ఎక్కడ ఉన్నాను. ఆ! సీ గాన పెసూనాంబ నన్ను నిద్ర లేపింది. లేపడమే కాదు. నాకు కళ్ళు నులుముకునే టైం కూడా ఇవ్వకుండా, “నువ్వు బాగుందని చెప్పావని, నేను మా ఇంట్లో వాళ్ళతో సీ రామ రాజ్జం సినిమాకి వెళ్ళాను. కానీ నాకేం నచ్చలేదు. నిన్ను కడిగి పారేద్దామని వచ్చాను,” చెప్పింది.

“మా రాధ ఎలాగూ నన్ను కాసేపయ్యాక స్నానం పేరుతో కడిగి పారేస్తుందిలే. ఇంతకీ నీకు సీ రామ రాజ్జంలో ఏం నచ్చలేదు?” అడిగాను నేను.

“భాలక్రిష్ణ లావుగా ఉన్నాడు.”

నాకు బోలెడు ఖోపం వచ్చేసింది. అదే ఈ మళయాళం సినిమాల్లో ఐతే మోగన్‌లాల్ లాంటి హీరోలు అడ్డ పంచెలు కట్టుకుని అడ్డ దిడ్డంగా పెరిగిపోయి ఉన్నా, వాళ్ళ యాక్టింగ్ ముఖ్యం, అద్భుతంగా చేశారు అంటారు. మన దాక వస్తే మాత్రం యాక్టింగ్ పట్టించుకోరు. హేంటో!

“భాలక్రిష్ణ ఎప్పుడూ లావుగానే ఉంటాడు. సీ రాముడిగా బాగా చేశాడా లేదా?”

“ఊరికే కన్నీళ్ళు పెట్టుకుంటాడు.”

“నీ చేగోడీలు నేను లాక్కుంటేనే నువ్వు శోకాలు పెడతావు. అలాంటిది పెళ్ళాం, పిల్లలు దూరం ఐతే సీ రాముడు అంతకంటే ఎక్కువ ఏడవనందుకు మెచ్చుకోవాలి.”

“హీరో అలా ఏడవచ్చా?”

“ఆ కథలో సీ రాముడు అలానే చేయాలి, అంతే కానే మాటి మాటికి వాచిపోయేలా తొడ కొట్టకూడదు. భాలక్రిష్ణ అలా హీరోయిజం చూపించిన సినిమాలు చూసి ఇంతకు ముందు నువ్వు బోలెడు చాలా నవ్వావు కద. ఇప్పుడు ఇలా నటించినా నచ్చకపోతే ఇంకెలా చచ్చేది?”

“కానీ నైనతారని సీతమ్మలా చూస్తూంటే నాకు తను షేం షేం బట్టలు వేసుకున్న పాత సినిమాలే గుర్తుకి వొచ్చాయి.”

నాకు ఆవేసం వచ్చింది. ఆవేసం అంటే ఖోపం లాంటిదే. ఆవేసం వస్తే బాగా ఆయాసం కూడా వస్తుంది. ఇది బాబాయి చెప్పాడు.

“అలా నీకు గుర్తు వచ్చిందంటే తప్పు నైనతారది కాదు. నీ కళ్ళది. ఈ సినిమాలో సీతమ్మగా కుదిరిందా లేదా అదొక్కటే నీ కళ్ళు పట్టించుకోవాల్సింది.”

“సీతని రాముడు అడవికి పంపించడం నాకు నచ్చలేదు.”

“అదేంటే? బాపుగారు హెంత వివరంగా చెప్పారు, రాముడు సీతని అడవికి ఎందుకు పంపించాల్సి వచ్చింది అని! నీ లాంటి మట్టి బుర్రలకు అర్థం అయ్యేలా, పెద్ద కిరీటం కూడ తెచ్చి రాముడి మీద పడేశారు. అదేదో నీ మీద పడేసినా బాగుణ్ణు.” గాఠిగా అరిచాను నేను.

“కానీ పాత లవకుసలో పజ్జాలు బోలెడన్ని ఉన్నాయి. ఇందులో లేవు. పజ్జాలు లేకపోతే అది దేవుడి సినిమా ఎలా అవుతుంది?” తను కూడా గాఠిగా అరిచింది సీ గాన పెసూనాంబ.

“నీకెందుకే పజ్జాలు? మొన్న సీ రామదాసులో ఉన్న “సిరికిం జెప్పడు” పజ్జమే నీకింకా అర్థం కాలేదు. అందుకే వాళ్ళు పజ్జాలు పెట్టలేదు. అందరికీ అర్థం కావాలని అలా తీశారు.”

“కాని నాకు అందులో కొన్ని డవిలాగులు అర్థం కాలేదురా!”

