అపాయానికో కషాయం!

అప్పారావు వాళ్ళావిడకు వాడు ఏం చేసినా నచ్చదు. అసలు ఈ స్టేట్‌మెంటే వేస్ట్ అనుకుంటా. ఏ భార్యకి మాత్రం తన భర్త చేసే పనులు నచ్చుతాయి కనుక, చోద్యం కాకపోతే!

“మీరు పొద్దున్నే లేవచ్చుగా! హడావుడిగా ఆఫీసు టైంకి అర్ధ గంట ముందు లేచే బదులు?” సడన్‌గా అప్పారావుని నిలదీసింది వాళ్ళావిడ.

“పిచ్చిదానా, అసలు నేను లేట్‌గా లేవడం వల్ల దేశానికి ఎంత లాభమో నీకు తెలుసా?” అన్నాడు అప్పారావు గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరూలా.

“వెధవ లాజిక్కులు చెప్పకండి. పొద్దున్నే లేస్తే ఎన్నో లాభాలు, తెలుసా?” అంది వాళ్ళ ఆవిడ ఆవేశంగా. తనకు కొంచెం ఆవేశం ఎక్కువ.

“అది నీకెలా తెలుసమ్మా? నువ్వు కూడా లేట్‌గానే నిద్ర లేస్తావు కద?” లా పాయింట్ లేవదీశాడు అప్పారావు.

దానికి సమాధానం చెప్పలేకపోయింది తను. నిజమే, ఒక్కోసారి ఆవిడ అప్పారావు ఆఫీసుకి వెళ్ళిన తరువాత లేచిన సందర్భాలు కూడా ఉన్నాయి.

“సరే ఐతే ముందు నేను పాటిస్తా. ఆ తరువాతే మీకు చెప్తా. ఇట్స్ మై ఛాలెంజ్!” బొటనవేలు చూపిస్తూ సవాలు చేసింది అప్పారావుతో.

తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు అప్పారావు. “తనకు నాకంటే నిద్ర ఎక్కువ. పొద్దున నిద్ర లేచే సమస్యే లేదు. ఈ సమస్యని భలే శాంతియుతంగా పరిష్కరించాను,” అనుకుంటూ తనలో తాను మురిసిపోయాడు. ఐతే అతనికి తెలీదు అతనెంత పెద్ద తప్పు చేశాడో. దానివల్ల భవిష్యత్తులో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతూందో.

***

రెండు వారాలు గడిచాయి. అప్పారావు అనుకోని విధంగా వాళ్ళావిడ ప్రతి రోజు పొద్దున్నే నిద్ర లేవడం మొదలెట్టింది. ఐతే, అప్పారావు నిద్ర డిస్టర్బ్ చేయకపోవడం వల్ల అతను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.

ఒక రోజు అప్పారావు నిద్ర లేవగానే వాళ్ళవిడ ఒక గ్లాసుతో రెడీగా ఉంది.

“హయ్యి! బెడ్ కాఫీ చేసావా నాకు? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చేసి ఇచ్చేదానివి. ఇప్పుడు మళ్ళీ!” ఆనందంగా అన్నాడు అప్పారావు.

కిసుక్కున నవ్వింది తను. “అయ్యో ఇది కాఫీ కాదండి, మీ ఆరోగ్యం బాగుండాలని నేను చేసిన ద్రావకం,” అంది.

“ద్రావకమేంటి? ఓ, లిక్విడ్ అనా నీ అర్థం! ఐనా ఎందుకు చేసావు ఈ ద్రావకం కామాక్షి?” అడిగాడు అప్పారావు.

“చెప్పాను కదండి, మీ ఆరోగ్యం కోసం. ఇది తాగితే ఎంతో మేలు,” అంది కామాక్షి.

“ఈజిట్? ఎవరు చెప్పారు?”

“పొద్దున్నే లేస్తే ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయండి. అందుకే మిమ్మల్ని లేవమంది.”

“సరే ఆ ద్రావకం ఇలా ఇవ్వు, తాగుతా,” అని గ్లాస్ అందుకుని యధాలాపంగా అందులోకి చూసి షాక్ తిన్నాడు అప్పారావు.

“ఏంటిది, ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. నీళ్ళ అడుగున ఏవో రకరకాల గింజలు ఉన్నాయి?” భయంగా అడిగాడు.

