బట్ట తల వచ్చేసిందే బాలా – 27

“చెప్పు ప్రవల్లికా, చెప్పు. ఈ ప్రపంచం ఏమనుకుంటుందో అని భయపడకు. మా పాపారావుగాడు మేము ఎన్ని సార్లు తిట్టినా ధైర్యంగా ఎలా పాడతాడో, అలా చెప్పు,” అన్నాను నేను ఆవేశంగా. చిన్నప్పటినుంచి నాకు ఆవేశం ఎక్కువ.

ప్రవల్లిక నా వైపు చిరుకోపంతో చూసింది. నేను గతుక్కుమని, “అంటే, ఎవరినీ పట్టించుకోవద్దు అని నా అర్థం,” అన్నాను.

“ఇది కొంచెం పెద్ద కథే. ముందుగా మీకు మా జపాన్ బావ గురించి చెప్పాలి,” దీర్ఘంగా నిశ్వసించింది ప్రవల్లిక. నేను ఉలిక్కి పడ్డాను. జపాన్ బావా? వాడెవడు. ఈ కథలో హీరో నేను కాదా?

“బావంటే నిజంగా బావ కాదు. చిన్నప్పుడు పక్క పక్క ఇళ్ళల్లో ఉండే వాళ్ళం. ఇంటి ముందు రోడ్డు మీద ఆడుకునే వాళ్ళం.”

“ఏం మీ ఇంటి దగ్గర పార్క్ లేదా?”

“ప్లీజ్. నా ఫ్లోకి అడ్డు పడకండి. వాళ్ళమ్మ గారికి నేనంటే బోలెడు ఇష్టం. తనే నన్ను వాళ్ళ అబ్బాయిని బావా అని పిలిచే అలవాటు చేసింది. ఐతే మా నాన్నకి బావ పడేవాడు కాదు.”

“ఓహో.”

“నాకు పదేళ్ళ వయసులో మా బావ వాళ్ళ నాన్నను, ఆయన కంపెనీ ప్రమోషన్ ఇచ్చి జపాన్‌కి పంపించింది. బావ వాళ్ళు వెళ్ళి పోయారు, నా ఎమోషన్‌కి నన్ను వదిలేసి. మా నాన్న బోలెడు ఆనంద పడ్డారు. కానీ నేను బావతో ఉత్తరాలు రాస్తూ, ఈ మధ్య కాలంలో ఫోన్లు కూడా చేస్తూ టచ్‌లోనే ఉన్నాను. మా ఇద్దరి స్నేహం అలానే ఉంది. ఫైనల్లీ, మా బావ వాళ్ళ నాన్నగారు రిటయిర్ అయ్యారు. వచ్చే వారమే, బావా వాళ్ళు ఇండియా వచ్చేస్తున్నారు.”

“వచ్చే వారమా?”

“అవును, నేను ఇన్నేళ్ళుగా దీని గురించే వెయిట్ చేస్తున్నా. నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకోరని తెలుసు. కానీ ఇంక బావను వెయిట్ చేయమనడం కూడా బావోదు. అన్నట్టు బావ ఫోటో చూస్తారా?”

పెళ్ళి, బావ, ఫోటో, ఇన్ని షాకులు నేను తట్టుకోలేకపోయాను. నా ఫీలింగ్స్‌తో ప్రమేయం లేకుండా నా చేతిలో ఒక ఫోటో పెట్టింది ప్రవల్లిక. నేను పెద్ద ఉత్సాహం లేకుండానే చూశాను.

కుర్రాడు ప్రవల్లిక కంటే ఒక మూడేళ్ళు పెద్ద. ఐతే అది కాదు నా దృష్టిని ఆకర్షించింది. జపాన్ బావది బట్టతల! ఇంకా చెప్పాలంటే పూర్తి గుండు. “ఇతనికి..” నేను వాక్యం ముగించేంతలోపలే ప్రవల్లిక, “అవును బావకి బట్టతల. జపాన్ నీళ్ళు బావకి పడలేదు. నాలుగేళ్ళ కిందే మొత్తం గుండైపోయింది,” అంది.

కంటిన్యూ చేస్తూ, “ఐతే నేను బావని చిన్నప్పటినుండి ఇష్ట పడ్డా, గుండున్నా జుత్తున్నా నా ఫీలింగ్స్‌లో మార్పు లేదు,” అంది.

“ఇంతకీ నన్నెందుకు పిలిచినట్టు?”