“అది నీ ఖర్మ. ఆ సినిమా తీసిన వాళ్ళు కూడా మరీ దిగజారలేరు కద.”

“ఒరేయి బుడుగూ, నన్ను వెక్కిరిస్తే నీ నడ్డి మీద ఛంపేస్తా. ఆ, ఇంకోటి! సీ రాముడికి లవకుసలకి మజ్జ కాస్త యుద్ధం పెట్టుంటే బావుండేది.”

“అప్పటికే సినిమా మూడు గంటలు అయి పోయింది కద. ఇంకా యుద్ధాలు పెడితే నీ లాంటి వారు చూడ్డానికి వెళ్తారా?”

“బుడుగూ, నువ్వు చాలా పక్షవాతంగా మాట్లాడుతున్నావు. ఎంతైనా నీకు ఆ బాపు-రమణ అంటే ఇష్టం!”

“హవును, రమణగారు నన్ను సృష్టించి ఇచ్చారు. బాపుగారు ఆయన ప్రాణ స్నేహితుడు. నాకు వాళ్ళంటే ఇష్టం ఎందుకు ఉండదు? అది పక్కన పెట్టు. బాపుగారు సినిమ హెంత అందంగా తీసారు! పాటలు హెంత బావున్నాయి! పిల్లలు ఇంకా హెంత బాగా చేశారు! స్క్రీన్ ప్లే హెంత బాగుంది! ఇలాంటివి పట్టించుకోకుండా వంకలు పెడితే నాకు ఖోపం వస్తుంది మరి.”

“ఇంతకీ ఏమంటావురా?”

“సీ రామ రాజ్జం చూస్తే పుణ్యం ఎలాగూ వస్తుంది. కానీ చూడకపోతే పాపం రావడం మాత్రం ఖాయం.”

This entry was posted in బుడుగు, సినిమాలు. Bookmark the permalink.

19 Responses to సీ రామ రాజ్జం

  1. శబాష్ .. ఆ చివరాఖర్లైనులో థియెటార్లో చూడాలని కూడా రాసెయ్ బుడుగూ!

    • Murali says:

      మా ఊరిలో ఐతే థియేటర్‌లోనే చూస్తాం కొత్త పాళీగారు. అందుకే ప్రత్యేకంగా రాయలేదు.

  2. Sri says:

    http://ishtapadi.blogspot.com/2011/11/blog-post_29.html

    రామరాజ్యం మీద వచ్చిన రివ్యులన్నిటిలో ఇది ప్రత్యేకమైన రివ్యు. చిన్న చిన్న లోపాలు అంట్టునే ఓపికగా మూడుపెద్ద టపాలు రాసాడు. మంచి సన్నివేశాల గురించి అతి తక్కువగా రాసి, లోపాలను భూతద్దాలతో వెదకి రాసిన రివ్యూని ఇప్పటివరకు చదవకుండా ఉండిఉంటే , చదివేది.

    • Murali says:

      ఆయన చాలా కష్టపడి, రంధ్రాన్వేషణ చేసి, కష్టపడి మూడు టపాలు రాశారు. మీకా కుళ్ళు దేనికి? ఇన్ని లోపాలు ఉంటే ఏ సినిమా హిట్ అవుతుందండీ? మన తెలుగు ప్రేక్షకులు నాణ్యతకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీకు తెలీదా? జాతి రత్నాల్లాంటి సినిమాలు తప్ప వేరే ఏవీ చూడను గాక చూడరు. ఆయన చెప్పింది నిజం. శ్రీ రామ రాజ్యం పరమ నాసి రకమైన సినిమా. 🙂 కాని నాలాంటి హిందుత్వ వాదులంతా మాత్రం ఈ సినిమాని ఎలా ఐనా హిట్ చేయడానికే ప్రయత్నిస్తాం.

  3. M.V.appaRao says:

    రమణగారి బుడుగు చేత సీ రామరాజ్జం సిన్మా గురించి ఎంత బాగా చెప్పారో మీరు !

  4. kamudha says:

    నాకు కూడా చాలా నచ్చింది. నేను తక్కువలోతక్కువ రెండువందలమంది చూడడానికి కారణం ఐయ్యేను కూడా.

    కాముధ

  5. తాడిగడప శ్యామలరావు says:

    హేంటీ!
    “సీ రామ రాజ్జం చూస్తే పుణ్యం ఎలాగూ వస్తుంది. కానీ చూడకపోతే పాపం రావడం మాత్రం ఖాయం.”
    ఇలా బెదిరించి యీ సినిమా చూపిద్దామనుకుంటున్నారా? ఆపప్పులేమీ ఉడకవండోయ్.