“అవేనండి ఆరోగ్యం కలిగించేవి. మెంతులు, జొన్నలు, దాల్చిన చెక్క, కాల్చిన మొగ్గ ఇలా ఇంకా ఎన్నో. పళ్ళు కడుక్కోకముందే తాగేస్తే డబుల్ ఎఫెక్ట్ ఉంటుందట! చప్పున తాగేయండి,” అంటూ గ్లాస్ అందించింది కామాక్షి.

చప్పున తాగడానికే ప్రయత్నించాడు అప్పారావు. కానీ, కొన్ని మెంతుల రుచి నాలుకకు తగలనే తగిలింది. వెంటనే కడుపులో తిప్పింది. అర సెకండులో అతను బాత్‌రూంలో ఉన్నాడు, బొళ్ళున వాంతి చేసుకుంటూ. ఒక ఐదు నిముషాల తరవాత కాస్త కుదుటబడ్డాడు.

అప్పుడు అర్థమయ్యింది అతనికి, ఎందుకు డబుల్ ఎఫెక్టో. కడుపులో ఏదన్నా వుంటే ఒక సారి కాకపోతే ఒక సారైనా కక్కుకోకుండా ఉండే అవకాశం ఉంది. కాని ఇలా పాచి నోటితో తాగితే ప్రతి సారీ పితృదేవతలు కనిపించడం ఖాయం!

“చూశారా, అప్పుడే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది,” ఆనందంగా అంది కామాక్షి.

“నీ బొంద! కడుపులో ఏముందని క్లీన్ కావడానికి? ఈ దిక్కు మాలిన ద్రావకం మొగుడు వెధవకి పొద్దున్నే పోయాలని ఎవరే నీకు చెప్పింది?” కోపంగా అరిచాడు అప్పారావు.

“అంతే లెండి. ఇదంతా ఎవరికోసం చేస్తూంది? మీ కోసం కాదా? మీ మగాళ్ళంతా ఇంతే. భార్య మనసు అర్థం చేసుకోరు,” గద్గద స్వరంతో అంది కామాక్షి.

“సరే, సరే! మాట్లాడితే ఇదొకటి. నీ పతి భక్తికి సంతోషించాములే,” అంటూ అక్కడినుంచి కదిలాడు అప్పారావు.

****

మరుసటి రోజు కామాక్షి అప్పారావుతో కాకరకాయ రసం తగ్గించింది. అది ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది. మళ్ళీ బాత్‌రూంకి పరిగెత్తాడు అప్పారావు.

ఆ మరుసటి రోజు తోటకూర షర్బత్! మళ్ళీ బొళక్కు.

తరువాత రోజు నిద్ర లేవకుండా ముసుగు తన్ని పడుకున్నాడు అప్పారావు. ఐనా కామాక్షి అతను నిద్ర లేచే వరకు అక్కడే కూర్చుని ఏదో పేరు కూడా తెలియని విచిత్రమైన కషాయం పట్టించింది. అది తాగాక మంచం మీద నుంచి లేచి బాత్‌రూంకి దౌడు తీయక తప్పలేదు అప్పారావుకి.

అసలు పొద్దున్నే కామాక్షి ఏం చేస్తూందో చూద్దామని నిశ్చయించుకున్నాడు అప్పారావు.

మరుసటి రోజు కామాక్షి నిద్ర లేచి వెళ్ళగానే ఆమెని ఫాలో అయ్యాడు. కాఫీ తీసుకుని వచ్చి టీవీ ఆన్ చేసి ముందు కూర్చుంది కామాక్షి.

టీవీ స్క్రీన్ మీద ఖాకీ నిక్కరు మాత్రం వేసుకుని పద్మాసనం వేసుకుని కూర్చున్న ఒక నడివయస్కుడు కనిపించాడు అప్పారావుకి. అతని మొహం బిన్ లాడెన్‌లా చాలా ప్రశాంతంగా ఉంది. ఆయన ఏదో ఉద్బోధ చేస్తున్నాడు. కామాక్షి చాలా శ్రద్ధగా ఆయన చెప్పేది వింటూంది.

