కొత్త కొత్తగా ఉన్నది!

“కొత్త సంవత్సరమా రమ్మా! నీతో పాటు తెచ్చింది ఏంటమ్మా, జిన్నా, రమ్మా?” అంటూ అప్పారావు గాడు గొంతెత్తి పాడుతూంటే రూంలోకి ఎంటర్ అయ్యాను నేను.

“ఛీ, ఛీ ఏంటా పాట?” అని నేనగానే, చిన్న బుచ్చుకున్నాడు అప్పడు . “అంతే లే గురు, శ్రీ శ్రీ గారు ఇదే కవిత చెప్తే అందరు చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. నేను చెప్తే దాని విలువ పోయింది,” అన్నాడు ఉక్రోశంగా.

“అది కాదురా, కొత్త సంవత్సరం వస్తే అందరు కొత్త రిజొల్యూషన్స్, అందులోనూ ఉపయోగపడేవి తీసుకుంటారు. నువ్విలా తాగుడు గురించి మాట్లాడితే నేనమనుకోవాలి?” అనునయంగా అన్నాను నేను.

“ఏదో పాడాను కానీ, నేనూ బోలెడు రిజొల్యూషన్స్ చేసుకున్నా.”

“ఏంటో అవి?”

“రోజూ మెలుకువ రాగానే లేవడం, స్నానం చేయడం, ఆఫీసు ఉంటే ఆఫీసుకు వెళ్ళడం, రాత్రి టీవీ చూస్తూ భోజనం చేయడం, పడుకోవడం, అన్నట్టు మర్చి పోయా: పొద్దున బ్రేక్ ఫ్యాస్టూ, మజ్జాన్నం లంచు కూడా చేయడం.”

“మా బాబే! ఇవి నువ్వు ఎలాగూ చేస్తావు. వీటిని రిజొల్యూషన్స్ అనరు!”

“అంటే చాలా మందిని చూశాను. ఏవేవో రిజొల్యూషన్స్ చేస్తారు కొత్త సంవత్సరం రాగానే, కానీ ఒక్కటి కూడా పాటించరు. దాని కంటే ఇదే బెటర్ కద. నేను ఇవన్నీ కంపల్సరీ గా చేస్తాను అని నా ప్రగాఢ విశ్వాసం.”

“ఏవేవో అక్కర్లేదు కానీ, కనీసం ఒక రిజొల్యూషన్ చేసి పాటించవచ్చు కద?”

“వచ్చే సంవత్సరం చూద్దాం లే. ఇంతకి ఏంటి ఇలా వచ్చావు?”

“కొత్త సంవత్సరంలో కాస్త ఫ్రెండ్స్ అందరినీ రెగులర్‌గా కలవాలి, సత్సంబంధాలు పెంచుకోవాలి అని, నీతో మొదలు పెట్టాను.”

“నీకు ఉన్నదే నేనొక ఫ్రెండుని. అందులో ఎలాగూ రోజు విడిచి రోజు మా ఇంటికి వస్తూనే ఉంటావు. దీనికి ఇంత అట్టహాసం ఎందుకు?”

అర్జెంటుగా టాపిక్ మార్చడం అవసరం అనిపించింది నాకు.

“ఇంతకీ కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నావు రా?” అడిగాను వాడిని.

“పెద్దగా ఏం రావు గురూ. గత సంవత్సరం జరిగిందే ఈ సంవత్సరం కూడా ఇంకొంచెం ఎక్కువ మోతాదులో జరుగుతుంది, అంత! కనీసం ఊటీవీ, ఏంనీ చానెల్స్‌లో వచ్చే సీరియల్స్‌లో ఒక్కటి కూడా పూర్తి కాదు అని నా అభిప్రాయం.”

“అది వేరే చెప్పాలా? ఆ సీరియల్స్ ఎప్పుడు అయి చస్తాయి కనుక. ఐతే ఒరేయి, మార్పు అనేది మనలోంచి రావాలి. అలా అందరిలో వస్తే, ఆటోమేటిక్‌గా మన చుట్టూతా మార్పులు వస్తాయి. తద్వారా కొత్త సంవత్సరంలోనూ మార్పు వస్తుంది,” ఆవేశంగా అన్నాను నేను.