“మీ రూం-మేట్స్‌ని చూస్తే నాకు మా బావ గుర్తుకి వస్తాడు. బహుశా బట్టతలల వల్లేమో? ఏదీ ఏమైనా ఇలాంటి పరిస్థితిలో మీరే నాకు హెల్ప్ చేయగలిగేది. వచ్చే వారం బావని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. మా నాన్నకు తెలీకుండా మీ నలుగురు మాకు సహాయం చేయాలి,” అంది ప్రవల్లిక అసలు విషయం బయట పెడుతూ.

(ఇంకా ఉంది)

This entry was posted in బట్టతల. Bookmark the permalink.

15 Responses to బట్ట తల వచ్చేసిందే బాలా – 27

  1. కేవ్‌వ్‌వ్‌వ్… నహీ…!!!

  2. రవి says:

    కొంపదీసి విషాదాంతమా? నేనొప్పుకోను 🙂

  3. రవి says:

    ఇంకాఉందా?? నాకైతే చాలా జాలిగా ఉందండీ మీ మీద..

  4. ప్రపుల్ల చంద్ర says:

    ప్రవల్లిక బావకే కాదు, చాలా మంది ఇండియన్స్ కి ఇక్కడ (జపాన్ లో) నీళ్ళు పడటం లేదు… అందరికి జుట్టు రాలిపోతోంది 😦

  5. Sravya says:

    Ayyo Ayyo papam 🙂 🙂

  6. Jyothi Reddy says:

    Eagerly waiting for 28th episode Muraligaru….

  7. మురళి గారూ..
    ఈ మధ్య బ్లాగులోకంలో ఎక్కడ చూసినా మీ ‘బట్ట తలే’ కనిపిస్తుందండీ..
    అంటే నా ఉద్దేశ్యం మీరు రాసే బట్ట తల అన్నమాట 🙂
    ఇదేదో నేను తెగ మిస్ అయిపోతున్నానుకుని ఇవ్వాళ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే.. మీ బ్లాగులోకి ఇవ్వాళే మొదటిసారి వచ్చేసి వరుసబెట్టి అన్ని ఎపిసోడ్స్ మొత్తం చదివేసానండీ..
    జంధ్యాల గారి సినిమాలాగా చక్కగా సాగిపోతుంది. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ సినిమాలు గుర్తొచ్చాయి నాకు మీ కథ చదువుతుంటే..
    అయితే చివరికి ‘రెండు జెళ్ళ సీత’ లాగా చేసేస్తారా ఏవిటీ 😦
    అప్పుడే ఆపేయకుండా.. ఇంకా పొడిగించకూడదూ.. మా కోసం 🙂

    eagerly waiting for next episodes.. 🙂

  8. Wanderer says:

    నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు జపాన్ బావలున్న అమ్మాయిలు అందంగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే గింటే నాకో జపాన్ బావున్నాడు అని బోర్డు కట్టుకు తిరగాలి. ఇప్పుడు నా నలుగురు హీరోల కంటే నాకే ఎక్కువ డిప్రెషన్ గా ఉంది. నేను మురళి గారిని “సూ” చెయ్యబోతున్నా… ఫర్ ది మెంటల్ ట్రౌమా.

  9. Bhaskar says:

    Inkemundi..anthaa ayyipondi…kompa munigindi..

  10. బాపు says:

    ఐతే అది కాదు నా దృష్టిని ఆకర్షించింది. జపాన్ బావది బట్టతల! ఇంకా చెప్పాలంటే పూర్తి గుండు. “ఇతనికి..” నేను వాక్యం ముగించేంతలోపలే ప్రవల్లిక, “అవును బావకి బట్టతల. జపాన్ నీళ్ళు బావకి పడలేదు. నాలుగేళ్ళ కిందే మొత్తం గుండైపోయింది,” అంది.
    Ha.. Ha.. Ha..

  11. Kishore says:

    Sir me Sense of humore ki Joharu sir. really super…….

  12. sthotakura says:

    ee japan bava gadevadandi babu..

  13. Karthik says:

    ఇది నేను ఒప్పుకోను. ప్రవల్లిక వేరే వాళ్ళని పెళ్ళి చెసుకుంటే ఆ ఘొరానికి నైతిక భాధ్యత వహించి మన రాష్ట్రపతి రాజినామా చెయ్యాలి.
    అఖిలాంధ్ర బట్టతల వీరులారా! ఏకం కండి..మీ ప్రతాపం ఈ బ్లాగ్ మీద చూపండి. 🙂 🙂 🙂

    -కార్తీక్

Leave a reply to శివ బండారు Cancel reply