“ఐదో రోజు మీ వారికి గన్నేరు కాయల రసం ఇవ్వాలి. అహహా, చచ్చి పోతాడేమో అని భయపడకండి. బాగా ఉడికించి అప్పుడు రసం తీసి, దానిలో కాస్త ఉప్పు కలిపి ఇస్తే వొంటికి ఎంతో మంచిది. అది తాగితే చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా అంతా కక్కుకుంటాడు. క్లీనే క్లీను అన్న మాట,” విశాలంగా నవ్వుతూ అన్నాడు ఆయన.

ప్రోగ్రాం అయిపోయినట్టుంది. “ఇంత వరకూ మీరు వంతెన పథ్యనారాయణ గారి ‘అపాయానికో కషాయం’ కార్యక్రమం చూశారు. మళ్ళీ రేపు ఐదు గంటలకు ఇక్కడే ఊటీవీ ద్వారా కలుసుకుందాం,” అంటూ ప్రత్యక్షమయ్యింది ఒక అనౌన్సర్.

అప్పారావు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. కిక్కురుమనకుండా కామాక్షి గమనించేంతలో అక్కడినుంచి జారుకుని ఒక ఐదు నిముషాల తరువాత దొడ్డి దారి ద్వారా బయట పడ్డాడు అతను.

****

ఒక పది రోజుల తరువాత అన్ని పేపర్లలో ప్రకటన వచ్చింది. “ఏమండీ! మీరు ఎక్కడున్నా ఇంటికి వచ్చేయండి. ఇక ఎప్పుడూ ఇలా కషాయాలు తాగించి మీ జీవితాన్ని విషపూరితం చేయనని చిరు మీద వొట్టు వేసి చెప్తున్నా,” అంటూ. కింద అప్పారావు ఫోటో ఉంది…

(ముఖ్య గమనిక: ఆయనేదో చెప్పాడని గన్నేరు కాయలు ఉడికించి రసం తీసి ఉప్పు కలిపి తాగకండి. మొదటికే మోసం రాగలదు జాగ్రత్త!)

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

16 Responses to అపాయానికో కషాయం!

 1. Amun says:

  Simply Superb

 2. Sravya says:

  Superb !

 3. rajkumar says:

  Sooooooooooper……………

 4. sruja says:

  APPARAO HEALTH KOSAME KADAA?

 5. భలే రాసారు… 😀
  ఆ ప్రోగ్రాం ఒకసారి నేను కుడా చూసాను… నిజంగానే బొత్తిగా ఏమి తినొద్దు అని చెప్తారు… అది తింటే ఈ రోగం వస్తది… ఇది తింటే ఆ రోగం వస్తది అని… మొత్తానికి అసలు ఏమి తినకండి… ఆరోగ్యమ్గా ఉంటారు అని చెప్తారు…

  మీరు చెప్పిన తీరు మాత్రం భలే బాగుంది… 🙂

 6. karthika says:

  Hehehe 🙂
  Gudone.

 7. Karthik says:

  పులి అద్దాలు పెట్టుకొవడం ఎప్పుడైనా చూశారా?? ఎందుకంటే అది సూర్యరస్మి లోఉన్న ఆహారం తింటుంది కనుక.

  ఇది ఆయన ట్రేడ్ మర్క్ డయలాగ్.నేను ఎంత నవ్వుకున్నానొ నాకే తెలుసు.

  -కార్తీక్

 8. Suresh Thotakura says:

  చాలా బాగుంది!

 9. prasad says:

  keka Super

 10. Sumna Nuthakki says:

  ma friend valla hubby choostaru aa program.. papam adi chachipotundi.. eppudanna aayana kanapadithe champetanu ani sapadham chesindi.. 🙂 evoo konni parledu kani, pratidi cheyyali antee kastam kada.

 11. lakshmi says:

  simply superb. but i think it is not only ladies who watch the program. if the case is reverse? just imagine.

  • Murali says:

   లక్ష్మి గారూ,

   ఇదే సెక్షన్‌లో ఉన్న సుమన గారి క్యామెంట్ చదవండి. మీ సందేహం తీరుతుంది. 🙂

   -మురళి

 12. nelabaludu says:

  baaga raasaaru.. Superb one !!!

 13. Jyothi Reddy says:

  Murali ji,

  Though this is a simple thing, a lot of homes have the same story, but the way you said is really really good. Keep going.

 14. sujata says:

  After TV Soaps, It is Vantena Pathyanarayana ! Humour at its best. I am falling in love with your blog. Its very good.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s