    పైగా బెదిరించి సినిమా చూపించినందుకుగాను తమకే మహాపాపం చుట్టుకుంటుందండీ. మాక్కాదు.
    అదీగాక, ఇలా ఝడుసుకుని సినీమా చూసినా, లేదా సినీమా చూసి ఝడుసుకున్నా ఆ పాపం మీదే.
    తలనొప్పి మాత్రం మాకేలెండి.

    • Murali says:

      తలనొప్పి సంగతి మీరు చూసుకోండి, పాపం సంగతి నేను చూసుకుంటా. ప్రొసీడ్!
      By the way, yours is the 2000th comment on my blog…

  6. నాకు ఇష్టమైన క్యారెక్టర్లరో బుడుగు మొదటివాడు. వాడితో రివ్యూనా…!!! భలే ఆలోచన.

    చాలా వెరైటీగా చాలా చాలా బావుంది… మీ సమీక్ష.

    • Murali says:

      థాంక్స్.

      బుడుగు హేమన్నా చిన్న వాడా చితక వాడా, రివ్యూ రాయక పోవడానికి?

  7. rvarma says:

    ఈ సినిమా గొప్పగా నడవకపోవడం చూసాక మళ్ళీ ఎవడన్నా తెలుగు సినిమా, సంస్కృతి నాశనం అవుతోంది అంటే చెంపలు వాయించాలనిపిస్తోంది. ఆఖరికి మనవాళ్ళు ఎంతగా దిగజారారంటే, తమకి ఇలాంటి సినిమాలు చూసే ఆసక్తి, ఓపిక లేవన్న నిజాన్ని కప్పిపుచ్చుకోటానికి వికృతమయిన విమర్శలు చేయటం మొదలెట్టారు. ఆ ఇష్టపది విమర్శ చదివాక ఇంత నీచంగా కూడా విమర్శలు చేయొచ్చా అనిపించింది. అదే రకంగా, అదే స్థాయిలో ఆయన ఈనాడు వస్తున్న ఇతర సినిమాలు విమర్శించడం మొదలెడితే, ఆ విమర్శలు బూతులతో నిండిపోవాలి మరి. చాలాకాలం తర్వాత మా అమ్మానాన్నలు చూసి మెచ్చిన సినిమా ఇది. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడ్డారు.

    అదేదో హిందీలో అన్నట్లు, మనం మన ఔకాత్ ఏమిటో చక్కగా నిరూపించుకున్నాం ఈ సినిమాని ఫట్టు చేయటం ద్వారా..

  8. sarada says:

    paapam prakshaalana augaaka!
    istapadi review ki virugudu idi –
    http://idlebrain.com/community/mymovie/sriramarajyam-sarada.html

  9. bharathi says:

    cinima chala bagundi bapu & ramana gaarrlu baaga teesaru kani, kontamandi audiens comments chesi navvatam chala badha anipinchindi. vallu akka da Ramudu Seeta patralu chuda kunda Nayanatara balakrishna nalanu chudadam cha badakaram alaanti vallu cenimaachudakunda vundadam better,inka yevaryna allati vallu vunte Ramayananni okkasari chadivi appudu cinema chudandi. (kaneesm bommala Ramayananni chdavandi).

  10. Ram says:

    The movie is OK if you haven’t seen LAVA KUSA. For me SRR is half hearted attempt of copying LavaKusa. The script and screenplay follows exactly Sadasiva Brahmam’s LavaKusa except the role of Hanuma. Bapu and Ramana are great artists and I have great respect for them. Ilayaraja’s music is nowhere near Ghantasala. In mythological and folklore movies music is lifeline. Ilayaraja killed this movie with his horrible tunes. Certain scenes and dialogues are totally identical with LavaKusa. Every one including Padma Vibhushan disappointed. Seethamma means Anjalidevi. Nayanatara did her best but not upto the mark.The only person that deserves acclaim is producer. These days we do not have great music directors who has in depth knowledge and great male singers who can modulate the voice properly to the situations. without those two assets it is very risky to remake old classics.

  11. Sandeep P says:

    శ్రీరామరాజ్యం చిత్రం నాకు నచ్చింది. నాతో పాటు వచ్చిన తమిళ సోదరులకీ నచ్చింది. ఈ కాలంలో ఈ సినిమా చెయ్యాలనుకోవడం గొప్ప విషయం. బాలకృష్ణ నటన నుండి, ఇళయరాజ సంగీతం నుండి, జొన్నవిత్తుల సాహిత్యం నుండి, దర్శకత్వం వరకు అన్నీ లవ-కుశతో పోల్చుకోవడం అనవసరమైన ప్రయాస అని నా అభిప్రాయం. మనకు ముఖ్యమైనది కథలో భావం ప్రేక్షకులకు అర్థమైందా లేదా అన్నది — అది కచ్చితంగా నా విషయంలో జరిగింది.

  12. sushma says:

    cinema emo kaani Budugu review baagundi….

Leave a comment