అప్పారావు గాడు ఒక టైప్‌లో చూశాడు నన్ను, “ఇవి నీ ఒరిజినల్ డైలాగుల్లా లేవు. ఎవరి వల్ల ఇన్స్పైర్ అయ్యావు?” అడిగాడు.

“ఏదో తెలుగు న్యూస్‌పేపర్ సంపాదకీయంలో చదివానులే. కానీ ఎక్కడ చదివాను అన్నది కాదు ముఖ్యం. ఎలా పాటిస్తాము అన్నదే ముఖ్యం,” గంభీరంగా అన్నాను నేను.

మళ్ళీ అనుమానంగా చూశాడు వాడు. ఏదో అనబోయి, ఎందుకో మళ్ళీ ఊరుకుండిపోయాడు.

నేను ఉత్సాహం పుంజుకున్నాను. “మనిద్దరం ఒక నిర్ణయం తీసుకుందాం. ఇద్దరం ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఏదైనా కొత్త కార్యక్రమం చేపడదాం. నేను రోజూ పొద్దున్నే మా వీధిలో ఆధ్యాత్మిక గీతాలు పాడుతూ నగర సంకీర్తనం చేస్తాను. ఆ రకంగా మా వీధి వారిలో భక్తి శ్రద్ధలు పెంచుతాను. నువ్వేం చేస్తావు?” అడిగాను వాడిని.

“నాకు పాటలు రావు, పైగా పొద్దున్నే లేవడం నాకు చేత కాదు,” అన్నాడు వాడు.

“అలాగైతే నువ్వు ఇంకేదైనా చెయ్యి.”

“మా కాలనీ పక్కనే కొన్ని గుడిసెలున్నాయి. రేపటి నుంచి వారం రోజుల వరకు, ప్రతి రోజూ ఒక గుడిసెలో ఉన్న కుటుంబానికి సాయంత్రం రెండు బిర్యాని పాకెట్లు ఇస్తాను. దిస్ బిర్యాని ఇస్ స్పాన్సర్డ్ బై అప్పారావు టైపులో.”

“భేషైన ఆలోచన. రేపటి నుంచే మొదలు పెడదాం. వారం రోజుల తరువాత కలుసుకుని మన ప్రాగ్రెస్ రిపోర్టులు ఒకరిదొకరు పరిశీలిద్దాం.”

ఆ రోజుకు వాడినుంచి సెలవు తీసుకున్నాను.

***

ఐతే వారం రోజుల వరకు ఆగాల్సిన అవసరం లేకపోయింది. సరిగ్గా నలభై ఎనిమిది గంటల తరువాత మేము మా ఇద్దరి ఇళ్ళకు మధ్య ఉన్న నర్సింగ్ హోంలో కలుసుకున్నాం, అదీ పక్క పక్క బెడ్ల మీద.

“ఒరేయి అప్పిగా, నీకేమయ్యిందిరా?” చేతికి ఉన్న బ్యాండేడ్ చూసి అడిగా.

“నా సంగతి సరే నీ కాలికా పెద్ద కట్టేమిటి?” రివర్స్‌లో నన్ను అడిగాడు వాడు.

“చెప్తాను, నిన్న పొద్దున్నే నగర సంకీర్తనకు బయలు దేరాను. ఐదు గంటలకే గట్టిగా భక్తి గీతాలు పాడుతూ వెళ్ళాను. నా పాటలకు చాలా ఇళ్ళల్లో లైట్లు వెలిగాయి. అంటే జనాన్ని నిద్ర లేపానన్న మాట. మార్నింగ్ వాక్‌కి వచ్చిన ఇద్దరు పెద్ద వాళ్ళు, నేను చేస్తున్న పని ఎంతో గొప్పది అని పొగిడారు కూడా. ఎందుకంటే అంత పొద్దున వాళ్ళ వీధిలో నిద్ర లేచేది వాళ్ళేనట,” నేను ఊపిరి పీల్చుకోవడానికి ఆగాను.

“నేను కూడా అనుకున్నట్టే మొదటి రోజు సాయంత్రం మా కాలనీ పక్కన ఉన్న గుడిసెల్లో ఒకటి ఎన్నుకుని ఆ గుడిసెలో కుటుంబానికి రెండు బిర్యాని ప్యాకెట్లు ఇచ్చా,” చెప్పాడు అప్పడు.

నేను మళ్ళీ నా భాగోతం కంటిన్యూ చేశాను. “రెండో రోజు నా మీద కుట్ర జరిగింది అని నా అనుమానం. నగర సంకీర్తనం మొదలు పెట్టి మొదటి పాట పూర్తి చేయక ముందే, మూడు కుక్కలు, ఎక్కడినుంచి వచ్చాయో కాని భయంకరంగా మొరుగుతూ నా వెంట పడ్డాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో బొక్క బోర్లా పడ్డాను. లెగ్గు విరిగింది,” అంటూ ముగించాను నేను.

“రెండో రోజు రెండు బిర్యాని ప్యాకెట్లు తీసుకుని ఊపుకుంటూ మా కాలనీ పక్కన గుడిసెల దగ్గరకి వెళ్ళానా! అక్కడ అందరికి తెలిసిపోయినట్టుంది, ఒక పెద్ద మంద నా కోసం ఎదురు చూస్తూంది. అందరూ నా చేతుల్లో ఉన్న రెండు ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. ఆ తొక్కిసలాటలో నాకు చేతికి బలంగా దెబ్బ తగిలింది,” చెప్పాడు అప్పారావు.

“బహుశా మార్పు కోసం ప్రపంచమే తయారుగా ఉన్నట్టు లేదు,” తేల్చాను నేను. అప్పడు కూడా నిజమేనన్నట్టు తల ఊపాడు.

అప్పుడే అక్కడికి వచ్చిన నర్సమ్మ (అంటే నరసమ్మ కాదు, నర్స్ అన్న మాట), మమ్మల్ని అడిగింది, “మీ కొత్త సంవత్సరం రిజొల్యూషన్స్ ఏంటి?” అని.

“కాళ్ళకూ చేతులకూ హాని కలిగించని కార్యక్రమాలు మాత్రమే చేయాలని,” ముక్త కంఠంతో సమాధానం ఇచ్చాం మేమిద్దరం.

 

This entry was posted in అప్పారావు - నేను, కథలు. Bookmark the permalink.

11 Responses to కొత్త కొత్తగా ఉన్నది!

  1. రవి says:

    అప్పారావు ఓరిజినల్ రిజల్యూషన్సే బాగున్నాయ్. నేను వాటిని ఫాలో అయిపోతున్నా.

    • Murali says:

      నేను ఎప్పటినుంచో ఆ రిజొల్యూషన్సే ఫాలో అవుతున్నా. 😉

  2. భావన says:

    నాకు కూడాఆప్పారావు ఒరిజినల్ రిజల్యూషన్స్ ఏ బాగున్నాయి.అవే ఫాలో ఐపోతాను నేను కూడా.. థ్యాంక్స్ అండి సహాయానికి 🙂

  3. పైన అందరూ చెప్పినట్టు.. అప్పారావు రిసొల్యూషన్స్ బావున్నాయండీ..:)

  4. brijbala says:

    ఈ యేడాదంతా చాక్లెట్ తినకూడదని నా రిజల్యూషన్

  5. Indian Minerva says:

    ఛీ.. ఛీ.. ఇవేం రెజొల్యుషన్‌లు? నేనైతే ఎంచక్కా వోడ్కా మానెయ్యాలనీ (అందుకు బదులుగా బీరు ఎంజాయిచెయ్యాలని0 తీస్కున్నా.

  6. ram says:

    i like ur posts

  7. Jyothi reddy says:

    Murali ji,

    Nice resolution, Sir. Keep going.

    Please keep writing on Telangana and Samaikyandhra.

  8. Seetha and Hari says:

    Murali,

    One of your best. Relevant and entertaining. Our resolution for this year is to keep laughing by following your blog

  9. sahasra says:

    he he he good one

Leave a comment